క్షమించవూ

క్షమించవూ

రచయత :: కమల ముక్కు ( కమల ‘శ్రీ’)

బెడ్ పై పడుకుని ఉన్న మూర్తి కళ్లు చెమ్మగిల్లి ఉన్నాయి. మనసు పశ్చాత్తాపం తో నిండిపోయింది. హృదయం భాధతో మూలుగుతోంది.మనసు లోని భాదనంతా తీరిపోయేలా తనకి క్షమాపణ చెప్పాలని ఉంది. కానీ తను క్షమిస్తుందా?!.”అనుకుంటూ భాదపడుతున్న అతని దగ్గరికి భార్య విశాలాక్షి వచ్చింది.

“ఏంటండీ ఆ కన్నీరు?.” అంది కంగారుగా.

“ఇన్నాళ్ళు నేను బంగారం అనుకున్న వాళ్లు ఎలాంటి వాళ్లో, మనకు భారం అనుకున్న మనుసులు ఎలాంటి వాళ్లో తెలిసి గుండెలోని వేదన అంతా ఇలా కన్నీటి బిందువులుగా మారిందేమో.” అన్నాడు చెమ్మగిల్లిన కళ్లనుంచి అశ్రువులు రాలుతుండగా.

“అవునండీ ఇప్పుడిప్పుడే మన కళ్ల ముందు ఉన్న మబ్బు తెరలను తొలగించి వాస్తవాన్ని మనకు చూపించాడు ఆ భగవంతుడు. ఇది కూడా మన మంచికేనండీ. ఇక ముందైనా ఆ బంగారం అనుకున్న వాళ్లను కాకుండా బంగారం లాంటి మనసున్న వాళ్లను నమ్మాలని చెప్పకనే చెప్పాడు ఆ దేవుడు.” అంది విశాలాక్షి.

“అవును విశాలా. అది తెలుసుకోవడానికే నాకు ఇలా జరిగిందేమో.” అన్నాడు మూర్తి.

“నిజమేనండీ.” అంది విశాలాక్షి.

“ఇన్నాళ్ళు మనం బంగారం లాంటి కొడుకుని కన్నాము.మనకు ఏ లోటూ రాకుండా చూసుకుంటాడు అని, మన ఆడపిల్లలను బాగా చూసుకుంటాడని ఎంత ఆశ పడ్డాము. వాడు అడిగింది కాదనకుండా, కోరింది లేదనకుండా ఇస్తూ వచ్చాము అలాంటిది ఈ రోజు వాడు…” అంటూ గుండెలో లావా లా ఉప్పొంగుతున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేక ఏడ్వడం మొదలు పెట్టాడు మూర్తి.

“మావయ్యా ఏమయ్యింది? కళ్లమ్మట ఆ నీరేమిటి? ఏడుస్తున్నారా? మిమ్మల్ని ఎక్కువ స్ట్రైయిన్ అవ్వొద్దని చెప్పారుగా డాక్టర్ లు. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు? రెస్ట్ తీసుకోండీ. అత్తయ్యా మీరిక్కడే ఉంటే మామయ్య ఇలా భాద పడుతూనే ఉంటారు. ముందు మీరు బయటకు రండి.” అంది అప్పుడే లోపలకు వచ్చిన లలిత.

“సరేనమ్మా!” అని పైకి లేచి బయటకు వెళ్లబోయింది విశాలాక్షి.

“ఆగు విశాలా. లలితా ఓ సారి ఇలా వస్తావమ్మా!.” అన్నాడు మూర్తి.

“లలితా! నన్ను మన్నించవూ…!” అన్నాడు మూర్తి గద్గద స్వరం తో.

“అయ్యో మమయ్యా ! మీరు నన్ను మన్నించమని అడగడం ఏమిటి?.” అంది లలిత కంగారుగా.

“ఇన్నాళ్లూ నువ్వు మాకు భారమని, మా గుండెల మీద గుది బండ అని అనుకున్నాము. కానీ ఈ రోజు నా ప్రాణం మీదకి వస్తే నువ్వే కాపాడావు. నా బంగారం ,వజ్రం , వైఢ్యూర్యం అనుకున్న నా కొడుకు చిల్లీ గవ్వ కూడా విదల్చలేదు. దగ్గర పిల్లవని, మా ఆడపిల్లలకు మాకూ చక్కగా చూసుకుంటావని నిన్ను మా వాడికిచ్చి పెళ్లి చేశాము. చేశాకా వాడెక్కడ నీకు దగ్గర అయిపోతాడేమో అని వాడికి ఏదో ఒకటి చెప్తునే ఉండే వాళ్ళం నీ మీద. జాబ్ లకు అప్లికేషన్ పెడతాను మమయ్యా అని డబ్బులు అడిగితే ఎందుకు పనికి రాని చదువులు చదివి.. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాని చదువులు అని ఎన్నో సంధార్భాల్లో నిన్ను హేళన చేశాను.

