జై హింద్

జై హింద్

రచన::అలేఖ్య రవికాంతి

” కాశ్మీర్ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది చల్లని మంచు, తయ్యనైన ఆపిల్ పండ్లు, అందమైన లోయలు.కానీ దేశం పై ప్రేమ ఉన్న ప్రతి భారతీయుడికి గుర్తొచ్చేది కాశ్మీర్ సరిహద్దు” …

ఆ సరిహద్దుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా దేశ మరియు ప్రజల భద్రత కోసం పోరాడే మిలిటరీ దళాలు. మనం ఈ క్షణం ఇక్కడ ఇంత స్వేచ్చగా ఊపిరి తీసుకుంటున్నామంటే భారత సైన్యం చల్లని చలువే కదా.అలాంటి గొప్ప బాధ్యత గల విధులను నిర్వహించే ఆర్మీలో నేను ఒక్కడిని అవ్వడం నిజంగా నాకెంతో గర్వకారణం.

‘అన్నీ అనుకునట్టుగా సజావుగా సాగితే దానిని జీవితం అని ఎందుకంటారు’…!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. ముఖ్యంగా ఆర్మీలో. ఏ క్షణంలో ముష్కరులు చొరబడతారో ఏ క్షణంలో జవానులు ప్రాణాలను కోల్పోతారో అంచనా వేయలేని పరిస్థితి. నాకు అలాంటి క్షణమే ఎదురైంది.

ఒక్క నిమిషం చాలు కదా గడిచిన మన జీవితమంతా కళ్ళ ముందు కదలాడడానికి. నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. అప్పటి వరకు రణరంగంలా ఉన్న నేల ఒక్కసారిగా శవాలదిబ్బ రూపంలో నిర్మానుష్యంగా మారింది. దేశభక్తి గీతాలతో నిత్యం హుషారుగా ఉండే సైన్యమంతా చెల్లా చెదురైంది. ఒంట్లోంచి రక్తం ఏరులా పారుతున్న నొప్పి తెలియడం లేదు కనిపిచేదల్లా స్వేచ్చగా ఎగిరే జెండా స్వాతంత్రపు ఆనందం తప్ప…

జెండాని చూస్తూ గతంలోకి నెమ్మదిగా జారుకున్నా.నా కుటుంబం కళ్ళ ముందు కనబడుతుంది. తల్లిదండ్రులకి నేనొక్కడినే సంతానం. నాన్నది చిన్న బడ్డీ కొట్టైనా నాకు కావలసినవన్నీ సమకూర్చేవారు.

నా జీవితంలో ముఖ్యమైన సంఘటన నా పన్నెండవ ఏటా జరిగింది.అప్పుడు నేను పదో తరగతి చదువుతున్న.తెల్లారితే స్వాతంత్య్ర దినోత్సవం.బడిలో వేడుకల కొరకు ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఊహ తెలసిన వయసది.బడిలో జరిగిన కొన్ని పోటీల్లో గెలుపొందిన సంతోషంతో ఇంటికెళ్ళాను.
రేపటి రోజుకై ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను జెండా వందనానికై కాదు పంచిపెట్టే మిటాయిలు, బహుమతుల కొరకు..

ఆ రోజు రానే వచ్చింది.వేకువ జామునే లేచి జెండాని చొక్కాకి పెట్టుకుని తయారయ్యి బడికి వెళ్ళాను.ఇంతలో అనుకోకుండా నా చొక్కాకున్న జెండా చిరిగి నేల పై పడింది.అప్పుడే నాలోని దేశభక్తి రగిలే సంఘటన జరిగింది.

ఎవరో విద్యార్థి కావాలని జెండా పై కాళ్ళు పెట్టి నలపుతుంటే నాలోని రక్తం సలసల మరిగింది.
” నా దేశం పై కాళ్ళు వేసే హక్కు నీకెవడిచ్చాడు” అని తనకి బుద్ధొచ్చేలా చేసా గురువులకి చెప్పి.
ఆ నిమిషం నుంచి తెలియకుండానే దేశభక్తి నా నర నరాల్లోకెక్కింది. బడిలో మాష్టార్లు చెప్పే సమరయోధుల పోరాటం, మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి పాఠాలు చెప్పే విధానం నచ్చి చరిత్ర పై మక్కువ కలిగింది.

నా పదవ తరగతి పూర్తి కావొచ్చే సరికి ప్రతిరోజు గ్రంథాలయానికి వెళ్లి భారతదేశ చరిత్ర గురించి చదివి చాలా విషయాలు తెలుసుకున్నాను.
ఆంగ్లేయుల చేతుల్లో మన బానిసత్వపు బతుకులు, ఆడవారి పై అరాచకాలు, మన దేశ సంపదను దోచుకుని మననే బానిసలుగా మలిచిన తీరు తెలుసుకుని నా రక్తం ఉడికిపోయింది.

“ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితమే స్వేచ్చగా ఊపిరి తీసుకుంటు ఎగురుతున్న మన మువ్వన్నెల జెండా కదా”…!

మనసంతా దేశభక్తి రంగుతో నిండింది. చరిత్ర పై ఆసక్తి కలిగింది. ఇంటర్లో చరిత్రనే ఎంచుకుని చాలా విషయాలను తెలుసుకున్నాను.దేశానికి నా వంతు సేవలను అందించాలని ధృఢంగా నిశ్చయించుకుని డిగ్రీ పూర్తవ్వగానే ఆర్మీలో చేరిపోయాను..

