రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:  డా.జె.చలం.

అదొక అగాధం. భయంకరమైన చీకటి. ఎంత అరిచి గీపెట్టినా నాగొంతు నాకే వినబడలేదు. నా శరీరం నా స్వాధీనంలో లేదు. కాదు, అసలు శరీరమే  లేదు. మృత్యువంటే ఇదే కాబోలు. నేను చనిపోతున్ననా?క్షమించండి. నాకు చనిపోవాలని లేదు. బలవంతంగా నాప్రాణం తీసుకుపోవడానికి వీలు లేదు. నేను ఆసబోతుని కాదు. నేను రాను. నన్ను బ్రతకనివ్వండి. నేను చిన్నతనం నుండి వెల్ఫేర్ హాస్టల్లఉండి చదువుకున్నాను. మా వార్డెన్ చండా శాసనుడు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేవాలి. లేవకుంటే కానుగ బెత్తంతో  నిద్రపోతున్న వారిపై బాదేవాడు. నిద్రమత్తులో ఎటు వెళ్లాలో తెలియక తలుపులకు కిటికీలకు తల కొట్టుకుని గాయం అయ్యేది. ఎలాగో చదువు పూర్తి అయి ఇంజనీర్ని అయ్యాను. మంచి కంపెనీ. మంచి జీతం.
ఆకర్షణీయ ప్యాకేజీలు. వీకెండ్స్ సెలవులు. టైమ్ ఎంతో జాలీగా గడిచిపోతుంది. భూలోకంలో స్వర్గం లా వుంది. ఏంటి ఇట్లాంటి టైంలో పరలోక ప్రయానం? ససేమిరా వీల్లేదు. కబ్బన్ పార్కులో కూర్చుని చల్లని సాయంకాలం పిల్లగాలులను ఆస్వాదిస్తుంటే, అది మోసుకోచ్చే నైట్ క్వీన్ పరిమళం మరోలోకంలో ఉన్నామన్న భ్రమ కలిగిస్తుంది. సప్తవర్ణాలతో విచిత్రమైన  రెక్కలకదలికలతో అలవోకగా గాలిలో నృత్యం చేస్తున్న సీతాకోకచిలుకలు అదోలోకం లోకి తీసుకెళ్తాయి. అలాంటి తరుణంలో పక్కనే కబుర్లు చెబుతూ మతేక్కించే ప్రియురాలు ఉండాలని కోరుకోవడం లేదే! నా జీవితం ఇలానే సాఫీగా జరిగిపోవాలనే కోరుకుంటున్నా. ఇక ఉదయం అయ్యర్ హోటల్లో ఇడ్లీ, వడ, సాంబారు రుచి వర్ణించ తరమా! ఆ కాఫీ పరిమళం కేప్ కి ప్రవేశించక ముందే స్వాగతం పలుకుతుంది. ఆ కప్పు కాఫీ ఎక్కడ త్వరగా అయిపోతుందో అని మెల్లిగా ఆస్వాదిస్తూ సమయమే మరిచిపోతాను. ఇక ఆఫీసు కెళితే అదో ఇంద్రభవనం. సెంట్రల్ ఏ.సి.తో శరీరానికి ఏమాత్రం శీతోష్ణ స్థితుల బాధ లేకుండా హాయిగా ఉంటుంది. నేను నా సిస్టంతో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే నా నేస్తంతో ఉన్న అనుభూతి. మధ్యలో టీ బ్రేకులు, లంచ్ టైమ్, జిమ్ కసరత్తులు, అబ్బ! జీవితంలో ఇంకేం కావాలి! ఇక 5 వ అంతస్తులో నా రూమ్. అది నారూమ్ అనకూడదు నాకై నేను నిర్మించుకున్న ప్రపంచం. నా ప్యాలెస్. ఇక మ్యూజిక్, బుక్స్ నా ఊపిరి. నా వీక్నెస్ అన్నా తప్పులేదు. వీటికోసం నేను ఎంత డబ్బాయిన ఖర్చు పెడతాను. ఎంత టైమ్ అయినా గడపుతాను. నా గది నా ప్యారడైజ్. నాకిష్టమైన హిందీ, తెలుగు, ఇంగ్లీషు పాటలు స్టీరియోలో వింటూ నన్ను నేను మైమరచిపోతాను. ఇక నా గది కిటికీ లోంచి అలా బయటకు చూస్తుంటే చీమల్లా తిరిగే మనుష్యులు, పాముల్లా కదిలే ట్రాఫిక్, కళ్ళకు మిరుమిట్లుగొలిపే నియాన్ లైట్లు, అన్నీ కలగలిపిన వింత శబ్దాలు, ఓహో ఎంత సమయమైనాఇట్టే గడిచిపోతుంది. ఇక నా రూమ్మేట్ సాయి నిజంగా సాయిబాబా అవతారము. పూర్తి డిఫరెంట్. తను రూంలో ఉన్నట్లే తెలియదు. తెల్లవారుజామున లేస్తాడు. అరగంట పైనే పూజ. పేరెంట్స్ తో గంటలు, గంటలు మాటలు. అసలు బయట ప్రపంచంతో సంబంధం లేనట్లుంటాడు. తనది అదోలోకం. కానీ నాకేంఇబ్బంది లేదు. నాలోకం నాది. ఇక అమ్మ, నాన్న పల్లెలో వుంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ, వారి జీవితం అంతా పొలంలోనే గడిపినట్లనిపిస్తుంది. ఏమి సేద్యమో ఏమో!