చదువుల తల్లి

(అంశం:: “సాధించిన విజయం”)

చదువుల తల్లి

రచన :: తిరుపతి కృష్ణవేణి

ఆంధ్రా, తెలంగాణా సరిహద్దులో గల అదొక మారు మూల గిరిజన ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవులు. ఏ రకమైన అభివృద్ధికి నోచుకోని గిరిజనులు నివసించే కుగ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటే రహదారిసౌకర్యం కూడా సరిగా లేదు. విద్యా, వైద్యం విద్యుత్ లాంటి ఆధునిక సౌకర్యాలకు నోచుకోని గిరిజన బిడ్డలు అక్కడికి పాతిక మైళ్ల దూరంలో ఉన్న పట్టణ ప్రాంతానికి అప్పుడప్పుడూ గుంపులుగా వెళ్లి తమకు కావలసిన నిత్యావసర వస్తువులు కొని తెచ్చుకుంటుంటారు. గుట్టలపై పోడువ్యవసాయం వారికి ప్రధాన జీవనధారం. అలాంటి గ్రామంలో ప్రభుత్వం ఓ ఏకోపాధ్యా పాఠశాలను,మరియు ఉపాధ్యాయ పోస్ట్ ను మంజూరు చేసింది. చాలా మందిఅభ్యర్డులు అది అడవి ప్రాంతామని ఆ గ్రామం వెళ్ళటానికి తిరస్కరించారు. చివరికి కొత్తగా ఉద్యోగం లోకి వచ్చిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆ పాఠశాలను కోరుకోగా ఆమెను నియమిస్తూ జాయింగ్ ఆర్డర్స్
ఇచ్చేరు.
ఆ ఆర్డర్స్ చేతికి రాగానే “తను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే తన చిరకాల కోరిక నెరవేరినందుకు “ఎంతో ఆనందం తో మురిసి పోయింది విజయలక్ష్మి.
కానీ ఆ అటవీ ప్రాంతంలో తమ కూతురు ఉద్యోగం చేయటం ఆమె తల్లి దండ్రులకు ఏ మాత్రం ఇష్టంలేదు. ఆడపిల్లవు ఒక్కదానివి ఆ అడవి ప్రాంతంలోకి ఎలా వెళ్లి ఉంటావు,? మానివేయామమని సలహా ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగం రావటం ఓ గొప్ప అదృష్టం ఎలాగో శ్రమ పడాలి.ఇంతకాలం నేను పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కింది. ఇది నేను ఎదురు చూస్తున్న కల అని మనసులో అనుకొంది విజయలక్ష్మి.
తల్లి దండ్రలకు విజయలక్ష్మి ఏకైక సంతానం.చాలా బీద కుటుంబం, రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి వృద్ధ తల్లి దండ్రులు, కూలి నాలి చేసి కూతురును కష్టపడి చదివించుకున్నారు. విజయకు చిన్నతనం నుండే చుదువు అంటే ఎంతో మక్కువ. తను బాగా చదివి నలుగురికి పాఠాలు చెప్పే టీచర్ కావాలని, తన ఆశయం ఈ రోజుకు నెరవేరినందుకు ఎంతగానో సంతోషించింది.
తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఎన్నో ఆశలు,ఆశయాలతో గుండెనిండా తృప్తితో ఆ గ్రామానికి బయలుదేరింది విజయలక్ష్మి.
కాలి బాటన నడచి సాయింత్రానికి ఆ గ్రామం చేరుకుంది. ఆమె గురించి ఎవరు ఎదురు చూడటంలేదు.? తను ఎవరో కూడా ఆ గ్రామస్టులకు తెలియదు. తనను టీచర్ గా పరిచయం చేసుకుంది. ఓహో అన్నారు, మన ఉరుకు కొత్తగా పంతులమ్మ వచ్చింది అన్నారు కానీ ఆమె అక్కడి పరిస్థితి చూసి తిరిగి వెళ్లి పోతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే కొత్తగా పాఠశాల ఏర్పాటు చేశారు కాబట్టి ఎప్పుడో బడి బిల్డింగ్ కడతారు అప్పటిదాకా పిల్లలకు బడిలేనట్లే!!
