జీవిత పాఠం

జీవిత పాఠం

రచన: సావిత్రి కోవూరు

“ఏవండీ రేపు ఆదివారం కదా. మన ఊరికి వెళ్లి మీ అమ్మానాన్నని తీసుకొద్దాం. అలాగే మా అమ్మ వాళ్లకి పాప పుట్టినరోజుకి రెండు రోజులు ముందే రమ్మని ఫోన్ చేద్దాం” అన్నది రాణి.

“ఈ సంవత్సరం వద్దులే రాణి. నాకు ఆఫీస్ పని చాల ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం మన పాప పుట్టినరోజు చాలా సింపుల్ గా చేద్దాం” అన్నాడు చందు.

“మీరు ఎప్పుడు సరే అన్నారు కనుక. మీకు అసలు బర్త్ డేలు, మ్యారేజ్ డేలు చేసుకోవడం అలవాటు లేదు, ఇష్టము లేదు. ప్రతి సారి నేను మీతో పోరాడాల్సి వస్తోంది. మా నాన్న నాకు రాణి అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? తను నన్ను పెళ్లి అయ్యేవరకు మహారాణిలా చూసుకునేవారు. అప్పుడు నేను, మా తమ్ముడు ఏదడిగిన ఎంత ఖరీదైనదైన  క్షణాల్లో తెచ్చేవారు.

మా పుట్టిన రోజులు కూడా పెళ్ళయ్యే వరకు చుట్టాలందరినీ, ఫ్రెండ్సందరిని పిలిచి ఎంతో ఘనంగా చేసేవారు. మీ జాబ్ చూసి, మీ ఆస్తిపాస్తులు చూసి మీరు కూడా నన్ను రాణిలా చూసుకుంటారని నన్ను ఇచ్చి చేశారు. మీరింత పీనాసి వారు అనుకోలేదు. కనీసం పిల్లల పుట్టిన రోజులు కూడా సరిగ్గా చేయరని ముందే తెలిస్తే, మీకు నన్నసలు ఇచ్చిచేసేవారు కాదు” అన్నది రుద్దమైన కంఠంతో రాణి.

“చూడు రాణి ఈ నెల నాకు ఆఫీస్ పని చాల ఎక్కువుంది. అందుకే సింపుల్గా చేద్దామని చెప్తున్నాను. దానికే ఇంత సీన్ చేస్తున్నావెందుకు. పిల్లలు వింటే బాగుండదు. నీ ఇష్టం వచ్చినట్టే గ్రాండ్ గ చేద్దాం” అన్నాడు చందు.

“హాల్ వాళ్ళకు, కేటరింగ్ వాళ్ళకి తొందరగాచెప్పు. రేపు వచ్చిన తర్వాత అతిథుల లిస్టు తయారు చేద్దాం. పాప వాళ్ళ ఫ్రెండ్స్ ని, బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ని, మీ ఫ్రెండ్స్ ని, నా ఫ్రెండ్స్ ని, చుట్టుపక్కల వాళ్ళని, దగ్గర చుట్టాలని పిలుద్దాం” అన్నది రాణి.

చందు మౌనంగా వింటూ ఉండిపోయాడు. ఉదయం లేవగానే ఇద్దరపిల్లలను తీసుకుని ఊరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి రాధమ్మ వంట పూర్తి చేసి వీళ్ళ కొరకు ఎదురుచూస్తూ ఉంది. భోజనాలు అయిన తర్వాత రాణి పిల్లలు రెస్ట్ తీసుకోవడానికి రూమ్ లోకి వెళ్ళిపోయారు.

“అదేంటిరా రెండు నెలల క్రితమే బాబు పుట్టినరోజు కి చుట్టాల అందరిని పిలిచి ఘనంగా చేశావు. ఇప్పుడు మళ్ళీ పాప పుట్టినరోజు కూడా అంత మంది చుట్టాలు, ఫ్రెండ్స్ అవసరమా. కాస్త వెనక ముందు చూసుకోవాలి. నీవు చెప్పిన ప్రకారం ఎంత లేదన్నా మూడు లక్షల ఖర్చు అవుతుంది” అన్నాడు చందు తండ్రి లక్ష్మణరావు.