ఆర్మీలో ఎన్నో కఠినమైన నియమ నిబంధనలుంటాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎన్నో కర్తవ్య బాధ్యతలు. మన కోసం కాదు దేశం కోసం ప్రాణాలను పనంగా పెట్టి పోరాడే సాధనలు. అంతులేని యుద్దాలు కొన్ని రోజులు నుంచి నెలల, సంవత్సరాల పాటు చేయాలి. ఇదంతా ఎంత కష్టమైన దేశం పై ఇష్టం ముందు చాలా చిన్నది అనిపించింది. ఎగిరే మన జెండా ముందు అన్ని బడలికలు దిగదుడుపే.ఆర్మీ అంటేనే క్రమశిక్షణ, నిజాయితి, నిబద్ధత.నాకు అవన్నీ అలవడ్డాయి.ఐదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి.

తల్లిదండ్రులను చూడాలనే కోరిక ఉన్నా వారిని చూసిన క్షణం నా దేశభక్తి వలన వారికి దూరంగా ఉంటూ వారిని బాధపెట్టడం ఇష్టం లేక ఆగిపోయాను.ఎలాంటి కుటుంబ బాంధవ్యాలు నా వృత్తికి అడ్డు రాకూడదని పెళ్లి చేసుకోలేదు.నా ప్రాణాలు నా చేతుల్లో లేవు కాబట్టి నన్ను నమ్ముకొనొచ్చి నా పైనే ప్రాణాలను పెట్టుకుని బతికే అమ్మాయిని బాధపెట్టడం తప్పు కదా.

ఐదు సంవత్సరాల తర్వాత నాన్న కాలం చేసారని తెలిసి వెళ్ళాను.అమ్మ డీలా పడిపోయింది.అమ్మకి ధైర్యంగా ఉందామనుకునే లోపు సైన్యం నుంచి కబురు… ‘శత్రుచర్లు దేశ సరిహద్దుల్లో చొరబడ్డారు…త్వరగా రావాలని’…

నాలో సందిగ్ధత నెలకొంది.అమ్మని వదిలేసి వెళ్ళలేని పరిస్థితి అలాగని దేశాన్ని రాబందుల చోతుల్లో వదలలేను.ఈ ఆలోచనలతో సతమతమవుతున్న నన్ను చూసి అమ్మ, బాబు ధైర్యం కూడగట్టుకుని మీ నాన్నగారి జ్ణాపకాలతో కాలం వెల్లబుచ్చుతా.ఇప్పుడు నాకన్న దేశానికే నీ సేవలు చాలా అవసరం అని బరువెక్కిన గుండెలతో సాగనంపింది.

కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకలతో యుద్ధం భీకరంగా జరుగుతుంది. మా దేశంలో మీకు అడుగు కాదు కదా, ఒక్క నిమిషం స్వేచ్చగా ఊపిరిని పీల్చే క్షణమైన దక్కనివ్వమని సైనికులమంతా ప్రతిజ్ఞ చేసుకుని కసితో, సరిహద్దుల్లో మరింతగా పోరాడసాగాం.

సరిహద్దంతా రణరంగంగా మారింది.నిమిషాల వ్యవధిలోనే చల్లని సరిహద్దు రక్తపు మడుగులతో, పీనుగుల దిబ్బలతో నిండిపోయింది.

దేశానికై పోరాడుతు అస్తమిస్తున్న వారిలో నేను ఒకడిని. ఒంట్లోంచి రక్తం మొత్తం పోతుంది. కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి శాశ్వత నిదురలోకి. నా జీవితమంతా రెప్పపాటు క్షణంలో మొత్తం కనిపించింది.

“అమ్మ, ఏమిచ్చి తీర్చుకోను నీ రుణం”… నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నందుకు మన్నించు అంటుండగానే నా గుండె వేగం తగ్గిపోయింది.చివరి ఘడియలు దగ్గరపడ్డాయి కాబోలు..

చివరిసారిగా స్వేచ్చగా ఎగిరే మువ్వన్నెల జెండాని చూస్తున్నా. “అబ్బా, ఎంత హుందాగా ఉందో కదా. మన దేశంలో అడుగుపెట్టాలని చూసిన ముష్కరులతో కడవరకు పోరాడి వీరమరణం పొందిన సైనికులారా అందుకోండి నా వందనాలు”.

” అలాగే అందులో ఒక్కడినైనా “నేను, మేజర్ సూర్య ప్రకాష్” దేశ సేవలో భరతమాత పొత్తిలలో అస్తమిస్తున్నందుకు గర్వపడుతున్నాను” .

“ఓ దేశ ప్రజలారా…మీకూ తెలుసా”..!
వీరమరణం పొందిన సైనికుల దేహలు మాత్రమే దూరం కానీ వారి ఆత్మలు సరిహద్దుల్లో ఎన్నటికి దేశానికి కాపు కాస్తుంటాయని మరువకండి…

‘ దేశభక్తి అంటే మా ప్రాణమున్నంత వరకే కాదు మా ఆత్మలు ఈ సరిహద్దుని వీడనంత వరకు సజీవమే సంజీవనిలా’ …

“పుణ్యభూమి నా దేశం నమోనమామి”…!
ఇక సెలవు నా దేహానికి మాత్రమే ఆత్మకి కాదు అని జైహింద్ అంటు చివరిసారిగా కళ్ళ నిండా జెండా రూపును నింపుకుని వీరమరణపు ఒడిలోకీ నెమ్మదిగా జారుకున్నాను మేజర్ సూర్య ప్రకాష్ అనే నేను సరిహద్దులో గస్తీ కాస్తూ ఆత్మనై…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!