ఉగాది ఊయల

ఉగాది ఊయల

యుగానికి ఆదిని అంటూ..

ఓంకార వేదికపై అంకురార్పణం చేస్తూ..

ఉద్భవించిన ఉగాది.. 

మంచుముత్యమై మనకు తోడుగా ప్లవ నామ సంవత్సర కవన వీచికగా మన ఉగాది.

 

పల్లెసొగసులు,పచ్చని మామిడితోరణాలతో..

రంగులరంగవల్లికలతో ప్రతి ముంగిట 

విల్లివిరిసెను ఆనందాల హేలీ…

 

ఆకురాల్చిన ప్రకృతే చిహ్నంగా..

గతచేదు జ్ఞాపకాలను వదిలేస్తూ..

ఆశయాలకు పునాది వేస్తూ..

 

చిగురించిన ఎన్నో ఆశలు 

మదిలో ఊహల ఊయల ఊగుతూ..

ఉత్సవాల ఉషస్సులు తెచ్చే చైత్రమిగా..

 

విశ్వశాంతి నెలకొల్పుతూ పంచభూతాలు..

ద్వాదశ రాశులు, పండితపంచాంగ పఠనాలు..

పద్యకవితా రాగాలు, వేదాలకు వేదికగా..

తెలుగు తేజస్సును జగతికి సౌభాగ్యాన్ని ఇచ్చే తలంబ్రాలుగా… ఉగాది.

 

వసంత ఋతువు వన్నె దోసిట మోసుకువచ్చే..

కుహు.. కుహు.. కోయిల..

మృదు మధుర గానాలే మదిలో మెదిలే..

సరాగాల మాలికలు అల్లి సుప్రభాతంగా..

ఎద లయలో హోయలు ఒలికించే…

 

చిరు వగరు.. చిరు కారం..

చిరు పులుపు.. చిరు చేదు..

చిరు ఉప్పు.. చిరు తీపి…

కలగలిపిన అమృత కలశాన్ని..

ఆ దివి నుంచి భువికి పంపెనేమో 

త్రిమూర్తులు తమకు మారుగా..

 

జీవితం అంటేనే కష్ట, సుఖాలు…

లాభ,నష్టాలు.. మంచి, చెడు..

చిరు నవ్వులు, కన్నీళ్లతో సాగే  జీవనగమనం.

అన్ని అనుభూతులు కలబోసిన 

అశోకకాళిక ప్రాశనంలా( ఉగాది పచ్చడిలా)…

చెప్పకనే చెబుతుంది జీవిత సత్యం…

 

మన లోగిళ్ళలో అల్లుకున్న అనుబంధాలు అల్లికలు.

కట్టు, బొట్టు,వినయ , విధేయతలు..

నీతి,నిజాయితీలు,సంస్కృతులు

మన భరతమాత  కీర్తిని నలుమూలల 

వ్యాప్తి చేసే మన పండుగలే…

మన ఉనికికి ఆనవాలం.

       రచన: లంక జయకుమారి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!