కష్ట జీవి
(కవితా సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షలు: కనకరాజు గనిశెట్టి
పోటెత్తే కెరటాల్తో
సంద్రాన్ని చిలికే నీ కండల్లో
దోపిడీకి గురైన నీ కష్టం అంటూ
దృఢమైన పదజాలంతో
కష్ట జీవిపై ఉన్న ఆవేదనను
నివేదనగా రచించి
వృత్తి వ్యవసాయ
కష్ట జీవి కష్టాన్ని స్పష్టంగా తెలియచేయగలిగారు
రచన ప్రకృతి
ఆలోచన ప్రకృతి
ఆవేదన ప్రకృతి
వారి ప్రతి పదంలోనూ
ప్రకృతి ఇమిడే ఉంటుంది.
వారు రచించిన
ఈ కష్ట జీవి పదకట్టు
నన్నెంతగానో ఆకట్టుకుంది.
వారి కలం నుండి మరిన్ని రచనలు జాలువారాలని కోరుకుంటూ.
***************************************
కవిత: కష్ట జీవి
రచన: విస్సాప్రగడ పద్మావతి
అంతెత్తు నుండి దింపే
కల్లు కుండల్లో
ఊపిరి బిగబట్టి
నెత్తికెత్తుకునే కట్టెమోపుల్లో
పోటెత్తే కెరటాలతో పోరాడి
సముద్రాన్ని చిలికే నీకండల్లో
దోపిడీకి గురైన నీ కష్టం
నిస్తేజంగా రోదిస్తుంది
పలుగు పారపట్టి
నువ్వు మట్టితో పొట్లాడినప్పుడు
కదలలేక కదిలే ఏడ్లబండికి
నువ్వు ఇరుసైనపుడు
నీకు అనిపిస్తుంది
ఇసుక తిన్నెల మీద నేర్చిన అంకెలు
బ్రతుకు పాఠాలు నేర్పలేదని
రెక్కలు ముక్కలయ్యేకా
చేతికొచ్చిన పైసలు
నీచేత కాని తనాన్ని వెక్కిరిస్తుంటాయి
ఈకాలపు మనిషివి కాదని
చెప్పకనే చెబుతుంటాయి.
**************************
కవిత కు తగ్గ సమీక్ష. Super