అక్కడిపరిస్థితులు చూసిన విజయలక్ష్మి మనసులోనే గట్టి నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సరే ఈ పాఠశాల అభివృద్ధి కొరకు గ్రామస్టుల సహకారంతో,నా శాయశక్తుల కృషి చేయాలి, అని గట్టిగా నిర్ణయించుకొంది.
టీచర్ గారు ఒంటరిగా తమతోనే ఈ గ్రామంలో ఉండటానికి నిర్ణయించుకోవటం పట్ల గ్రామస్టులకు టీచర్ పట్ల గౌరవ భావం పెరిగింది.
విజయలక్ష్మి ఆ ఊరి గ్రామ పెద్ద ఇంట్లో ఒక గదిలో ఉంటూ వారు పెట్టింది తింటూ తొందరలోనే వారితో కలసి మెలసి తిరగ సాగింది.
వారం రోజుల పాటు ప్రతి ఇంటికి తిరిగి గ్రామస్టులను పరిచయం చేసుకుంటూ వారితో ఇకనుండి తను ఇక్కడనే ఉంటానని పిల్లలందరికీ చదువు చెప్తానని, ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించింది. కొత్తగా వచ్చిన పంతులమ్మ కలుపు గోలుగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే పిల్లల్లో, పెద్దల్లో ఉత్సాహం మొదలైనది. ఆమెతో కలసి
తిరగటం ప్రారంభించారు.
నెమ్మదిగా వారిలో భయం పోయింది.
ఒక రోజు గ్రామపెద్ద ఇంటివద్ద సమావేశం నిర్వహించి తల్లి దండ్రులు అందరితో మాట్లాడింది. మన గ్రామానికి కొత్తగా పాఠశాల మంజూరు అయినది. పాఠశాల బిల్డింగ్ కట్టటానికి ఆలస్యం అవుతుంది. అంతవరకూ స్కూల్ నడుపు కోటానికి ఒక ఖాళీ గది కావాలి. పిల్లలందరిని రోజు అక్కడికి పంపాలి, మీరు సహకరిస్తే మీ పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది. నాకు లాగా అందరూ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు. విజ్ఞాన వంతు లౌతారు. మన గ్రామానికి అన్ని సౌకర్యాలు వస్తాయి. ఇంతకాలం లేని అవకాశం ఇప్పుడొచ్చింది. ఈ అవకాశం ఉపయోగించు కొని మీరు, మీ పిల్లలు వృద్ధిలోకి రావాలి. ఇకనుండి నేను మీతోనే ఉంటాను. మీకు నా పూర్తి సహకారం అందిస్తాను. ఒకవేళ మీరు కాదంటే నేను వెళ్ళిపోతాను. మీ పిల్లలు చదువుకు దూరమైతారు. ఆలోచించండి. అని చెప్పగానే అందరూ సంతోషంగా అంగీకరించారు. మీరు చెప్పినట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
మరుసటి రోజే ఒక పాత ఇంటిని శుభ్రం చేసి
తాత్కాలికంగా స్కూల్ నడుపుకోవటానికి ఏర్పాటు చేశారు.
గ్రామస్తులందరు తన మాటలు అర్ధం చేసుకొని సహకరిస్తున్నందుకు ఏదో పెద్ద విజయం సాధించినట్లు ఎంతగానో సంతోషించింది విజయలక్ష్మి.
