స్వగతాలు

స్వగతాలు

రచన: వాడపర్తి వెంకటరమణ

అదో రిచ్ ప్లేస్…

రిచ్ ప్లేసంటే అంటే బాగా డబ్బుండి, ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేసే ధనవంతులు నివశించే ప్రాంతం అన్నమాట. ఆ ఏరియా పేరు గోల్డెన్ హిల్స్.

ఆ గోల్డెన్ హిల్స్ లో ఓ అధునాతన రాజప్రసాదంలాంటి భవనం. ఆ భవనం చుట్టూ ఇతరులెవరూ లోనికి చొరబడకుండా షార్ట్ సర్క్యూట్ తో అమర్చబడిన ఎత్తైన ప్రహరీ గోడ. గోడకి ఆవల పచ్చని తివాచీ పరిచినట్లు ముచ్చటగొలుపుతున్న లాన్. మెయిన్ గేటు నుంచి ముఖ ద్వారం వరకు నడిచి వచ్చే అతిథుల కోసం దారంతా కార్పెట్ పరచబడి ఉంది. దారికిరువైపులా ఉన్న క్రోటన్ మొక్కలు వచ్చే అతిథులందరికీ స్వాగతం చెబుతున్నట్లు గాలికి అటూ ఇటూ తలలు ఊపుతున్నాయి.

ఆ సాయంత్రం వేళ ఆ భవనం రంగు రంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఉంది. భవనం చుట్టూ అమర్చిన ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆ ప్రదేశమంతా పట్టపగలును తలపిస్తోంది.

ప్రహరీ గోడ లోపల ఆరోజు ఆ ఇంటి వారసుడైన విక్రమ్ వర్మ అలియాస్ విక్కీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఆహ్వానించిన అతిధులతో బయట లానంతా సందడి సందడిగా ఉంది. రకరకాల వంటకాల ఘుమఘుమలతో ఆ ప్రదేశమంతా ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి. నచ్చిన మందు, విందులతో ఆ కార్యక్రమానికి విచ్చేసినవారంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

అదే సమయంలో ఇంట్లోనుండి బయటకు వచ్చింది స్నూఫీ. అది ఆ ఇంటి పెంపుడు కుక్క. వచ్చీ రాగానే అటూ ఇటూ చూసింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

ఓసారి చల్లగాలికి బయట పచ్చికలో తిరగాలనిపించింది. రోజంతా ఇంట్లో మగ్గి మగ్గి చిరాకనిపించింది స్నూఫీకి. అయితే అది ఎంత తిరిగినా ఆ ప్రహరీ లోపలే. ఆ ఇల్లే దాని ప్రపంచం. అంతకుమించి ఆ ఇంటి గేటుదాటి బయటికి వెళ్ళడం బహు తక్కువ. ఆ ఇంటి ముఖాలను చూసి చూసి బోరుకొట్టేసింది. జీవితం నిస్తేజంగా సాగుతోన్నట్టు అనిపించింది స్నూఫీకి.

గబగబా లాన్ లోకి వచ్చింది. అప్పుడే మందు ఎక్కువైన ఓ భారీ శాల్తీ ఊగుతూ, తూలుతూ చేతిలోనున్న బౌల్ లోంచి వేడి సూప్ ని స్నూఫీ పైన ఒలకబోశాడు.

‘చచ్చాన్రా దేవుడో…’ అనుకుంటూ, అనవసరంగా ఈ ఎదవల మధ్యకు వచ్చినందుకు ఒళ్ళంతా బొబ్బలు తెప్పించుకోవలసి వచ్చింది అనుకుని ఓ మూలకు చేరుకుంది స్నూఫీ.

‘ఛీ…ఛీ…ఎదవ కుక్క బతుకు. తినడానికి అన్నీ దగ్గరే ఉన్నా, కనీసం స్వేచ్ఛ లేకుండా పోయింది. నాకన్నా ఊరకుక్కలే నయం. నచ్చింది తింటాయి, నచ్చినట్లు ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తాయి’ స్వగతంగా అనుకుంది స్నూఫీ.

************

బయట ప్రహరీ గోడకు ఆనుకుని ఓ ఎత్తైన బండరాయి ఉంది. చాలాసేపట్నుంచి ఆ బండరాయిపై కూర్చుని పంక్షన్ జరుతున్న ఆ భవనం వైపే ఎదురుచూస్తోంది ఓ ఊరకుక్క.

‘అబ్బ… ఎన్నెన్ని వంటకాలో, బతికితే ఇలాంటి ధనవంతుల భవనాల్లోనే బతకాలి. నచ్చినవి తినొచ్చు నచ్చినట్లు సుఖంగా ఉండొచ్చు. అన్నీ మన కాళ్ళ దగ్గరకే వస్తాయి.

ఎందుకూ తానూ వుంది ఎండనకా, వాననక ఊరంతా తిరిగి, ఊరిమీద అడ్డమైన పెంట తింటూ… ఏదేమైనా ఈ భవనాల్లో ఉండే కుక్కల అదృష్టమే అదృష్టం. వాటివి ఏ చీకూ చింతా లేని జీవితాలు.’ అని స్వగతంగా అనుకుంది ఊరకుక్క.

జాతికి రెండూ ఒకే జాతికి చెందినవైనా, మనస్తత్వాలలో భిన్న పార్శ్వాలు. భిన్న స్వగతాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!