స్కూల్ బ్యాగ్ కష్టాలు

స్కూల్ బ్యాగ్ కష్టాలు

రచయిత :: రోజా రమణి ఓరుగంటి

అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సోఫా లో కూలబడి.. ఎదో ఆలోచిస్తున్న శ్రీనిధిని అమ్మ ఇలా అడిగింది.. “ఏమిటి శ్రీనిధి దీర్ఘం గా ఆలోచిస్తున్నావ్”

శ్రీనిధి : హా… ఏమని చెప్పను.. ఎన్నని చెప్పను…

అమ్మ : ఏమిటవి….

శ్రీనిధి : నా “స్కూల్ బ్యాగ్” కష్టాలు అమ్మ.

అమ్మ: ఆ…ఏవిటీ విడ్డూరం.. “స్కూల్ బ్యాగ్” కష్టాలా .. అదీ నీకు ఈ వయసు లోన..

శ్రీనిధి : “స్కూల్ బ్యాగ్”కి వయసుతో సమందం ఏవిటి అంటావా.. వయసుకు మించిన బరువు మొయిస్తున్నారు మా చేత.. ఎం చెప్పమంటావ్. బాగా అలసి పోయాను. కొన్ని మంచినీళ్లు ఇస్తే అన్ని వివరం గా చెప్తాను…
అమ్మ : సరే సరే ఉండు తెస్తాను.
ఇదిగో ఇంద నీళ్లు. ఇప్పుడు చెప్పవే నీ స్కూల్ బ్యాగ్ కష్టాలు..ఏంటో..
సరే .. “పొద్దునే స్కూల్ కి వెళ్లాలని నిద్ర లేస్తానా.. లేచిన వెంటనే కాలకృత్యాలు కానిచ్చి, స్నానం అదీ అయ్యాక, ఎదో కాస్త నా పొట్టలో వేసాక నువ్వు జడ వేసేటప్పుడు మొదలు అవుతుంది నాకు భయం. స్కూల్ బ్యాగ్ ని చూడగానే బియ్యం బస్తా చుసిన అనుభూతి కలుగుతుంది. దేవుడా ఇప్పుడు ఈ బ్యాగ్ ని మోసుకుని కిందికి దిగేసరికి పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయి రోజు… నాకు. అమ్మకి ఏమో అర్థం కాదు. అమ్మ.. “స్కూల్ బ్యాగ్” బరువుగా ఉంది అంటే ఏమంటావ్ నువ్వు.. “మా చినప్పుడు ఒక మైకా సంచి భుజానికి తగిలించుకుని తరగతికి సంభందించిన పుస్తకాలు పెట్టుకుని ఒక నటరాజ్ జామెంట్రీ బాక్స్, రేనాల్డ్స్ పెన్ను పట్టుకుని స్నేహితులతో కలిసి బడికి వెళ్తుంటే దూరం తెలిసేది కాదు, బరువు తెలిసేది కాదు అని మొదలు పెడతావు అందుకే ఇంక నీకు స్కూల్ బ్యాగ్ గురించి చెప్పే కన్నా..నేను మోసుకొని వెళ్ళటం మంచిది అనిపిస్తుంది. ఔనట్టు మీకు చెప్పనే లేదు కదా ఒకసారి నాకు అనుమానం వచ్చి స్కూల్ బ్యాగ్ బరువు తుచాను చూస్తే 8 కేజీ లు ఉంది. గుండె గక్కురు మంది. కానీ ఏం చేస్తాం.. చేసేది లేక స్కూల్ బ్యాగ్ మొయ్యటానికి ఉపక్రమించాను. అమ్మని పట్టుకోమంటే నీ పని నువ్వు చేసుకోడం నేర్చుకోవాలి అని క్లాస్ మొదలు పెట్టేస్తుంది. అందుకే నా బ్యాగ్, నా లంచ్ బ్యాగ్ రెండు నేనే పట్టుకుంటాను. మొత్తానికి నా స్కూల్ బ్యాగ్ కి ఉన్న రెండు రెక్కలని నా రెండు రెక్కలకు తగిలించుకుని ప్రయాణం మొదలు పెట్టాను. ప్రయాణం అంటే ఎక్కడికో అనుకో గలరు మేము ఉంటున్న ఇంటికి కాస్త ముందుకు స్కూల్ బస్సు వస్తుంది అంతవరకే.. ఇంటిలో బ్యాగ్ భుజాలకి తగిలించుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్లేసరికి బ్యాగ్ బరువు కి నేను 65 ఏళ్ల బామ్మ లాగ వంగిపోతాను. ఇంక అక్కడనుంచి లిఫ్ట్ దిగాక స్కూల్ బస్సు వచ్చే వరుకు నడిచే సరికి 75 ఏళ్ల బామ్మ లాగ నా నడుము వొంగి పోతుంది. సరే ఇంక బస్సు వచ్చేస్తుంది కదా అనుకుంటాను. బస్సు రానే వచ్చింది బస్సు లో ఎక్కి కూర్చుంటానా.. నా కన్నా నా బ్యాగ్ నేను కూర్చునే చోటు లో ఎక్కువ భాగం తీసుకుంటుంది అది ఎలా అంటారా.. నాకు ఒక సీట్ ఉంటుంది కదా ఆ సీట్ లో ముందు బ్యాగ్ ని కూర్చో బెట్టి నేను ముందుకు ఉన్న కాస్త స్థలం లో సర్దుకు పోవాలి. దానికి తోడు సీట్ బెల్ట్ ఒకటి మమ్మల్ని ఇద్దరినీ కట్టి ఉంచడానికి. పెద్ద పొట్ట ఉన్న అంకుల్ ఒడి లో ఒక 5 ఏళ్ల పిల్లాడు కూర్చుంటే వాడు కూర్చో లేక ముందుకు జారిపోతుంటే అంకుల్ అతన్ని తన చేతి తో పట్టుకుంటే పిల్లాడు పరిస్థితి ఎలా ఉంటుందో ఇంచుమించు నా పరిస్థితి కూడా అదే.. సరే ఎలాగైతేనేం స్కూల్ కి చేరుకున్నానా.. మా తరగతి గది 3 వ అంతస్థులో ఉంది. ఇంక అసలు కథ ఇప్పుడు ఉంటుంది. ఒకచేతిలో లంచ్ బ్యాగ్, నాకున్న రెండు రెక్కలకి స్కూల్ బ్యాగ్ ఈ రెంటిని పట్టుకుని ఒక అంతస్తూ ఎలాగోలా ఎక్కేస్తాను. ఇంక రెండు మూడు ఎక్కేసరికి చెప్తే నమ్మరు గాని ఎదో మల్లుయుద్దానికి వెళ్లి వస్తే ఎలా అయితే పూర్తిగా చమటలతో తడిసి పోతారో అలా తడిసి పోయి అమ్మ.. అయ్యా . అంటూ తరగతి గది లో నా చోటులో అలా పడిపోతాను పది నిమిషాల తరువాత కాస్త మంచినీళ్లు తాగి మళ్ళీ కోలుకుంటాను. ఇందులో అదృష్టం ఏమిటంటే మా స్కూల్ బస్సు అంకుల్ ఒక అరగంట ముందే స్కూల్ లో మమ్మల్ని దింపేస్తాడు. అందుకని క్లాస్ మొదలయ్యే సరికి స్థి్మిత పడిపోతాను. ఇవండీ నా స్కూల్ బ్యాగ్ కష్టాలు. మీకు కూడా ఇలాంటి కష్టాలే ఉంటాయి కదా ఏమంటారు”.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!