గురు శిష్యులు

(అంశం:: “సాధించిన విజయం”)

గురు శిష్యులు 

రచన :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

రజనీకాంత్ చిన్నగా రోడ్డు దాటి ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర కూర్చున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు తన వైపు జాలిగా చూస్తున్నారు. అది తనకి నచ్చడంలేదు. నా పని నేను చేసుకుంటుంటే నా వైపు జాలిగా ఎందుకు చూస్తున్నారు.అనుకుంటూ జనాల సైకాలజీని చదవడం తనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు ఆ విషయాన్ని పక్కకు నెట్టి చిరుమందహాసం చిందించాడు. రోజూ టీ కొట్టు దగ్గరికొచ్చి న్యూస్ పేపర్స్ చదవడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం తన హాబీ.

రజనీకాంత్ అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా డిగ్రీ వరకు చదువుకున్న యువకుడు.తను హైస్కూల్ లో చదివేటప్పడు తనకిష్టమైన గురువు మునీంద్ర సార్ తనకు మంచి మార్గదర్శకుడిగా ఉంటూ తన భవితకి బాటలు వేశాడు.హైస్కూల్లో పిల్లలు రజనీకాంత్ ని కుంటి కుంటి అంటూ వెక్కిరిస్తుంటే ,టీచర్లు జాలి పడుతుంటే ఈ రెండింటినీ తట్టుకోలేక పోయేవాడు.వాళ్ళు ఎందుకు ఎగతాళి చేయడం, వీళ్ళెందుకు జాలి పడడం అనుకుంటూ రోజూ దిగులుగా ఏడుస్తూ ఉండేవాడు.అప్పుడు తనకు అన్నింటా సహాయపడే స్నేహితుడు గురు ప్రసాద్ ఏడవడం ఎందుకురా పదరా..! నువ్వంటే జాలి చూపించకుండా నిన్ను ధైర్యంగా బతకమని ఎంకరేజ్ చేసే మునీంద్ర సార్ దగ్గరకి వెళ్దాం అంటూ ఆయన దగ్గరకి తీసుకెళ్ళాడు.మునీంద్ర సార్ “ఏరా సూపర్ స్టార్ …ఏంటి విశేషాలు “అన్నాడు.రజనీ”సార్ ఊరికే వచ్చాం సార్.కనిపించి వెళ్దామని “అన్నాడు. గురుప్రసాద్ అందుకొని కాదు సార్ వీడికి మెంటలెక్కింది జాలిపడ్డా ఏడుస్తున్నాడు,ఎగతాళి చేసినా ఏడుస్తున్నాడు అనడంతో రజనీ మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు.మునీంద్ర సార్ “ఒరేయ్ గురూ..నీకు వాడి బాధ అర్థం కాదు గానీ కూర్చోండి మాట్లాడుకుందాం” అంటూ రజనీ కళ్ళలోకి చూస్తూ నీ కంట్లో ఇంకొక్క కన్నీటి చుక్క కూడా నేను చూడకూడదు రా అన్నాడు.ఆ కన్నీరు తల్లిదండ్రులకోసమో గొప్పవాళ్ళకోసమో వృథా చేయాలి కానీ ఇలా లోకులైన కాకుల కోసం కాదు అనడంతో రజనీ కళ్ళు తుడుచుకొని అలాగే చూస్తున్నాడు.మునీంద్ర “రజనీ.!నీ అంగవైకల్యం విధిరాత అంతే.ఎవరో ఎగతాళి చేస్తున్నారు. జాలిపడుతున్నారని ఫీల్ అవకు.నీ అంగవైకల్యం దేనికీ అడ్డు కాదు.నీకే అవసరం వచ్చినా తోడుగా నేనుంటా.నీ పక్కన నేనున్నాననే ధైర్యంతో ముందుకెళ్ళు.అసలు నన్నడిగితే “తాగుబోతుల్ని, సోమరిపోతుల్ని ,నిజాయితీ పరుల్ని, కళాకారుల్ని ,శాస్త్రవేత్తల్ని ఈ సమాజం నీకంటే ఎక్కువగా వెక్కరిస్తుంది,వెనక్కి లాగేస్తుంది. “గుర్తుపెట్టుకో నువ్వు కాళ్ళు లేనివాడవని అవకాశాలు రాకుండా పోవు నీ తెలివికే పట్టం కడతారని గుర్తుపెట్టుకో “అంటూ రజనీ బుర్రకి పాపారాయుడు తీర్పులో జ్ఞానోదయం కలిగినట్లయింది.సార్ జనాలు ఎవరు ఎలా ఉంటారో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థంకావట్లేదు సార్ అందుకే లోలోపలే కృంగిపోతున్నానంటూ రజనీ తన బాధను వెలిబుచ్చాడు.దానికి మునీంద్ర”నీకు కొన్ని సైకాలజీ బుక్స్ ఇస్తా చదువుకో మానవ నైజం తెలుస్తుంది.ఇంటరయ్యాక డిగ్రీలో సైకాలజీ స్పెషలైజేషన్ చేసుకో అంటూ సలహా ఇచ్చాడు.ఆ సలహా మైండ్లో నాటుకుపోయింది రజనీ కి.ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ప్రయత్నంలో భాగంగానే టీకొట్టునే కరెంట్ అఫైర్స్ క్లాసుగా మలచుకున్నాడు.

