ఆన్లైన్ ఆర్డర్

ఆన్లైన్ ఆర్డర్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి

ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం అన్ని భావాల్ని ప్రతిఫలిస్తున్న మోహంతో తల వేలాడేసి కూర్చున్నాడు ఆఫీస్లో సుబ్బారావు. అడక్కపోయినా సలహాలిస్తూ, అడిగితే వెటకారం చేస్తూ, ఎప్పుడూ హడావిడిగా ఉండే సుబ్బారావు మౌనం ఆరోజు ఆఫీసులో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని గుసగుసలు, కొన్ని వెక్కిరింతలు, కొన్ని ఓదార్పుల  మధ్య ఆ రోజు పని అయింది అనిపించి ఇంటి దారి పట్టారు అందరు. సుబ్బారావు దోస్తు వెంకటరావు మాత్రం సుబ్బారావు తీసుకొని పార్క్ వైపుగా నడక సాగించాడు. జన సంచారం పెద్దగా లేని ఓ చోట బెంచీపై కూర్చున్నారిద్దరూ. “చెప్పరా సుబ్బారావు ఏంటి నీ బాధ ” ఓదార్పుగా అడిగాడు వెంకట్రావు. ఆ కాస్త ఓదార్పుకే ఏడ్చినంత పనిచేశాడు సుబ్బారావు. “అసలు నీ బాధకు కారణం ఏంటని” అడిగాడు వెంకట్రావు.”నా భార్య అలివేలు తెలుసు కదా” ముక్కు చీదుతూ చెప్పాడు సుబ్బారావు. “అలివేలా ! చాలా మంచి అమ్మాయి కదరా కొంపదీసి నీచేత ఇంటి పని, వంట పని చేయిస్తోందా? అడిగాడు వెంకట్రావు. కాదురా ఆరు నెలల క్రితం తనకి నేను స్మార్ట్ ఫోన్ కొనిచ్చా  తెలుసుగా అన్నాడు సుబ్బారావు. అవును చెప్పావు అది కొన్న తర్వాత షాపింగ్ తీసుకెళ్ళమని అడగట్లేదు ప్రాణానికి హాయిగా ఉంది అన్నావుగా అంటూ ఆగాడు వెంకట్రావు. అవున్రా దానికి ఆన్లైన్ షాపింగ్ పిచ్చి పట్టుకుంది అవసరం ఉన్నా లేకపోయినా ఏదీ వదలకుండా కొని  తెగలేస్తుంది. మొన్న వంద చీపుర్లకు ఒక స్పూన్ ఫ్రీ అంటే రెండువందల చీపుర్లు కొన్నది. బొట్టుబిళ్లల దగ్గర్నుంచి చంటాడి చెడ్డీ వరకు అన్నీ ఆన్లైన్లో నే పదిరూపాయల వస్తువైనా యాభై రూపాయల డెలివరీ ఛార్జ్ పెట్టిమరీ కొంటుంది. ఈ మధ్య ఉదయం టీ నుండి రాత్రి డిన్నర్ వరకు అన్నీ ఆన్లైన్లోనే. పిచ్చికి పరాకాష్టేమిటో తెలుసా రాత్రిపూట కూడా అర్ధరాత్రి పెట్టే ఆఫర్స్ కోసం మేలుకొనే వుంటుందిరా” చెప్తూ భోరుమన్నాడు సుబ్బారావు.
బ్యాంకు బాలెన్స్ కాళీ చేసి డబ్బులు లేవని చెప్పకపోయావా, పిన్ కోడ్ మార్చడమో ఏదో చెయ్యచ్చు కదా “సలహా ఇచ్చాడు వెంకట్రావు.
