మృత్యుంజయుడు(సంక్రాంతి కథల పోటీ)

మృత్యుంజయుడు

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: టీ.విజయ లక్ష్మి

“చంపా, నువ్వు అసిస్టెంట్ డ్రైవరుగా సెలక్టు అయ్యేవు. చాలా సంతోషం. డ్రైవరు ఉద్యోగం బాధ్యతగా చెయ్యవలసి ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు పాటించాలి, ఏంతో అప్రమత్తంగా ఉండాలి. నా కూతురు, ట్రైన్ డ్రైవర్ అని చెప్పుకోవటం నాకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ…” అంటూ ఆగిన తండ్రితో..
“ఆడపిల్ల, డ్రైవర్ ఉద్యోగమని భయపడకండి. పట్టాల మీద ట్రైను పరుగెట్టించాలనే నా కోరిక, ఇన్నాళ్లకు తీరుతోంది. మీరు నన్ను ఊరికే భయపెట్టకండి” అంది చంపా ఉత్సాహంగా.

“నీకు, నేను భయపెట్టడం లేదు. ఒక్క డ్రైవరు చేతిలో ఎన్నో ప్రాణాలుంటాయి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా, ఎన్నోజీవితాలు అంతమవుతాయి. ఆవులు, గేదెలు లాంటి ఎన్నో జీవాలు అడ్డంవస్తాయి. నిన్ను, నిరుత్సాహపరచటం లేదు. నా జీవితంలో నేను చూసినదుర్ఘటన చెప్తాను విను” అన్నాడు ఆనందం.

“నాన్నా, మీరు నేను ఉద్యోగంలో చేరకముందే…” అంటూ ఏడుపు మొహం పెట్టుకున్న కూతురుని చూసి…

“అలా, ఏడుపు మొహం పెట్టకు. ఈ ఘటన నువ్వు విని తీరాలి. ఇది జరిగి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళైనా సరే, ఇప్పుడే నా కళ్లముందే జరిగినట్టు అనిపిస్తుంది ” అంటూ ఆనందం ఇరవై సంవత్సరాల క్రితం దుర్ఘటన చెప్పటం ప్రారంభించేడు.

( భారతీయ రైలు చరిత్రలో ఒక దుర్ఘటన)

అహ్మదాబాదు ఎక్స్ ప్రెసులో నేను నాగపూరు నించీ కలకత్తా స్నేహితుడి పెళ్ళికి బయలుదేరేను. ట్రైను మహారాష్ట్రా దాటి ఛత్తీస్గడ్ లో ప్రవేశించింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ దాటి బిలాస్పూరు చేరుకుంది. తరువాతి స్టేషన్ చాంపా అట. అక్కడ ఏదో ఉత్సవం ఉందని, రిజర్వేషనుతో సంబంధం లేకుండా జనాలు బిలాస్పూర్ లో విపరీతంగా ఎక్కేరు. కాలు పెట్టటానికి జాగాలేదు. అది, స్లీపర్ క్లాసే కానీ జనరల్ బోగీ కన్నా అధ్వానంగా ఉంది. ఉడకపోతే భరించటం కష్టంగా అనిపించి, లోపల ఉండలేక ఒక్క దమ్ము సిగరెట్ తాగుదామని గేట్ దగ్గరకు వచ్చి, సిగరెట్ వెలిగించి గుండెనిండా పొగపీల్చుకున్నాను.

అంతలో ఏమైందో తెలిసే లోపునే, గేట్ వద్ద నిలబడిన నేను కిందకు అమితమైన వేగంతో విసిరి వేయబడ్డాను. వేగంగా వెళుతున్న రైలు బండిలో కొన్నిబోగీలు, వంతెనమీదుగా హస్ దేవ్ నదిలో పడిపోయాయి. ఒక బోగీ సగం నీళ్ళల్లో పడి వేలాడుతూ ఉంది. హాహా కారాలు ఏడుపులు. కొన్ని వేలగొంతులు గోలగా ఏడుస్తున్నాయి. నేను ఇసకమేటమీద పడటంతో నాకు పెద్దగా దెబ్బలు తగలకపోవటంతో మెల్లిగా లేచి కూర్చోగలిగేను.

లేచి నిలబడటానికి ప్రయత్నించేను. లేవటం చాలా కష్టంగా అనిపించింది. అయినా చేతులు కట్టుకొని కూర్చోవాలని అనిపించలేదు. రిలీఫ్ ట్రైన్ మరొక గంటలో చేరుకుంది ఘటనాస్థలానికి. ఊళ్లోనించీ చాలామంది యువకులు వచ్చేరు. నదిలో పడిన వాళ్ళని రక్షించే ప్రయత్నం, బోగీల్లో ఉన్న వాళ్ళను రక్షించే ప్రయత్నం సాగుతూనే ఉంది. రాత్రి అయింది. చీకటిలో కష్టంగా ఉంది. కొందరు, చిల్లర దొంగలు దొంగతనానికి విజృంబించేరు.

“నాన్నా, ఆ ఘటన ఎలా జరిగింది ఇంతకీ?” అంది చంపా.

