గోరింటాకు

గోరింటాకు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: ఎం. వి. ఉమాదేవి

  ఆషాడమ్ వచ్చిందంటే గోరింటాకుకు రక్షణ ఉండదు. చెట్టుకనిపిస్తే చాలు, దూసేయడమే. పదేళ్ల చిలకకి ఎక్కడా గోరింటాకు దొరకడంలేదు. పక్కింటి అరవ వాళ్ళపిల్ల, వాళ్ళమ్మ అరచేతులనిండా పాముకున్నారేగాని, పిసరంత గూడా చిలకకి పెట్టలేదు. వాళ్ళు రుబ్బుకుంది తమరోట్లోనే !రుబ్బినంతసేపూ అక్కడే కూర్చున్నది చిలక. కాస్తయినా రోట్లో వొదిలిపోతారని, నేను కడుగుతాలే అత్తా రోలు అంది కూడా, ఆమాటకి సంబరంగా మొత్తం ఊడ్చుకొని పెద్దకొబ్బరిచిప్ప నిండా పెట్టుకోని పోయిందేగాని ఇదుగో అని కాసింతకూడా విదిల్చలేదు పక్కింటామె. సంధ్యదీపం పెట్టాక గబగబా అరటికాయ్ వేపుడు, రసంతో అన్నం తినేసి, పెద్ద గంగరేణి ఆకు తీసుకొని పక్కింటికెళ్ళింది చిలక. వాళ్ళు అన్నాలు తింటున్నారు. “ఏమి వొచ్చావ్” అన్నది అలివేలమ్మ ముఖం చిట్లించి. గోరింటాకు పెట్టుకోవాలత్తా కొద్దిగా. భయంగా చూసినసిగింది చిలక. ఇప్పుడా వొచ్చేదీ. దీపంపెట్టాక రొంబ ఇయ్యరాదే, పో ..పో తింటూనే నిర్లక్ష్యంగా చెప్పింది అలివేలమ్మ. పక్కన కూతురు అమ్మణ్ణి వెక్కిరిస్తూ నవ్వులు. రోజూ తన బొమ్మలతోనే ఆడుకుంటున్నది కదా కాస్త పెడితే ఏమి. అనుకుంటూ ఆపిల్ల వైపు చూస్తే పెరుగన్నంలో ఆవకాయ ముక్క నంజుకుంటూ లొట్టలేస్తుంది అమ్మణ్ణి! నిరసనగా చూస్తూ బైటకొచ్చేసి ఆకు విసిరేసి దబదబ అడుగులేస్తూ ఇంటికెళ్ళి నులకమంచం వేపచెట్టుకిందకి లాక్కుని పడుకుంది చిలక. తండ్రి పనినుండి రావడం, స్నానం చేసి అన్నానికి కూర్చుని “చిలకా రావే బువ్వ తిందాం”అని పిలవడం తెలుస్తుంది గానీ లేవబుద్ధికాలేదు. నాన్న మంచోడు పాపం అనుకుంది. ఎన్నోసార్లు తనతో బాటు అమ్మణ్ణికీ అయిస్ లూ, వేయించిన పల్లీలూ కొనిస్తాడు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది చిలక. ఈమధ్య పొద్దున్నేలేచి అమ్మకిసాయంగా వాకిలి ఊడ్చి ముగ్గుపెట్టడం నేర్చుకున్నది కదా! ముగ్గేస్తూ ఉంటే రెండు పాదాలువొచ్చి చిలక ముందు ఆగాయి. గోరింటాకు పండినపాదాలు అవి అమ్మణ్ణివే! కాఫీ రంగులో నల్లనల్లగా పండింది గోరింటాకు. తలెత్తిచూస్తే, అమ్మణ్ణి గర్వంగా నవ్వుతు అరచేతులు చూపిస్తుంది. చుట్టూ చుక్కలు, మధ్యలో చందమామ ! బాగుందా? అంటున్న దోస్తుతో.. ఏం బాలేదు, నల్లగా ఉంది! అని కచ్చగా ముక్కుపుటాలు ఎగరేసి పెదవివిరిచింది చిలక.
ఛర్రుమన్న అమ్మణ్ణి ఆ.. నీపేరు మాత్రం బాగుందేమీ.. వారి.. చిలకంట చిలక..? ఎక్కడన్నా అలా పిలుస్తారా మనుషులనీ..? పావడా దులిపి విసవిస అడుగులేస్తూ ముగ్గు చెదిరిపోయేలా చేసివెళ్ళింది ఆపిల్ల. అల్లాంటి పేరుతో పిలుస్తారేం నన్నూ, అంటూ చాలా సార్లడిగింది అమ్మనాన్నలనీ. నీపేరు రత్నమాల ! బడిలో అదే రాసాముగా. ముచ్చటగా ఉంటావని మీ నాన్నమ్మ పెట్టుకున్న పేరు చిలక. మనపేర్లు మనిష్టమ్, అడగడానికి వాళ్ళెవరు? నువ్వు పట్టించుకోకే అన్నారు వాళ్ళు.