ఆ సంబడం అయింది. మహిళా ఆన్లైన్ షాపింగ్ వాట్సాప్ గ్రూప్ అట. అందులో కంప్లైంట్ ఇస్తే షాపింగ్ చెయ్యనియ్యని భర్తలను గృహహింస చట్టం కింద అరెస్టు చేయిస్తారట. రెండ్రోజులు గ్రూపులో ఆక్టివ్ గా లేకపోయినా, షాపింగ్ చెయ్యకపోయినా, లేటెస్ట్ గా కొన్న వస్తువులు షేర్ చెయ్యకపోయినా, అనుమానంతో  వెంటనే సదరు సంస్థ వారు ఆ మహిళ తాలూకు భర్తని అరెస్ట్ చేయిస్తారంట బెదిరిస్తోందిరా” గుడ్లనీళ్ళు కుక్కుకుంటూ చెప్పాడు సుబ్బారావు. మా కాలనిలో జడ్జి ఆనందరావు గారున్నారు. రేపు ఆయన దగ్గరికెళ్లి దీనికో పరిష్కారం అడుగుదాం. ఈ ఒక్కరోజుకు ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకో అన్నాడు వెంకట్రావు.
విరక్తిగా ఇంటిదారి పట్టాడు సుబ్బారావు. తలుపు కొట్టగానే ఆత్రంగా తలుపుతీసిన అలివేలు నిరుత్సాహంగా” మీరా వేడినీళ్లు ఆర్డర్ పెట్టాను స్నానానికి, ఆ డెలివరీ బాయ్ అనుకున్నాను” అంటూ లోపలికెళ్ళింది. వంటే మైనా చేశావా అదీ ఆర్డర్ పెట్టావా అసహనంగా అడిగాడు సుబ్బారావు. నావరకే పెట్టాను. మీకేంకావాలో మీరే ఆర్డర్ చెయ్యండి. భలే భోజనం ఆప్ లో రెండు చపాతీలకి ఒక టీషు పేపర్ ఉచితమట. ఆఫర్ కూడా చెప్పి వచ్చిన వేణ్ణీళ్లను రిసీవ్ చేసుకోడానికి వెళ్ళింది అలివేలు. రేపు జడ్జి గారిని కలిసాకైనా ఏదో పరిష్కారం దొరకకపోతుందా అనే ఆశతో నిద్రపోయాడు సుబ్బారావు. మర్నాడు ఉదయాన్నే ఆఫీస్ కు సెలవు పెట్టి మరీ వెళ్లారు ఆనందరావుగారింటికి. బయట కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడాయన వీళ్ళు వెళ్లేసరికి . వెంకట్రావు చెప్పిందంతా విన్న ఆయన మౌనంగా లేచి నాతో లోనికి రండంటూ తీసుకెళ్లాడు. అక్కడ పరిస్థితి చుసిన సుబ్బారావు, వెంకట్రావు ఇద్దరు అవాక్కయ్యారు. అక్కడ పనికొచ్చేవి, పనికిరానివి బోల్డు వస్తువులున్నాయి. ఇంకో గదిలోకి తీసుకెళ్లాడు అక్కడ ఆనందరావు గారి భార్య తాయారు గారు ఆన్లైన్ షాపింగ్లో బిజీగా వున్నారు. బయటకొచ్చిన తరువాత కళ్లనీళ్లు పెట్టుకుంటూ అడిగాడు మీకేదైనా పరిష్కారం దొరికితే నాకు చెప్పమని చేతులు పట్టుకు బతిమాలాడు. నిరాశగా వెనుదిరిగారిద్దరూ. మర్నాడు సోషల్ మీడియా సాక్షిగా అఖిల భారత భార్యా బాధిత ఆన్లైన్ షాపింగ్ వ్యతిరేక సమూహానికి ఊపిరిపోశాడు సుబ్బారావు. అనూహ్యంగా వేల సంఖ్యలో సభ్యులు చేరారు ఆనందరావుతో సహా. కమిటీ కార్యాచరణ అమలు వంటి బాధ్యతలు వెంకట్రావు తీసుకున్నాడు. ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!