మూఢత్వ జాడ్యం

(అంశం:”అపశకునం”)

మూఢత్వ జాడ్యం

రచన:: దొడ్డపనేని శ్రీవిద్య

ఒక ఊరిలో కమల విమల అనే ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవారు. ఇద్దరూ చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పెరిగారు.. కలిసి చదువుకున్నారు. ఆడుకున్నారు. కమల ఉన్నత కుటుంబం లో పుట్టింది. విమల పేదింటిరాలు. ఇద్దరూ ఎంతో అణుకువుగా ఉండే వారని మంచి పేరు ఉండేది. కానీ విమలని అందరూ నష్ట జాతకరాలు అని అనేవారు ఇంట్లో వారు, వీధిలో వారు. కానీ విమల ఎప్పుడూ మాట జారలేదు.
కొన్నాళ్ళకు కమలకి, విమలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. వారిద్దరూ అత్తారింటికి వెళుతున్నారు అనే బాధ కన్నా తమకి ఎడబాటు అవుతుందని ఎక్కువ బాధపడ్డారు.
కమల అత్తారింట్లో కూడా సుఖంగా ఉంది. ఏ లోటూ లేదు తనకి.
విమలకి మాత్రం పాపం అత్తారింట్లో కూడా ఆరళ్లు తప్పలేదు. విమల అత్తగారు ఎప్పుడూ విమలని సాధిస్తూనే ఉండేది. నష్టజాతకురాలు అని తెలిసినా చేసుకున్నాము. అంతా మా ఖర్మ. మా అబ్బాయి తలరాత అని రుస రుస లాడేది. అయినా విమల ఎప్పుడూ మాట తూలలేదు. అత్తగారికి ఎదురు చెప్పి ఎరగదు. ఓపికగా అందరికీ అన్ని సదుపాయాలు సమకూరుస్తుండేది.
చక్కని అల్లికలు అల్లేది. ఇల్లు అందంగా సర్థేది. తెల్లవారే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టేది.
మనిషి కూడా చూడ చక్కని రూపవతి
ఏ పని చేస్తున్నా నిరంతరం భగవన్నామస్మరణ లో ఉండేది.
కొన్నాళ్ళకు విమల మామగారు కాలం చేసారు. దీనికి కూడా విమలనే ఆడిపోసుకుంది అత్తగారు. నువు వచ్చిన వేళా విశేషం ఇంత పెద్ద అనర్థం జరిగింది. ఇంకా ఎన్ని చూడాలో అని కసిరింది.
కార్యక్రమాలు పూర్తయ్యాయి. అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకునేది విమల. కాలక్రమేణా విమల అత్తగారిని చుట్టుప్రక్కల అమ్మలక్కలు ఈసడించుకోవటం, నానా రకాలుగా మాటలు అనటం మొదలు పెట్టారు. మొగుడు పోయిన దానిని ఓ మూలన కూర్చోక తగుదున్నమ్మా అంటూ వచ్చేస్తావు. ప్రాద్దున్నే నీ ముఖం చూడాలా మేము? మేము కూడా నీలాగే కావాలనా అని రకరకాల మాటలు అనేవారు. విమల ఎంతగా సర్థి చెప్పాలని చూసినా నీ అత్తగారు నీకు గొప్పేమొ మాకు కాదు అని అరిచేవారు.
కానీ కాలం గడిచేకొద్ది విమల అత్తగారిలో మార్పు రావటం మొదలైంది.
ఒకరోజు విమలతో , అమ్మా , కోడలు పిల్లా, చిన్నదానివైనా నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను అని పశ్చాత్తపడింది. నిన్ను ఎన్నో మాటలు అన్నాను. అయినా నువు నన్ను పల్లెత్తు మాటలనలేదు. ఈ కాలం కోడళ్లు ఎలా ఉన్నారో కొంత మందిని చూస్తున్న. నువు ఎంతో ఉత్తమురాలివి అని ఎంతో బాధపడింది.
అయ్యో అత్తగారు మీరు నాకు అమ్మతో సమానం. మా అమ్మకే ఇటువంటి కష్టం వస్తే వదిలేస్తానా?. మీరు కూడా అంతే నాకు. ఇలాంటివి మనం కోరుకుంటే వచ్చేవి కావుగా,
అయినా ఒకరు ఎదురుపడితే నష్టం, కష్టం జరగదు అత్తయ్యా. మంచి మనసుతో మనం ఏ పని చేసినా అది జరిగి తీరుతుంది అని సమాధాన పరిచింది.
దాంతో విమల అత్తగారికి పూర్తిగా కళ్ళు తెరుచుకున్నాయి.
ఆ రోజు నుంచి కోడలిని కూతురి లాగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది.
ఇదంతా తన స్నేహితురాలికి చెప్పుకొని సంతోషపడింది విమల.
మంచి మనసున్న నీకు ఆలస్యమైనా ఎంతో మేలు జరిగింది విమలా అని కమల సంతోషంతో పలికింది.
అపశకునాలు అనే మూఢత్వం అనే జాడ్యం ఎప్పుడు పోతుందో కదా ? ఇంకా ఎంత మంది దీనికి బలవుతున్నారో కదా అని చాలా కాలానికి కలిసిన ఇద్దరు స్నేహితులు ముచ్చట్లు పెట్టుకున్నారు.
కథ సుఖాంతంలోకి మనం మన పనుల్లోకి🤗

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!