“నీకు తెలియదు నాన్న నేను సింపుల్గా చేద్దామన్నందుకే పెద్ద కథ చేసి ఒక రోజు మొత్తం మనశ్శాంతి లేకుండా చేసింది రాణి. తనకి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదు. అంతే కాదు వారానికి ఒక్కసారి సినిమాకు తప్పని సరి తీసుకెళ్ళాలంటది. మూడు నెలలకు ఒకసారి ఎక్కడైనా దూరప్రాంతాలకు వెళ్లి వద్దాం అంటుంది. పండుగలకి కాకుండా టైం దొరికినప్పుడల్లా షాపింగ్ అంటుంది. ప్రతి మ్యారేజ్ డేకి ఒక నగ ఎలాగైనా కొనాలి అంటుంది. నన్నేం చేయమంటావ్ నాన్న. నాకు వచ్చే జీతం పది రోజులకు అయిపోతుంది. మిగతా నెలంతా అప్పులు చేయాల్సి వస్తుంది” అన్నడు చందు.

“అలా అంటే ఎలారా అన్ని అర్థం అయ్యేలాగా చెప్పు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల చదువులు పెళ్లిళ్లు, పేరంటాలు ఎన్నో ఖర్చులుంటాయి ముందర. నీ తోటి వాళ్ళందరూ ఇళ్ళు, ఫ్లాట్స్ కొంటున్నారు. మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడ రాదు కదా. ఈ లోపలే సంపాదన ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి, బాధ్యతలు తీర్చుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత గడవడానికి కూడా పొదుపు చేసుకోవాలి.

మా బాధ్యత అయితే ఎలాగైనా నీకు లేదు కదా. మాది మాకే సరిపోతుంది. ఇంకా అడపాదడపా నేనే నాకు చేతనైన సహాయము చేస్తున్నాను. మీరు  ఇలాగే అనవసర ఖర్చులు చేస్తే ముందర ముందర చాలా ఇబ్బందులు ఎదురై చిక్కుల్లోపడతారు జాగ్రత్త” అన్నాడు లక్ష్మణ్ రావ్.

“నేను ఏం చెప్పినా తను వినే స్థితిలో లేదు నాన్న. ఏమన్నా అంటే ‘మా నాన్న అలా పెంచాడు,ఇలా పెంచాడు’ అని గొప్పలు చెప్తుంది”

“వాళ్ళ నాన్నగారి గురించి చెప్పకపోయావా” అన్నాడు లక్ష్మణ్ రావు.

“నేను ఏమి చెప్పలేదు. తను బాధ పడుతుందని ఎలాగైనా ఇక్కడికొస్తే తనకే తెలుస్తుంది కదా అనుకున్నాను” అన్నాడు చందు.

సాయంత్రం టీ తాగిన తర్వాత “రాణి మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళదాం పద” అన్నాడు చందు.

“మా నాన్న వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎందుకండి. ఇప్పుడు ఎలా వెళ్తాము రేపు వెళదాము” అన్నది

“సరే రాణి అలా బయటకు వెళదాం పద” అని ఆమెని తీసుకుని పక్క వీధిలో ఒక ఇంట్లోకి తీసుకెళ్ళాడు చందు.

“ఈ ఇల్లు ఎవరిదండి. ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చారు నన్ను” అన్నది రాణి.

“వీళ్ళను కూడా మన పాప బర్త్ డే కు పిలుద్దాం” అన్నాడు చందు.

అప్పుడే ఇంట్లోంచి రాణి తల్లిదండ్రులు బయటకు వచ్చి, “రండి రండి అని” ఆహ్వానించారు.

ఆ ఇంట్లోంచి వచ్చిన తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయింది రాణి. “అమ్మ మీరు ఇక్కడ ఉన్నారేంటి” అన్నది.

