నువ్వు లేక నేను లేను

(అంశం :: “ప్రేమ”)

నువ్వు లేక నేను లేను

రచయిత:: కమల ముక్కు (కమల’శ్రీ’)

మధ్యాహ్నం ఒంటి గంటన్నర అయ్యింది. లంచ్ టైం కావడంతో తన సీట్ నుంచి లేచి క్యారేజ్ పట్టుకుని డైనింగ్ హాల్ కి వెళ్లాడు మోహన్. అప్పటికే కొలీగ్స్ అందరూ తమ బాక్స్ లు ఓపెన్ చేసే పనిలో ఉన్నారు.

హ్యాండ్ వాష్ చేసుకుని కొలీగ్స్ తో మాట్లాడుతూ లంచ్ ముగించాడు. భోజనం అయ్యాక ఫోన్ తీసి తన భార్య సమత కి ఫోన్ చేశాడు.

“హా… ఏవండీ భోజనం చేశారా.” అంది ఫోన్ లిఫ్ట్ చేసిన సమత.

“హా అయ్యింది. నువ్వు చేశావా?!.”

“చిన్న పని మీద బయటకు వచ్చాను. మళ్లీ చేస్తాను.” అని మోహన్ ఏదో అడుగుతుండగానే ఫోన్ కట్ చేసింది.

తర్వాత మళ్లీ ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే పనిలో ఉందని చెప్పింది గా మళ్లీ చేస్తుందిలే అనుకుంటూ వర్క్ లో పడిపోయాడు. మధ్య మధ్యలో ఫోన్ చూస్తేనే ఉన్నాడు సమత కాల్ కోసం. కానీ తను ఫోన్ చేయనేలేదు.

ఇంక ఆగలేక మూడు గంటలు అవుతుందనగా తనకి కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. ‘అదేంటి మళ్లీ చేస్తానని చెప్పింది. ఇంతవరకూ చేయలేదు. ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమై ఉంటుంది?.’అనుకుంటూ మరోసారి ట్రై చేశాడు.

‘ఛార్జింగ్ లేదేమో? తిన్నాక కాస్త కునుకు తీయడం అలవాటు కదా పడుకుందేమో? అయినా ఈ టైం వరకూ పడుకోదే?’అనుకుంటూ మరోసారి ఫోన్ ట్రై చేశాడు. మళ్లీ అదే సమాధానం ‘మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. కాసేపాగి ప్రయత్నించండి.’ అంటూ.

ఎందుకైనా మంచిదని తన ఫ్రెండ్ చైతన్య కి ఫోన్ చేశాడు.

“ఏంటి మోహన్ ఈ టైంలో చేశావు?!. అన్నాడు చైతన్య తన వర్క్ చేస్తూనే.. అతనో బ్యాంక్ ఎంప్లాయీ.

“చైతూ! నాకో చిన్న హెల్ప్ చేసి పెడతావా?!.” అన్నాడు అర్థింపుగా.

“అదేంట్రా! ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావు?. నీ వాయిస్ ఏంటీ వణుకుతోంది?.”కంగారుగా అడిగాడు చైతన్య.

“అదేమీ లేదురా ఆఫీసులో చిన్న టెన్షన్. అంతే. సరే కానీ ఓసారి ఇంటికి వెళ్తావా. చాలా సేపటి నుంచి సమత కి ఫోన్ చేస్తున్నా లైన్ కలవడం లేదు.” అన్నాడు.

“సరేరా. ఓ పది నిమిషాల్లో వెళ్తాను.” అని ఫోన్ పెట్టేశాడు చైతన్య.

క్షణమొక యుగంలా గడుస్తున్నట్టుగా అనిపించింది మోహన్ కి. ‘ఇంకా ఫోన్ చేయలేదేంటి వీడు వెళ్లాడా లేదా. ఎంతసేపు వెయిట్ చేయాలి?. అనుకుంటూ మరోసారి ఫోన్ చేద్దాం’ అని నెంబర్ కొట్టే లోపే చైతన్య నుంచి ఫోన్ వచ్చింది.

“రేయ్ మోహన్ ఇంటికి తాళం వేసుంది రా. సమత బయటకు వెళ్లినట్టు గా ఉంది.”

