నిండు మనసులు

నిండు మనసులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

అది ‘అక్టోబర్ నెల ‘ దసరా, దీపావళి పండగలు దగ్గరలో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులు కూడా బోనస్ లు, ప్రమోషన్లు వచ్చే రోజులు, అందరూ ఎంతో ఆశగా ‘దీపావళికి ఒక మంచి కారు, గృహోపకరణాలు, నగలు ఇలా ప్రతి కుటుంబం ఆ పండుగలు కోసం సంవత్సరమంతా వేచి చూసే రోజులు, ఏమైనా కొని ఆనందంగా పండుగలు గడపాలన్న తాపత్రయం, వీలైతే పెళ్లి, శుభకార్యాలకు, కావలసిన వస్తువుల కోసం అర్రులు చాచే మంచి రోజులు. అలాంటి కుటుంబమే’ రామచంద్ర రావు గారిది,’ ఆయన పేరు మోసిన ‘చార్టర్డ్ అకౌంటెంట్ ‘చాలా కంపెనీలకు తన ఆరితేరిన స్టాఫ్ తో ‘ఆడిటింగ్ ‘చేస్తూ చాలా పేరు, ఆస్తులు సంపాదించారు, ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఆయన హోదాకి తగ్గట్టుగా మంచి ‘మెర్సిడెస్-బెంజ్ కారు, ‘నగరం నడిబొడ్డులో ఒక ‘డూప్లెక్స్ హౌస్’ ఉన్నాయి. ఇల్లంతా రంగురంగుల దీపాలతో అలంకరించి ఉంది ఆ రోజే దీపావళి పండగ, ఒరేయ్ ప్రసాద్! ముందు కారు తుడిచి అమ్మగారిని, పిల్లల్ని ఏదో దేవాలయాలకు వెళ్తారట వెళ్లి చూపించరా! ఆ తర్వాత మనం బయటకు వెళ్లాలి! చాలా పని ఉంది, అంటూ కళ్ళజోడు సర్దుకుంటూ చెప్పేసరికి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది, కారు డ్రైవర్’ ప్రసాదు కి ‘ అలాగేనండి! అంటూ కారు ని శుభ్రంగా కడిగి, అమ్మ గారు ఇచ్చిన నిమ్మకాయలు కట్టి, కారులోని ‘గణేశ ప్రతిమకు ‘పూలు పెట్టి, ఫుల్లు ఏసి స్టార్ట్ చేసి, కారులో తన డ్రైవర్ యూనిఫారం సర్దుకుంటూ ‘రామచంద్ర రావు గారి’ కుటుంబం కోసం వెయిట్ చేస్తూ, తనలో తనే’ ఛీ, వెధవ బతుకు! నేను వారం రోజులు నుంచి ఈ ఒక్కరోజు సెలవు అడుగుతున్నా కానీ ఏదో పని అంటూ, చివరకు ‘దీపావళి ‘ రోజున కూడా నా కుటుంబంతో నన్ను గడప నియ్యడం లేదు సార్! నా భార్య రేవతి, నా చిన్న పిల్లలు ఇద్దరూ  కూడా ప్రొద్దున్నే ఎంతో ముద్దుగా ‘,నాన్నగారు మనం కూడా అందరిలాగా బజారుకెళ్లి దీపావళి సామాను కొందాం! అంటూ చేతులు పట్టుకుని అడుగుతున్నా పిల్లల్ని, తలుచుకుంటూ నా భార్య కూడా తొందరగా వచ్చేయండి సరదాగా పండగ చేసుకుందాం! అని నెత్తి నోరు బాదుకున్నా నేను ఏమీ చెప్పలేని పరిస్థితి, గట్టిగా మాట్లాడితే ఉద్యోగం పీకేస్తారు, ఈ కాస్త ఉద్యోగం కూడా పోతే ఏం పెట్టి సంసారం సాకుతాను, రోజు ప్రొద్దున్నే 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కార్ డ్రైవర్ గా పని చేస్తున్న ప్రసాదు, ఆ రోజు ధైర్యం చేసి సార్! ఇవాళ దీపావళి కదండీ, ఈ ఒక్కరోజు మధ్యాహ్నం వెళ్లిపోతానని, అని అనగానే ‘ఏం చేస్తావ్ రా !