మాష్టారుగారు

మాష్టారుగారు

రచన: బండి చందు

అది ఒక అందమైన పల్లెటూరు. పట్టణానికి పదిమైళ్ళ దూరంలోఉంది. ఆ ఊర్లో ఒక పాతికేళ్ల కుర్రాడు పేరు చందు. తల్లిదండ్రులు అశోక్, నర్సవ్వ. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో చిన్నప్పటినుండి తల్లి అతి గారాబం వల్ల కష్టపడకుండా పెరిగాడు. బాగా చదువుకున్నవాడే అయినా రానురాను కష్టపడనితత్వం అతనిని సోమరిగా తయారుచేసింది. బాధ్యతలెన్ని ఉన్న బరువు అనిపించడంతో వాటిని మోయడానికి నిరాకరించాడు. రోజంతా ఏ పనీపాటా లేకుండానే కాళీగా ఊరంతా స్నేహితులతో తిరిగి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడు. తల్లి బాధ్యతగా మసులుకోమని నలుగురిలో ఉన్నత స్థితికి ఎదగమని ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఇక చేసేది లేక తల్లి కూడా చెప్పడం మానేసింది. దాంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చెడతిరుగుళ్ళకి కూడా అలవాటుపడ్డాడు. ఆ విషయం తెలిసి కూడా కొడుకుని మందలించక తనలోతాను భాదపడసాగింది ఆ తల్లి.

ఒకరోజు ఆ ఊర్లోకి కొత్తగా ఒక స్కూలు మాస్టారు వచ్చారు. ఆయన పేరు నారాయణ. భార్య లక్ష్మీ ఇద్దరు కూతుళ్ళు సుశీల,అంజలి. ఊర్లో ఉన్న స్కూలుకి బదిలీ మీద వచ్చాడు. నారాయణ ఇంటి కొరకు వెతుకుతూ స్కూలుకి దగ్గర్లో ఉన్న నర్సవ్వ ఇంటి పైపోర్షన్ కాళీగా ఉందని ఎవరో చెప్పగా విని నర్సవ్వ వద్దకి వెళ్లి తనని పరిచయం చేసుకుని ఇల్లు అద్దెకి కావాలని కోరాడు. నర్సవ్వ ఇంటి అద్దెకు అంగీకరించి ఇల్లు చూపించి తాళాలు నారాయణకి ఇచ్చింది. అంతేకాక ఆరోజు వారికి కావాల్సిన అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేసింది.

నారాయణ మాస్టారు చాలా కలుపుగోలు మనిషి. అందరినీ స్వంతవారిలానే అనుకునేవాడు. ఎవరికి కష్టం వచ్చినా తనకి తోచిన సహాయం చేసేవాడు. అయితే చాలా రోజులనుండి నారాయణ మాస్టరు నర్సవ్వని ఆమె కొడుకు చందుని గమనిస్తున్నాడు. పైగా ఊర్లోవాళ్ళు అతని గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, నర్సవ్వ కొడుకుని కని ఊరిమీదకి వదిలేసిందని తిట్టడం విన్న మాస్టారు అతనిని ఎలా అయినా దారిలో పెట్టాలనుకున్నాడు. ఒకరోజు నర్సవ్వ కొడుకు గురుంచి భాదపడుతున్న సమయంలో మాస్టారు వెళ్లి అమ్మ నీ కొడుకు అందరిలా బాగుపడితే చూడాలని ఉందా అని అడిగాడు. దానికి ఆమె మాష్టారుగారు నా జీవితంలో నాకున్న ఒకే ఒక కోరిక అది. కానీ నెరవేరే దారి మాత్రం కనిపించడం లేదు అని వాపోయింది.

మాస్టారు నర్సవ్వని ఓదార్చి చూడమ్మ నీ కొడుకుని నాతో పాటు పట్టణం పంపించు నేను నీ కొడుకుని మార్చి చూపిస్తాను అని చెప్పాడు. కొడుకు బాగుపడడం కన్నా కావాల్సిందేముంది అని అందుకు ఒప్పకున్న నర్సవ్వ కొడుక్కి విషయం చెప్పి వెళ్ళమని బ్రతిమాలింది. మొదట్లో వెళ్లనని మొండికేసినా పట్టణం చూడొచ్చని చందు ఒప్పుకున్నాడు. మాస్టారు, చందు ఇద్దరు ఉదయమే పట్టణం బయల్దేరారు. పట్టణంలో బస్ దిగిన వెంటనే వారికి ఒక దృశ్యం కనిపించింది. సరిగ్గా పదేళ్లు వుంటాయేమో ఆ పిల్లవానికి. చింపిరి జుట్టు, మట్టికొట్టుకుపోయిన చేతులు, చాలా చోట్ల చిరిగిన ఒంటిపై దుస్తులు ఇలా చూడగానే అయ్యోపాపం అనిపించేలా ఉంది ఆ పిల్లవాడి రూపం.

ఆ పిల్లవాడు మాత్రం అతని రూపాన్ని పట్టించుకోకుండా బస్ స్టాండ్ ఆవరణలో వచ్చిపోయే వారి వాహనాల అద్దాలు తుడుస్తున్నాడు. ఉదయం మొత్తం పనిచేసి సాయంత్రం అదే బస్ స్టాండ్ లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళి కష్టపడి సంపాదించిన డబ్బుతో తల్లికి ఆహారం పొట్లం కొని తానే తినిపించాడు. ఇదంతా ఉదయం నుండి గమనించిన చందు తానెంత సోమరినో, ఇన్ని రోజులనుండి తన తల్లిని ఎంత కష్టపెట్టానో అని దుఃఖించసాగాడు. మాస్టారు అతనిని ఓదారుస్తూ చందు చూసావా లోకం ఎంత విచిత్రమైనదో ఆ పిల్లవాడు ఎం తప్పు చేసాడని ఇంత చిన్నతనంలో అంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. నువ్వు మాత్రం అన్ని సదుపాయాలు ఉన్న ఏ బాధ్యత లేకుండా మీ అమ్మ మాట వినకుండా ఊరికే బ్రతుకు వెళ్లదీస్తున్నావు అని పలికాడు.

చందు మాస్టారుగారితో మాస్టారు ఇక నేను ఇంకెప్పుడు బాధ్యత లేకుండా తిరగను. మా అమ్మని కష్టపెట్టకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఇంటికి వచ్చాక అమ్మకి చెప్పి కొంత మొత్తంతో చిన్నవ్యాపారం ప్రారంభించాడు. కొద్దికాలంలొనే వ్యాపారం పట్టణానికి కూడా విస్తరించాడు. ఊర్లో అందరు క్రమంగా అతడిని మెచ్చుకోసాగారు. చందు వ్యాపారంలో మంచి పేరు సంపాదించాడు. మాస్టరుగారు చందుకి తన పెద్దమ్మాయి సుశీలతో పెళ్లి జరిపించాడు. కొడుకు ఏమవుతాడోనని ఇన్ని రోజులు భయపడిన నర్సవ్వ ఇదంతా చూసి తన కొడుకుని ప్రయోజకుడిని చేసిన మాష్టారుగారికి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని ఆనందభాష్పలు నిండిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పుకుంది…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!