నేటి ఇల్లాలి దైర్యం.

(అంశం:: “సాధించిన విజయం”)

నేటి ఇల్లాలి దైర్యం

రచన :: విన్నకోట శ్రీదేవి

ఉగ్రవాదం గురించి పేపర్లలో చదవడము. టీవీల్లోచూడ్డం తప్ప నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఎందుకంటే నేను ఒక అతి  మామూలు  గృహిణి నీ కాబట్టి నా పని ఏదో నేను చేసుకుంటూ చుట్టుపక్కల ఉండే నలుగురికి తలలో నాలుకలా మెలుగుతూ నాకు చేతనైన సాయం చేస్తూ గడపడం నా దినచర్య.

మీకు నా పేరు చెప్పలేదు కదూ నా పేరు జనని.ఎవరికి పుట్టానో, ఎలా పెరిగానో, తెలియని నాకు ఆశ్రయం ఇచ్చి, నన్ను అక్కున చేర్చుకుని, ఉన్నత విద్యావంతురాలు గా తీర్చిదిద్దిన అనాధాశ్రమం పేరే శ్రీ మాత జనని అనాధ ఆశ్రమం. ఆ ఆశ్రమం పేరునే నా పేరుగా మార్చుకున్నాను.  అక్కడి అనాధల మొహంలో చిరునవ్వు నై  వారి కంటికి వెలుగై ఎప్పటికీ అక్కడే వారితో పాటు ఉండాలనేది నా కోరిక.

కానీ ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన నేను ఎంతో ఆప్యాయంగా తాతయ్య అని పిలిచే నారాయణ స్వామి గారు నా కోరికనీ నా  ఆశయాన్ని ఒప్పుకోలేదు. చూడమ్మా జననీ. నువ్వు చిన్నప్పటినుంచి అనాధ వి. నువ్వు ఎప్పటికీ అనాధగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అనొచ్చు తాతయ్య ఈ అనాధలు అందరూ నా వాళ్ళే కదా అని. అవునమ్మా అందరూ నీ వాళ్లే కాదని నేను అనను. కానీ ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ సొంత జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పిల్లాపాపలతో హాయిగా ఉంటూ
ఈ ఆశ్రమానికి తగిన సాయం చేస్తూ ఉండాలని. ఇప్పుడు కాకపోయినా చివరి రోజుల్లో అయినా నేను అనాధగా మిగిలిపోయాను అనే బాధ నీకు ఎప్పటికీ ఉండకూడదనేదే నా ప్రయత్నం తల్లి. అని ఆయన అనడంతో ఆయన మాట కాదనలేక నేను ఒకరికి ఇల్లాలిని అయ్యాను. ఒక బాబుకి తల్లిని కూడా అయ్యాను. కానీ నాకు మరో జన్మ నిచ్చిన జననిఅనాధ ఆశ్రమాన్ని మాత్రం నేను కలలో కూడా మరిచిపోలేదు. నా ప్రాణం పోయినా మరచిపోను. నేను నా భర్త సంపాదించిన దాంట్లో మా అవసరాలకు మాత్రమే ఉంచుకుని మిగిలింది  అనాధ ఆశ్రమానికి  నా వంతుగా సహాయ పడుతున్నాను

రోజులాగే వంట చేసుకుని బాబు ని స్కూల్ కి పంపించి ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. బయట ఏవో మాటలు వినబడడం తో చేతిలో ఉన్న పనిని పక్కనపెట్టి బయటికి వచ్చాను. ఇద్దరు వ్యక్తులు బయట నిలబడి ఉన్నారు. ఎం కావాలి చెప్పండి అన్నాను.