“ఓహ్ అవునా. సరే రా. థాంక్యూ.” అన్నాడే కానీ మోహన్ కి కాలూ చేతులూ ఆడటం లేదు. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. ఇక ఆఫీస్ లో ఉండలేక పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చేసి బైక్ స్టార్ట్ చేసి ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు.

‘ఇంట్లోనూ లేక. ఫోన్ పని చేయక ఎక్కడికి వెళ్లుంటుంది. అసలు ఏమైయ్యుంటుంది?!.’ అని తనలో తానే అనుకుంటూ ఉండగా రేయ్ మోహన్ అసలు ఏం జరిగింది రా?!.” అన్న చైతన్య మాటలతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి

“అహా!ఏం లేదు రా సమత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చాలా సేపటి నుంచి.పడుకుందేమో ఫోన్ ఛార్జింగ్ చూసుకోలేదేమో అనుకున్నా. కానీ ఇంట్లోనూ లేదంటున్నావు. స్కూల్ నుంచి పిల్లల్ని తేవడానికి వెళ్లిందేమో! అరే చైతూ నాకు ఇంకో హెల్ప్ చేయాలిరా. ఓసారి తను స్కూల్ కి వెళ్లిందేమో చూసి చెప్పవా.. ఫ్లీజ్.ఈ ఒక్క మేలూ చేయరా నీ రుణం మర్చిపోను.” అన్నాడు.

“ఈ మాత్రం దానికే రుణాలు వరకూ ఎందుకు రా. నేను వెళ్తాను.” అంటూ ఫోన్ పెట్టేసాడు చైతన్య.

‘ఇంట్లోనూ లేదా…మరేం అయినట్టు. అసలు బయటకు ఎందుకు వెళ్లింది. ఇంటికి ఏం అవసరం అయినా అన్నీ నేనే తెచ్చి పెడతాను కదా. అసలే తన ఆరోగ్యం ఈ మధ్యన బాలేదు.మొన్ననే కళ్లు తిరిగి పడిపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. ఆయన లోబీపీ ఉందనీ జాగ్రత్త గా ఉండమని చెప్పారు. తనేమో చెప్పకుండా ఎక్కడికో వెళ్లింది. కొంపదీసి పని మీద బయటకు వెళ్లాను అంది దార్లో ఎక్కడైనా కళ్లు తిరిగి పడిపోయిందా. అసలు నాకు చెప్పకూడని పని ఏముంది తనకి. ఎక్కడికి వెళ్లినట్టు?.’ అనుకుంటూ తన మొబైల్ కీ,సమత మొబైల్ కీ లింక్ చేసిన లైఫ్ 360 యాప్ ఓపెన్ చేసి తనతో మాట్లాడినప్పుడు లొకేషన్ చెక్ చేశాడు.అది తమ ఊరికి కొంచెం దూరం లో ఉన్న వాటర్ టాంక్ దగ్గర చూపిస్తుంది.

‘అదేంటి అక్కడికి ఎందుకు వెళ్లినట్టు.అసలే ఆ ప్రాంతం అంత మంచిది కాదనీ, ఆడపిల్లల మీద ఆగాయిత్యాలు జరిగే ప్రాంతం అని ప్రతీతి.మరి అలాంటి ప్రాంతానికి చేరువలో సిగ్నల్ ఆగింది అంటే సమతకి ఏదైనా… నో అలా జరగదు. తనకేమి అయ్యుండదు. స్కూల్ కి చైతన్య వెళ్ళాడు గా తను అక్కడే ఉందని చెప్తాడు.’ అనుకుంటూ బైక్ ని ఫాస్ట్ గా నడుపుతున్నాడు.

చెంపలపై అశ్రువులు జాలువారుతున్నా అతనికి తెలియడం లేదంటే అతనెంత ఆలోచనల్లో మునిగిపోయాడో అర్ధం అవుతుంది. ఇంతలో అతని సహనానికి పరీక్షగా సిగ్నల్స్ పడ్డాయి. క్షణం గడిచే కొద్దీ అతనిలో టెన్షన్ పెరిగిపోతుంది. సిగ్నల్ పడీ పడటం తోనే బైక్ ని ముందుకి దూకించాడు మోహన్.

