ఎంతైనా

ఎంతైనా

రచయిత :: సుధామురళి

‘మీ అమ్మకుషుగర్, బీపీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే ఆమె కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం. బీపీ ఇలా పెరుగుతూ పోతే ఆమెకు పెరాలసిస్ కూడా రావచ్చు’

డాక్టర్ ఆంటీ అన్న ఈ మాటలతో నా పరిస్థితి దిక్కుతోచకుండా అయిపోయింది. అమ్మ ఎప్పుడూ టాబ్లెట్స్ వేసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయదు. తిరుగుతూ, తిరుగుతూ నే పోవాలని, చివరి రోజుల్లో ఎవరి దగ్గరా చేయించుకునే స్థితి రాకూడదని, ముఖ్యంగా నన్ను ఇబ్బంది పెట్టకూడదని ఆమె ఆలోచన. అలాంటిది ఇంత సడెన్ గా ఇలా జరగడం ఏంటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు.

‘ఆంటీ ఎలాగోలా మీరే అమ్మను నార్మల్ స్థితికి తీసుకురావాలి. అమ్మ ఆరోగ్య స్థితి మీకు బాగా తెలుసు. దాదాపు ముప్పై ఐదేళ్లుగా మీకూ, అమ్మకూ పరిచయం ఉంది. మీరే ఇప్పుడు ఈ మాట అంటే నేనిక ఏ కొత్త డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగలను’ గొంతు పెగల్చుకుంటూ ఒక్కోమాట అన్నాను.

‘అవును నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన మీ అమ్మ అతి తక్కువ కాలంలోనే నాకు ఆప్త మిత్రురాలిగా మారింది. నా దగ్గర తను ఏదీ దాచదు. అలాంటిది ఇంత ఆలోచన ఏమి పెట్టుకుందో నాకే అర్థం కావడం లేదు.నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను. అది ఓ స్నేహితురాలిగా నా బాధ్యత కూడా’

నాన్న మా ఇద్దరి మాటలను మౌనంగా వినడం తప్ప ఏమీ మాట్లాడలేదు, మాట్లాడే స్థితిలోనూ లేడు.

‘మాధవ్ నువ్వు ఇంటికి వెళ్ళు. నాన్నా నేనూ ఉన్నాం కదా చూసుకుంటాం. ఏమన్నా అత్యవసరం అయితే నీకు ఫోన్ చేస్తాను. అక్కడ రజని పిల్లాడితో ఒంటరిగా ఉంది. వాడు ఏం అల్లరి చేస్తున్నాడో, ఏమో’

‘అమ్మను ఈ స్థితిలో వదలి….’

‘పర్లేదు అంత డేంజర్ కండిషన్ ఏమీ కాదు కదా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. నో వర్రీ’

అలా ఆంటీ బలవంతం మీద ఇంటికి బయలుదేరాను. అదీ కాక అమ్మ ఈ స్థితికి కారణం రజనీకి ఏమన్నా తెలుసేమో కనుక్కోవచ్చని, కారణం తెలిస్తే అమ్మను త్వరగా రికవరీ చేయొచ్చని నాకు ఏర్పడ్డ ఆలోచన కూడా నన్ను ఇంటి దారి పట్టించింది

‘ఆంటీ మీకు చెప్పాల్సిన పనిలేదు. అయినా నాకున్న ఆత్రుత కొద్దీ చెబుతున్నాను అమ్మ జాగ్రత్త ఆంటీ. ఏ అర్ధరాత్రి అవసరం అనిపించినా నాకు ఫోన్ చేయండి. వెంటనే వచ్చేస్తాను. డోంట్ హెసిటేట్’
‘నాన్నా నేను రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను.అమ్మను జాగ్రత్తగా చూసుకోండి’

చెప్పాల్సిన అవసరం లేకున్నా ఆంటీకి, నాన్నకు చెప్పి ఇంటికి బయలుదేరాను.

**********

‘ఎలా ఉన్నారు ఆ శ్రవణుడి తల్లి. ఇంకా ఏ కబురు రాలేదేమిటా అని చూస్తున్నాను. మీరే వచ్చారూ…!?
అయితే గండం గట్టెక్కినట్టే. ఇక మళ్ళీ నా నెత్తిమీద ఎక్కి తొక్కడానికి, నా బిడ్డ మీద అజమాయిషీ చేయడానికి లక్షలు ధారపోసి మరీ వస్తారన్నమాట రేపో, మాపో ఆ హాస్పిటల్ నుంచీ’

రజనీ అంటున్న ఈ మాటలు నా చెవుల దగ్గరే ఆగిపోయాయి. మెదడంతా మొద్దుబారి పోయింది.
అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది రజనీని. పిల్లాడు పుట్టి సంవత్సరం అయినా ఇంతవరకూ రజనీకి పాలు పట్టడం కూడా రాదంటే అమ్మ రజనీకి ఏ కష్టం కలగకుండా ఎలా చూసుకుని ఉంటుంది. అలాంటిది రజనీ ఇలా…..