అప్పటినుండి మండల కేంద్రంలో జరిగే నెల వారి విద్యా సమావేశాలకు హాజరువుతూ, పిల్లలకు క్లాస్ పుస్తకాలు, నోటు బుక్స్, పలకలు,ఇతర పాఠశాల సామాగ్రిని ఏర్పాటు చేసుకో సాగింది. ఆడపిల్ల అయినాగిరిజన గ్రామంలో ప్రజలను మంచి చేసుకొని దైర్యంగా ఉంటున్నందుకు ఎంపీడీఓ గారు మండల విద్యా శాఖాధికారి గారు ఎంతో ప్రశంచించారు.
రెండు సంవత్సరాలు గడుస్తూన్నాయి. ఒక రోజు భారీగా కురిసిన వర్షానికి గాలికి పాఠశాల గుడిసె మొత్తం కూలి పోయింది.
టీచర్ చాలా బాధపడింది. గ్రామ పెద్దలతో మరలా సమావేశం నిర్వహించిoది. విజయలక్ష్మీ మనసులో ఒక సాహసోపేతమైన ఆలోచన మెదిలింది.ఆ విషయం గ్రామస్తులకు తెలియ జేసింది. పాఠశాల బిల్డింగ్ ప్రభుత్వం మంజూరు చేయాలంటే కొంత కాలం పడుతుంది. అప్పటి వరకు పూరి పాకల్లో చెట్ల క్రింద పాఠశాల నిర్వహించుకోవాలి. ప్రతి వేసవి సెలవుల్లో గాలికి వర్షాలకు పాక కూలి పోవటం, గడ్డి ఎగిరి పోవటం తప్పనిసరిగాజరుగుతాయి. మరలా, గడ్డి, కర్రలు, సమకూర్చు కోవాలి.అందరూ శ్రమదానం చేయాలి. ఇలా చేయటం గ్రామస్తులకు ప్రతి సంవత్సరం చాలాకష్టమైన పని. అందుకు నాకొక ఆలోచన వస్తూంది. మీరు తప్పనిసరిగా అంగీకరించాలి అని గ్రామస్టులను ఒప్పించింది.
ఇటుకలు, సిమెంటు, ఇనుప రాడ్లు కొనుగోలు చేస్తాను. ఇంత కాలంగా తనకు వస్తున్న జీతం మొత్తం బ్యాంక్ లో ఉంది అమ్మానాన్నాలు పెళ్లి గురించి నీదగ్గరే డబ్బు దాచుకో అన్నారు.” డబ్బు మరలా సంపాదించు కోవచ్చు కానీ ఈ బీద విద్యార్థులకొరకు నేను ఖర్చు పెడదామునుకుంటున్నాను.చదువు అంటే నాకు ప్రాణం. ఈ మంచి పని ద్వారా జీవితాంతం నా మనసుకు ఒక మంచి పని చేసాను అనే తృప్తి మిగులుతుంది. అది చాలు నా జన్మకు. మీరెవరూ అడ్డు చెప్పవద్దు. ఇది నా మనస్పూర్తిగాచేస్తున్నపని. పాఠశాల నిర్మాణం చేయటానికి మేస్త్రిని మాట్లాడండి. దగ్గరుండి కట్టించే భాద్యత మీది.మీ సహకారం నాకు కావాలి. అని వారిని ఒప్పించిoది.
అందరూ మాట్లాడుకొని ఊరి మధ్యలో పెద్ద విశాలమైన స్థలంను సేకరించి పని ప్రారంభించారు.రేకుల షెడ్డు వేయటానికి, ఆటస్థలం, పూల తోట వేయటానికి.ఏర్పాటు జరిగింది.
నెలరోజుల్లో నాలుగు గదులతో రేకులషెడ్డు తయారైంది. గోడలకు సున్నాలు వేసి అందంగా పాఠశాలను తీర్చిదిద్దారు.
చక్కటి క్రీడాస్థలం, రంగురంగుల పూల
మొక్కలతో ఆవరణాన్ని చూడ ముచ్చటగా తయారు చేశారు. పాఠశాల చుట్టూ అందమైన కంచెను నిర్మించారు. పాఠశాల నిర్మాణంతో ఊరికే కొత్త కళ సంతరించుకుంది.