“మేము నెల రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాము” అన్నాడు రాణి తండ్రి పరాంకుశం.

“ఎందుకు నాన్న మన ఇల్లు ఏమైందసలు. ఈ ఊరు ఎందుకు వచ్చారు” అన్నది రాణి అయోమయంగా.

“ఆ విషయాలన్నీ తీరికగా చెప్తాను ఇంట్లోకి రండి” అని లోపలికి తీసుకెళ్లి వాళ్లు కూర్చున్న తర్వాత తండ్రి పరాంకుశం చెప్పడం మొదలు పెట్టాడు

“మా నాన్న వారసత్వంగా ఇచ్చిన ఇల్లు, రెస్టారెంట్ నేను నడుపుతూ మిమ్మల్ని గొప్పగా పెంచాను. రెస్టారెంట్ వ్యాపారము మీ చిన్నప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. కానీ రాను రాను ఆడంబరాలు ఎక్కువై, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయినాయి. అప్పుడే అప్పులు చేయడం మొదలుపెట్టాను. మీ పుట్టిన రోజులు, చదువులు, పెళ్లిళ్లు, పేరంటాలు, అన్ని అప్పుల తోనే చుట్టాలు అందరూ గొప్పగా చెప్పుకునే లాగా చేసేవాణ్ని.

అప్పుడే మీ అమ్మ “అప్పులు చేసి ఇంత గొప్పగా చేయక్కర్లేదండి ఉన్నంతలో పొదుపుగా చేసుకుందామని పోట్లాడినా నాకు చెవికెక్కలేదు.
చివరికి బోజనం మానేసి పోట్లాడినా ఆమె మాట వినేవాడిని కాదు. చివరికి మీ తమ్ముని పెండ్లి కూడా ఎవరు కనీ వినని రీతిలో చేశాను. వానికి మంచి ఉద్యోగం వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాడు.

నా అప్పుల సంగతి తెలిసినప్పటి నుండి వాడి రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ లోపల కరోనా తుఫాన్ వల్ల రెస్టారెంట్ మూతపడింది. అప్పుల్లో కూరుకు పోయాను. అప్పులిచ్చిన వాళ్ళు ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక మీ తమ్ముడికి ఫోన్ చేస్తే ‘నాన్న నా జీతం మాకే సరిపోవడం లేదు. నేనేమి హెల్ప్ చేయలేను’ అని చేతులెత్తేశాడు.

అప్పుడే దేవుడిలా మీ మామ గారు మమ్మల్ని ఇక్కడికి తెచ్చి ఖాళీగా ఉన్నా తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండమన్నారు. ఈ ఇంటి ఓనర్ హైదరాబాద్లో ఉంటూ దీనిని, రెండెకరాల భూమిని కూడా అమ్ముతున్నారని తెలుసుకొని చాల చవకగా నాకున్న కొద్దిపాటి డబ్బులకే ఇప్పించారు. ఇద్దరు పనివాళ్లని పెట్టుకుని ఆ భూమిలో  కొన్ని పండ్ల చెట్లు పెట్టి, కూరగాయలు పండించి హైదరాబాద్ కు రవాణా చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. మీ మామ గారి మేలు మరువలేనిది” అన్నాడు పరాంకుశం.

“నాన్న ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా చెప్పలేదెందుకు నాకు. నేను తరచుగా ఫోన్ చేస్తూనే ఉన్నాను కదా” అన్నది రాణి ఏడుస్తూ.

“ఏమని చెప్పను అమ్మా. లేనిపోని ఆడంబరాలతో, మితిమీరిన ఖర్చు చేసి, నడిరోడ్డున నిల్చుంటే, మీ మామగారు సాయం చేశాడని చెప్పనా? ఏమని చెప్పను?

బిజినెస్ బాగా సాగినప్పుడే నాలుగు డబ్బులు వెనుకేసుకుంటే ఈ రోజు ఈ గతి పట్టేది కాదు. నేను  చేసిన తప్పుకి నాతో పాటు మీ అమ్మ కూడా శిక్ష అనుభవిస్తోంది”అన్నాడు పరాంకుశం.