బడికెళ్ళాక ముక్కాలు మంది గోరింటాకు చేతులు చూపించుకుంటూ ఒకటే కబుర్లు ! అబ్బాయిలు కూడా చిటికెనవేలికి, బొటనవేలికి, అరచేతిలో చందమామ పెట్టుకోనున్నారు. నాకూ కావాలే సుందరీ, మీరు ఎక్కడ తెచ్చుకున్నారూ గోరింటాకు? ఒకమ్మాయినీ అడిగితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళఇంట్లో చిన్నచెట్టు ఉందని ఆకు అయిపోయిందనీ చెప్పింది సుందరి ! మధ్యాహ్నభోజనం తిన్నాక ఇంటికి వెళ్ళిపోయింది చిలక. వొంట్లో నలతగా అనిపించింది రాత్రికి అన్నంతినకున్నా జ్వరం వచ్చేసింది. పిల్లకి ఊష్ణo ఎక్కువ అయింది. అని నాన్నమ్మ సబ్జా నీళ్ళు ప్రభాకరవటి మాత్రలు వేసినా రెండ్రోజులు జ్వరం తగ్గలేదు చిలకకి. ఆషాఢ వేడికి శీతల వస్తువులు వాడాలి పిల్లా. రెండ్రోజులకే నీరసించిపోయింది బిడ్డ !రేపు కాసింత గోరింటాకు తెచ్చి, అరచేతులు, పాదాలకీ పెడితే గానీ మహా ఉష్ణం దిగదు. గసగసాలు పొడి, నెయ్యితో అన్నం పెట్టు ! అంటున్న నాన్నమ్మ దేవతలా కనిపించడంతో దిగ్గునలేచి కూర్చున్నది చిలక హుషారుగా. ఎక్కడ ఉంది నాన్నమ్మా చెట్టు? అంటూ. చాలా దూరంవెళ్ళాలే. గోవిందనాయుడు గారింట్లో కాశీ సమారాధనకి వంటచేసేదానికి వెళ్ళాను సుభద్రతో. అప్పుడు చూసా. ప్రహరీ పక్కన చాలా పేద్దచెట్టు. పూతకూడా ఉంటుంది. మంచి మత్తు వాసన ఆ పూలు! రేపు శుక్రవారం కదా ఇవ్వరు. ఎల్లుండి శనివారం వెళ్లితెస్తాలే బజ్జోమ్మ అంది నాన్నమ్మ. సంతోషంతో చాలాసేపు నిద్రరాలేదు చిలకకి. పొద్దున్నే చట్నీ లేని చప్పటి ఇడ్లిలు గమ్మున తినేసింది, పైత్యంగా తనకిష్టం లేని పొట్లకాయ కూర కూడా పేచీలేకుండా తిన్నది. గోరింటాకునే ఊహించుకుంటూ. శనివారం వెయ్యి ఏనుగుల బలం వొచ్చినట్లు పొద్దున్నే లేచి
స్నానం చేసి ఆకుపచ్చ బాడీపావడ, తెల్లజాకెట్టు బడి యూనిఫారం వేసుకొని బ్రెడ్ తినేసి బడికివెళ్లినది చిలక. మధ్యాహ్నం నాన్నమ్మ పేపర్ పొట్లంలో తెచ్చిన గోరింటాకు సాయంత్రం దగ్గరఉండి రుబ్బించుకొని పెట్టించుకుని వీధిలో చీకటి పడేవరకూ అటుఇటూ తిరిగి అమ్మణ్ణి కంట్లో కూడా పడి తృప్తి గా ఇంట్లోకొచ్చింది. అదేమీటే, ఆ తెల్లజాకెట్టు తీయలేదు. రేపు పొద్దున్నకి గోరింటాకు మరకలు అవుతాయి కదా. అంటున్న కోడలితో పోనీలే అమ్మాయి, ఏదో చిన్నతనం ముచ్చట అంటూ కంచంలో పప్పులుసు, వడియాలు అన్నం తెచ్చి ముద్దలు తినిపించుతూ కాశీ మజిలీ కథ చెప్పి మూతికడిగి వెళ్ళింది నాన్నమ్మ తన చిన్న మంచం మీద దుప్పటి పరిచిఉంది. పడుకొని జాగ్రత్తగా చేతులు వెల్లికిలా పెట్టుకోనీ పడుకోని గాఢనిద్రలో