కొంచెం దూరం పోయేసరికి తన మొబైల్ రింగ్ అవ్వడం తో ఓ సైడ్ కి బైక్ ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు.

“మోహన్ సమత ఇక్కడ కూడా లేదురా. స్కూల్ ఇప్పుడే వదిలారు పిల్లల్ని తెచ్చేయమని అంటావా?!.” అన్నాడు చైతన్య ఫోన్ లో.

“సరే నువ్వు తెచ్చేయ్యారా. నేను ఇంటికి వచ్చేస్తున్నాను.” అని ఫోన్ కట్ చేసి ఏదో పని బయటకు వెల్లుంటుంది, నేను వెళ్ళే సరికి వచ్చేస్తుంది అనుకుంటూ బైక్ ని ఇంటి వైపుగా పోనిచ్చాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న అతనికి ఇంటి ముందు ఉండాల్సిన స్కూటీ కనపడక పోయే సరికి ‘ఇంకా రాలేదా.అసలు ఎక్కడికి వెళ్లింది?!.’ అనుకుంటూ మరోసారి ఫోన్ చేశాడు.ఇప్పుడూ అదే సమాధానం. అతనికేం పాలు పోవడం లేదు. సమతకి ఏం అయ్యింది. తను లేకపోతే నేనూ పిల్లలూ ఏమైపోతారు. మరో సారి తను ఒంటరి అయిపోతాడు. అనుకుంటూ తన గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.

చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కాస్త పెద్దైయ్యాక తండ్రి ఉద్యోగం అతనికి వచ్చింది. తల్లి ఉన్నంత వరకూ చక్కగా డ్యూటీ చేసుకునే వాడు. అలాంటి అతని జీవితం లో అనుకోని కుదుపు తల్లి మరణం. ఆమె చనిపోయాక తల్లి జ్ఞాపకాలతోనే గడుపుతూ, రోజంతా తాగుతూ ఉద్యోగానికి కూడా వెళ్లడం మానేశాడు. అలా ఓ సంవత్సరం పాటు పిచ్చోడిలా తిరుగుతూ గడిపేశాడు.

ఇలానే ఉంటే అతని జీవితం ఏమౌతుందో, పెళ్లి చేస్తే కాస్తైనా మార్పు వస్తుందని అనుకుని ఆఫీస్ స్టాఫ్ సమత తో పెళ్లి కుదిర్చారు. సమత వచ్చాక మోహన్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. తల్లి దూరమైన తన జీవితం లోకి వచ్చిన సమతకి తల్లి స్థానాన్ని ఇచ్చి ప్రేమగా చూసుకున్నాడు. వారి ప్రేమకి గుర్తుగా ఇద్దరు పిల్లలు మోక్ష, మోక్షిత. వాళ్ళతో హ్యాపీ గా లైఫ్ గడిచిపోతున్న టైమ్ లో ఇప్పుడు సమత కనిపించక పోవడం అతన్ని మరోసారి డిప్రెషన్ లోకి నెట్టేసింది. పిచ్చోడిలా తలపట్టుకుని గుమ్మం దగ్గరే కూర్చున్న అతని దగ్గరికి పరుగున వచ్చారు “డాడీ” అంటూ అప్పుడే చైతన్య బైక్ దిగిన పిల్లలిద్దరూ. వాళ్లని చూడగానే మోహన్ లో దుఃఖం మరింత పెరిగింది.

“పిల్లల్ని నన్నూ వదిలి ఎక్కడికి వెళ్లిపోయావు సమత. నువ్వు లేకుండా మేము ఉండగలమా.అసలు ఏమైపోయావు”అనుకుంటూ వాలిద్దర్ని గుండెలకు హత్తుకున్నాడు.

మోహన్ అని చైతు పిలుపు వినిపించి తలపైకెత్తాడు. “ఏంట్రా ఏం జరిగింది ఎందుకింత కంగారుగా ఉన్నావు? కళ్లెందుకు ఎర్రగా ఉన్నాయి?.” అన్నాడు.

