బ్రహ్మాండనాయక

రచన – శివ జ్యోతి

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
నిను వర్ణించగ పదములే చాలవయ్యా
నిను వర్ణించగ పదములే చాలవయ్య

అన్నపూర్ణేశ్వరి నీ ప్రాణసతి కాగా
దీనులకు హీనులకు
కడుపు నింపగ రావా

సర్వజీవులందు నీవున్నావందురే
ఆ జీవులందు మేము నిన్ను కానలేమా
ఆ జీవులను మేము ప్రేమించలేమా

సర్వశక్తివంతుడవు నీవు కాగా
మాకింక భయమేలేల దుష్ట సంహారకా
మాకింక దిగులేల నీ అండ దండలుండ

స్మశానమందు నీవు నివసింతువందురే
అచటికే రావలెనా నిన్ను కొలవగా
మా హృదయ మందు నీవు నివసించగరావా

వెండి కొండలందు నీవు ధ్యానింతువందురే
మా ధ్యానమున నీవు నిలువగరావా
ధ్యానజ్యోతిని మాలో నిలుపగ రావా

కోటి సూర్య తేజముతో ప్రకాశింతువందురే
అజ్ఞాన తిమిరమును హరియించగ రావా
ఆత్మజ్యోతిని మాలో నిలుపగరావా

విశ్వమానవాళికి నీవాధారముకాగా
సకలైశ్వర్యమూర్తి నీవుకాగా
స్మశానమే నీ వాసమాయె బూదియే నీకు ఆభరణాలాయె

రుద్రాక్షలే నీకు మాలలాయే
కరిచర్మమే నీకు వస్త్రమాయే
మాకేల ఈ ఇహ భోగాలు తండ్రి

సర్వరూప నామధారి నీవుకాగా
మాకేమి కావలె నీ నామ స్మరణకన్న
ఇంకేమి కావలె నీ రూప ధ్యానముకన్న

ఏజన్మ పాపమొ నన్నిన్నేళ్ళు దహియించ
ధన్యురాలినైతిని నే నీ నామ స్మరణతో
నా మనసు సంతసించె నీరూప ధ్యానముతో

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
నిను వర్ణించగ పదములే చాలవయ్యా
నిను వర్ణించగ పదములే చాలవయ్యా

******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!