ఆత్మీయ కౌగిలి

(అంశం:: “సాధించిన విజయం”)

ఆత్మీయ కౌగిలి

రచన :: కమల ముక్కు (కమల’శ్రీ’)

తన ఛాంబర్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు భార్గవ్. అతని కళ్లముందు ఉదయం జరిగినదే కదలాడుతుంది.

“మాకేం కోట్లు అవసరం లేదు డాడీ.మీరు కావాలి మాకు,మీతో సరదాగా గడపడం కావాలి. ఫైనల్లీ మీ టైం కావాలి మాకు.ఎట్ లీస్ట్ ఒన్స్ ఏ వీక్ అయినా.” అంటున్న అభీజ్ఞ మాటలే చెవుల్లో మారు మ్రోగుతున్నాయి.

అలా అంటున్నప్పుడు ఆమె కళ్లల్లో కదలాడిన కన్నీటి చెమ్మ భార్గవ్ గుండెని కదిలించి వేసింది.

ఎకరం పొలం మీద వచ్చిన పంటతోనే తనని, ఇద్దరు ఆడపిల్లల చదువూ, తిండీ అన్నీ తండ్రి ధర్మయ్య కష్టాన్ని కళ్లార చూసిన భార్గవ్ చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకున్నాడు.

పదో తరగతి డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. ఇంటర్ చదువుతున్నప్పుడు గుండెలో నొప్పి గా ఉందని తండ్రి ని హాస్పిటల్ కి తీసుకుని వెళితే హార్ట్ ఎటాక్ అనీ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో ఆ రోజుల్లో ఓ యాభై వేలకోసం తల్లి పదిమంది ని అడిగితే వారు కావాలనే ముఖం చాటేయడం భార్గవ్ ని చాలా బాధపెట్టింది.

డబ్బులు ఎలాగోలా కుదుర్చుకుని హాస్పిటల్ లో కట్టేలోపు తండ్రి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. చుట్టాలూ, పగ్గాలూ చాలా మందే ఉన్నా అవసరానికి ఎవరూ అక్కరకు రాకపోవడంతో ధర్మయ్య చనిపోయాడు. ఆనాడే నిర్ణయం తీసుకున్నాడు భార్గవ్ ఇక ఎప్పుడూ డబ్బులికి వెతుక్కునే పరిస్థితి రాకూడదని.

అప్పటి నుంచి కష్టపడి చదువుకోవడమే కాక పొద్దున్న లేవగానే పేపర్ వేయడం, సాయంత్రం తన కంటే చిన్న వారికి ట్యూషన్ లు చెప్పడం చేసేవాడు. తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ పూట కాలేజ్ కి వెళ్లి మధ్యాహ్నం పూట ఓ చిన్న షాప్ లో గుమాస్తా గా చేరాడు. ఇలా దొరికిన పనులన్నీ చేస్తూ తన డిగ్రీ ముగించాడు.

ఆ తర్వాత ఓ చిన్న కంపెనీలో సేల్స్ మెన్ గా ఉద్యోగం సంపాదించడం తో వెన్నీళ్లకు చన్నీళ్లలా పంట కి అతని చిరు సంపాదన తోడవ్వడం తో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది తల్లి సీతమ్మ. అంతా చక్కగా సాగుతుంది అనుకునే సమయం లో సీతమ్మ కి సుస్తి చేయడం తో డాక్టర్ కి చూపించారు. ఆమెకి కాన్సర్ అని తేలడం మందుల కోసం చాలా ఖర్చు చేయాల్సి రావడం భార్గవ్ కుటుంబాన్ని మళ్ళీ కష్టాల్లోకి నెట్టింది.

ఎప్పటి నుంచో ఆమెకి ఒంట్లో నలతగా ఉన్నా ఇంటి ఆర్ధిక పరిస్థితి తెలిసిన సీతమ్మ చాలా రోజుల వరకూ విషయం కొడుక్కి చెప్పనే లేదు. ఆ విషయమే అన్నారు డాక్టర్లు ఈమె చాలా రోజుల నుంచి అనారోగ్యానికి గురౌతున్నా మీకు చెప్పనేలేదు అని.

