పేద ప్రేమ

(అంశం : మది దాటని ప్రేమ)

పేద ప్రేమ

రచయిత: పి. వి. యన్. కృష్ణవేణి

చూడు హేమ, మీరు ఉన్న ఈ పరిస్తితి లో నీకు ప్రేమ, పెళ్లి అంటే జరిగే పని కాదు. బుద్దిగా ఉండి చదువుకో. నీకు ఈ చదువు చెప్పించటం కోసం, మీ అమ్మ ఎంత ఇబ్బందులను ఎదుర్కొంటోందో నీకు తెలియనిది కాదు కదా? అని తనకి చిలక కు చెప్పినట్టు చెప్తున్నాను.

అలా చెప్పండి అమ్మా, ఎంత చెప్పినా ఆ అబ్బాయే కావాలని  అంటోంది. మొండికేసి రెండు రోజుల నుండీ అన్నం కూడా తినకుండా కూర్చుంది అంటూ వచ్చింది హేమ వాళ్ల అమ్మ కొండమ్మ.

హేమ, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే, ఒక పేద ఇంటి అమ్మాయి. చాలా అందగత్తె. తన పేదరికం, చాయలకు కూడా ముఖం లో లేనంత అందగత్తె. మేని ఛాయ తెల్లని తెలుపు, పెద్ద కురులు, చక్కటి శరీర సౌష్టవం, మంచి కళ గల ముఖంతో, చూడగానే ఆకట్టుకునే కళ్ళు.

ఆ మొండితనం వదిలి, అన్నం తిను. నువ్వు అనుకున్నవి అన్నీ జరగటానికి ఇదేమీ సినిమా కాదు అన్నాను కొంచెం గట్టిగానే.

ఆ మాటకి పౌరుషం వచ్చి, ఎమైనా తాగి చస్తా కానీ, నేను మాత్రం మీ మాట వినను అంటూ విసురుగా అక్కడి నుంచీ వెళ్లిపోయింది హేమ.

ఎవరిని బెదిరిస్తావు?  తరవాత నువ్వే  ఇబ్బంది పడేది అన్నాను, వెళ్ళి పోతున్న తనకి విన పడాలని గట్టిగానే.

తను వెళ్ళాక, కొండమ్మతో.. ఏంటి ఆ అబ్బాయి పరిస్తితి, ఎదో కనుక్కుని ఇద్దరికీ ముడి పెట్టాయ్యక పోయావ్? అమ్మాయి వినేలాగ అనిపించట్లేదు అన్నాను.

అదే అనుకుని వెళ్లానమ్మా నిన్న. కానీ,  ఆ అబ్బాయి ఎందుకో  హేమ కి సరిజోడు కాదు అనిపిస్తోంది అంది సాలోచనగా. వాళ్ళ నాన్న ఒక తాగుబోతు, ఇప్పడు ఈ అబ్బాయి కూడా అలాగే అనిపిస్తున్నాడు. ఇంకా, ఎదో చెప్పే లోపే,  అమ్మా అంటూ పెద్ద అరుపు కొండమ్మ వాళ్ల ఇంటి నుంచీ, వాళ్ల అబ్బాయి అరుణ్.

మాకు ఎదో  అపశృతి గా తోచి, ఇద్దరం పరిగెత్తాము.

అనుకున్న అంతా జరిగింద. పొలంలో కొట్టే మందు తాగేసింది హేమ.

హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. తాగింది మొత్తం కక్కించారు డాక్టర్లు. ప్రమాదం తప్పింది. హేమ ని ఇంటికి తీసుకువచ్చారు.

తర్వాత రోజు, కొండమ్మ పొలానికి, అరుణ్ స్కూల్ కి వెళ్లిపోయారు. హేమ వాళ్ల నాన్న ఇంటి ముందు రోజు లాగానే, తాగి పడిపొయాడు. హేమ ఆ అబ్బాయి కోసం.  వెళ్లిపొవటానికి ఇదే మంచి సమయం అనుకుంది… వెళ్లిపోయింది.

ఆరు నెలలు గడిచాక, ఒకరోజు హేమ వచ్చింది. అప్పటికే పెళ్లి అయ్యింది వాళ్లకి. చాలా రోజులకి ఆమ్మాయిని చూసి,  వాళ్ల అమ్మ మనసు  కరిగి, సపర్యలు చేసింది.

తరవాత నా దగ్గరకు అంటే మా ఇంటికి తీసుకుని వచ్చింది ఇద్దరినీ. అప్పటికే, హేమ అమ్మ కాబోతుంది. అలా అప్పటి నుంచీ మళ్లీ రాక పోకలు మొదలు అయ్యాయి.

ఒక సంవత్సరంలోపు  పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చినది. అత్తమామలు కూడా బానే చూసుకుంటున్నారుట. అంతా కుదుటపడుతోంది అనుకున్న టైం లో పిడుగు లాంటి వార్త.

హేమ కి కేన్సర్. అది కూడా అడ్వాన్సు స్తేజ్ లో ఉందన్నారు డాక్టర్లు. పెళ్లి వరకు ఆరోగ్యం గానే ఉంది కదా అంటే, తాగిన పురుగుల మందు పవర్ తెలియకుండానే, బాడీ లో ఉండి పోయింది అన్నారుట హాస్పిటల్ లో.

ఉన్న పొలాలు అన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో వైద్యం చేయించినా, లాభం లేక పోయింది.  వాళ్ల నాన్న ఇంకా ఎక్కువగా తాగుబోతు అయిపోయాడు.

నాలుగు నెలలు లో హేమ చనిపోయింది అని నాకు ఫోన్.

తొందరపాటులొ తీసుకున్న ఒక నిర్ణయం, నిండు జీవితాన్ని బలి తీసుకుంది. నిండు పూల వనం లా ఉండే ఒక సంసారం, ఎడారి అయిపోయింది.

ప్రేమ ఒక మధుర భావన. కానీ మన మనసుని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే ఆ ప్రేమ ఒక వరం అవుతుంది. కానీ కొందరి జీవితాల్లో మాత్రం ప్రేమ అనేది ఓ విష జ్ఞాపకంగా మారుతూ ఉంటుంది. అది నిజం. నమ్మి తీరాల్సిన జీవిత అనుభవం ఈ హేమ జీవితం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!