“అక్కడికే వస్తున్నాను విను. ట్రైన్ ఇనుము పట్టాలమీదనే నడుస్తుందని తెలుసు కదా. రిపేర్ కోసమని పట్టాలు తీసేసారు. ఆ సంగతి కాషన్ ఆర్డరులో ఇచ్చేరు డ్రైవరుకి. అయితే పని జరిగే స్థలంలో ఎరుపురంగు గుడ్డబ్యానర్ పెట్టించాలి. అది అక్కడ పెట్టేరో, లేదో తెలియదు. పట్టాలు లేని కారణంగా రైలుబండి గతి తప్పి మూడు బోగీలు నదిలో పడ్డాయి. చిన్న దెబ్బలు తగిలిన నన్ను విశ్రామగృహానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నారు. నాకు మనస్కరించలేదు. రక్షక దళాలతో పాటూ నేను చేయగలిగిన సహాయం చేస్తున్నాను. బాగా రాత్రయింది కన్ను పొడుచుకున్నా కనిపించటంలేదు. టార్చిలైట్ సహాయంతో వెతుకుతున్న రక్షక దళాలకు సహాయపడుతూ… వీలయినన్ని శరీరాలను బయటకు లాగటానికి ప్రయత్నిస్తూ.. అలా రాత్రంతా గడిచింది. వందల్లో శవాలు, వేలల్లో క్షతగాత్రులను చూస్తూ గుండె బరువెక్కింది.

రాత్రంతా వినిపించిన మూలుగులు తెల్లవారేసరికి ఆగిపోయాయి. ఇక ప్రాణాలతో ఎవరూ లేరనే అనుకున్నాము. బెర్తులు కిందన లగేజీ నడుమనించీ సన్నగా ఏడుపు వినిపించి, జాగ్రత్తగా తియ్యటానికి ప్రయత్నించేము. రెండేళ్లచిన్నారిని జాగ్రత్తగా అందరూ కలిసి బయటకు తీసేరు. ఆ స్థలంలో ప్రాణాలతో దక్కిన ఆఖరు ప్రాణి ఆ చిన్నారి. చిన్నారి తల్లి తండ్రుల ఆచూకీ తెలియలేదు. పాపగురించి పత్రికా ప్రకటన ఇచ్చేరు. ఎవరైనా వస్తారేమోనని చాలా రోజులు చూసేరు. ఎవరూ రాలేదు. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ఆ చిన్నారివి నువ్వే. చాంపా అనే ఊర్లో, హస్ దేవ్ నది వద్ద దొరికేవని నీ పేరు చంపాదేవి అని పెట్టుకున్నాను” అంటూ ఆగి నవ్వుతున్న తండ్రిని ఆశ్చర్యంగా చూస్తూ..

“ఇది నిజం కాదు. నేను మీ కూతుర్నే. ఒత్తినే మీరు నాకు అలా చెప్తున్నారు” అంటూ ఏడుస్తున్న చంపాని దగ్గరకు తీసుకొని..
“నువ్వు ఎప్పుడూ నా కూతురువే. ఏదో సమయం వచ్చింది కాబట్టి నీకు చెప్పేనురా. అయితే తరువాత ఆ దుర్ఘటనకు కారకులైన వారందరినీ ఉద్యోగం లోనించి తీసేశారు. అందుకే ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడమని చెప్తున్నాను నీకు ” అంటూ సిగిరెట్ వెలిగిస్తున్న తండ్రిని చూస్తూ..

“చాల్లెండి నాన్నా. కబుర్లు చెప్తూ, దిక్కుమాలిన సిగరెట్స్ ఆపకుండా ఊదేస్తున్నారు” అంటూ చంపా మందలిస్తుంటే..

“అమ్మో, నన్నేమైనా అంటే అను గానీ…ఈ సిగరెట్టుని మాత్రం ఏమీ అనకు. ఎందుకంటే? ఈ సిగరెట్ తాగటానికి గేటు దగ్గరకు వెళ్ళటం వలనే నాకు జీవనదానం దొరికింది. అదే నాకు ప్రాణదాత ” అంటున్న తండ్రి ఒళ్ళో తలపెట్టుకొని..

“నాన్నా, సిగిరెట్టు ఎప్పటికీ, ఎవరికీ జీవనదాత కాలేదు. ఏటా, సిగిరెట్ తాగి ఎంతమంది ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడుతున్నారో మీకుతెలుసు. మీ మంచితనం మిమ్మల్ని కాపాడింది. అత్యవసర సమయంలో నాకేమని మీరు విశ్రాంతి గృహానికి వెళ్లకుండా..మీ అమూల్యమైన సేవలను నిర్విరామంగా బాధితులకోసం ఉపయోగించేరు. తల్లీ, తండ్రీ ఎవరో తెలియని నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. నిస్వార్థంగా, మీరు ఎంతోమందికి సహాయంచేసేరు. మీ మంచితనం ఎందరికో స్ఫూర్తి కావాలి. మీరు, ఆరోగ్యంగా ఉండాలి నాన్నా. సిగరెట్ ఎప్పటికీ ప్రాణదాత కాదు. అది, అనారోగ్యానికి పట్టుతివాచీ. మిమ్మల్ని మృత్యు ముఖంనించీ కాపాడింది మీ మంచితనమే. అలవాటు, మానుకోవడం కష్టమే. ఇప్పటినుంచి ప్రయత్నించి చూడండి” అంటూ తండ్రిచేతిలోని సిగరెట్ తీసి అవతల పడేసింది చంప.

(సమాప్తం)

*******

You May Also Like

One thought on “మృత్యుంజయుడు(సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!