విజయలక్ష్మి టీచర్ గారి కృషిని గ్రామస్తులు అభినందించారు. ఈ వార్త ఈ నోట ఆ నోట ప్రింటూ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు చేరింది.
ఒక రోజు వారంతా ఆ
గిరిజన గ్రామానికి వచ్చి విజయలక్ష్మి టీచర్ ఆ గ్రామాభివృద్ధికి పాఠశాల నిర్మాణానికి చేస్తున్న కృషి ని చూసి చాలా గొప్పగా ప్రశoసిస్తూ టీవీ.ల్లో వార్త పత్రికల్లో వార్తలను ప్రసారం చేశారు.
మహిళాపొదుపు సంఘాల ఏర్పాటు విద్యార్థుల్లో చైతన్యం,క్రీడలు, గ్రామంలో చెట్ల పెంపకం అన్ని రంగాలందు అవగాహన కల్పిస్తూ గ్రామఅభివృద్ధిలో అగ్రభాగానా నిలుస్తున్న మహిళ ఉపాధ్యాయురాలు అని ప్రధాన శీర్షికలో ప్రచురించారు.
మొత్తం జిల్లా అంతా ఈ వార్త గుప్పు మంది.జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి గార్లు స్పందించారు. అధికారయంత్రాంగమంతా ఆ గ్రామానికి తరలి వచ్చారు. ఎంపీడీఓ. MEO. ఇతర అధికారులు ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి విజయలక్ష్మి టీచర్ కారణమని గ్రామస్తులద్వారా తెలుసుకొని ఆమెను అభినందించారు. అప్పటికప్పుడు గ్రామానికి రోడ్, కరెంటు, వైద్య సాకర్యాలు మరియు మంచి నీటి వసతుల గురించి ప్రతి పాదనలు తీసుకొని వెళ్లారు. ఆ మారుమూల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయలక్ష్మి టీచర్ నిర్మించిన పాఠశాల ప్రాంగణాన్ని జిల్లా విద్యా శాఖాధి కారి ప్రారంభోత్సవం చేయటానికి ముహూర్తం ఖరారు చేశారు.
వారం రోజుల్లో జరిగే నూతన పాఠశాల ప్ర్రారంభోత్సవానికి వస్తున్న అధికారుల కొరకు వారికి ఆహ్వానం పలుకుతూ గ్రామం అంతా పచ్చని తోరణాలతో అలంకరించారు . .స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. అనుకున్నట్లు గానే గ్రామానికి రోడ్, కరెంటు, మంచి నీటి వసతులుత్వరత్వరగానే అధికారులు ఏర్పాటు చేశారు.
ఊరంతా సందడి జిల్లా విద్యాధికారి పాఠశాలను ప్రారంభోత్సవం చేశారు. విజయలక్ష్మిని ఉత్తమ ఉపాధ్యాయిని బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు ప్రతి ఒకరు తాము పనిచేస్తున్న గ్రామంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషిచేయాలని,త్యాగగుణంతో వ్యవహరించి విద్యార్థుల జీవితాలని , తీర్చి దిద్దాలని కోరారు.
అనతి కాలంలో మాపిల్లల భవిష్యత్ తీర్చి దిద్ది, మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన విజయలక్ష్మి టీచర్ గార్కి కృతఙ్ఞతలు తెలియజేశారు గ్రామ ప్రజలు.
ఇంతటి విజయాన్ని సాధించటానికి సహకరించిన గ్రామ ప్రజలకు, జిల్లా అధికారులకు, ముఖ్యంగా ఈ విజయ గాథను ప్రపంచానికి తెలియజేసిన పాత్రికేయులకు గుండె నిండా నిండిన ఆత్మ విశ్వాసంతో కృతఙ్ఞతలు తెలియ జేసింది విజయలక్ష్మి టీచర్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!