మానవత్వం గెలిచింది – మతం ఓడింది

మానవత్వం గెలిచింది – మతం ఓడింది 

రచన:: జె వి కుమార్ చేపూరి

వెంకటాపురంలో నివసించే గోవిందశర్మ సౌమ్యుడు, ఆ ఊరిలోని నరసింహ స్వామి ఆలయంలో అర్చకుడు మరియు పౌరోహిత్యం నిర్వహిస్తుంటాడు. ఆ ఊరిలో ఎవరింట వేడుక జరిగినా శర్మ గారి తోటే ముహుర్తాలు పెట్టించుకుంటారు. శర్మ గారు పెట్టే ముహుర్తాలమీద వారికంత గురి. ముహుర్తాలు పెట్టినందుకు ఇంత కావాలని ఎన్నడూ ఎవరినీ అడిగేవారు కాదు శర్మగారు.. దక్షిణగా వారెంత ఇస్తే అంతే పుచ్చుకునే అలవాటు శర్మ గారిది. శ్రమ గారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి, ఉద్యోగ రీత్యా వేరు వేరు పట్టణాలలో కాపురముంటున్నారు. శర్మ గారి భార్య ఈశ్వరమ్మ. శర్మ గారికి ఊరిలో ఒక పెంకుటిల్లు, చుట్టూ విశాలమైన ఆవరణ. దొడ్డిలో ఈశ్వరమ్మ గారు ప్రేమతో పెంచుకునే పూల, కూరగాయల మొక్కలు. ఊరి చివరన రెండు ఎకరాల పొలం. ఇవి శర్మ గారి ఆస్తులు. వీరంటే ఊరిలో వారికి ఎంతో గౌరవం.

ఊరిలోనే పళ్ళ వ్యాపారం చేసుకునే అబ్దుల్ తో శర్మ గారి మైత్రి. ఇద్దరూ ఊరిలో మంచి స్నేహితులు. శర్మ గారింట్లో జరిగే ప్రతి వేడుకకూ అబ్దుల్ సకుటుంబం గా వచ్చి వారి ఆతిధ్యాన్ని స్వీకరించి వెళతాడు. అబ్దుల్ గారింట్లో వేడుకకూ శర్మ గారి కుటుంబం వెళుతుంది, కానీ పళ్ళ వరకు స్వీకరించి వచ్చేస్తుంది. ఇది వారి స్నేహానికెప్పుడూ అడ్డు గోడ కాలేకపోయింది. చిన్నప్పుడు పేదరికంలో చదువుకున్న శర్మ గారికి అబ్దుల్ సహవిద్యార్థి. ఆ సమయంలో శర్మ గారి పరిస్థితి చూసి అబ్దుల్, శర్మ గారికి తనకున్నంతలో తగిన సహాయాన్ని చేసేవాడు. చిన్ననాటి వారి స్నేహం, ఊరిలో అలాగే కొనసాగుతూ వస్తోంది. అబ్దుల్ కి కూడా శర్మ గారి ముహూర్తాల మీద నమ్మకమెక్కువ. తన పిల్లల పెళ్లిళ్లు కూడా శర్మ గారు నిర్ణయించిన మూహూర్తాలకే జరిపించాడు. ఆ ముహూర్త బలాల వల్లే పిల్లల కాపురాలు హాయిగా సాగుతున్నాయని ఆయన నమ్మకం. ఊరందరికీ వారి ప్రాణ స్నేహం ఎంతో విడ్డూరంగా తోచేది.

ఇటీవలే ఆ ఊరంతా కరోనా మహమ్మారి సోకింది. అది శర్మ, ఈశ్వరమ్మ గార్లకు కూడా పాకింది. ఈ విషయం అబ్దుల్, పట్టణాల్లో ఉన్న శర్మగారి పిల్లలకు చేరవేసాడు. వాళ్లకు రావాలని ఉన్నా, కోడళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని గడప దాటనీయలేదు. వ్యాధితో శర్మ, ఈశ్వరమ్మ గార్లు ప్రాణాలు విడిచారు. ఊరిలో అంత మంచి పేరున్నప్పటికీ, వ్యాధి తీవ్రత దృష్ట్యా ఊరివారెవరూ ధైర్యం చేసి ముందుకు రాలేకపోయారు. అప్పుడు అబ్దుల్ అన్నీ తానై తన స్నేహితులతో కలసి దగ్గరుండి తన ఆప్త మిత్రుడికి, మిత్రుడి భార్యకు దహన సంస్కారాలు జరిపించాడు. మతాన్ని ఓడించి, మానవత్వాన్ని గెలిపించాడు.

ఇది ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన ఒక యదార్ధ సంఘటనకు ప్రేరణ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!