‘రజనీ ఏంటి ఆ మాటలు. అమ్మకు ఏదైనా ఎందుకు కావాలి. అసలు అమ్మ అంటే నీకు ఇంత కోపం ఉందా. నాకు అర్థం కావడంలేదు’

‘నేనూ పెళ్ళైన కొత్తలో అలానే అనుకున్నాను. మా అత్తగారు దేవతనీ, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందని ఇలా ఏవేవో అనుకున్నాను. కానీ అవన్నీ నా మొగుడినీ, నా బిడ్డనీ నాకు దూరం చేసే పన్నాగాలని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. కనీ, పెంచకున్నా మీ మీద ఆవిడ గారికి అంత ప్రేమ వున్నప్పుడు తొమ్మిది నెలలూ మోసి, పురిటి నొప్పులు భరించి కన్న నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా..!? వాడికి అన్నం ఎలా తినిపించాలో, పాలు ఎలా పట్టాలో, ఎప్పుడు నిద్ర పుచ్చాలో, ఎప్పుడు నిద్ర లేపాలో అన్నీ ఆవిడ ఇష్ట ప్రకారమే జరిగేటప్పుడు ఇక నేనెందుకు. వాడిని కన్నది నేను కానీ ఆవిడ కాదు. అసలు ఆవిడకు పిల్లలు పుట్టే యోగ్యత లేకనే కదా మిమ్మల్ని దత్తత తీసుకుని పెంచింది. అలాంటి గొడ్డుబోతు నాకు నీతులు చెబుతుందా. అదే అడిగాను ఉదయం. అంతే ఏదో తలతిరుగుతున్నట్టు డ్రామా ఆడి పడిపోయింది. ఇక ఉన్నాడుగా నోట్లో నాలుక లేని మీ నాన్న కాని నాన్న ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించడం, హాస్పిటల్ లో చేర్చి మీ దగ్గర లక్షలు ఖర్చు పెట్టించాలని ఎత్తు వేయడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి’

రజనీ నోట్లోంచి వస్తున్న ఒక్కో మాటా ఒక్కో బల్లెంలా నన్ను కుళ్ళ బొడుస్తోంది. అసలీమె నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న రజనీయేనా అన్న సందేహం కలిగింది. ఇటువంటి అపార్థాలు రాకూడదనే కదా పెళ్లికి ముందే అన్ని విషయాలూ రజనీకి చెప్పింది. నేను వీళ్లకు సొంత కొడుకును కాదన్న విషయం కూడా నాకూ అప్పుడే చెప్పింది. అప్పటిదాకా ఏ లోటూ లేకుండా పెరిగిన నేను ఒక్కసారిగా హతాశయుడిని అయ్యింది. అయినా అసలు నాకేలేని అభ్యంతరం ఈ రజనీకి ఎందుకు. ఇప్పుడు నేను తనతో వాదించడమో, గొడవపడటమో చేయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. పైగా అమ్మకు ఫ్యామిలీ డిస్టర్బ్ అవడం ఇష్టం ఉండదు. అందుకని చాలా సౌమ్యంగా మాట్లాడి రజనీకి అమ్మ విలువ తెలియచేయాలి. అమ్మంటే ఏంటో రజనీ పూర్తిగా అర్థం చేసుకోవాలి.

‘రజనీ నీకు మొదటిసారి అబార్షన్ అయ్యింది కదా’

‘ఆ అయితే….’

‘మన పక్కింటి చింటూ గాడిని నీ కొడుకులా పెంచగలవా’

‘ఏమిటీ తిక్క తిక్క ప్రశ్నలు..!? అయినా వాళ్ళనూ వీళ్ళనూ పెంచాల్సిన అవసరం నాకేముంది. మీ అమ్మలా నేనేమన్నా గొడ్రాలినా ఏంటి’