“అదేం లేదు చైతూ బాగానే ఉన్నాను.అంత దూరం బైక్ మీద వచ్చాను కదా కళ్ళల్లో ఏదో పడుంటుంది.అందుకే కళ్లు ఎర్రగా ఉన్నాయి.” అన్నాడు తల పక్కకి తిప్పుకుని.

“కళ్లలో నలక పడితే కళ్లు ఎలా ఉంటాయో. భాద లో ఉంటే ఎలా ఉంటాయో నాకు తెలీదా. అసలు ఏం జరిగింది?.” అని అతని భుజం పై చేయి వేశాడు చైతన్య.

మోహన్ ఏడుస్తూ మధ్యాహ్నం నుంచి సమత ఫోన్ అవ్వడం లేదని, చాలా సార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన లాస్ట్ కాల్ వచ్చిన లొకేషన్ ఆ వాటర్ ట్యాంక్ దగ్గర చూపిస్తుంది. ఏమైయిందో ఏంటో అని భయం వేస్తుంది.” అన్నాడు ఏడుపు ముఖం తో.
“ఇంత జరిగితే చెప్పకుండా సమత ఉందో లేదో చూసి చెప్పు అని చెప్పావేంట్రా. ఉండు ఇప్పుడే మన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాను. వాళ్లు సమత గురించి వెతుకుతారు. ఎందుకైనా మంచిది పోలీసులకు కంప్లైంట్ ఇద్దాము.” అని ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాడు చైతన్య.

ఎప్పుడూ నవ్వుతూ ఎదురోచ్చే తల్లి కనిపించక పోయే సరికి పిల్లల ముఖాల్లో ఏదో తెలియని దిగులు.వారిని పక్కింటి వారికి అప్పగించి తన ఫ్రెండ్స్ తో పాటే సమతని వెదకడానికి బయలుదేరబోతుంటే వీధి చివర ఓ ఆటో ఆగింది. అందులోంచి దిగుతూ కనపడింది సమత. ఆమె ని చూడగానే పరుగున ఆమె దగ్గరికి చేరుకుని గట్టిగా హత్తుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు. అంతవరకూ పడిన టెన్షన్ మొత్తం దూదిపింజలా ఎగిరిపోయింది.

ఎప్పుడూ లేనిది అతనలా ఏడుస్తూ ఉండేసరికి ఏం చెప్పాలో తెలీక అలా నిలబడిపోయింది సమత.

ఆమె కనపడగానే మోహన్ ఫ్రెండ్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి తేరుకున్న మోహన్ కళ్లు తుడుచుకుని పద ఇంటికి అంటూ ఇంటివైపు నడిచాడు.

అయ్యో డోర్ కూడా ఓపెన్ చేయకుండా ఎటు బయలు దేరుతున్నావు మోహన్. పిల్లలు వచ్చారా. వాళ్లకేమైనా ఇచ్చారా?. అంటూ లాక్ ఓపెన్ చేసింది. మోహన్ సమాధానం ఇవ్వకుండా పిల్లల్ని తీసుకుని వచ్చాడు. అందరూ ఇంట్లోకి వెళ్లారు. సమత ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ”ఎక్కడికి వెళ్లావు సమతా?!. అని చైతన్య అడగబోతుంటే మోహన్ కళ్లతోనే వారించాడు వద్దని. కాసేపటికి అందరూ వెళ్లిపోయారు.

పిల్లల డ్రెస్ లు మార్చి వారికి పాలు ఇచ్చి వంట పనిలో పడింది సమంత.

రాత్రి భోజనాలు అయ్యి పిల్లలు పడుకున్నాక “ఏమయ్యింది మోహన్ ఎందుకలా చిన్నపిల్లాడిలా ఏడ్చారు?!.” అంది సమత.

“నీవల్లే.”

“నా వల్లా. ఎందుకు. నేనేం చేశాను?!.”

“నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ చేశావు?!.”

“అదీ చిన్నపని ఉండి బయటకు వెళ్లాను. అందుకే…”

“ఏం పనీ…?!.”

“….”

