అమ్మమ్మ కలిపిన ప్రేమ

అమ్మమ్మ కలిపిన ప్రేమ

రచన: పరిమళ కళ్యాణ్

నేను మౌనిక.. నేనూ, గణేష్ ఓకే ఆఫీసులో పని చేస్తూ, రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అందుకే అనుకుంటా మా ఇద్దరి మనసులు  కలిశాయి అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా.

ఈలోగా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాన్నకి నా ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకరోజు నాన్న నా దగ్గరకి వచ్చి,
“మౌనీ, నీకోక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో మంచి ఉద్యోగం. ఆడపడుచు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయింది. అత్తగారి పోరు కూడా ఉండదు. ఏమంటావు? నాకైతే ఈ సంబంధం అన్ని విధాలా నచ్చింది. నీ అభిప్రాయం ఏమిటో చెప్తే అబ్బాయి వాళ్ళని మంచి రోజు చూసుకుని వచ్చి చూసుకోమని చెప్తాను. చెప్పమ్మా?” అని అడిగారు.

ఎలాగైనా గణేష్ విషయం ఇంట్లో చెప్పాలి అనుకుంటున్న నాకు, నాన్న అలా అడగగానే నా మనసులో మాట చెప్పాలని డిసైడ్ అయ్యాను.
“నాన్నా, అదీ,..” అంటూ మొదలుపెట్టాను.

నా మనసులో ఎదో అనుమానం ఉందని అర్ధమైన నాన్న, “ఏంట్రా ఏదైనా ఉంటే చెప్పు?” అనడిగారు.

“నాన్నా, నాకు ఈ సంబంధం నచ్చలేదు” అన్నాను.

నాన్న కదా కనిపెట్టేసారు, “నీ మనసులో ఎవరైనా ఉన్నారా?” అని అడిగేసారు.

ఇక ఆలస్యం చెయ్యకూడదు అని గణేష్ విషయం నాన్నకి చెప్పేశాను, ధైర్యం చేసి. ముందు ఒప్పుకోలేదు నాన్న. అమ్మకి కూడా నచ్చలేదు నేను చెప్పిన విషయం.

అమ్మ కోప్పడింది, నాన్న ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. రెండురోజులు ఇంట్లో ఎవరికీ వారే అన్నట్టు ఉన్నాం.

బాగా ఆలోచించాక, ఓకే ఆఫీసు, మంచి జీతం కావటంతో వద్దనలేక పోయారు అమ్మా నాన్నలు.

పైగా మాకు కుల పట్టింపులు కూడా పెద్దగా లేవు. వెంటనే గణేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతా మంచిగా జరుగుతోంది అనుకున్న సమయంలో ఒక చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు గణేష్ పుట్టిన తేదీ. తన వివరాలు చూడగానే అర్థం అయ్యిందీ గణేష్ నా కన్నా వయసులో రెండు నెలలు చిన్నవాడు అనీ.

అటూ ఇటూ పెద్దవాళ్లు ససేమిరా అనేశారు మా పెళ్ళికి. ఇక ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ ఉండగా, మా అమ్మమ్మ వచ్చింది. ఆవిడ ఎలాంటి సమస్యనైనా సులువుగా తీర్చేస్తుంది. అలాగే నా విషయం వినగానే, ఆవిడ ఎప్పుడో రాయించిన నా జాతకం తెప్పించింది.

అప్పుడు తెలిసింది అందరికీ అసలు విషయం; సర్టిఫికెట్లలో ఉన్న నా వయసు తప్పనీ, అసలైన తేదీ జాతకంలో ఉన్న విషయం అమ్మా నాన్నా కూడా మర్చిపోయారు అనీ. జాతకం ప్రకారం నా వయసు గణేష్ వయసు కన్నా తక్కువే అని అర్ధం అయ్యింది. అందరికీ ఆ విషయం చెప్పి, పెళ్లికి ఒప్పించింది అమ్మమ్మ. హమ్మయ్య అనుకున్నాం అందరం.

ఇక మా ప్రేమకి శుభం కార్డు పడ్డట్టే అని అనుకున్నారు అందరూ. తర్వాత రెండు నెలల్లో మంచి ముహూర్తం చూసి మా పెళ్ళి జరిపించేశారు మా పెద్దవాళ్ళు.

“అమ్మమ్మా నువ్వు చాలా గ్రేట్” అనుకున్నాను నేను. అలా, అమ్మమ్మ జోక్యంతో మా ప్రేమ ఫలించింది. మా పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు.. మా ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు.. ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేవు. ఏ అరమరికలు లేకుండా సాగిపోతోంది మా జీవితం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!