వెళుదువు గాని లే, ముందు ఉద్యోగం చెయ్, ఇవాళ చాలా పని ఉంది, అంటూ చివాట్లు పెట్టారు తప్పా, కనీస కనికరం కూడా చూపలేదు సార్! అని అనుకుంటుండగానే ‘ప్రసాద్ కారు తీయు ‘అంటూ వచ్చిన అమ్మగారిని, పిల్లలని లోపల కూర్చోబెట్టి 3 ,4 దేవాలయాలకు  వెళ్లి వచ్చేసరికల్లా మధ్యాహ్నం రెండు అయిపోయింది. సరిగ్గా అదే  సమయంలో’ రామచంద్ర రావు గారు’ బయటకు వచ్చి ‘, ప్రసాదు తొందరగా భోజనం చెయ్! మనం మార్కెట్ కి వెళ్లి, కొన్ని రకాల’ దీపావళి సామాను, స్వీట్ బాక్స్ లు, పూల బొకేలు, చాలామంది కష్టమర్ కి పంచాలి, ఇదిగో అమ్మగారు నీకు పులిహార, బూర్లు ఇచ్చారు, భోజనం చేసి రెడీగా ఉండు ! అని చెప్పి లోపలికి వెళ్లిపోయారు, పొద్దున్నే భార్య ఉండి ఇచ్చిన బాక్సు తీసి భోజనం చేద్దామనుకునే సరికి అసలు సహించక పక్కన పెట్టేశాడు ప్రసాద్, ఎంతో సరదాగా తన కుటుంబంతో కలిసి దీపావళి రోజున భోజనం చేద్దాం, అనుకున్నా కానీ కుదరదు! అనుకుంటూ ఉండిపోయాడు ప్రసాదు. అసలే దీపావళి పండుగ, నెలాఖరున పడ్డాది, మధ్యతరగతి కుటుంబీకులు లకు జీతభత్యాలు కూడా అందవు, పండుగ ఎలా చేసుకోవాలో? తెలియక సతమతమవుతూ ప్రసాద్ జేబులు తడుముకున్నా డు, అందులో తీరా చూస్తే 200 రూపాయలు మాత్రమే మిగిలాయి, దీంట్లోనే పిల్లలకి కాకరపువ్వొత్తులు, మతాబులు , భార్య కి ‘లక్ష్మీ పూజ ‘కోసం ఏదో ఒక రకం స్వీటు పట్టుకెళ్ళాలి, అంతే జేబులు ఖాళీ, ఏం చేస్తున్నావ్ రా దేవుడా! ఉన్నవాళ్లకి  అన్నీ కలిసి వస్తాయి, లేనివాడికి ఆశలన్ని అడియాశలే, చాలా వింతగా ఉంది అనుకుంటుండగానే,’ ప్రసాదు కారు తియ్యి !అన్న యజమాని మాటలు విని ఒక్కసారి లేచి  యజమాని కుటుంబం కోసం కారు తలుపులు తీసి తన యునిఫారం సర్దుకుంటూ, అలాగే సార్ !అంటూ మెల్లిగా కారును పోనిచ్చాడు ప్రసాద్.
ప్రసాదు ముందు ‘పూల మార్కెట్ ‘కు వెళ్లి కొన్ని ‘బొకేలు కొందాం! అంటూ అక్కడినుంచి స్వీట్ షాప్ కి వెళ్లి ఒక 20 బాక్సులు స్వీట్లు కొని, అలాగే  మరికొన్ని ‘డ్రై ఫ్రూట్స్ ‘బాక్సులు కొని అవన్నీ ఒక గిఫ్ట్ గా చేసి ప్రతి కస్టమర్ ఇంటికి వెళ్లి ,వారికి ఇచ్చి అభినందించి రావడం, రామచంద్ర రావు గారికి అలవాటు, ఆ ప్రకారమే అన్నీ అయిపోయాక, ఒక పెద్ద ‘షాపింగ్ మాల్’ దగ్గర ఆపించి, యజమాని గారు తన కుటుంబంతో సహా లోపలికి వెళ్ళి పోతూ ఉండగా, సార్! చీకటి పడిపోతుంది, దీపావళి  మొదలైపోయిం ది, నన్ను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ల నివ్వండి సార్, అంటూ ప్రసాద్ అనగానే, ఒరేయ్, మాక్కూడా దీపావళి ఉంది కదా ! ఎందుకు తొందర వెళుదువు గాని లే” అంటూ నవ్వుకుంటూ షాపింగ్ మాల్ లోకి వెళ్ళిపోయారు రామచంద్ర రావు గారు. పైన కార్ లో కూర్చున్న ప్రసాద్ కి జీవితమంటే చిరాకు వస్తుంది, యజమాని అసలు నన్ను పట్టించుకోవడం లేదు, కారు వదిలి పారిపోదామని, వాళ్ల దారి వాళ్ళు చూసుకుంటారు, నేను ఇంటికి వెళ్లి నా భార్యాబిడ్డలతో ఉన్నదాంట్లో పండుగ చేసుకుంటాను! అనుకుంటూ బాధపడుతూ, మళ్లీ రేపు ఉద్యోగం లేకపోతే నా పిల్లల గతి ఏమిటి? అనుకుంటూ, తనలో తనే మదనపడుతూ ఉండగా, “అరె ప్రసాదు, ఈ సామానంతా డిక్కీ లో పెట్టు, అవునట్టు ఇక్కడికి దగ్గరే నీ ఇల్లు ఉంది గా అటుగా పోనీ! అనగానే ఎందుకు లెండి? సార్, ఎలాగో