“చెప్పు ఏంటా పనీ‌. నాకు కూడా చెప్పకుండా వెళ్లేంత ముఖ్యమైన పని ఏముంటుంది. నేనెంత భయపడ్డానో. మా అమ్మ చనిపోయిన తర్వాత ఇదే మొదటిసారి నేను ఏడ్వడం.” అన్నాడు చిన్నపిల్లాడిలా.

“ఇదే ఆఖరిసారీ… కావాలి. సారీ మోహన్ మీకు చెప్పకుండా వెళ్లడం నా తప్పే. కానీ ఫోన్ ఆన్ లో ఉంటే మీరు మాటిమాటికీ చేస్తునే ఉంటారని ఆఫ్ చేశాను.”

“అదే ఎందుకు?!.”

ఆమె సమాధానం ఇవ్వకుండా గడియారం వైపు చూస్తూ ఉండిపోయింది.

“ఏంటి అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా అలా దిక్కులు చూస్తావు. ఎక్కడికి వెళ్లావు సమతా?!.”

అప్పుడే గడియారం ముల్లు పన్నెండు మీదికి వెళ్లింది. అది చూడగానే అంతవరకూ తన చేతిలో ఉన్న ఓ బాక్స్ ఓపెన్ చేసి “హ్యాపీ బర్త్ డే మోహన్. లవ్యూ సో మచ్ డియర్.” అంటూ అతని చేతికి ఉంగరం తొడిగింది.

అతను ఏమాత్రం ఎక్జైట్ కాకుండా “నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా ఇదంతా ఏంటి సమతా?!.” అన్నాడు.

“సారీ మోహన్ మిమ్మల్ని చాలా భయపెట్టాను కదా. మీ బర్త్ డే కి గిఫ్ట్ కొని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని మా బాబాయ్ ని తోడు రమ్మన్నా. నువ్వు ఫోన్ చేయడంతో బైక్ ఆపి మాట్లాడాను. నా ఫోన్ లొకేషన్ ఆన్ లోనే ఉంటే నేను ఎటువెళ్తున్నానో ఏంటో తెలిసిపోతుంది అని ఫోన్ స్విచ్చాఫ్ చేశాను. స్కూల్ విడిచే టైం కి వెళ్లిపోవచ్చనే అనుకున్నా. కానీ బాబాయ్ షాప్ కి వచ్చేసరికి లేట్ అవ్వడం, రింగ్ కొన్నాక నా బైక్ పంక్చర్ అవ్వడం దాన్ని బాబాయ్ కి ఇచ్చి నేను ఆటో ఎక్కి స్కూల్ కి వెళ్లేసరికి పిల్లల్ని చైతన్య తీసుకుని వెళ్లాడని చెప్పడంతో వెంటనే అదే ఆటో లో ఇంటికి బయలుదేరా నువ్వు వచ్చేసరికి ఇంటికి చేరుకుందామని. కానీ అప్పటికే నువ్వు వచ్చేసావు.” అంటూ మొత్తం చెప్పింది సమత.

ఆమె చెప్పిందంతా విని ఆమె చేతిలో చేయి వేసి నువ్వు నా లైఫ్ లో ఉండటమే నాకు పెద్ది గిఫ్ట్ సమతా. ఇంకేం కావాలి చెప్పు. ఆ నాలుగు గంటలూ నాలుగు యుగాలుగా అనిపించాయి నాకు. ఇంకాసేపు ఆగితే నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది. నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లకు సమతా. నువ్వు లేకుండా నేను లేను.” అంటూ చిన్నపిల్లాడిలా ఆమెని హత్తుకుని ఏడ్చాడు.

అతనలా చెప్తే సరికి సమత కళ్లల్లో కూడా కన్నీరు. కాసేపటికి తేరుకుని “నువ్వుంటే చాలురా. నాకింకేం అవసరం లేదు. ఐ లవ్యూ సో మచ్.” అంటూ ఆమె నుదుట ముద్దుపెట్టుకున్నాడు.

లవ్యూ టూ. ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను. అని అతని నుదుటిపై ముద్దు పెట్టి “ఒన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే.”అంది‌.

“థాంక్యూ సో మచ్ బంగారం.” అంటూ ఆమెని హత్తుకున్నాడు మోహన్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!