బాల్యం

బాల్యం

రచన:ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ఉదయమే “ఒరేయ్ వెంకటేశు, రామూ చద్దన్నం ఆవకాయ కలిపి పెట్టాను. వెన్న కూడా వేసాను, తినండి” అన్న అమ్మ పిలుపుకు ఇద్దరం వచ్చాం కంచం దగ్గరకు.

ఈలోపు లో మా పెద్దన్నయ్య వచ్చి ట్యాక్స్ కట్టాలి అంటూ వచ్చాడు నా దగ్గరకు. అంటే ఆవకాయ అన్నం ముద్ద తన నోటికి అందించాలని అర్థం.

“చూడు అమ్మా, అన్నం పెట్టమంటున్నాడు. తనకి నువ్వు వేరే కంచంలో కలిపి పెట్టవచ్చు కదా! ”

“పోనీలే ఒక ముద్దే కదా, మీకు కావాలంటే మళ్ళీ కలుపుతానులే” అని అమ్మ అనే సరికి ఏడుస్తూ పెట్టాను.

ఈలోపులో చిన్నన్నయ్య వచ్చి, పెద్దన్నయ్యను గిల్లి, వంకాయిని అడిగావు, పకోడీని అడగలేదు ఎందుకు అంటూండగానే “వాడి దగ్గరకే వెడుతున్నాను” అంటూ తమ్ముడిని కూడా ట్యాక్స్ అనేసరికి, వెంకటేశు పెట్టాడు కదా అనగానే, “లేదు లేదు ఎవ్వరికీ వారే ట్యాక్స్ కట్టాలి” అనగానే తమ్ముడు కూడా అన్నం పెట్టాడు అమ్మకు కంప్లైంట్ చేసినా వుపయోగం లేదని.

ఈ సంఘటనలో అప్పటి బాల్యంలో తాత్కాలికంగా కోపము, ఏడుపు వచ్చినప్పటికీ, ఈ జ్ణాపకాలు ప్రేమే అని ఇప్పుడు అర్థం అవుతోంది.

మేమందరమూ అన్నయ్యలను పేరు పెట్టుకునే పిలుచుకునే వారము ఒక్క మా పెద్దక్కను తప్ప. తను చిన్నప్పుడు ఓ అక్కగా అజమాయిషీ చేస్తూ అక్క పిలుపు అలవాటు చేసింది.

మా మధ్యన ఏడిపించుకోవడము అంటే కొట్టుకోవడమూ, తిట్టుకోవడమూ వుండదు. దోసకాయ, గుమ్మడికాయ, వంకాయ, పకోడి అని పిలుచుకునే వారం. అదే చిన్నతనంలో మా కోపం. మా అల్లరిలో ఆత్మీయత, అనుబంధం తప్ప వేరు లేదు. వీటి మధ్యనే పెరిగాము కాబట్టి వీటి వ్యతిరేకత అంటే ప్రేమ లేకపోతే ఎలా వుంటుందో తెలియదు అప్పుడు.

బాల్యం శాశ్వతం కావాలన్నా కాలం వూరుకోదు కదా. మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి సంపాదన, సంసారము వారిదే. అప్పుడే స్వార్థానికి విత్తనం పడింది. ఆత్మీయత, అనుబంధం చుట్టాలయ్యాయి. అలా అని మా మధ్యన పొరపొచ్చాలు వున్నాయని కాదు. ప్రస్తుతం చాలా కుటుంబాలు చూసిన తరువాత, సైడ్ ఎఫెక్ట్స్ వలన అభిమానం, ప్రేమల క్వాలిటీ తగ్గుతోందేమోనని అనిపిస్తోంది.

తరుచుగా మేము ఫంక్షన్లలో కలుస్తూనే వుంటాము. అప్పుడే అప్యాయంగా, మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాము. అంతవరకూ మా అప్యాయతలు , సెల్ ఫోన్లలో కనిపిస్తూ వుంటుంది. అలా అని తప్పు పట్టడం లేదు పరిస్థితుల ప్రభావం.

కుటుంబ సభ్యుల మధ్యే కాదు ఇంటి పని వారిలోనూ అదే ఆత్మీయత. అప్పట్లో కొండయ్య అనే పని (అలా అనడానికి మనసు ఒప్పడం లేదు) అతను వుండే వాడు. మాకు నలుగు పెట్టి, కుంకుడుకాయ పులుసు పోసి తల రుద్దుతుంటే, ఏడుస్తూ అమ్మను పిలవగానే “నేను మెల్లిగా రుద్దుతున్నాను అమ్మగారు, అరువు (తెచ్చి పెట్టుకున్న) ఏడుపు ఏడుస్తున్నారు అబ్బాయి గారు అనే వాడు. వాడికి మా అక్కలు అన్నం పెడుతుంటే, మీరు వద్దు, మీ చేతులోంచి పడదు, అమ్మగారు మీరే పెట్టండి అని అలిగే వాడు. పరిస్థితులు బట్టి ఇంటి పని మానేసినా మా పెళ్ళిళ్ళకు వచ్చి, పెళ్లి పనులు చేసేవాడు. హైదరాబాద్ లో ఒక తమ్ముని పెళ్లికి (అతని అనారోగ్య కారణంగా) పిలవలేదని నేరుగా వచ్చేసి, మా అమ్మతో కోప్పడి అన్ని పనులు చూసుకున్నాడు.

అలాగే గిన్నెలు తోమే అప్పలమ్మ (అప్పట్లో పేర్లు అలా వుండేవి) వుండేది. మా ఆఖరి తమ్ముడు నెలల వయసులో బోర్లా పడుకుని తల పైకెత్తిపుడు పామూ అని పిలిచేది. అంతే అమ్మానాన్నలు వాడికి సుబ్రహ్మణ్యం అని పేరుపెట్టారు.

ఏమైనప్పటికీ అప్పుడున్న చుట్టూ వున్న సమాజంలో ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలు, అనుబంధాలు అన్నీ వుండేవి. అప్పుడు చుట్టూ వుండేది ఎక్కువుగా ప్రేమేయని ఇప్పటికీ గర్వంగా చెప్పగలను. అది మా తరువాత తరం వారు అందిపుచ్చుకోవాలనే ఆశ దురాశ కాకూడదనే నా చిన్ని ఆశ.

…..‌

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!