మాకు ఇల్లు అద్దెకి కావాలి మేడం. రెండు గదులు అయితే చాలు. అద్దె ఎంతైనా పర్వాలేదు. అన్నారు.
నేను చిరునవ్వుతో తప్పకుండా అండి. కానీ ఇల్లు మాది కాదు మేము కూడా అద్దెకు ఉన్నాము ఉండండి ఇంటి ఓనర్  ని పిలుస్తాను అంటూ అని పిలవడానికి వెనక్కి వచ్చాను. కానీ నాకెందుకో వారి చూపులు అనుమానాస్పదంగా అనిపించాయి. ఏదో కీడు జరగబోతుంది అని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది.
వద్దు అని చెప్పి వాళ్ళని పంపించమని నా మనసు చెప్తోంది. కానీ నా అనుమానం తీరాలంటే వాళ్ళిక్కడ ఉండితీరాలి కదా. అందుకే ఇంటి ఓనరు పిన్ని గారిని పిలుచుకు వచ్చాను. ఆమెకు నేనంటే చాలా ఇష్టం.
ఏమిటే  అమ్మాయి  పిలుస్తున్నావు అంటూ వచ్చింది.
ఇల్లు కావాలంట పిన్ని గారు మాట్లాడండి  అన్నాను.
ఆవిడ కొంచెం చాదస్తపు మనిషి. వాళ్లను ముప్పుతిప్పలు పెట్టి . మూడు చెరువుల నీళ్ళు తాగించి ఆమెకి కావాల్సిన వివరాలన్నీ  వచ్చాక  అప్పుడు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంది. వేరేఏమి ఆలోచించకుండా కనీసం ఇల్లు కూడా చూడకుండా ఆవిడ అడిగిన మూడు నెలల అడ్వాన్స్ తీసి ఆమె చేతిలో పెట్టారు వాళ్ళు. రేపు మా సామాన్లు తీసుకొని వచ్చేస్తాము థాంక్స్ అండి అని ఇద్దరికి ఒక్కసారే చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు.
నేను కాసేపు పిన్ని గారితో మాట్లాడి లోపలికి వచ్చాను.

మర్నాడు ఉదయమే సామాన్ల తో దిగిపోయారు వాళ్ళు. చాలా సామాన్లు ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్ద అట్టపెట్టెల తో ప్యాక్ చేసి ఉన్నాయి.
నేను చిరునవ్వుతో మంచినీళ్లు అవి ఏమైనా అవసరమైతే అడగండి.నేను లోపల ఉంటాను.అంటూ లోపలికి వచ్చేసాను. కానీ ఆ కొత్త వాళ్ళ మీద ఒక కన్ను వేసే ఉంచాను. మా ఇంట్లోంచి  వారి గది కిటికీకనిపిస్తుంది. కిటికీ తలుపులు తీసి ఉంటే లోపల పూర్తిగా ఏం జరుగుతుందో కనిపిస్తోంది. కానీ ఇప్పుడు  వారి కిటికీ తలుపులు మూసి ఉండడంవల్ల ఏమి చూడలేకపోయాను. అంత నా బ్యాడ్ లక్ అనిపించింది నాకు. అలా రెండు రోజులు గడిచాయి యాంత్రికంగా.
నాకసలు వాళ్ళు బయటికి రావడమే కనబడలేదు అ రెండు రోజులును బహుశా నేను ఆశ్రమం కి వెళ్లి నప్పుడుగాని  బయటికి వస్తున్నారెమో నాకు తెలీదు. ఆ రోజు ఉదయం కావాలని పనిగట్టుకుని వారి ఇంటి తలుపు తట్టాను.ఒక రెండు నిమిషాల తర్వాత ఒకతను తలుపు తీశాడు. చెప్పండి అన్నాడు. అతని ముఖంలో  విసుగు సృష్టంగా కనిపిస్తోంది.కానీ ముఖానికి నవ్వునీ పులుముకుంటూ అడిగాడు. అది ఏంటో నాకు ఎవరైనా నటిస్తుంటే ఈజీగా తెలిసిపోతుంది.

అహ ఏం లేదండి. పైపు వస్తుంది. మంచినీళ్లు ఏమైనా పట్టుకుంటారు ఏమోనని  అడగడానికి వచ్చాను అని అన్నాను. పర్లేదు లేండి మేం మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటాం. మీరు వెళ్ళవచ్చు. అన్నాడతను నిర్లక్ష్యంగా. నాకెందుకో అతని బిహేవియర్ నచ్చలేదు.

