స్నేహబంధం

స్నేహబంధం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

అపర్ణ నీలిమ ఇద్దరు పదో తరగతి చదువుతున్న బాలబాలికలు. ఒకరికోసం మరొకరు అన్నట్టు ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లేవారు. ఏ పని చేసినా కలిసి చేసేవారు. వారి స్నేహబంధం అన్యోన్యమైనది, పవిత్రమైనది. బడిలో ఉపాధ్యాయులకు తలలో నాలుకగా ఉంటూ చదువులలో ఆటలలో చక్కగా రాణించేవారు. మార్కులు తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా అసూయ పడక ఒకరినొకరు ఉత్సాహ పరుచుకుంటూ ముందుకు సాగేవారు. అలా వారి స్నేహం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. నీలిమ ఎవరు బాధపడుతున్న చూడలేక పోయేది. తనకు తోచిన సాయం చేస్తూ ఉండేది. అందులో భాగంగా రాజు అనే అబ్బాయితో చనువుగా ఉండేది. అది అపర్ణకు నచ్చేది కాదు. అపర్ణ చాలాసార్లు ఆ విషయంపై నీలిమను వారించింది. కానీ నీలిమ అపర్ణ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అది అపర్ణకు నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా తన ధోరణి మార్చుకోక పోయిన నీలిమతో పలకడం మానేసింది అపర్ణ. అలా వారి స్నేహం కుదుపుకు గురయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. రాజు బడికి రావడం మానేసాడు. నీలిమ అపర్ణలు బడిలో ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. ఒకసారి అపర్ణ బడికి వస్తుంటే రాజు కనిపించాడు. బడికి రావడం లేదు ఏంది? అని రాజుని ప్రశ్నించింది అపర్ణ. అమ్మ చనిపోయిందని ఇల్లు గడవడం కష్టంగా ఉందని అందుకే పనికి వెళుతున్నాను అని బాధపడ్డాడు రాజు. అమ్మ ఆరోగ్యం విషయంలో బడిలో బాధపడే వాడినని అప్పుడే బడి మానేస్తానంటే నీలిమ ధైర్యం చెప్పి రోజు పరామర్శించేదనే విషయం చెప్పాడు రాజు. విషయం తెలుసుకున్న అపర్ణ, నీలిమను అపార్థం చేసుకున్నందుకు సిగ్గుతో తలదించుకుంది. నీలిమ దగ్గరికెళ్లి బాధపడింది. నీలిమ అపర్ణను ఓదార్చింది. ఇద్దరు మళ్లీ స్నేహంగా ఉండటం మొదలు పెట్టారు.

నీతి: విషయం తెలుసుకోకుండా అపార్థం చేసుకోరాదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!