అప్పుడప్పుడే కుటుంబంలో భాదలు తీరుతున్నాయి అనుకునేంతలో తల్లికి కేన్సర్ అని తెలియడం భార్గవ్ కి తీరని వేదనే. తల్లి ని హాస్పిటల్ కి తిప్పడానికి తన దగ్గర దాచిన డబ్బులే కాక ఉన్న ఎకరం పొలము కూడా హారతి కర్పూరం అయిపోయింది. తెలిసిన వారందరి దగ్గరా అప్పులు చేశాడు. కానీ తల్లి కూడా చివరకు దక్కలేదు. ఆనాడు తండ్రి చావుకీ, ఈనాడు తల్లి చావుకీ కారణం డబ్బులేకపోవడమే.

ఇక అప్పటి నుంచీ అవిశ్రాంతం గా పనిచేస్తూ ఇప్పుడు ఓ పెద్ద కంపెనీలో పెద్ద హోదాలో ఉన్నాడు. ఈ క్రమం లో పెళ్లి, ఓ పాప అభిజ్ఞ పుట్టడం ఆమెకి పద్దెనిమిదేళ్లు రావడం జరిగిపోయింది.

కూతురు ఏదీ అడగకముందే ఆమె ముందు ఉంచేవాడు.అందరిలోనూ తన కూతురు గొప్పగా ఉండాలని అతని కోరిక. కూతురికి ఓ సొంత కారు కొనిచ్చాడు. రెండు రోజుల్లో అభిజ్ఞ పుట్టిన రోజు ఉంది. దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయమని తన పీఏ కి చెప్తుండటం విన్న అభిజ్ఞ, “డాడీ నా బర్త్ డే కి ఏ పార్టీ వద్దు.” అని తెగేసి చెప్పింది.

ఆ మాటలు పట్టించుకోకుండా పీ ఏ తో ఎవరెవర్ని ఇన్ వైట్ చేయాలి, ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ ఉండాలి అని చెప్పుకుపోతుంటే కోపం వచ్చిన అభిజ్ఞ టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ని కింద పడేసింది.

దాంతో ఆమె వైపు కోపం గా చూస్తూ “ఏంటీ అభీ ఇది. నీ బర్త్ డే పార్టీ కోసం నేను ఏర్పాట్లు చేస్తుంటే మధ్యలో ఏంటి నీ డిస్టర్బెన్స్” అన్నాడు చిరాగ్గా.

“ఎందుకు డాడీ ఈ ఏర్పాట్లు అన్నీ, ఎవరి కోసం?.” అంది భాదగా.

“వింటున్నావు గా నీ బర్త్ డే కోసమే ఈ ఏర్పాట్లు.”

“దేనికీ, నాకేమీ వద్దు, చారీ గారూ మీరేమీ చేయొద్దు. వెళ్లిపోండి.” అనడం తో ఆయన, భార్గవ్ వైపు చూశాడు. వెళ్లిపోమని భార్గవ్ సైగ చేయడం తో వెళ్లిపోయాడు చారి.

చేతిలో ఉన్న ఫైల్ ని పక్కన పడేసి “ఏంటి అభీ ఇది. అతని ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. అయినా ఈ బర్త్ డే పార్టీ నిన్ను హ్యాపీ గా ఉంచడానికే గా ” కోపం గానే అన్నాడు భార్గవ్.

“హ్యాపీ నా ఎవరికి హ్యాపీ, నేనడిగానా నా పుట్టిన రోజు గ్రాండ్ గా చేయమని, నేనడిగానా నా పుట్టిన రోజు కోసం వేలకి వేలు ఖర్చు పెట్టమని. ఎవరికి కావాలి ఇవన్నీ, నాకు కావాల్సింది మీరూ, మీ ప్రేమ, మీతో గడిపే సమయం.” అంది భాదగా.