వారి వైఖరి నాకెందుకో తేడాగా అనిపిస్తోంది. వారి వల్ల ఏదో కీడు జరగబోతుందని నా మనసు నాకు చెప్తుంది కానీ ఏం జరుగబోతుందో నాకు అర్థం కావడం లేదు.
పైన పిన్నిగారికి చెప్పాలి అనుకున్నాను. కానీ ఒకవేళ ఏమి లేకపోయినా అనవసరంగా కంగారు పడి పోతూ ఉంటారు ఆవిడ. అందుకే ఏమీ చెప్పలేదు.

నేను ఆరోజు ఆశ్రమానికి వెళ్లడం మానేసి మా ఇంటి కిటికీలో నుంచి వారి ఇంటి తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా ఎదురు చూస్తూ. వారి ఇంటినే అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను. సమయం గడుస్తుంది గాని  వాళ్ళూ బయటికి రావడం లేదు. ఎప్పటికో రెండు గంటల తర్వాత నా నిరీక్షణ ఫలించింది. వాళ్ళు బయటికి వచ్చి రూమ్ కి తాళం వేసి భోజనానికి వెళ్లారు అనుకుంటా. వాళ్ళు అలా వెళ్ళగానే వారి ఇంటి ముందు వెళ్ళాను. ఏమీ అనుమానాస్పదంగా లేదు కానీ మనసు మాత్రం ఏదో కీడు శంకిస్తోంది. వాళ్ళు వేసిన తాళం
పిన్ని గారు ఇచ్చినదే వుంది. నాకు ఐడియా ఫ్లాష్ లా వెలిగింది. పిన్ని గారి దగ్గర అన్నీ  రెండేసి తాళం చెవులుఉంటాయి. వాళ్లకి ఒకటే ఇచ్చి ఉంటారు కదా.
మరి పిన్ని గారి దగ్గర ఇంకోటి ఉంటుంది. ఆవిడ తాళాలు ఎక్కడ తగిలిస్తారో నాకు బాగా తెలుసు.
నేను వెంటనే పైకి పరిగెత్తాను.

పిన్ని గారు  టీవీ చూస్తున్నారు. ఏం కావాలి జనని అని అడిగారు. ఏం లేదు పిన్ని గారు. ఇంటి తాళం ఎక్కడ పడేసానో గుర్తు రావడంలేదు . ఒకసారి మీ తాళాలు ఇవ్వండి. వాటితో ఏమైనా వస్తుందేమో చూస్తా అన్నాను. సరే అక్కడ మేకు కి తగిలించి ఉన్నాయి తీసుకెళ్ళు అమ్మ అన్నారు ఆవిడ.
నేను తాళాలు తీసుకుని ఎంత ఫాస్ట్ గా పైకి ఎక్కానో అంత ఫాస్ట్ గా కిందికి దిగి వచ్చేసా. మళ్లీ వాళ్ళు వచ్చేస్తారేమో అనే కంగారుతో వారి ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళాను.
లోపల చాలా అట్టపెట్టెలు ప్యాక్ చేసి ఉన్నాయి. ఒక అట్టపెట్టి విప్పి చూడటానికి ప్రయత్నించాను. నా వల్ల కాలేదు.   ఒక అట్ట పెట్టెను తీసి బయట పెట్టి మామూలుగా తాళం వేశా. ఆ పెట్టే ను  మా  ఇంట్లో మంచం కింద పెట్టాను. పిన్ని గారి దగ్గరికి వెళ్లి వాళ్ల రూమ్ కి సంబంధించిన తాళం మాత్రం నా దగ్గర ఉంచుకునీ  మిగిలినవి ఇచ్చేసి వచ్చాను. మా ఇంటి తలుపులు వేసుకుని  బాగా పదునుగా ఉన్న చాకుతీసుకొచ్చి ఆ పెట్టెను తెరవడానికి ప్రయత్నించాను. ఒక ఐదు నిమిషాలు శ్రమపడిన తర్వాత తెరవ గలిగాను. ఆ పెట్టె నిండా చిన్నచిన్న తుపాకులు ఇంకా నాకు అర్థం కాని తెలియని సామాను ఏవో ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని మాత్రం అర్థమైంది. వీళ్ళు ఉగ్రవాదులో టెర్రరిస్ట్ లో అయి ఉంటారు. త్వరలో రిపబ్లిక్ డే రా రాబోతుంది. అప్పుడు ఇక్కడ ఏమైనా అరాచకాలు సృష్టించాలని వారి ఆలోచన ఏమో అని నాకు బలంగా అనిపిస్తుంది

