దారికి తెచ్చిన దెయ్యం!

దారికి తెచ్చిన దెయ్యం!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

అనగనగా భేతాళపురం అనే ఒక ఊరు. ఆ ఊరి చివరలో రాజుగారి తోట, ఆ తోట మధ్యలో ఇల్లు. అది అక్కడ మోతుబరి రైతు, రాజన్నది. వాళ్ళ పూర్వీకుల నుంచీ అక్కడే ఉంటూ ఉండేవారు.
అనుకోకుండా ఒక రోజు ఆ ఇంట్లో ఏం జరిగిందంటే.
చీకటి పడి ఊరంతా నిద్దురలోకి జారుకునే సమయం. పాడి గేదెలు ఒక్కటే అరుపులు, ఎక్కడి నుంచో భయం కల్పించేలా నక్కల మూల్గులు, కరెంటు పోయి చీకటి. వారి పెంపుడు కుక్కలు రెండూ కర్ణ వికారంగా అరుస్తున్నాయి. పెరటి వైపు నుంచి పిల్లులు అరుస్తున్నాయి. ఇంట్లో పని చేసే నౌకర్లు అయ్యగారూ, అమ్మగారూ, చినబాబు గారూ అంటూ కేకలు వేస్తున్నారు. రాజన్న అటు ఇటూ చూస్తూ ఏమైంది అని ఒక్కసారి భయంగా ఉన్నా, తేరుకుని ఏదో చెప్తున్నాడు కానీ ఎవరికీ వినబడడం లేదు. రాజన్న భార్య ముందే నోట మాట రాక పక్కగా కూలబడి పోయింది. అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజన్న కొడుకు వీరేశం గురించి వెతుకుతున్నారు, ఎక్కడా కనిపించలేదు. అదో దెయ్యం సినిమాను తలపించేలా ఉంది అక్కడ. ఇంతలో మిద్ది పైన ఒక తెల్లని ముసుగు వేసుకుని ఏదో ఆకారం ఒక చిన్న వెలుగుతో కనిపించింది. ఆ వెలుగు కూడా చేతిలో దీపం కానీ, కొవ్వొత్తి కానీ లేదు, తన చేతి వేళ్ళ నుంచే దివ్వెలా వెలుగుతోంది. దానితో అందరూ హడలిపోయి బయటకు పరుగు తీశారు. రాజన్న గారు కూడా పరిగెడు తున్నారు కానీ అంగుళం కూడా కదలడం లేదు. ఇక తన పని అయిపోయింది ఏదో దెయ్యం వచ్చింది, ఈ రోజు నన్ను చంపడం ఖాయం అనుకుంటున్నారు. భయం మరింత పెరిగింది. దెయ్యం ఆకారంలో ఉన్న మనిషి వికృతంగా నవ్వుతున్నాడు. అది వినడానికే భయంగా ఉంది. ఆ ఆకారం కూడా పెరుగుతూ పైన అంతస్తుని తాకుతోంది. ఇక రాజన్న ప్రాణం మీద ఆశలు వదిలేసుకొని ఆంజనేయుని నామ జపం మొదలుపెట్టారు..ఏమీ రాజన్న! హనుమంతుడు నిన్ను ఈ రోజు కాపాడలేడు. నేను కూడా బ్రతికున్నప్పుడు హనుమ భక్తున్నే. నీ మంత్రాలు, జపాలు ఏమీ పనికి రావు అంది. నువ్వెవరు, ఏం కావాలి చెప్పు, దయచేసి నన్ను వదిలేయ్, నీకు ఏం కావాలన్నా ఇస్తా అన్నారు రాజన్న. నిజంగా ఏం కావాలన్నా ఇస్తావా, ఏం చెయ్యమన్నా చేస్తావా అంది ఆ ఆకారం. తప్పకుండా చేస్తా చెప్పు అన్నారు రాజన్న. అయితే విను ఈ రోజు నుంచీ చక్రవడ్డీ లు వసూలు చేస్తూ ఊరిలో ఉన్న రైతులను పీడించ కూడదు అంది ఆ ఆకారం. అదీ అదీ..అంటూ నసిగారు రాజన్న. ఏయ్ నా పంజా చూపించినా అని గర్జించి ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడేసి రాజన్న కి మరింత దగ్గరగా వచ్చింది ఆ ఆకారం. దానితో ఇక తప్పేది లేక అలాగే అన్నారు రాజన్న. అంతే కాదు అన్యాయంగా నీ దగ్గర ఉంచుకున్న భూమి దస్తావేజులు అన్నీ తిరిగి ఇచ్చెయ్యాలి. ఈ పని నువ్వు రేపే మొదలు పెట్టాలి ఆలస్యం చేశావా నీ ప్రాణం హరీ అంది. అంతే కాదు నీకు సాయం చేస్తున్న నీ నౌకర్లను కూడా వదలను అంది. ఇవన్నీ గోడ చాటు నుంచి వింటున్న నౌకర్లు బుద్ది వచ్చిందని లెంపలు వాయించు కుంటారు.
