వకీల్ సాబ్

వకీల్ సాబ్


ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ గారు నటించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ ఈ చిత్రం. ముఖ్యంగా 3 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ గారు తిరిగి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులే కాక సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
మరి పవన్ కళ్యాణ్ గారి రెండో ఇన్నింగ్స్ ఎలా ఉంది? 
అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం పదండి
కథ :
సత్యదేవ్ (పవన్ కళ్యాణ్ ) ప్రజల కోసం, వాళ్ళ సమస్యల గురించి పోరాడటం కోసం తన ఆస్తిని వదిలేసి వకీలు గా మారుతాడు. శృతి హాసన్ తో ప్రేమలో పడతాడు. కానీ న్యాయం కోసం పోరాడుతూ తనని నమ్ముకున్న వాళ్ళని కోల్పోయి, తనకు ఇష్టమైన వకీలు పోస్టును కూడా వదిలేస్తాడు..
అదే సమయంలో పల్లవి (నివేదిత), జరీనా (అంజలి) మరియు అనన్య (అనన్య ) అనే ముగ్గురు అమ్మాయిలు అన్యాయంగా ఒక తప్పుడు కేసులో చిక్కుకుంటారు. కేసు పెట్టింది ఒక పలుకుబడి కలిగిన ఎంపీ కొడుకు అవ్వడంతో వీళ్ళ తరుపున వాదించడానికి ఎవరు ముందుకు రారు..
అప్పుడే వాళ్ళని కాపాడడం కోసం సత్య దేవ్ మళ్ళీ
నల్లకోటు ధరిస్తాడు. నంద (ప్రకాష్ రాజ్ ) లాంటి పేరుమోసిన లాయర్ తో వాదిస్తూ వాళ్ళని ఎలా ఆ కేసు నుంచి బయట పడేసాడు అనేదే మిగతా కథ….

నటన :
అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడు నటించిన పాత్రను పోషించడం అంటే సవాల్ అనే చెప్పాలి. 
పైగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు మీద దృష్టి పెట్టడం కోసం సినిమాలు నుంచి తప్పుకున్నారు. మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ రంగులు వేసుకున్నారు..
అయితే నేను విరామం ఇచ్చింది మనిషికి మాత్రమే కానీ నాలోని నటుడికి కాదు అని ఘనంగా చాటి చెప్పారు.
కథ మొదలైన 15 నిముషాలు తరువాత స్క్రీన్ మీద కనిపిస్తారు. కానీ వచ్చిన తరువాత అందరూ తనని మాత్రమే చూసేలా ఎనర్జీ తో నటించారు.  ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కోర్టు సీన్స్ లో తన నటనతో కట్టిపడేసారు. యువకుడిగా, ప్రేమికుడిగా, నాయకుడిగా, వకీలు సాబ్ గా ఇలా ప్రతి చోటా తన నటనతో సాధారణ సన్నివేశాన్ని కూడా మరో స్థాయికి తీసుకొని వెళ్లారు.
ఇంక తరువాత మాట్లాడాల్సింది ప్రకాష్ రాజ్ గారి నటన గురించి.. ఆయన ఎంతటి విలక్షన నటుడో అందరికి తెలిసిందే. ప్రతి నాయకుడు ఎంత బాగా నటిస్తే హీరో పాత్ర అంత బాగా పండుతుంది. అది మరోసారి రుజువైంది. ఆయన పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా అద్భుతంగా నటించారు.
ఇక అమ్మాయిల విషయానికి వస్తే… నివేద థామస్, అంజలి, అనన్య… ముగ్గురూ వాళ్ళ పాత్రలో నటించలేదు. జీవించారు అని చెప్పచ్చు..
ముఖ్యంగా నివేద నటించిన కొన్ని సీన్స్, కోర్ట్ సీన్ లో అంజలి ఏడ్చే సీన్ లో నటన చాలా మందిని కంటతడి పెట్టిస్తుంది.
ఇక శృతి హాసన్ పాత్ర నిడివి తక్కువే అయినా సరే తన పాత్రకు న్యాయం చేసింది అనే చెప్పచ్చు..
ఇక మిగతా నటి నటులు వాళ్ళ పాత్రల మేరకు నటించారు.

విశ్లేషణ :
మగువా… మగువా.. లాంటి స్త్రీ శక్తిని చెప్పే పాటతో సినిమా మొదలు అవ్వడంతోనే సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చెప్పేసింది…
ఇక 2016 లో విడుదల అయిన పింక్ సినిమా రీమేక్ ఈ చిత్రం. కథ విషయానికి వస్తే మొత్తం ఒక సామాజిక అంశం చుట్టూనే తిరుగుతుంది. అలాంటి సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ గారితో తెరకెక్కించడం అంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో హీరో పోరాట సన్నివేశాలు, ఐటమ్ పాటలు, రొమాంటిక్ సీన్లు లాంటివి ఏవీ ఉండవు..
కానీ ఎక్కడా ఈ సినిమా కథ చెదరకుండా కమర్షియల్ హంగులు అద్దడంలోనే వేణు శ్రీ రామ్ గారి ప్రతిభ తెలిసింది.

పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం సత్య దేవ్ పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ సృష్టించి తనకంటూ ఒక కథను రాయడం బాగుంది. ముఖ్యంగా సత్యదేవ్ ఎంపీ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్ చాలా బాగా తెరకెక్కించారు. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి సంబంధించిన కొన్ని డైలాగులు సందర్భానుసారంగా అందంగా పలికించారు.

మాతృక లో లేని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వకీల్ సాబ్ లో అభిమానుల కోసం జొప్పించారు కానీ అది కొంతవరకు సాగదీసినట్టు అనిపించింది. 

అలాగే పవన్ కళ్యాణ్ గారిని యువకుడిగా చూపించే సన్నివేశాల్లో మేకప్ మరీ ఎక్కువగా వేసినట్టు అనిపించింది. కొంచెం దాని మీద కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది..
సెకండ్ హాఫ్ సినిమా మొత్తం కోర్టులోనే నడుస్తుంది కానీ వాద ప్రతివాదనలు అందరిలో తరువాత ఎం జరుగుతుంది అనే ఆసక్తిని మాత్రం కలగజేస్తాయి…
ఇక సంగీతం విషయానికి వస్తే…. థమన్ తనలోని ప్రతిభ మొత్తం ఈ సినిమా కోసం బయటకు తీసాడు అని చెప్పవచ్చు. సినిమా మొత్తం నేపథ్య సంగీతం అదరగొట్టాడు. అందులో ముఖ్యంగా మెట్రో లో ఫైట్ వచ్చే సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానుల అరుపులు పెంచేలా ఉంది.
పాటలు గురించి అంటే ఇప్పటికే మగువ మగువా పాట అందరి నోట నానుతుంది….
సినిమాలో మనం విన్న మూడు పాటలు మొదటి హాఫ్ లోనే వచ్చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో మగువా మగువా ఫిమేల్ వెర్షన్ హృదయాన్ని తడిమేలా ఉంది..
బలాలు :
– పవన్ కళ్యాణ్
– కథనం
– సంభాషణలు
– కోర్టు సీన్స్
– ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ బ్లాక్స్ 
– సందేశం
– ఎమోషనల్ కంటెంట్ 
బలహీనతలు :
– సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీత
– తెలిసిన కథ అవ్వడం
– కొన్ని అనవసరమైన ఫైట్లు 
సినిమా కలెక్షన్స్ : 
పవన్ అభిమానులు కోరుకునే అన్ని హంగులు, మహిళా ప్రేక్షకులను కదిలించే సన్నివేశాలు, సామాజిక అంశం మొదలైన వాటితో రంగరించి తీశారు. ఉగాది పండుగ ముందు నాలుగు రోజుల సెలవులు రావడంతో తప్పక మంచి వసూళ్లే రాబట్టుకోవచ్చు.
కానీ కరోనా మళ్ళీ విజృంభిస్తున్న ఈ తరుణంలో సినిమా కలెక్షన్స్ మీద తప్పకుండా ప్రభావం అయితే పడనుంది.
మరి దానిని తట్టుకొని ఎలా నిలబడుతుందో, ఎంత మేర వసూలు సాధిస్తుందో కాలమే నిర్ణయించాలి. 
చివరి మాట :
ఆడదంటే బాత్రూములో గీసే బొమ్మ కాదు మనం రోజు చూసే అమ్మ… ఒక అమ్మాయి వేసుకున్న బట్టలు, ఉన్న స్థలం బట్టి తన క్యారెక్టర్ నిర్ణయించే సమాజంలోని చాలా మంది ఆలోచనను ఆలోచింపజేసిన మంచి కథ ఈ వకీల్ సాబ్….
ఒక్క మాటలో చెప్పాలంటే…
” Powerful సందేశం ఉన్న Power స్టార్ సినిమా… “
రేటింగ్ :: కొన్ని సినిమాలకు కొన్ని కథలకి మనం రేటింగ్స్ ఇవ్వటం కాస్త కష్టం .. ఈ సినిమా అంతే..ఒక్కటే చెప్పగలం సినిమాకి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిగా బయటకి వస్తారు…

రచన: రామ్ ప్రకాష్

You May Also Like

14 thoughts on “వకీల్ సాబ్

  1. చాలా చక్కగా వివరించారు సర్ .సూపర్ సర్👌👌👌👏🏻👏🏻💐

  2. పవర్ స్టార్ మూవీ గురించి అంతే పవర్ఫుల్ గా చెప్పారు…One of the best review … Fabulous explanation…💜💜🍫🍫⭐

    1. Thank you andi…
      ‘Power’star movie అంటే ఆ మాత్రం powerful గా చెప్పాలి కదండీ 😊

    1. Thank you Anusha garu..
      కచ్చితంగా ఒక మంచి సినిమా చూసిన భావన కలుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!