న్యాయము దక్కని దేశ నిర్మాతలము , వెన్ను విరిగిన వలసకూలీలము

న్యాయము దక్కని దేశ నిర్మాతలము ,
వెన్ను విరిగిన వలసకూలీలము

రచన::వడ్డాది రవికాంత్ శర్మ

సామాజిక అసమానత సగం జీవితాన్ని చిదిమేయగా…/
ఆర్థిక ఆసరాకై ఉత్తరాదినుండి దక్షణాది చేరాము …./
ఆ రోజులే బాగున్నాయి…/
కనీసం సగం కడుపైనా నిండేది …………/
కరోనా కల్లోలంలో, ఖాళీ కడుపులతో ఉపఖండంలో కదిలాము … /
దిక్కే తెలియని ప్రయాణానికి తొలి అడుగు వేసాము , స్వదేశంలో శరణార్థులలాగా ../

మండే సూర్యుణ్ణి అడుగు …./
తన వేడికి తానే విసుగొంది రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటాడతడు…/
వెన్నెల కురిపించే చందమామ నడుగు …/
చీకటికి భయబడి వేకువ ఝామున ఇక చిత్తమంటాడు అతడు …/
చీకటి- వెలుతురు తేడాలేని అరుంధతీ సుతులము మేము …/
కాటికి కాలు చాచిన పెద్దలని పుచ్చుకుని సొంతూరికి పయనమయ్యాము …/

ఆదివారాలు సెలవు దినాలు …/
లాక్ డౌను కాలములో ఇంటిలోనే ఆన్లైను ఆఫీసు మీటింగులు …/
కుటుంబాలతో కలిసి దేశీయులు ఆస్వాదిస్తున్న వేళ …/
తిండీతిప్పలు లేని వారాలు చేస్తూ …./
అప్రకటిత నిరాహారదీక్షలో మాకే తెలియని ఆధ్యాత్మిక యాత్రచేస్తున్నాము ../
కర్మ సిద్దాంతముతో న్యాయము దక్కని దేశ నిర్మాతలము , వెన్ను విరిగిన వలసకూలీలము ../

నెలసరిలో మా ఆడబిడ్డల నొప్పి రెట్టింపు కాగా …/
ఎముకల బరువుతో మా బక్కచిక్కిన బుడ్డోడి పేగులు రోదన చేయగా …/
అసమర్థుని జీవిత యాత్రలో ఆఖరి ఘట్టాపు వర్ణనలాగా …./
అందని ద్రాక్షలాంటి ప్రభుత్వ పథకాల ఒయాసిస్సులని మార్గమధ్యలో దర్శిస్తూ ../
స్వర్గలోకపు దారి , నరకపు వాతావరణమూ ఒకే సారి అనుభూతి చెందుతూ …/
భూమాత వడిలోనే నేలరాలిన కుసుమాలము , నవభారత అసమానతల సాక్షిభూతాలము …/
వలస కూలీలము మేము , అన్యాయాన్ని గుర్తించలేని అమాయక ప్రాణులము మేము …/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!