అలాగే మరి నువ్వు ఇక వెళ్ళిపో అన్నారు.
హా! నీ మీద నాకు నమ్మకం లేదు. నేను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటా, రాత్రిళ్ళు వస్తా. అంతవరకూ నీ కొడుకు వీరేశం నా దగ్గరే ఉంటాడు. నీ పని పూర్తి కాగానే మీ ఇంట్లో వాడ్ని వదిలేసి నేను వెళ్ళిపోతా, తస్మాత్! జాగ్రత్త అని ఆ ఆకారం వెళ్లిపోయింది.
మెల్లిగా రాజన్న తేరుకుని భార్యని లేపారు. ఆవిడ లేచి బిత్తర చూపులు చూస్తూ ఏం జరిగింది అని అడిగారు. జరిగిందంతా ఆయన, భార్యకు చెప్తారు.
అయ్యో నా పిల్లాడు ఏడి! ఏమైంది? వాడికి ఏమైనా అయితే మిమ్మల్ని చంపి నేనూ పోతా అంటూ ఏడుపు మొదలెట్టింది. అబ్బా! ఉండవే ఆ దెయ్యం చెప్పినట్టు చేసి, నేను బుద్దిగా ఉంటా అంటారు రాజన్న. ఇది నేను, మన బాబు ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీరు వినడం లేదు. మీ తండ్రి తాతల పేర్లకు కూడా చెడ్డ తెస్తున్నారు. ఇది మంచిది కాదని ఎన్ని సార్లు చెప్పాం మీకు. మీరు వినలేదు. ఇప్పుడు చూడండి పెల్లీడుకి వచ్చిన పిల్లాడు, ఎంత ప్రమాదంలో ఉన్నాడు, మీకు అసలు అర్థమోతోందా! అంది ఆవిడ. దానితో బాగా బుద్ది తెచ్చుకుని రాజన్న గారు మరునాడే ఆ దెయ్యం చెప్పినట్టు రైతులకు దస్తావేజులు తిరిగి ఇచ్చి, ఇక ధర్మంగా వడ్డీ లేకుండానే మీకు అవసరాలకు డబ్బు సాయం చేస్తానని చెప్తారు అందరికీ. ఇదంతా ఓ మూడు రోజులలో పూర్తి చేసి, ఆఖరి రోజు ఇంట్లో పూజలు చేయించి ఊరంతా పిలిచి భోజనాలు కూడా పెడతారు. ఆ రోజు సాయంత్రం వీరేశం తిరిగి ఇంటికి చేరుకుంటాడు క్షేమంగా. ఏం జరిగిందని అమ్మా నాన్న ఎంత అడిగినా ఏమీ గుర్తు లేదు, ఎవరో వచ్చి ఎటో తీసుకు పోయారు, మళ్లీ ఇక్కడ వదిలేశారు అంటాడు. దానితో ఆ తల్లి పొన్లే నువ్వు తిరిగి వచ్చావు, అది చాలు అనే సరికి రాజన్న కూడా అవును అని ఇక ఎప్పుడూ ఆ విషయం ప్రస్తావించ లేదు. అటు తరువాత ఎప్పుడూ ఆ దెయ్యం కూడా కనిపించలేదు. ఇంతకీ ఆ దెయ్యం నాటకం అంతా ఆడింది తన తండ్రిని మార్చా లని వీరేశం ఆడిన నాటకం అని తను ఎవరికీ చెప్పలేదు. అందుకే చదువుతున్న మీకు, నాకూ, వీరేశం కి తప్ప ఎవరికీ తెలీదు. ఉష్! గప్ చిప్! ఎవరికీ చప్పకండి, సరేనా..

You May Also Like

6 thoughts on “దారికి తెచ్చిన దెయ్యం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!