నపుంసకుల మనోగతం (తమ మాటల్లో…)

నపుంసకుల మనోగతం (తమ మాటల్లో…)

(This is Third Gender’s Story)

ఈ పురోగమన ప్రపంచాన, పరిగెత్తుతున్న ప్రజలారా,
భవిష్యత్తు పైన ఆశలతో, పెరుగుతున్న యువకులారా…
వెలకట్టలేని మీ సమయాన, పదినిమిషాలను మాకివ్వగలరా???
వేసిరిల్లకుండ సహనంతో, మా వ్యధను కాస్త వినగలరా???

భగవంతుని సృష్టిలో, నేను లింగానికి నపుంసకుని,
ఈ భారతదేశంలో, ఒక దురదృష్టపు జాతకుని…

వేల విధాలుగా వివక్షతో, వేధింపబడ్డ మనసుని,
ఈ స్త్రీ పురుషుల సమాజాన, వెలివేయబడ్డ మనిషిని…

ఏ లోపం చూపించలేని, పసివాడిగ పుట్టాను,
బాల్యంలో అందరిలా, ఒక బాలుడిగా పెరిగాను,

కాలమేమో నెమ్మదిగా, నా వయసును పెంచేస్తుంటే,
తలరాతే తికమకగా, నాపై ప్రశ్నలనే విసిరింది…

మనసేమో చేయిదాటి, లోన చిత్రాలను చేస్తుంటే,
మేను కూడ తీరు మార్చి, మదికి బానిసగా మారింది…

రోజులు గడిచే కొద్దీ, ఒక స్పష్టత నాకొచ్చింది,
నపుంసకుడిని నేనని, నిదానంగా తెలిసింది…

అమ్మ నాన్న ఆశ్చర్యంతో, మూగబోయి మిగిలారు,
స్నేహితులే సుతిమెత్తగా, నను దూరం పెట్టారు…

యౌవనమే యముడై, నా భవిష్యత్తుని బలిచేసింది,
సమాజమేమొ కఠినంగా, మా జాతిని వెలివేసింది…

మీ అందరిలా చదువుకుని, ఎదగాలని మా ఆకాంక్ష,
వేల ఆశలతో నడిచొస్తే, మాపై అడుగడుగున వివక్ష…
ఏది చేయాలని తలచినా, మాకు ప్రతిరోజూ ఒక పరీక్ష,
మా అసంపూర్ణ జీవితాన, ఇది ఆ విధి వేసిన శిక్ష…

మేము కన్న కలలన్నీ, గాలిలోన మేడలు,
నేటి సమాజాన వివక్షలే, వాటికడ్డు గోడలు…

చదువుకునే స్వేచ్ఛ లేక, ఉద్యోగానికి వీలు లేక,
మాకంటూ గుర్తింపు లేక, మేము ఆకలికే ఆగలేక,
నాట్యాలూ నాటకాలు, చేసుకుంటు బతుకుతున్నాము…
ఆ వచ్చిన చిల్లరతోనే, కడుపు నింపుకుంటు ఉన్నాము…

మా జాతిలోన కొందరికి, ఈ అవకాశమైన దొరకక,
ఎన్ని రకాలుగా చూసినా, ఏ ఆహారం సమకూరక,
చేయి చాచి యాచిస్తూ, మేము రోడ్ల పైకి వచ్చాము…
మీ స్త్రీ పురుషుల జాతికి, ఇంకాస్త అలుసు అయ్యాము…

చప్పట్లు కొట్టి బెదిరించే, ప్రతివారు మేము కాదండి,
మా పొట్ట కొట్టి జోబు నింపుకునే, నకిలీలే వారండి…
అసలు నపుంసకుడు ఏనాడూ, బలవంతం పెట్టడు,
దయతలచి కొందరిచ్చిందే, సర్దుకుంటూ సాగుతాడు…

వేధింపుల వివక్షతో, వీధిన విసరబడ్డ బతుకులు,
ఏ వైపు నుంచి చూసినా, మాలోన వేల గాయాలు…
రైల్లూ రోడ్లూ కాదు, మా ఇల్ల కు చిరునామాలు,
మా బస్మమైన భవితకు అవి, చితిమంటల చిహ్నాలు…

చేరదీయాల్సిన సమాజము, సమూహంగా శిక్షిస్తుంది…
రక్షించాల్సిన ప్రభుత్వం, సరిచేయకుండా వీక్షిస్తుంది…

ఏ దేశంలో లేదండీ, ఇలాంటి లింగ వివక్షత,
ప్రపంచాన ప్రతి దిక్కున, ప్రతిభదె ప్రాముఖ్యత…
మనదేశంలో ప్రతి చోట, స్త్రీపురుషులదే ఆధిక్యత,
ఏ జాగృతికి తోడ్పడదా, మా జాతితోన సఖ్యత???

ఒక మొక్కకు నిలువెల్లా, ఏ సువాసనలు లేకున్నా,
ఎన్నాళ్ళు వేచి చూసినా, కుసుమాలూ పూయకున్నా,
వివక్షనేది ఉంటుందని, పాపం మన ప్రకృతికేం తెలియదు,
మాను ప్రాణంతో ఉన్నవరకు, అన్నీ సమకూర్చక మానదు…

పసిపిల్లల తల్లులూ, మీరు భావితరపు నిర్మాతలు…
మీ పిల్లలనే పెంచుతూ, మంచి చెడులు నేర్పుతారు…
లింగబేధమొద్దు అంటూనే, స్త్రీపురుషులె సమమంటారు,
మేము కూడ ఉన్నామని, ఓ క్షణమైనా తలిచారా???

సమాజాన్ని తీర్చిదిద్దు, వెలకట్టలేని గురువులూ,
మీరైనా తగ్గించగలరా, ఈ వేధింపుల బరువులు???
మీ నోటి వెంట వచనాలు, విద్యార్థులకే ఉత్తర్వులు,
ఆ బోధనలకు ఆగగలవు, మా రేపటి అశ్రువులు…

మీ ఆశయాల సాధనకై, నిత్యం శ్రమపడేటి యువకులారా…
మాకు కూడ మీలాంటి కలలు ఉండేవని నమ్మగలరా???
గొప్ప మనసు చేసుకుని, నేడు మాకు తోడు నిలవగలర???
ఈ వివక్ష ఒక పాపమని, రేపటి తరముకు నేర్పించగలరా???

కనిపిస్తేనే భయపడేంత, ధుర్మార్గులమేం కాదండి,
మాలాంటివాళ్ళు ఎదురైతే, దూరంగా వెళ్ళకండి…
మేము కూడ మనుషులమని, ధైర్యంగా నడవండి,
రావాల్సిన మార్పుకు అది, తొలి అడుగని నమ్మండి…

మా దీవెనలే గొప్పవంటె, మీ మంచికి ప్రార్థిస్తాము,
ఈ వెనకపడిన జాతిపైన, కాస్తైనా దయ తలచండి…
శివుడి ప్రతిరూపం మేమంటూ, సింహాసనాలు వద్దండి,
మమ్ము మనుషులమని గుర్తిస్తూ, బతకనిస్తే చాలండి..

                                    ఇట్లు,
మీలోని నపుంసకులం

రచయిత ::భరత్(చిన్న)

You May Also Like

2 thoughts on “నపుంసకుల మనోగతం (తమ మాటల్లో…)

  1. నిజమేనండి, ఎవరి వేదన వారికే తెలుస్తుంది. చాలా అందంగా మీ భావాలను రచన చేశారు👏👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!