కానీ నాకు ఒక కోరిక అయితే బలంగా ఉంది. నన్ను నా వాళ్ళని నా ఉరుని  కాపాడుకోవాలని ఏం చేయాలా అని ఆలోచించాను. ఇంతలో వాళ్ళు బయటనుంచి  వచ్చి. లోపలికి వెళ్ళి యధావిధిగా తలుపులు వేసుకున్నారు. ఇది చిన్న సమస్య కాదు మామూలు గా పోలీసులు చెప్తే ఉపయోగం లేదు. వాళ్ళు గాని తప్పించుకుంటే చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు.
నాలో నేను ఇలా ఆలోచించుకుంటే కాలం గడిచి పోతుంది తప్ప ఉపయోగం ఉండదు నా భర్తకి ఫోన్ చేయాలనుకున్నాను. కానీ మళ్లీ అందులో ఏదైనా అనుకోనిప్రమాదం  జరిగితే నా బిడ్డ నాలా  ఆనాధగా మిగిలి పోకూడదు అమ్మ నాన్నో వాడికి తోడుగా ఉండాలి. ఇలా ఆలోచించుకుంటూ నాలో నేనే సతమతమై పోతున్నాను. ఇంతలో హఠాత్తుగా నాకు
ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి కాసేపు గడిపి వెళ్లే ఎస్.పి మేడం . రాజనందిని గుర్తొచ్చారు. ఆవిడ చాలా ధైర్యవంతురాలు. చాలా మంది అవినీతిపరుల్ని మోసగాళ్ళని ఎదుర్కొన్నారు. చాలా నిజాయితీ గా ముక్కు సూటిగా ఉండే నిక్కచ్చి మనిషి. ఆవిడ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు. ఎలాంటి మంచి విషయాల్లో నైనా అందరికీ సహకరించే వ్యక్తి. ఆవిడ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. నా ఫోన్ తీసుకొచ్చి ఆమె కి కాల్  చేసాను. రెండు మూడు సార్లు చేసినా బిజీ బిజీ అని వస్తుంది నాకు టెన్షన్ తోచెమటలు పట్టేస్తున్నాయి.
మళ్లీ మరోసారి చేద్దాం లేదా డైరెక్ట్ గా వెళ్లి కలుద్దాం అనుకొని ఆఖరి సారి చేశాను ఫోన్. రింగ్ అవుతుంది.
అవతల మేడం ఫోన్ ఎత్తారు. ఎవరు మాట్లాడేది చెప్పండి. ఐ యాం రాజనందిని  అంటున్నారు.
నా గొంతు తడబడి పడిపోతోంది. ఎలాగో తేరుకుని  నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి మేడం అన్నాను. తప్పకుండా  కలవండి ఇంతకీ మీరు ఎవరు నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు.
నేను కలిసిన తర్వాత మీకు మొత్తం విషయం అంతా చెప్తాను మేడం అన్నాను సరే నేను ఆఫీస్ లోనే ఉన్నాను. నన్ను కలవాలి అనుకుంటే మీరు రావచ్చు. లేదా మీరు ఏదైనా ప్రాబ్లం లో  ఉంటే మీరు ఉన్నచోటు చెప్పండి నేను వస్తాను. అన్నారు.

నేను త్వరత్వరగా మా ఇంటి అడ్రస్ చెప్పాను.
అరగంటలో మీ ఇంటి దగ్గర ఉంటాము కంగారు పడకండి  మీ ప్రాబ్లం ఏదైనా సరే సాల్వ్ చేస్తాను డోంట్ వర్రీ అని చెప్పి ఫోన్ పెట్టేసారు.