“నాన్న మీరు ఇంత దీనంగా ఉండటం నాకు ఇష్టం లేదు. మాతో పాటు మా దగ్గరకు వచ్చేయండి. అందరం ఒక్క దగ్గర ఉందాం. మళ్లీ మీరు ఏదైనా బిజినెస్ చేసుకుని దర్జాగా బ్రతకవచ్చు” అన్నది రాణి.

“నేను ఇక్కడ బాగానే ఉన్నానమ్మా. ఈ ఇల్లు ఈ పొలము నాది అని చెప్పుకోవడానికి మిగిలినవి. ఈ పొలంతో హాయిగా బ్రతుకుతున్నాం. పొల్యూషన్ లేని గాలి, చవకగా దొరికే పాలు, పండ్లు, కూరగాయలు. ఏ చీకూ చింతా లేకుండా హాయిగానే బ్రతుకుతున్నాము మేము. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు నాకు. ఇక కష్టసుఖాలలో పాలు పంచుకుని, ధైర్యం చెప్పేందుకు మీ అత్త మామలు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. అప్పటిలా కార్లు బంగళాలు లేకపోయినా పుష్కలమైన మనశ్శాంతితో హాయిగా బ్రతుకుతున్నాము. నీవేమి బాధపడకు మా గురించి అన్నాడు పరాంకుశం.

“మమ్మల్ని  గొప్పగా పెంచి, మంచి చదువు సంధ్యలు చెప్పించినందుకు మేము మిమ్మల్ని ఆదుకోవాలి కదా నాన్నా” అన్నది రాణి.

“అది తప్పమ్మా కన్నందుకు పెంచడం, చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. తలకు మించిన భారంతో పెంచడం మా తప్పిదం. తల్లిదండ్రులను దగ్గరుంచుకొని ఆదరించాలని కోరుకోవాలి కాని తలకు మించిన అప్పులు చేసి ఆ భారమంతా మోయమనడం కరెక్ట్ కాదు. సంపాదించే శక్తి ఉన్నప్పుడే ముందుచూపుతో పొదుపు చేసుకుని జాగ్రత్తపడటం ఎవరికైనా అవసరం. నా జీవితాన్ని చూసి మీరు నేర్చుకోవలసిన పాఠం ఇదే” అన్నాడు పరాంకుశం.

“సరే నాన్న మేము వెళ్తాము ఇక. అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. కొన్ని రోజులు మా దగ్గర ఉండి వద్దురు గాని” అన్నది రాణి.

“తప్పకుండా వస్తామమ్మా” అన్నారు తల్లిదండ్రులు.

అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత  “రాణి ఫంక్షన్ హాల్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏమని చెప్పమంటావు” అన్నాడు చందు.

“ఏవండీ నన్ను క్షమించండి. వెనక ముందు చూడకుండా, మన పరిస్థితి తెలుసుకోకుండ మిమ్మల్ని  పోరి పోరి పుట్టిన రోజు ఫంక్షన్ గొప్పగా చేయించాలని అనుకున్నాను. అది ఎంత తప్పో మా నాన్నను చూసిన తర్వాత తెలిసింది నాకు. క్యాటరింగ్ వాళ్లకు, హాల్ వాళ్లకు చెప్పేయండి. ఫంక్షన్ క్యాన్సిల్ అయింది అవసరం లేదని” అన్నది రాణి.

“అదేంటి” అన్నాడు చందు.

“పుట్టినరోజుకు ఎవర్ని పిలవడం లేదండి. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న ఉంటే చాలు” అన్నది రాణి.

ఈ మాటలు విన్న చందు, పక్క గదిలో నుంచి వింటున్న చందు అమ్మానాన్న ఎంతో సంతోషించారు. పెద్ద భారం దిగిపోయినట్టు ఫీలయ్యి
ఆనందించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!