మరపురాని రోజు

(అంశం:”అపశకునం”)

మరపురాని రోజు

రచన:: పి. వి. యన్. కృష్ణవేణి

ఆ రోజు ఎంతో ఆనందంగా, మరెంతో ఉద్వేగంగా అమ్మ దగ్గరకు బయలుదేరాను. అమ్మ దగ్గరకే కదా ఎందుకు అంత ఎంగ్జయీటీ అని మీరు అనుకుంటున్నారు కదా! అదీ చెప్తాను ఉండండి.

కిట్టూ, లే… మళ్లీ టై అవుతోంది. ఎండ ఎక్కువైంది అంటే అంత దూరం ప్రయాణం చెయ్యలేవు అంటూ నిద్ర నుంచి లేపుతున్నాడు శ్రీను.

అబ్బా … అప్పుడే లేవాలా, నా వల్ల కాదు. అంటూ  ముసుగుతన్ని మళ్ళీ పడుకున్నాను.

వెళ్లాలి.. లేవాలి… అక్కడ పిల్లలు ఎలా ఉన్నారో.. వాళ్ళని ఏమి ఇబ్బంది పెడుతున్నారో… అనుకుంటూ మళ్లీ కళ్లు మూసుకుని పడుకున్నాను.

ఆ నిమిషంలో నాకు తెలియదు, నన్ను గారంగా పసి పాపలా చూసుకునే ఒక మంచి హృదయం గల ఒక మంచి మనిషిని శాశ్వత నిద్రలోకి పంపాటానికి వెళుతున్నాను అని.

వేణి.. లే అంటూ ఈ సారి గట్టిగానే పిలిచారు మా శ్రీవారు. ఇంకా లేవక తప్పింది కాదు. అబ్బా రెండు రోజులు ఆగి వెళతాను కదా పిల్లలకు ఎలాగో ఆన్ లైన్ క్లాసులే అంటూ దాటవేయబోయాను.

కాదు వేణి, ఇప్పుడు పిల్లలు బెంగపడి, వాళ్లకి ఏ జ్వరమో వచ్చిందంటే బయట పరిస్తితి కూడా ఏమి బాగాలేదు అంటూ నన్ను మందలించారు. అయినా ఎప్పుడూ అమ్మా వాళ్ళింటికి అంటే ఎగిరి గంతేసి వెళ్లేదాన్ని ఏమైంది నాకు అనిపించింది.

ఆ భావన నాకు అప్పుడు ఒక అపశకునంలాగా అనిపించలేదు. కానీ, అది నాకు దేవుడు చేసిన ఒక సూచన.

ఆ రోజు తెలియదు నాకు ఆ నెల రోజులను నాకు జీవితంలో మరపురాని రోజులు అవుతాయని.

ఎలాగో ప్రయాణం మొదలుపెట్టాను. మా వారికి వారి ఆదేశం మేరకు, లైవ్ లొకేషన్ షేర్ చేసి, బండి ఎక్కి కూర్చుని నన్ను నేను చూసుకున్నాను నా బండి అద్దంలో.

కంఫర్ట్ గా ఉండే డ్రెస్, చేతికి వాచీ, తలకి హెల్మెట్, కళ్ళకి కళ్లజోడు, మాస్క్, శానిటైజర్ తో నన్ను నేను రెడీ చేసుకున్నాను. అంతే కాదండోయ్, అలా ఒక సెల్ఫీ  తీసుకుని, మా వారికి కూడా పెట్టాను. అన్నట్టు చెప్పలేదు కదూ, విజయవాడ టు మచిలీపట్నం జర్నీ మొదలు పెట్టాను.

అలా డ్రైవ్ చేసి చేసి, బందరు చేరాను. అక్కడ కోనేరు సెంటర్ లోని ఒక స్వీట్ షాప్ లో అందరికీ ఇష్టమైన, మా అమ్మ కూడా తినగలిగేవి ( అమ్మకు కంటి ఆపరేషను చేయించాము) నాన్నకు ఇష్టమైనవి మిల్క్ మైసుర్ పాక్, కారప్పూస తీసుకుని సరాసరి బండి ఇంటి ముందు ఆపాను.

నేను వస్తున్నట్టు ఎవరికి చెప్పక పోవడంతో నన్ను చూసి, నా పిల్లలు, అన్నయ్య పిల్లలు, అమ్మనాన్న, అన్నయ్య ఒదిన అందరూ చాలా సంతోషించారు.

ఆన్ లైన్ క్లాసులు తీసుకోను అని జాబ్ కి కొన్ని రోజులు సెలవు పెట్టి వచ్చాను అని తెలసి ఆశ్చర్యంగానే చూశారు.

కానీ మనము ఒకటి తలస్తే దేముడు మరొకటి తలుస్తారు అది సృష్టి ధర్మం.

ఏమి చెయ్యను. బయట వాతావరణం సరిగ్గా లేదు. కరోనా కేసులు అందునా నాకు చిన్న పిల్లలు. వాళ్ళు నన్ను వదలి ఉండను లేరు. నాతో పాటు స్కూల్ కి రాను లేరు. అందుకే నేనే వచ్చేశాను.

రెండు రోజులు ఉన్న నేను, ఇంకా వెళతాను అని బయలు దేరాను. కాదు… ఈ నెల రోజులు ఉంటే, కరోనా కేసులు తగ్గుతాయి అని అన్నయ్య గట్టిగా చెప్పటంతో మిన్నకుండిపోయాను.