‘అవును రజనీ మా అమ్మ గొడ్రాలే.పెళ్ళై పది సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టక అల్లాడిన గొడ్రాలే. కానీ నీలా ఓ పిల్లాడిని కన్న తర్వాత కూడా తల్లి విలువ తెలియని గొడ్రాలు మాత్రం కాదు. తనకు మాతృత్వ వరం దక్కాలని ఆమె చేయని పూజలేదు, మొక్కని దేవుడు లేడు, తిరగని హాస్పిటల్ లేదు. ఎన్ని నాటు మందులు తిన్నదో, ఎందరు భూతవైద్యుల చుట్టూ తిరిగిందో నానమ్మ నాకు చెబుతూ ఉంటే కళ్ళ వెంట నీళ్లు తిరిగేవి. అమ్మ కాలేక పోవడం నాన్నవల్ల అని తెలిసినా ఏనాడూ ఆ విషయాన్ని నమ్మలేదు, బయటపడనివ్వలేదు అమ్మ. తనలోనే లోపం ఉందని ఏవేవో చేసింది. నీకు అబార్షన్ అయినప్పుడు నువ్వెలా విలవిలలాడావో నీకూ తెలియదు కానీ అమ్మ ఆ టెస్ట్యూబ్ బేబీ విధానం ద్వారా అయినా తల్లి కావాలని ఎన్ని అగచాట్లు పడిందో. తన కడుపులో పెరగాల్సిన బిడ్డను అలా లాగి ఎక్కడో ఓ గొట్టంలో దాచి దానిని పెంచి మళ్లీ తన కడుపులోకి చేర్చడం ఆ తల్లికి ఎంత నరకమో తెలుసా నీకు…!? అక్కడ తన బిడ్డ అవ్వగలడో లేదో తెలియని బిడ్డ ఎలా ఉన్నాడో, సరిగా ఎదుగుతున్నాడో లేదో అన్న భయంతో ఇక్కడ అమ్మ ఉలిక్కిపడి లేచేదంట. తీరా తన కడుపులో పెట్టిన ఆ ఫలదీకరణ చెందిన అండాలు తనను తల్లిని చేయాలని పగలూ,రాత్రి కనిపించని దేవుళ్లను మొక్కేదట. ఆ ప్రయత్నమూ విఫలం అయ్యాక అమ్మ ఆల్మోస్ట్ చావు అంచుకు వెళ్ళి వచ్చింది. ఎవరో గర్భంలో తనకూ తన భర్తకూ చెందిన ప్రేమ రూపాన్ని పెట్టి వాళ్ళ మాతృత్వం దోచుకోవడం, కొనుక్కోవడం ఇష్టం లేక ఏ అమ్మ కని వదిలేసి పోయిందో నన్ను నా కులగోత్రాలు, పుట్టిన విధానం ఏదీ పట్టించుకోకుండా దత్తత తీసుకునేసింది. నేను వాళ్ళ కొడుకును కాదన్న విషయం నాన్నమ్మ ద్వారా నాకు ముందుగానే తెలిసినా అమ్మ చెప్పింది మాత్రం మన పెళ్లి అప్పుడే. అప్పుడూ నీతో నాకు ఏ సమస్యలూ రాకూడదనే చెప్పింది. నిన్ను మాత్రం ఎంత బాగా చూసుకోలేదు అమ్మ. ఈరోజు ఏ అనాధాశ్రమంలోనో పెరిగి సరైన చదువు లేక , భవిష్యత్తు లేక ఓ బికారీలా ఉండాల్సిన నీ భర్త ఐదంకెల జీతం అందుకుంటూ, మడత నలగని బట్టలు ధరిస్తూ, హుందాగా జీవిస్తున్నాడంటే కారణం అమ్మ కదూ. ఏమన్నది ఆమె మన చింటూని కూడా నాలా గొప్పగా పెంచుతాను అనే కదా…!? అసలే నీరసంగా ఉన్న నువ్వు పిల్లవాడి అలానాపాలనా చూసుకుంటూ అలసిపోకూడదని తనకు ఎంత ఓపిక లేకున్నా తానే అన్ని పనులూ చేయడానికి పూనుకున్నది అంతే కదా….!? అమ్మ రజనీ తను. మా అమ్మ రజనీ. నాకు దేవుడు ఇచ్చిన వరం. అసలు అమ్మలేకుంటే నేను….’

ఇక నా గొంతులోనుంచీ మాట పెగల్లేదు…

ఇటు చూస్తే రజనీ కళ్లలోంచీ పశ్చాత్తాపం ఏరులై ప్రవహించేందుకు సిద్ధంగా ఉంది….

‘ఏమండీ నన్ను మన్నించండి. ఎక్కడ మన చింటూ అత్తయ్యకు మాలిమి అయ్యి నాకు దూరం అయిపోతాడో అన్న స్వార్ధపు ఆలోచనతో అనకూడని మాటలు అన్నాను. ఇప్పుడే నేను అత్తయ్యను చూడాలి. మన చింటూని ఆవిడ చేతుల్లో పెట్టాలు. చూడండి చింటూ గాడి స్పర్శ తగిలి అత్తయ్య ఇట్టే లేచికూచుంటుంది’ అంటూ ఉన్న రజనీని చూస్తే అమ్మ తిరిగి ఇంటికి వచ్చేసింది అన్న ఆలోచన సంతోషాన్ని మోసుకొచ్చేసింది…

ఎంతైనా మా అమ్మ అమ్మే….
నన్ను ఎక్కువ ఏడిపించదు….

You May Also Like

2 thoughts on “ఎంతైనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!