నా జ్ఞాపకాలు

జ్ఞాపకాలు లేని  మనిషి,  జీవితంలో

గాయాలు లేని హృదయం  ఉండదేమో

చీకట్లో ఏకాంతంగా కూర్చున్నపుడు

జ్ఞాపకం నాకు దీపమై తోడుగా నడిపిస్తుంది.

రైలు ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చున్నపుడు

జ్ఞాపకం నాకు గాయమై కనిపిస్తుంది

సాయంత్రాలు సైకిల్ తొక్కుతూ 

కిందపడి గాయంతో ఇంటికొచ్చినపుడు

అమ్మ నన్ను కోపంగా బెదిరిస్తూ

గాయానికి పసుపు రాసి ముద్దు చేయడం

నా  చేతులకంటిన మట్టిని 

అమ్మ కొంగుతో తుడుచుకోవడం

ఎవరి పెళ్లికి వెళ్ళినా  నా జ్ఞాపకం

నన్ను గాయమై పలకరిస్తుంది

నా పెళ్లి అప్పగింతల్లో అమ్మ కంటిలో గంగని

నాన్న కంటిలో గోదారి ని చూశానని

నాకిప్పటికీ ఆశ్చర్యమే

ఎన్ని కష్టాలు వచ్చినా కూడా

కంటిలో నీరు కనిపించకుండా ఉన్న నాన్న

ఇలా బేలగా అందరిలో ఏడవడం

తన గుండెల మీద ఆడిన చిట్టితల్లిని ఈనాడు

వేరొకరికి అప్పగిస్తున్నా అని గుర్తొచ్చింది కాబోలు

వాళ్లకు కూడా తెలుసుగా

నా  గుండె చెరువైందని

నేనెక్కడికి వెళ్ళను.. మీతోనే ఉంటాను

ఇన్నేళ్లుగా కంటికి రెప్పలా పెంచి

ఎవరికో  కన్యా “దానం” ఇవ్వడం ఏంటి అని మనసులోఎంతగా రోదించానో

పెళ్లి అనే బంధంలో అనురాగాలు, ఆప్యాయతలు 

తొలి సారి అమ్మాయి పుట్టాక

మాతృత్వంలో ఇంత మాధుర్యం .. అందుకేనేమో 

“మాతృదేవోభవ” అని అమ్మకు  మొదటి స్థానం

అమ్మాయి అటు అమ్మగారి ఇంటికీ,

ఇటు అత్తవారి ఇంటికి వారధిలా ఉండాలని

ఎన్ని  సమస్యలు ఎదురైనా నవ్వుతూ ఉండడం నేర్చుకున్నా

ఒక్కోసారి కొన్ని జ్ఞాపకాలు

కంటిలోంచి చెక్కిలిని తడిమి వెళ్తుంటాయి

నా జ్ఞాపకాలు బ్రతికి ఉన్నాయి కాబట్టే

ఇంకా  నేను మనిషిగా  బ్రతకగలుగుతున్నాను.

వేముల ప్రేమలత

You May Also Like

One thought on “నా జ్ఞాపకాలు

Leave a Reply to Anusha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!