ఇంకా పిల్లల నలుగురి ఆనందానికి అవధులు లేవు.
ఒదిన, మా పిన్ని, బాబాయిలు అందరు కలిసి  ఒకరోజు ఆడపిల్లల ఇద్దరికీ పూల జడలు వేయించి, ఫోటోలు తీయించారు.

పల్లెటూరు అవ్వటం చేత అందరం కలిసిమెలిసి ఈ సెలవులు గడిపాము. సాయంకాలం చల్లని ముంజెలు, ఉదయాన్నే ఒడియాలు, మద్యాహ్నము ఆవకాయ, మాగాయ పచ్చడులు పట్టే హాడావిడిలో అసలు టైం తెలీలేదు.

నేను వెళ్లాను అని తెలసి దగ్గరలో ఉన్న పిన్ని, పిల్లలు వచ్చారు. ( ఒక గురువారం రోజున బాబాయి మమ్మల్ని వదలివెళ్లి మూడు సంవత్సరాలు అయ్యింది.)  ఏదో సెలవు ఇచ్చారు అని మా వారు కూడా వచ్చారు. ఆ నాలుగు రోజులు మామిడి పళ్ళ సందడి. పిల్లలంతా వేసవి సెలవలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళుతో కలసి మా అమ్మనాన్న కూడా చాలా ఆనందంగా గడిపారు.

ఏ ధిష్టి తగిలిందో, ఏ విధి రాత రాసాడో ఆ విధాత మా నాన్నకు అనుకోని విధంగా ఛాతీ నొప్పి మొదలైంది. ఒక్క ఐదు నిమిషాల వ్యవధిలో నరకం చూశారు. కాసేపటికి నెమ్మదించింది.

హమ్మయ్య.. అని అందరం ఊపిరి పీల్చుకున్నాము. తరువాత రోజు మా వారు, పిన్ని, పిల్లలు వెళ్లిపోయారు.
దగ్గరలో ఉన్న డాక్టర్ వచ్చి, ఇంజెక్షన్లు చేసి, కరోనా టెస్ట్ చేయించండి అన్నారు.

అదీ నెగటివ్ అనే రిపోర్ట్ రావడంతో గండం గడిచింది అనిపించింది.

మా అమ్మ, నేను కలసి పూజలు, నోములు చేసుకున్నాము ఆనందంగా.

ఆ తరువాత రెండు రోజులకు మళ్లీ నొప్పి. ఒక్క సారిగా భూమి కంపించినట్టుగా అనిపించింది. ఎం కాదు నాన్న, ఎస్క్రే తీయించుకో… తాతయ్యకు షుగర్ ఉంది కదా, షుగర్ టెస్ట్ చేయించుకో. నీకు ఏమి ఉండదు అని ధైర్యం చెప్పాము.

అప్పుడు నాన్నకు ధైర్యం నేనే అయ్యి నిలిచానేమో. ‘ ‘పాపాయ్… నాకు తగ్గేవరకూ నువ్వు ఉండవే ‘ అన్నారు. నీకు బాగోకపోతే నేను నిన్ను వదలి వెళ్ళను నాన్న, నీకు తగ్గిందని వెళతాను అన్నాను.  కానీ, నేను వెళ్లనులే … అయినా నీకు చెకప్ చేస్తారు అంతే… ఏమి ఉండదు.అని బుజ్జగించాను.

ఆ రోజు రాత్రి… నొప్పి కొంచెం ఎక్కువైంది. ఉదయాన్నే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు అన్నయ్య, అమ్మ కూడా ఉన్నారు నాన్న వెనుక నాన్నకు అండగా.

ఆ రోజు గురువారం. అదే నేను మరచిపోదామన్నా, మరపురాని మరువలేని రోజు అది.నాన్నా వాళ్ళు వచ్చే లోపు నేను స్నానం చేసి, పూజ చేసుకుని, వాళ్ళకి వంట చెయ్యాలి. నాన్నకు ఎం కూర ఇష్టం. ఆ కూర చేస్తే, పిన్నీ వాళ్ల ఇంట్లో భోజనం చేస్తాము అంటారేమో… పది విధాల ఆలోచనలు.

కానీ అంతలోనే ఫోన్ … నిన్నటి దాకా పిల్లలతో ఆడుకున్న నాన్న… నిన్న తానే పిల్లాడుగా మారిన నాన్న,.. నా చేతులతో మందులు తీసుకున్న నాన్న… గంట క్రితం కూడా నా వైపు జాలిగా చూసిన నాన్న ఇంక లేరు.

నమ్మలేని నిజం ఇది. నేను కారులో వచ్చి, నాన్న ముందు నిలవాలి అనుకున్నానే… హీరో లాగా ఉండే మా నాన్న… ఇంకా ఎన్ని డాన్సులో ఈ పిల్లలతో కలసి చేస్తారు అనుకున్నానే…

ఏరి ఆ నాన్న…. ఇక ఈ జన్మకు నాన్న లేరు.

ఒక నాన్నలేని కూతురుగా మళ్లీ విజయవాడలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి నాది.

సెకనులో పోయే ప్రాణమిది. జన్మలో తీరని భందమిది. ఎంత ఏడ్చినా తీరని మనసు ఘోష ఇది.

నాన్న కోసం నేను వ్రాసుకున్న ఈ కథ నాన్నకే అంకితం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!