“అభీ! ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు?. ముందు కాలేజీకి వెళ్లు?.” అంది భార్గవ్ భార్య సహస్ర.

“అమ్మా! ఇన్నాళ్లకు డాడీ తో మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఈ రోజు నా మనసులో ఉన్న భాదని డాడీ కి చెప్పాలి ఎలాగైనా. అయినా నన్ను అంటున్నావు కానీ నువ్వు ఎన్ని రోజులు భాదపడ్డావో నాకూ తెలుసు. ఫ్యామిలీ ఫంక్షన్ లకు వెళ్తున్నప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళు అందరూ డాడీ ఎందుకు రాలేదని అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఎంతలా భాద పడ్డావో నాకు తెలుసు. ఈ రోజుకి అవకాశం దొరికింది ఎలాగైనా డాడీ ని అడగాల్సిందే.

నా చిన్నప్పటి నుంచీ ఎదురుచూస్తున్నా మీతో ఓ పదినిమిషాలు గడిపే సమయం కోసం.కానీ మీకు మాతో గడిపే సమయమే లేదు. నేను లేచే సరికే వెళ్లిపోతారు, మళ్ళీ నేను పడుకున్నాక వస్తారు.

చిన్నప్పుడు నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అనుకున్నా ఆ విషయం మీకు చెప్పి మీ కళ్ళల్లో ఆనందం చూడాలని. కానీ మీరు దొరికితేగా. టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు మీతో ఆ ఆనందం షేర్ చేసుకోవాలని అనుకున్నా కానీ మీరు నేను ఫస్ట్ వచ్చానని తెలిసి పదిమందికీ పార్టీ ఇచ్చారే కానీ నాకు చిన్న కంగ్రాట్స్ అన్న మాట కూడా చెప్పనేలేదు. నాకు సంబందించిన ప్రతిదీ వేడుకగా చేయాలనుకునే మీరూ నాతో కంగ్రాట్స్ రా చిట్టితల్లీ ఓ చిన్న మాట అంటే నేనెంత సంబరపడేదాన్నో. కానీ చిన్నప్పటి నుంచీ నాకు ఈ విషయం లో ఎదురుచూపే మిగిలింది తప్పా ఎప్పుడూ నా కోరిక నెరవేరనేలేదు.

వయసుకి వచ్చాక కాలేజీకి వెళుతుంటే పోకిరి వాళ్ళు ఆడే మాటలకు భయం వేసిన ప్రతీసారీ అనుకున్నా మీతో విషయం చెప్పాలని కానీ మీకు తీరిక ఎక్కడిది. నేను అడగకుండానే అన్నీ ఇచ్చే మీకు, నాతో మాట్లాడే సమయమే లేనప్పుడు మీరిచ్చేవి నాకు సంతోషాన్ని కలిగిస్తాయని ఎలా అనుకున్నారు డాడీ.” అలా అంటున్నప్పుడు ఆమె కళ్లల్లో నీటి చెమ్మ భార్గవ్ తండ్రి హృదయాన్ని కలిచివేసింది.

“సారీ డాడీ మిమ్మల్ని భాదపెట్టి ఉంటే,కానీ ఇన్నేళ్లుగా నేను అనుభవించిన భాదని మీకు చెప్పాలని అనిపించి చెప్పేశాను.మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, నాకు భాదనిపించినా, సంతోషం కలిగినా,నా లైఫ్ లో ఏం జరిగినా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటాను. కానీ మీరు దొరకరు.అందుకే నా రూమ్ నిండా మీ ఫోటోలతో నింపేసి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నా ప్రతీదీ ఆ ఫోటోలతో చెప్పుకుంటా.మీరు అవేవీ వినరని తెలిసినా మీతో మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ నాలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అలా చేస్తాను. నేను చెప్పాలనుకున్నదీ చెప్పేశాను డాడీ. అది మిమ్మల్ని భాదపెట్టున్తే ఐయాం రియల్లీ వెరీ సారీ.” అంటూ బయటకు వెళ్లిపోయింది అభిజ్ఞ.

