కాటు

కాటు

రచన:: మద్దిలి కేశవరావు

“సుందరయ్యా…నీ కొడుకు ఏమైనా ఫోన్ చేసాడ్రా…” అన్న పిలుపుకు కొబ్బరికాయ ఓలుస్తున్న సుందరయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఊరు నాయుడు సోంబాబు.
“దండాలయ్యా…! మావోడు పూను సేసి పది దినాలవుతుందయ్యా, డోలుపున్నమి రోజు డిల్లీలో ఇమానం దిగినానని, కుంచెం వొళ్ళు ఏడిగా ఉందని, ఆస్పత్రికేల్లి సూది మందు ఏసుకొని వత్తానన్న మా పురుసుగాడు ఇంతవరకు ఊరు సేరనేదయ్యా…” అంటూ దిగులుగా నిట్టూర్చాడు సుందరయ్య.
“ఓస్.. అంత మాత్రంకే దిగాలు పడిపోతావెందుకు సుందరయ్యా….ఆ చెయినా వోడు ఒదిలిన కరోనా వైరస్ మన దేశం కూడా సేరినాది. దీని మూలంగా బస్సులు, రైళ్లు అన్నీ నెలరోజుల నుంచీ ఆపేసినారు కదా…! ఎక్కడో వుంటాడలే గాబరా పడకు” అంటూ ఓదార్చాడు నాయుడు సోంబాబు.
* * * * * * * *
మరో కొనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం సుందరయ్యది. ఎకరా కొబ్బరితోట ఉన్న చిన్న రైతు. గత మూడేళ్ళ నుంచి వరుసగా వస్తున్న తితిలీ, పైలాన్ వంటి తుఫాన్లకు ఎదిగొచ్చిన కన్న కొడుకుల్లాంటి కొబ్బరిచెట్లు నెలకొరగడంతో షావుకారు దగ్గర తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక అప్పులపాలయ్యాడు. చేసేదేమీ లేక పెళ్లీడు కొచ్చిన పాతికేళ్ల కొడుకు పురుషోత్తం కుటుంబ కష్టాలు చూసి..మళ్ళీ సావుకారు దగ్గర అప్పు చేసి ఏడాది క్రితం దుబాయ్ వెళ్ళిపోయాడు. నెలనెలా కాస్తో,కూస్తో డబ్బులు పంపిస్తుండటంతో కొంతవరకు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇప్పుడిప్పుడే కుటుంబం కుదుట పడుతున్న తరుణంలో “కరోనా” అందరి బతుకులపై కాటేసింది. దుబాయిలో కంపెనీలు మూసేయ్యడంతో స్వదేశాలకు ప్రయాణమయ్యే కూలీలకు ప్రత్యేక విమానం సదుపాయాన్ని కల్పించారు. దీంతో తోటి కూలీలతో పురుషోత్తం ఢిల్లీ చేసుకున్నాడు. చిన్నపాటి జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో విమానాశ్రయం ప్రక్కనున్న ఆసుపత్రికి వెళ్ళాడు పురుషోత్తం. ఆ సమయంలో ఫోన్ చేసిన తండ్రి సుందరయ్యకు ఆసుపత్రికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లినవాడు వారం, రెండు వారాలు, నెల రోజులు గడుస్తున్నా కొడుకు నుంచి ఫోన్ గానీ….సమాచారం గానీ రాకపోవడంతో ఊర్లో సుందరయ్యతో పాటు బార్య అన్నపూర్ణ కూడా జబ్బుపడింది. కొడుకుపై బెంగతో తల్లీ,తండ్రీ వారం రోజుల తేడాలో శివైక్యం చెందారు.
జ్వరంతో ఆసుపత్రిలో చేరిన పురుసుగాడికి కరోనా సోకిందని, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆసుపత్రిలోనే కన్ను మూయడంతో అక్కడికక్కడే దహన సంస్కారాలు చేసినట్లు ఇంతవరకు ఆ ఊరి వారికి గానీ, ఆ వాడ వారికి గానీ తెలియకపోవడం కొసమెరుపు.
కరోనా పుణ్యమాని ఈ సమస్య ఒక్క పురుషోత్తమదో, సుందరయ్యదో కాదు…వందలాదిమందికి పరిచయం ఈ సమస్య. తొడబుట్టినవారు, బంధువులు, ఆప్తులకు తీరని శోకాన్ని మిగిల్చింది ఈ కరోనా “కాటు”.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!