నీ కష్టానికి ప్రతిఫలమో, నీ బిడ్డ అదృష్టమో నీకు చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ వచ్చిన జీతం లో వాడు సగం తీసుకుంటే మిగిలిన సగం మా చేతిలో పెడితే ఎన్నేసి మాటలు అన్నామో జీతం ఏం చేస్తుందో…? అని. అయినదానికీ, కాని దానికీ ఏదో ఓ మాట అంటూనే ఉన్నాము. మేమే కాకుండా మా ఆడబిడ్డలు కూడా వచ్చిన ప్రతిసారీ ఏదో గొడవ పెట్టి నిన్ను చులకన చేసిన వారే. అయినా నీ కన్నీరు బయటకు రానివ్వకుండా వాళ్ళని ఆదరిస్తూ వచ్చావు.

మొన్న రాత్రి నిద్దట్లో సడన్ గా గుండెల్లో నొప్పిలా ఉందంటే అప్పటికప్పుడు అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ లో జాయిన్ చేయించావు. హార్ట్ ఎటాక్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పగానే డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పి వెళ్ళిన నా కొడుకు ఫోన్ కూడా ఎత్తడం మానేశాడు. వాడికి చేసి చేసీ విసిగిపోతే ఆఖరికి ఓ మెసేజ్ పెట్టాడు. ఇప్పటికే మీ వల్ల చాలా అప్పులు చేశాను. ఇక నా వల్ల కాదు. ఎలాగూ ఆ రెండేకరాల పొలం నా పేరు మీద రాశారు కదా అది అమ్మి నా అప్పులు తీర్చుకుంటాను. ఇక ఈ జన్మ లో మీ ముఖం కూడా చూడను.మిమ్మల్నీ, మీ ఆడబిడ్డల్నీ చూడాల్సిన అవసరం నాకేంటి,నాకు నచ్చిన మనిషి తో నాకు నచ్చినట్టు ఉంటా. దయచేసి ఇక మీదట నాకు ఫోన్ చేయకండీ.” అని.

అది చూడగానే ఆ గుండెల్లో ఇంకాస్తా నొప్పి మొదలయ్యింది.రెండు గంటల్లో ఆపరేషన్ చేయకపోతే నేను బ్రతకనని డాక్టర్ లు చెప్తే ఎలా తెచ్చావో ఎక్కడి నుండి తెచ్చావో రెండు గంటల్లోగా ఆ డబ్బు తెచ్చి కట్టావు. ఆపరేషన్ చేయించి నాకు పునర్జన్మ ప్రసాదించావు.” అన్నాడు బాధగా.

“అయ్యయ్యో అవేం మాటలు మావయ్యా మీరు ఎక్జైట్ కాకూడదని చెప్పానా. రెస్ట్‌ తీసుకోండి.” అంటూ వెళ్లబోతుంటే,

“లేదమ్మా! ఆకలేసినప్పుడే తినాలి. ఏడుపొచ్చిన వెంటనే ఏడ్వాలి. చెప్పాలి అనుకున్న వెంటనే క్షమాపణ చెప్పేయ్యాలి. మళ్లీ ఈ అవకాశం నాకు వస్తుందో రాదో. నన్ను క్షమించవూ.” అంటూ ఆమె చేయి పట్టుకుని చిన్నపిల్లాడిలా బాధపడుతున్న మూర్తి గారిని చూస్తూ విశాలాక్షి కూడా రోధించడం మొదలుపెట్టింది.

“మామయ్యా! ఇలా ఏడ్చారనుకో నేను మీతో మాట్లాడను.”అంది లలిత.

“అయ్యో! అంత మాటనకు తల్లీ ఈ ముసలి ప్రాణాలకు మిగిలిన ఒకే ఒక్క ఆశ నువ్వు. మేము అల్లారు ముద్దుగా పెంచిన మా బిడ్డలందరూ ఈ కష్ట కాలంలో అక్కరకు రాలేదు. మేము గడ్డిపరక లా తీసిపారేసిన నీవే ఈ రోజు ఆపధ్బాంధవి లా ఆదుకున్నావు. ఇప్పుడు నువ్వు మాట్లాడను అంటే మేమైపోవాలి చెప్పూ.” అన్నాడు మూర్తి.

“మరి మీరిలాగే ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పండి. అయినా మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన పని ఏముంది మామయ్యా.ఓ తండ్రి తన బిడ్డ ని ఓ చిన్న మాట అంటే పడదా. మామయ్య అయితేనేమీ మీరు నాకు తండ్రితో సమానం. మీరు కోపంగా ఓ మాట అన్నా అవన్నీ నాకు ఆశీర్వచనాలు గానే భావించాను. ఇక ఈ ఆపరేషన్ అంటారా ఓ కూతురిగా మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత.

ఇక మీరు ఏవీ ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకోండి. మీ పిల్లలు రాలేదనీ, మా కష్టాల్లో వదిలేశారనీ ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఎదురుగా ఈ కూతురిలోనే వాళ్లందరినీ చూసుకుంటూ సంతోషం గా ఉండండి.” అంటూ బయటకు నడిచింది.

అలా వెళ్తున్న ఆమెనే చూస్తూ “ఎంత ఉన్నతమైన గుణాలో నా కోడలివి.తనని బాధించిన వారిని కూడా క్షమించే గుణం ఆమెకే సొంతం. నా బంగారుతల్లి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి.” అని అనుకోకుండా ఉండలేకపోయారు భార్యాభర్తలిద్దరూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!