ఇన్నేళ్లయినా కూడబెట్టింది ఏమీ లేదు. పూట గడవడానికి సరిపోతుందేమో! నా చదువంతా స్కాలరుషిప్పుల మీదే పూర్తయింది. ఇక సంగీత మాల్ కెళితే డోర్ దగ్గరే తాకితే మాసిపోయే, కందిపోయే బుగ్గలున్న సుందరీమణులు స్వాగతం పలుకుతారు. ఇక లోపల్కెళితే, అన్ని ఐటమ్స్ అలా చూస్తూ పోతే అదొక సంతోషం. ముఖ్యంగా ఎలెక్ట్రానిక్ ఐటమ్స్ అంటే నాకు పిచ్చి. కొనకపోయినా అక్కడే ఎక్కువ సేపువుంటా. కొన్న అనుభూతి. రోజంతాఅక్కడుకున్నా బోర్ అనిపించదు. చిన్న చిన్న బిడ్డలతో తల్లులు, బా ఈ ఫ్రెండ్డుతో అలవోకగా చెయ్యి పట్టుకుని షాపింగ్ చేస్తున్న టీనేజ్ అమ్మాయిలు, పచారి సరుకులు కొని భారంగా ట్రోలిని లాక్కోస్తున్న మధ్యతరగతి జంటలు, ఆ సందడే మజాగా ఉంటుంది. వారంలో 2 లేక 3 సార్లయినా అక్కడకు పోకుండా ఉండలేను ఏమీ కొనకపోయినా. ఇక శిల్ప గురించి చెప్పనేలేదు కదూ. బ్రహ్మ ఎంతో జాగ్రత్తగా మలిచిన శిల్పమే శిల్ప. బంగారు మేని చాయతో, ప్రపంచ సుందరి లాగా ఖచ్చితమైన కొలతలతో, ఠీవిగా నడిచివస్తుంటే మా ఆఫిస్లో అందరూనోళ్లు వెళ్ళబెట్టి చూడడం రోజూ జరిగే తంతే. ఆమె స్నేహం కోసం, మాటలకోసం పరితపించే వాళ్లందరినీ పట్టించు కోకుండా నాపక్కనే కూర్చుంటుంది. నాతో చనువుగా మాట్లాడుతుంటే, ప్రపంచాన్ని జయించిన అనుభూతి. ఆ మహారాణిని సొంతం చేసుకున్న చక్రవర్తిలా, అదృష్టవంతుడిగా పొంగిపోతుంటాను. అంతటి అందాలరాసికి నేనంటే ఎందుకంత అభిమానమో నాకు అర్థంకాదు. దేవుడు నన్ను కరుణిస్తే, తనతో ఏడడుగులు నడిచి నా జీవితం స్వర్గమయం చేసుకునే రోజు అట్టే దూరం లేదనిపిస్తోంది. తన తేనె కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతుంటే మాట తడబడుతుంది. మైండ్ బ్లాంక్ అవుతుంది. నా స్థితికి జాలి పడి పకా, పకా నవ్వుతున్నాబ్ శిల్పాను చూస్తే మరింత కంగారు. ఆమె దగ్గర టైమ్ తెలీకుండా గడిచిపోతుంది.
ఇక మ్యూజిక్ సంగతి చెబుతాను. హిందీలో పాత తరం పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే. “ప్యార్కియాతో డరనా క్యా! ప్యార్ కీయా కోయి చోరీ నహీ”
“దాంమరో దం! మిటీజాయ్ హమ్! హారేకృష్న్ హారేరాం!” ఇంకాలెక్కలేనన్ని తెలుగు, ఇంగ్లీషు హిట్ సాంగ్స్ హెడ్ ఫోన్స్ లో వింటుంటే ఈ జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. సంగీత ప్రపంచంలో ఓలలాడాలనిపిస్తుంది. అందరూస్వర్గం, నరకం అంటారు. నాకు అవేవీ వద్దు. జీవితంలో నాకు నచ్చినట్లు బ్రతకడమే స్వర్గం. దానికి వ్యతిరేకమే నరకం. అదిగో! నల్లగా ఎదోఆకారం ఇటు వేపే వస్తోంది. యముని మహిషం కాబోలు! ఆ వేనకాల నల్లగా..యమభటులేమో! వద్దు! వద్దు! నన్ను తీసుకెళ్లవద్దు. నేను రాను. నన్ను వదలండి.
గట్టిగా కేకలు వేసి కాలితో బెడ్ తంతుంటే శ్రీమతి నా దుప్పటి లాగేసింది. రాత్రుళ్ళు ఎక్కువసేపు మేలుకోవద్దు. నెట్ లోనే  వుండొద్దు అంటే వినరు. పీడకలలు వస్తాయని చెప్పాను కదా! బాగా తెల్లవారిపోయింది. లేవండి. ఆఫీసుకు టైమైంది! కేకలేస్తోంది శ్రీమతి. కళ్లు నులుముకుంటూ స్వప్నలోకం నుండి భూలోకానికి రావడానికి కొంచెం టైమ్ పట్టింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!