ఆమె చెప్పింది విన్న భార్గవ్ స్థాణువు అయిపోయాడు. మేడ మీద ఉన్న అభిజ్ఞ గదికి వెళ్లిచూసి కొయ్యబారిపోయాడు. తనని చాలా యాంగిల్స్ లో ఫోటో తీసి గోడకి అంటించి ఉంది.

“దానికి ఫోటో గ్రఫీ అంటే చాలా ఇష్టం భార్గవ్, ఈ ఫోటో లన్నీ అది తీసినవే.” అంది సహస్ర.

“నా చిట్టి తల్లి ఇంతబాగా ఫోటోలు తీస్తుందా!.” అన్నాడు ఆనందం గా.

“హా దానికి పెయింటింగ్,పాటలు పాడటం, ఫోటో గ్రఫీ అంటే చాలా ఇష్టం.” అంది సహస్ర.

ఆమె చెప్పేది విని అలానే కిందకి వెళ్లి ఆఫీస్ కి వెళ్లిపోయాడు భార్గవ్.ఇంతలో ఫోన్ మ్రోగడం తో ఆలోచనల నుంచీ తెరుకున్నాడు భార్గవ్.
డబ్బు లేక తల్లిదండ్రులను కాపాడుకోలేక పోయాననే భాదతో, ఏనాడూ డబ్బులేదన్న కారణం తో ఎవరి ప్రాణాలూ పోకూడదని, అవిశ్రాంతం గా డబ్బు సంపాదనలో పడి తన కుటుంబాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాడో అతనికి భాగా అర్ధం అయ్యింది.

అప్పుడే గుర్తు వచ్చింది భార్గవ్ కి ఓ వారం క్రితం తన పెద్దక్క ఫోన్ చేసి తన కొడుక్కి పెళ్లి కుదిరింది పెళ్లిపనులకు తోడుగా నువ్వు వస్తావా భార్గవ్ అంటే సహస్రా, అబిజ్ఞ వస్తారు నేను వీలైతే పెళ్ళికి వస్తాను లేదంటే లేదు అని చెప్పిన విషయం. పాపం అక్క ఎంత భాదపడిందో.

ఆ భావన కలగగానే లేచి బయటకు వచ్చి కార్ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. ఎప్పుడూ లేనిది పెందలాడే ఇంటికి వచ్చిన భార్గవ్ ని చూడగానే తల్లీకూతుర్లు ఆశ్చర్యపోయారు.

“అభీ…లగేజ్ ప్యాక్ చేసుకోండి మనం మీ పెద్దత్తయ్య ఇంటికి వెళ్తున్నాం. మీ బావ పెళ్లి అయ్యేంతవరకూ అక్కడే ఉంటున్నాం. నీ పుట్టిన రోజు కూడా ఈ సారి మీ అత్తయ్య వాళ్ల ఇంట్లోనే.” అన్నాడు నవ్వుతూ.

“ఓహ్! థాంక్యూ డాడీ. థాంక్యూ సో మచ్ అంటూ పరుగున వచ్చి తండ్రిని హత్తుకుంది అబిజ్ఞ. ఆమె అలా హత్తుకోగానే ఇన్నాళ్ళూ తనేం కోల్పోయాడో అర్ధం అయ్యింది భార్గవ్ కి. అంతటి ఆనందం దాగుందా కౌగిలిలో.

ఇన్నేళ్లూ వృత్తి పరంగా ఎన్నో విజయాలు సాధించినా కలగని ఆనందం ఆ ఆత్మీయ కౌగిలిలో దాగుందని ఆ క్షణం అర్థమై ఆశ్రునిమిళితాలు అయినాయి అతని కళ్లు. ఇంకెప్పుడూ ఈ ఆనందాన్ని దూరం చేసుకో కూడదు అనుకున్నాడు మనసులో.

 సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!