జ్ఞాపకాలు

జ్ఞాపకాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : నందగిరి రామశేషు

చిన్న నాటి జ్ఞాపకాల్లో మా నానమ్మ జ్ఞాపకాలు నాకు చాలా విలువైనవి. తానేమీ చదువుకోక పోయినా మాకు ఎన్నో మంచి విషయాలు కథలుగా చెప్పేది.
ఆవిడకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. మా నాన్నగారు మిలిటరీ ఉద్యోగం కారణంగా నేను, ఆమ్మ ఎక్కువగా తన దగ్గరే ఉండేవాళ్ళం. ఆవిడకి అందరికీ పెట్టనిదే తోచేది కాదు. అందుకే మా బాబాయిలు, పెదనాన్నలు ఎవరేం తెచ్చినా ముందు మా అందరికీ పంచి పెట్టేది. కోడళ్ళకి పెడితే కొడుకులు తిడతారని “లక్ష్మీ, కొంచెం మంచి నీళ్ళు పట్టుకురా, దాహంగా ఉంది.” అని పిలిచేది. ఏ కోడలు వచ్చినా తాను పెట్టాల్సింది గమ్మున వారి చేతిలో పెట్టి వెళ్ళమని సైగ చేసేది. తన చిన్ననాటి విషయాలు, అత్తగారి వివరాలు, ఇంటికి వచ్చే బంధువులు, భద్రాచలం లో తాతగారు హెడ్మాస్టర్ గా ఆ ఊరి లో ఉద్యోగం, ఇలాంటి విషయాలన్నీ వినసొంపుగా చెప్పేది. అసలు మాకు విసుగు వచ్చేది కాదు. మా నానమ్మ పాలుకాచి, మీగడతీసి తోడు వేసి వెన్న తీసేదిట. కానీ వెన్న తీసినప్పుడు తక్కువ గా రావడం చూసి వాళ్ళ అత్తగారు “ఏమిటే గోపాలం, వెన్న తగ్గుతోంది.” అని ఆడుగుతూంటే ఆవిడ తనని మీగడ తినేస్తున్నట్లు అనుమానిస్తున్నారని బాధ పడేదిట. ఒకరోజు అనుకోకుండా తెల్లవారు జామున ఎవరో లేచి వంటగదిలోకి వెళ్ళడం చూసింది. తనూ వెనకాతలే చప్పుడు చేయకుండా వెళ్లి చూస్తే మా నాన్నగారు, (పదేళ్ళ వయసు) లోపల పాలగిన్నెలో చేయిపెట్టి  మీగడ తీసుకుని తినడం చూసి కోపంతో వీపు మీద గట్టిగా దెబ్బ వేసింది. ఆయన ఏడ్చేసరికి
అత్తగారు వచ్చి “అయ్యో, ఇదేం అన్యాయమే, ప్రొద్దున్నే పిల్లాడిని అలా కొట్టావ్” అని కసిరారట.
“మరి, వాడు మీగడ దొంగతనం గా తింటూంటే, అదేదో నేనే తిన్నానన్నట్లు మీరు నన్నడగడం.” అందిట ఆవేశంగా. “నేనలా ఎప్పుడన్నాను. అయినా వాణ్ణి కొట్టడం ఏం బాగులేదు. రేపట్నుంచి నేనే నీకు మీగడ పెడతాన్రా నాన్నా” అంటూ ఆయన్ని అవతలకి తీసుకెళ్ళిందట. ఇలాంటి విశేషాలు, విషయాలు కథలు, కథలుగా చెప్తూ మాకు అన్నాలు పెడుతూంటే, ఏం పెట్టినా అల్లరి చేయకుండా తినేవాళ్ళం. మమ్మల్ని కూర్చో పెట్టి రాముడు, కృష్ణుడు కథలు చెప్పేది. అవి ఎంత బాగా చెప్పేదంటే మేమంతా “ఇంకా చెప్పు నానమ్మా,” అని గొడవ చేసేవాళ్ళం. కృష్ణుని కథల్ల’చల్దులారగించుట’ అనే కథ వర్ణించి వర్ణించి చెప్పేది. ఆ కథను ఎన్నిసార్లు చెప్పినా వింటూనే ఉండేవాళ్ళం. “కృష్ణుడు తన తోటి గోపాలకులతో కలిసి ఆవుల్ని మేపడానికి వెళ్ళేవాడు. అప్పుడు వాళ్ళమ్మ యశోద కృష్ణునికి కూడా చద్ది కట్టి ఇచ్చేది.” ఇలా చెప్తూ ఉండేది నానమ్మ. మధ్యలో ఒక మనవరాలి ప్రశ్న ” నానమ్మా, కృష్ణుడు నంద రాజు కొడుకు కదా, అతనెందుకు ఆవుల్ని మేపడం, వాళ్ళకి పని వాళ్ళు లేరా.” అని. ” ఆ కాలంలో ఇలాంటి తేడాలు ఉండేవి కాదమ్మా. అందరూ కలిసికట్టుగా ఉండేవారు. కృష్ణుడు తన చద్ది అందరితో పంచుకొనే వాడు. అందరి దగ్గర తనూ తినేవాడు. అప్పట్లో ఈ ఎక్కువ తక్కువ లు లేవు.” అంటూ కృష్ణుని గురించి బోలెడు కథలు చెప్పేది. కృష్ణ నామం తరచూ విని విని ఆ పేరు పట్ల నాకు విపరీతమైన ప్రేమ పెరిగి పోయి పెద్దయ్యాక ‘ఆ పేరు గల వాడిని పెళ్ళి చేసుకోవాలి, లేదా ఆ అబ్బాయి కి ఏం పేరున్నా “కృష్ణ'” అని మార్చేయాలి’ అనుకునే దాన్ని. ‘మగవాడి పేరు మార్చిన మొదటి అమ్మాయి గా పేరు తెచ్చుకోవాలని’ కలలు కనేదాన్ని కానీ నాకు మా వారు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన పేరు కృష్ణ. ఇంకా నాకు మార్చే అవకాశం ఏది? పోనీ లే, కోరుకున్నా పేరే కదా అని తృప్తి పడిపోయా.
ఇవి మా నానమ్మ గురించి నా మనసున మిగిలిన జ్ఞాపకాలు. అవి తల్చుకుంటే ఇంకా నిన్నా, మొన్నా జరిగినంత తాజాగా అన్పిస్తాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!