ప్రేమ పవర్

ప్రేమ పవర్

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కవిత బేతి

శరత్,

ప్రేమ అనే రెండక్షరాలలో ఇంత పవరుందా! లోకమంతా అందంగా కనిపిస్తుంది. ఎవరిని చూసినా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నిమిషనిమిషానికి ఒళ్ళు పులకరిస్తుంది. పెదవులపై చిరునవ్వు నాట్యం చేస్తుంది. కళ్ళలో మెరుపు చమక్కంటుంది. ఎవరి తప్పులయినా ఎంచక సరిదిద్దే సహనం వచ్చింది. ఏ పనయినా చకచకా చేసేసే నేర్పు వచ్చింది. ఆఫీస్ స్టాఫ్ అందరికీ నాలో మార్పు కనిపిస్తుంది. అది నాకు తెలుస్తుంది. మొండిది అనుకునే వాళ్ళందరూ నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో మార్పులు నాలో, దానికి కారణం నువ్వే. చిన్నప్పటి నుండి నా పేరు మొండిపిల్ల. అతిగారభం వల్లనేమో, అడిగినవన్నీ దొరికినందుకేమో, చదువులో ఆటల్లో ముందున్నందుకేమో, దేనికీ ఎదురులేకుండా పెరిగినందుకేమో, నా చుట్టూ నా మనసు చుట్టూ నేనే రాణిని అని కోట కట్టుకున్నాను. నువ్వొచ్చి దాన్ని ముట్టడించావు, నన్ను జయించావు.
హెడ్ ఆఫీస్ కి వారం రోజుల ట్రైనింగ్ కోసం ముంబై వచ్చి నిన్ను కలవడం నా జీవితంలో మరపురాని సంఘటన. ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో నా హృది నింపావు. నా పని నేను చూసుకుని వెళ్ళిపోతుంటే అడ్డగించావు, అల్లరి చేసావు, ఆప్యాయత కురిపించావు. నా జీవితంలో అమృతం నింపావు. నీ కళ్ళతో నాకు కొత్త ప్రపంచాన్ని చూపించావు. ఊపిరి సలపనంతగా ఉక్కిరిబిక్కిరి చేసి, నాకు ప్రేమ రుచి చూపించావు. నాకే తెలియకుండా నా మనసు నీకర్పించిన క్షణం, ప్రేమ అనే రెండక్షరాల సంతకం నా పెదవులపైన, మనసుపైన, నా జీవితంపైన ముద్రించావు. నన్ను పూర్తిగా ప్రేమ మైకంలో ముంచావు. నేనింకా అందులోనే మునిగి ఉన్నాను. ట్రైనింగ్ పూర్తయి తిరిగొచ్చేస్తూ నిన్ను హత్తుకున్నప్పటి నా గుండెవేగం ఇప్పటికీ గుర్తుంది. త్వరలో కలుసుకుందామని నీ పెదవులకి నా చేతినానించుకొని నువ్విచ్చిన వీడ్కోలు, నా చెవులలో ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. ఆ తరవాత వచ్చిన వైరస్ ప్రపంచంలోని ఎన్నో జీవితాలని అతలాకుతలం చేయడమే కాదు, మననీ కలుసుకోనీకుండా దూరం పెంచింది శాశ్వతంగా. లాక్డవున్లో నువ్వు పడిన శ్రమ, చేసిన త్యాగం, నీ నిస్స్వార్ధ సేవ, నీ ప్రేమ మన రెండు హృదయాల మధ్య మాత్రమే కాదని, అది అందరిదీ అని తెలిసింది. ప్రపంచంలోని ప్రతీది ప్రేమించదగినదేనని నాకు నేర్పించినట్టయింది. రాణిని అనుకునే నేను, నీ ప్రేమకి దాసోహం అయ్యాను. నువ్వు చెప్పిన మాటలు, పంపిన మెసేజీలు, ఫొటోలు ఇప్పటికీ నాకు ప్రేరణనిస్తున్నాయి. అందుకే నువ్వు లేకున్నా నీ ప్రేమ నన్ను కృంగిపోకుండా నిలబెట్టింది. శరత్, నువ్వు నన్ను మాత్రమే ప్రేమించి ఉంటే, నిన్ను పోగొట్టుకున్నందుకు ఏడుస్తూ ఉండేదాన్నేమో, అందరికీ నీ ప్రేమను పంచావు కనుక నాకు ప్రపంచమంతా నువ్వే కనిపిస్తున్నావు. నువ్వు నాలో నింపిన ప్రేమతో, జవాబు రాదని తెలిసినా నీకిలాంటి లేఖలు రాస్తూనే ఉన్నాను.

నీ
రాణి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!