అన్నట్టుగానే అరగంటలో మా ఇంటి ముందు ఉన్నారు.
నేను వారి వ్యానుకి  ఎదురు వెళ్లి వారిని హడావిడి చేయొద్దని సైలెంట్ గా ఇంట్లోకి రమ్మని లోపలికి తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళాక నాకు  అనిపించిన కనిపించిన ప్రతి విషయం వివరంగా చెప్పాను. చెప్పి
నేను వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చినట్టు అట్టపెట్టి తీసి ఆమె ముందు పెట్టాను. ఒక్క క్షణం ఆమె కళ్ళుఆశ్చర్యంతో  పెద్దవి అయ్యాయి. తన ఫోన్ తీసుకునీ వెంటవెంటనే తన హయ్యర్ ఆఫీసర్స్ కి సమాచారం ఇచ్చింది.  వారు ఉంటున్న ఇంటి చుట్టూ  ఒక రౌండ్ వేసి వచ్చింది. మరో అరగంటలో వరసగా పది పోలీసు జీపులు. చాలా సైలెంట్ గా వచ్చి మా ఇంటి ముందు ఆగాయి. బిలబిలమంటూ పోలీసులు గన్స్ తో ఆ ఇంటిని  చాలా నిశ్శబ్దంగా చుట్టుముట్టారు.
రాజనందిని మేడం. చూడండి జనని మీరు వెళ్లి వాళ్ళ ఇంటి తలుపు కొట్టండి. మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి వారు మనకి ప్రాణాలతో కావాలి వాళ్ల వల్ల ఎంతోమంది సంఘ విద్రోహుల జాడ తెలుస్తుంది మేము వెనకనుంచి వచ్చి దాడి చేస్తాము ఎలాంటి పేలుళ్ళు
ఏమి గొడవ జరగకుండా వాళ్లని ఇక్కడినుంచి తీసుకెళ్లాలి. జనానికి ఈ విషయం తెలిస్తే భయస్తులు అవుతారు. అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పారు నాకు. మనసులో భయంగా అనిపిస్తున్నా నా దేశం కోసం నేను చేయబోయే సహాయం ఇది. ఇందులో భయానికి తావుండకూడదు అని నా మనసుకి ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి తలుపు కొట్టాను.  ఒక్క నిమిషం.రెండు. మూడవ నిమిషం మొదలయ్యాక తలుపులు తెరుచుకున్నాయి
ఏంటి. చాలా విపరీతమైన నిర్లక్ష్యం అతని గొంతులో
ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నారు మీ పని మీరు చేసుకోవచ్చు కదా. అంటూ తలుపులు మూసెయ్యబోయాడు. ఇంతలో కళ్ళు మూసి తెరిచే అంతలో పోలీసులు వారిని చుట్టుముట్టడం తమ అదుపులోకి తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి
వారికి ప్రతిఘటించడానికి కూడా అవకాశం దొరకలేదు.
వారికి దొరికిపోయాము అని తెలిసి మరి ఏం చేయాలో తెలియక. ఆఖరి మార్గంగా సైనెడ్ తో చావుని ఎంచుకో బోయారు. వారి ఊహను  ముందే పసిగట్టిన రాజనందిని మేడం  వారు అనుకున్న పనిని చెయ్యనివ్వలేదు.వారి  చేతులను వెనక్కి విరిచి కట్టి  వారిని ఈడ్చుకుంటూ
తీసుకెళ్లి పోలీస్ జీప్ లో పడేసారు.  ఆక్కడున్న అట్టపెట్టె లని వారి సామాన్లనీ ఏమీ వదలకుండా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అప్పుడు మళ్ళీ మొదలైంది నా ఊపిరి తిరిగి కొట్టుకోవడం.  యూ ఆర్ వెరీ వెరీ గ్రేట్ జనని మాతృభూమి రుణాన్ని తీర్చుకున్నావు. నువ్వే కనుక ఏమి పట్టించుకోకపోయి ఉండి ఉంటే ఎంత అనర్థం జరిగేదో. ఈరోజు ఇలా మాట్లాడుకోవడానికి మనం మిగిలి ఉండే వాళ్ళమో లేదో అంటూ నన్ను పొగుడుతూనే  ఉన్నారు. ఆమె పొగడ్తలు వింటుంటే నాకు సిగ్గుగా అనిపించింది. కానీ నా మనసులో గర్వం గానే ఉంది
