వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

రచన: పద్మావతి తల్లోజు

గాలివాటుకు, రెప్పపాటున
తరువు విడి నేలజారెను బీజం
తల్లడిల్లే పిల్లహృదయం!
చెమ్మగిల్లే తల్లి నయనం!!
ఒడిని పట్టే పుడమితల్లి
నేలగుండెలో పదిలం మళ్ళి
చిరుజల్లు తట్టిలేపగా,
రవికిరణం వెన్ను నిమరగా;
మలయ మారుత కరబాసటతో,
శిరమునెత్తి, ఒళ్ళు విరిచి
ఉత్సుకతతో ఉరకలేస్తూ,
మొలక నవ్వులు చిందిస్తూ,
ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా…!
మొక్కై, చెట్టై, మహావృక్షమై
మానవ జీవితంతో మమేకమై…!!!
ఊయల నుండి ఊతందాకా
పంట సరుకు నుండి వంట చెరుకు దాకా
పండ్లతో ఆహారమిస్తూ..,
పూలతో ఆహ్లాదపరుస్తూ..,
అలసిన వేళ గొడుగులా
చిరుపవన స్పర్శ తల్లి లాలింపులా,
తన మస్తకంతో పుస్తకం చేసి
తన కరములు విరిచి కర్రలుగా మలచి
తన దహనమైన దేహాన్ని కూడా
ఇంధనంగా మార్చే కల్పవల్లి!
ఔషధాలతో ఆరోగ్యమిచ్చే పాలవెల్లి!!
స్వార్థమంటూ ఎరుగని పిచ్చి తల్లి!!!
కట్టెలుగా మారి కాటికి మోసి
కాష్టాలoలో కాలిపోతూ
కష్టకాలంలో నిను ఒంటరి చేయని
ఆత్మబంధువు విలువ తెలిసి
బతికించుకుంటేనే జీవితం!
లేదా.,.,,?
ఇక తప్పదు యుగాంతం!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!