లేట్ అయిపోయింది, మిమ్మల్ని ఇంట్లో దింపి నేను వెళ్ళిపోతాను, అన్నాడు బాధగా, ‘అరే చెప్తున్నది నీకు కాదా! పిల్లలు మీ ఇల్లు చూసి వెళ్దాం! అంటున్నారు, అటుగా పోనీ అని యజమాని గట్టిగా అనేసరికి, అలాగేనండి ! అంటూ తను  ఉంటున్న ఇంటి దగ్గర కారాపాడు ప్రసాద్. తను కారు దిగి” రేవతి బయటికి రా! మన యజమాని గారు కుటుంబంతో వచ్చారు” అని గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్లి గబగబా ఉన్న రెండు చిన్న గదుల్లో ఉన్న కుర్చీలను శుభ్రంగా తుడిచి,’ రండి సార్! అంటూ లోపలికి ఆహ్వానించారు భార్య భర్తలు. ఈ లోపల ప్రసాద్ పిల్లలు కూడా ఎంతో మర్యాదగా నమస్కారాలు చేస్తూ నిలబ డిఉండటం చూసిన రామచంద్ర రావు గారు ఆయన భార్య ఎంతో హాయిగా నవ్వుతూ, “చూశావా అమ్మా ! నీ భర్త ఈ దీపావళి రోజంతా మాతో ఉన్నాడని, నువ్వు బాధ పడుతున్నావు కదా! అంటూ నవ్వుతూ పలకరించే సరికి.’ లేదండి మీరు మాకు యజమానులు’ మీరు ఏం చెప్పినా అది చెయ్యడం ఉద్యోగస్తులుగా మా ధర్మం, అని భార్య రేవతి అనడంతో అప్పుడే లోపల్కి వచ్చిన రామచంద్ర రావు గారి పిల్లలు, ఒక సంచీ నిండా కొత్త బట్టలు, ఒక సంచీ నిండా దీపావళి సామాను, మరొక సంచితో స్వీట్స్ అన్ని తెచ్చిచి ప్రసాద్ భార్య రేవతి ఇచ్చేసరికి ఆశ్చర్యపోయారు ఆ దంపతులు,’ ఏంటి సార్? ఇది  మా కోసం ఇన్ని సామాన్లు’ ఒక యజమాని సేవకుడి కోసం, ఇంత దీపావళి రాత్రి పండుగ రోజు మా ఇంటికొచ్చి ఇవ్వడం, అన్నది నేను ఎక్కడా వినలేదు సార్! మీ అపారమైన ఆత్మీయతకు, ఆదరణకు జోహార్లు సార్!! అంటూ నమస్కారం చేస్తున్నా డ్రైవర్ ప్రసాదు ఆయన భార్య రేవతి చూస్తూ, చూడమ్మా! మీ భర్త ఎంతో నిజాయితీ గల మా మనిషి , ఆయన కుటుంబం బాగోగులు అన్ని యజమాని చూస్తాడు, ఇకనుంచి నీ పిల్లల చదువులు వారి భవిష్యత్తు అంతా మేమే చూస్తాము,! అంటూ చెప్తున్న రామచంద్ర రావు గారు ఒక దేవుడిలా కనబడ్డారు ప్రసాద్ కి, అంతే కళ్ళనీళ్ళ పర్యంతం అవుతు” సార్, మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్న, ఒక గంట క్రితం అయితే మీ కారు వదిలి పారిపోదామని అనుకున్న, కానీ ఎందుకొ ఆ మర్నాడు మళ్ళీ బతకలేమని, గుర్తుకు వచ్చి మీతోనే ఉండిపోయాను, కానీ మీ కుటుంబం దగ్గర పని చేయడం నా ‘పూర్వజన్మ సుకృతం! అంటూ రామచంద్ర రావు గారికి, ఆయన భార్యకు నమస్కారం చేశారు. ఇంతలో రామచంద్ర రావు గారి భార్య రేవతి ని పిలిచి ఒక ‘పట్టు చీర’ బొట్టు పెట్టి ఇస్తూ” చూడమ్మా! ఈ చీర లోపల 10 వేల రూపాయలు ఉన్నాయి, మీ పిల్లలు స్కూల్ ఫీజు కడుతూ, ఏమైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా! ఇక మీరు కూడా మా కుటుంబమే! అంటూ అనే సరికి నోట మాట రాక ఆశ్చర్యంతో తమ బతుకుల్లో ‘చీకటిని పారద్రోలి వెలుగు ‘నింపిన తమ యజమాని కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని ప్రార్థించారు డ్రైవర్ ప్రసాద్ భార్య రేవతి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!