నా కథ

(అంశం : మది దాటని ప్రేమ)

నా కథ

రచయిత :: బండి చందు

నా పేరు చందు. ఆగస్ట్ 31, 2015 సోమవారం. హైద్రాబాద్ నుండి ఆరోజే సిద్దిపేట వచ్చాను. వచ్చీ రాగానే డిగ్రీ అడ్మిషన్ కొరకు కళాశాలకు వెళ్ళాను. సమయం గం. 11:34 నిమిషాలు. ఆఫీస్ లో ప్రిన్సిపాల్ కోసం ఎదురుచూస్తున్న నాకు పక్కనే ఉన్న మెట్ల దగ్గర నవ్వుల శబ్దం వినపడింది. ఆ నవ్వుల వెనక ఒక అందమైన స్వరం. కిటికీలో నుండి తొంగి చూసాను. మెట్లపై నుండి ముగ్గురు అమ్మాయిలు దిగుతున్న నా కళ్లు మాత్రం ఒక్కరినే చూస్తున్నాయి. క్షణం కూడా కళ్లు తిప్పుకోలేని రూపం తనది. తన స్నేహితులతో మంచినీళ్లు తాగడానికి వచ్చిన తనని చూస్తూ అసలు అక్కడికి ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయాను. నేను చూస్తూ వుండగానే తాను అక్కడ నుండి వెళ్ళిపోయింది. ప్రిన్సిపాల్ పిలుపుతో ఊహల లోకంలో నుండి తేరుకున్న. ఎలా అయినా సరే ఈ కాలేజ్ లోనే చదవాలని పట్టుబట్టి మరి మావయ్యను ఒప్పించి జాయిన్ అయ్యాను.

కాలేజ్ లో అడ్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చాను కానీ ఆలోచనలన్నీ కాలేజ్ లోనే. తన పేరు కూడా తెలుసుకోలేదని నన్ను నేనే తిట్టుకున్న. ఎప్పుడు తెల్లవారుతుందా కాలేజ్ ఎప్పుడు వెళ్లి తనని చూద్దామా అని రాత్రంతా మేల్కొనే ఉన్న.

ఉదయం అవ్వడమే ఆలస్యం త్వరగానే కాలేజ్ కి బయలుదేరాను. కాలేజ్ బస్ వస్తే ఎక్కాను ఎంతకు బస్ కదలలేదు. ఇక ఓపిక నశించి బస్ దిగి ఆటోకి వెళ్లిపోదామని అనుకున్న. ఇంతలో ఒక స్వరం తియ్యగా నా చెవులని తాకింది ఆ గొంతు నిన్న నేను కాలేజ్ లో చూసిన అమ్మాయిది. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. బస్ బయల్దేరింది నాలో తెలియని ఉత్సాహం. కాలేజ్ వెళ్ళగానే పరిచయం చేసుకుని మాట్లాడాలనుకున్న. కానీ ధైర్యం చాలలేదు.

స్నేహితుని ద్వారా తన వివరాలు తెలుసుకున్న. తన పేరు సంధ్య కొమురవెళ్లి దగ్గర చిన్న పల్లెటూరు అని తెలిసింది. ప్రతిరోజు తన కోసమే కాలేజ్ వెళ్ళేవాడిని. తనతో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా తనకంటే ముందు భయమే పలకరించేది. అలా భయంతోనే ఆరునెలలు గడిచిపోయింది. ఒకరోజు తను కాలేజ్ రాలేదు కారణం తెలియదు ఏడుపొచ్చేసింది. ఇంటికి వెళ్లిపోదామని బ్యాగ్ సర్దుతున్నాను. నా ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాను. అటువైపు ఎవరో అమ్మాయి బాగా తెలిసిన గొంతులా అనిపించింది. అవును బాగా తెలిసిన గొంతే ఆ అమ్మాయే ఫోన్ లో మాట్లాడుతుంది. నమ్మలేకపోయాను మేము అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. మీరు వస్తారా అని అడిగింది. సరే అని చెప్పాను.

ఆరోజు నుండి తనతో రోజు ఫోన్లో మాట్లాడేవాడిని అర్ధరాత్రి వరకు చాటింగ్ చేసేవాడిని. మా ఇద్దరి ఆ పరిచయం తనపై ఇంకా ఇష్టాన్ని పెంచింది. కానీ
కాలేజ్ లో తను ఎదురుపడితే మాత్రం భయంతో చెమటలు పట్టేవి. అలా మరో ఆరు నెలలు గడిచాయి అయినా నాలో భయం పోలేదు.

ఒకసారి తనను ప్రేమపై నీ అభిప్రాయం ఏంటి అని అడిగాను. తను చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. తను ప్రేమంటే నాకు చాలా గౌరవం. కానీ నేను ప్రేమిస్తే నా నలుగురు చెల్లెల భవిష్యత్తు నాశనం అవుతుంది అందుకే నేను ప్రేమకు దూరంగా ఉంటాను అని చెప్పింది. తన అభిప్రాయాన్ని గౌరవించాను నా మనసులోని మాటను తనకు ఎప్పటికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాను.

చూస్తుండగానే కాలేజ్ అయిపోయింది. తనతో ఫోన్లో మాట్లాడడం కూడా బాగా తగ్గిపోయింది తనని మరచిపోవడానికి ప్రయత్నిస్తున్న నాకు ఒకరోజు తన స్నేహితురాలు ఫోన్ చేసి సంధ్యకి పెళ్లి అని చెప్పింది. ఏమి చేయాలో అర్థం కాలేదు అయినా తన పెళ్లికి వచ్చే ఆలోచన లేదు అని చెప్పాను. దానికి ఆమె సంధ్య నిన్ను చాలా ఇష్టపడింది. చాలా సార్లు నీతో తన ప్రేమ గురుంచి చెప్పాలని అనుకుంది. కానీ ఆ విషయం నీకు చెప్పే లోపే తనకి నిశ్చితార్థం జరిగింది వాళ్ల అమ్మానాన్న మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పింది. నాకు నోట మాట రాలేదు కంట కన్నీటి దారతో చేతులు వణుకుతుంటే ఫోన్ పెట్టేసాను.

ఎంత ప్రయత్నించినా సంధ్య ఫోన్ కలవలేదు. మళ్ళీ తనతో మాట్లాడే అవకాశం దొరకలేదు. తన అభిప్రాయన్ని గౌరవించి నేను, వాళ్ళ అమ్మానాన్న మాటకి ఎదురు చెప్పలేక తాను ఇద్దరం ప్రేమలో ఓడిపోయాం. మనసులు దాటాని ప్రేమగా నిలిచిపోయాము….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!