తర్వాత ఒక్కసారి స్టేషన్ కి రా జనని. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి పూర్తి చేస్తే సరిపోతుంది. ఆడవాళ్ళు అందరూ ఇలా నీలా ధైర్యంగా ఉండాలిఅంటూ రాజనందిని మేడం వెళ్ళిపోయారు.  పైనుంచి భయంభయంగా చూస్తున్న పిన్ని గారి దగ్గరికి వెళ్లాను.
భయపడాల్సింది ఏమీ లేదని ఆవిడకు నచ్చచెప్పి ఆమె భయాన్ని పోగొట్టి కిందికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనేదో సాధించాను అన్న తృప్తి తో నా మొహం వెలిగిపోతోంది. ఆ వెలుక్కి  కారణం నా దేశాన్ని ప్రమాదం నుంచి రక్షించ గలిగానని
ఆ దేశ ద్రోహుల కు శిక్ష పడుతుందని. వారి ద్వారా మరి కొందరి  ఆచూకీ లభిస్తుందని.  ఇంకా మరెన్నో కారణాలు. నా సంతోషానికి. ఇది ఒక మహిళ సహకారంతో నేను సాధించిన విజయం అని అనుకుంటూ ఆనందిస్తూ ఇవన్నీ పక్కన పెట్టేసి స్కూల్ నుంచి వచ్చే నా బాబు కోసం మంచి  టిఫిన్  తయారు చెయ్యడానికి  ఇంట్లోకి నడిచాను. అన్నిటికంటే ముందు నేను తల్లిని. అచ్చు మన దేశ మాత లా అన్నమాట.
ఒక 5 సంవత్సరాల తర్వాత ఓ ఫైన్ మార్నింగ్ మా వారు ఆఫీస్ కి నా కొడుకు స్కూల్ కి రెడీ అయ్యే వేళ మా వారికి పొద్దున్నే న్యూస్ చూడడం అలవాటు. అలా వార్తలు చూస్తుంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఓ మంచి వార్త నేను పట్టించిన టెర్రరిస్టులకి మరణశిక్ష విధించబడింది  అనే న్యూస్ వినగానే నాకు ఒక్కటే అనిపించింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు కాకపోయినా మరికొన్ని రోజుల కైనా శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అనుభవించాల్సిన శిక్షను అప్పుడు లెక్క రాస్తూనే ఉంటాడు. దాన్నుంచి ఎలాంటివారైనా తప్పించుకోలేరు. ఇలాంటి  ముష్కరులు అసలు తప్పించుకోలేరు. అనుకుంటూ చిరునవ్వుతో మా వారి వంక చూశాను. ఆయన మొహంలో కూడా సంతోషం ఎందుకంటే వాళ్ళు విడుదల అయితే ఎప్పటికైనా మా కుటుంబానికి ప్రమాదమే అని ఆయన మనసులో భయం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆయన మొహం లో చిరునవ్వును చూస్తే ఇక మనకి  ఎలాంటి భయం లేదు మనం క్షేమమే అనే సంతోషం ఆయన మొహం లో కనిపిస్తుంది. నిజం చెప్పొద్దు నాకు కూడా మనసులో ఆనందంగా ఒకపక్క గర్వంగా కూడా ఉంది.ఎందుకంటే నేను కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాను, అనే గర్వం తప్పకుండా  ఉండాల్సిందే కదా, మరి నేను సాధించిన విజయం గురించి విన్న మీరేమంటారు ఫ్రెండ్స్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!