న్యూస్ పేపర్లో మునిగిపోయి టీ తాగుతూ ఉన్న రజనీ భుజంపై ఎవరో చెయ్యి వేశారు.రజనీ ఎవడ్రా అది అని చూడగా బాల్య స్నేహితుడు గురుప్రసాద్.ఒరేయ్ గురూ ఏ కాలేజ్ రా అన్నాడు.నేను ఇంజనీరింగ్ ఫైనలియర్ రా ఇప్పుడు మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు నేను సలహా కోసం మన మునీంద్ర సార్ దగ్గరికెళ్ళి వస్తున్నా అన్నాడు.అవునా సార్ నాకు అప్పుడప్పుడూ కాల్ చేసి మాట్లాడుతాడురా ఆయన వల్లే డిగ్రీ పూర్తయింది అంటూ సార్ మీద ఉన్న అభిమానాన్ని కళ్ళతో చూపించాడు.గురుప్రసాద్ “సార్ టీకొట్టు దగ్గరే ఉండు వస్తానని చెప్పారు రా ,వస్తూ ఉంటారు “అంటుండగానే మునీంద్ర వచ్చాడు “ఏవండీ సైకాలజీ సూపర్ స్టార్ గారూ బాగున్నారా “అనడంతో రజనీ సార్ దగ్గరకెళ్ళి సార్ మీరలా అనకండి సార్ అంటూ గట్టిగా పట్టుకొని ఆనంద భాష్పాలు రాల్చాడు గమనించిన మునీంద్ర దేనికి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నానన్నావ్ మరి టీ కొట్టులో ఏంపనిరా నీకు అన్నాడు.సార్ కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్ చదవడానికి వస్తున్నా అన్నాడు.సరే మంచి ఆలోచనే .నీకు గొప్పగా ఆలోచించే మనసు,ఏదైనా చేసేయగల ధైర్యం వచ్చేసింది కాబట్టి నువ్వు సివిల్స్ కి ఎందుకు ప్రిపేర్ కాకూడదు ఆలోచించు.సివిల్స్ కి ప్రిపేర్ అవ్వు బుక్స్ సంగతి నాకొదిలెయ్,నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో అంటూ వెన్నుతట్టి మునీంద్ర వెళ్ళిపోయాడు.

రజనీ ఆలోచనలో పడ్డాడు సివిల్స్ అంటే ఎంత కష్టం ఎన్నో కోచింగ్ లు తీసుకొని సాధిస్తున్నారు.నాకు సాధ్యమేనా మునీంద్ర సార్ చెప్పాడంటే నాకు మంచే జరుగుతుంది నా మీద నాకు నమ్మకం ఉంది అనుకుంటూ సివిల్స్ బుక్స్ ను ఆరు నెలల్లో నమిలేశాడు.ఇంతలో నోటిఫికేషన్ పడింది.అప్లై చేశాక టెన్షన్ మొదలయింది.సిలబస్ కొంచెం మారింది.కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.మునీంద్ర సార్ నా కంటిలో నీటి చుక్క రాకూడదన్నాడు.గుండె దిటువు చేసుకొని కొత్త సిలబస్ ప్రకారం చదవగలను అని పది సార్లు అనుకున్నాడు. మునీంద్ర సార్ కి ఫోన్ చేసి సలహాలు తీసుకొని మరలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు.ఎగ్జామ్ బాగా రాశాను,ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది అనుకుంటూ తృప్తిగా బయటికొచ్చి అమ్మా నాన్నలకు చెప్పాడు.అమ్మా..!మునీంద్ర సార్ సలహాల వల్ల చిన్నప్పుడు కన్నీటి చుక్క విలువ చెప్పిన ఆయన కిచ్చిన మాటకోసం ఈనాడు నేను కంట నీరు కార్చకుండా ఒక కలెక్టర్ అవుతాననే నమ్మకమొచ్చిందమ్మా.మీరు అవిటివాడని నన్ను గెంటేయలేదు.నన్ను పువ్వులాగా పెంచారు. మునీంద్రసార్ నా గుండెల ధైర్యం నింపి సరైన
దారిలో నడిపించాడు.ఆ దైవం నాకు మీలాంటి పూజ్యులను అండగా పంపాడు.అందుకే తల్లి దండ్రి గురువు దైవం ఈ నలుగురు ఎవరి జీవితానికైనా మూలస్తంభాలని గ్రహించాను.నేనూ పది మందికి అండగా నిలబడతాను అంటూ తల్లిదండ్రుల కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకొని గర్వంతో తలయెత్తాడు. ఫలితాలు రానే వచ్చాయి.తన నమ్మకం వమ్ము కాలేదు.అనుకున్నట్లుగానే కలెక్టర్ అయిన తర్వాత మునీంద్ర సార్ స్కూల్ కి వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేసి తర్వాత తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాడు.మనో ధైర్యమనే మందుంటే ఏదైనా సాధించవచ్చని తను సాధించిన విజయాన్ని గురువుకు అంకితమిచ్చాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!