మునిగింది చిలక. పొద్దున్నే లేచిపెరట్లో కెళ్తే అమ్మ ఒకటే నవ్వడం. తెల్ల జాకెట్ కి మరకలు పడ్డాయి నల్లగా. అది ఉతికినా పోదు. అంటూ బావి దగ్గరికి తీసుకెళ్ళి చెక్కులు కట్టిన గోరింటాకు తీసేసి, చేతులు, పాదాలు శుభ్రంగా కడిగి ఒక బొట్టు కొబ్బరినూనె రాసింది అమ్మ. మందార రంగులో చిలక అరచేతులూ, పాదాలు పండి మెరిసిపోతున్నవి. అరవం వాళ్ళ పిల్ల ముఖం ముడుచుకొని ఇంట్లోకి పోయింది ఆదివారం ఆటలో చిలక చేతులు చూసి. మిగతా నేస్తాలు బలే ఉందే అన్నారు. ఆదివారం సాయంత్రం ఉతికిన తెల్లజాకెట్ తెచ్చి చిలక కిచ్చి, మరకలు పోలేదు. కొత్త జాకెట్ వృధాగా పోతుంది. రైలుకట్ట దగ్గర రంగోళ్ల బావికి నాన్నమ్మతో వెళ్లి ఏదొక రంగులో ముంచిమ్మని చెప్పు. అన్నది సుభద్ర. సరేనని ఇద్దరూ వెనకవీధిలో ఉన్న రంగోళ్ల ఇంటికి వెళ్లారు. చిన్న చిన్న వాటాలు నాలుగు అన్నదమ్ములవి. వాకిట్లో పెద్ద గిలక బావి. పెద్ద పెద్ద రంగు తొట్టెలు. ఒక పక్కన బొంతరాళ్ల పొయ్యిపైన బానలో వైలెట్ రంగు ఉడుకుతుంది. తరాలుగా కులవృత్తి వాళ్ళది అని చెప్తున్నాది నాన్నమ్మ. అంతలో మధ్యవయసు అతను వచ్చి నాన్నమ్మ కి దండంపెట్టాడు. ఏమమ్మా, ఇట్లా వొచ్చారు? అంటూ. పాప జాకెట్టుకి గోరింటాకు మరకలు అయ్యాయి దశయ్యా. గట్టిగానే ఉంది కాస్త రంగులో ముంచితే వేసుకోవచ్చు కదా అనీ. అలాగేనమ్మ ఇలా ఇవ్వండి అదుగో వైలెట్ ఉంది వేసేదా..? వేరే రంగా.. చెప్పు పాపాయ్ !
అంటున్న అతనితో ఆరెంజ్ కావాలి అంది ధైర్యంగా చిలక. సరే రేపు సాయంత్రం బడి అయ్యాక వచ్చి తీసుకువెళ్ళమ్మా. పని లేకపోతే నేను తెచ్చిస్తా !”అంటున్న దశయ్యకి, చీర కొంగున ముడివేసిన పది రూపాయల నోటు ఇవ్వబోయింది నాన్నమ్మ. వొద్దు తల్లీ. మీ దగ్గర డబ్బులు తీసుకోగూడదు. మా నాయన చెప్పేవాడు, అయ్యగారు చాలా దొడ్డమనసు అనీ. పొట్ట చేతబట్టుకొని ఈ ఊరికి వొస్తే ఈ ఉపాధి చూపించినారని. అన్నాడు దశయ్య. ఈ లోగా చిలక పెద్దపెద్ద కళ్లతో పరిసరాలను చూస్తూ ఉంది. బావి పక్కన వరసగా మూడు అత్తిచెట్లు పెద్దవి. చెట్ల నిండాకాయలూ, పండ్లూ. కోసుకుందామంటే చెట్టుకాండం మీద బోలెడు గండుచీమలు తిరుగుతాఉన్నాయ్. రావే చిలకా పోదాం అంటున్న నాన్నమ్మ కొంగులాగి. ఉండు నాన్నమ్మా అత్తి పండ్లూ
అని గునిసింది చిలక. ఓహో అత్తి పండ్లా పాపకి,”అంటూ దశయ్య గడతెచ్చి పండ్లూ కాయలు కోసి వైరు బుట్ట నిండుగా ఇచ్చాడు. చాలా తీపిగా ఉంటాయి అమ్మ గారు. కడిగి తినండి. పచ్చి కాయలు రోట్లో దంచి చెరిగేసి ఉప్పు పసుపుతో ఉడికించి వడేసి, తాలింపు పెట్టి తినండి. కమ్మగా ఉంటాయి ! అని చెప్పింది దశయ్య భార్య. వస్తాం అని చెప్పి ఇంటికి వచ్చారు చిలక, నాన్నమ్మ.
సోమవారం బడికివెళ్లిన చిలక దోస్తులకి బోలెడు కబుర్లు చెప్పి, గోరింటాకుతో పండిన చేతులు చూపించి, సంచిలో తెచ్చిన తీయని అత్తిపండ్లు తలో నాలుగు ఇచ్చింది. దూరంగా నిలబడి చూస్తూ ఉన్న అమ్మణ్ణిని పిలిచి తనకీ అత్తిపండ్లు ఇస్తూ మనస్ఫూర్తిగా నవ్వింది రత్నమాల!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!