కళ్యాణ తిలకం

(అంశం:”అపశకునం”) 

కళ్యాణ తిలకం

రచన :: కమల’శ్రీ’

“అమ్మా! రాజీ పిన్ని ఎక్కడా? పొద్దున నుంచీ అడుగుతుంటే చెప్పవే?.” అంది వసుంధర.

“వసూ! పిన్ని ఏవో పనుల్లో ఉన్నట్టుగా ఉంది. చాలా మంది చుట్టాలు వచ్చారాయే. వారికి కావల్సిన వన్నీ చూసుకోవాలి కదా. ఏమైనా తాగుతావా?. కాస్త నిమ్మరసం తీసుకుని రానా. నీరసం రాదు.” అంటూ వెళ్లిపోయింది దేవి, వసూ తల్లి.

“అబ్బా! పొద్దున నుంచీ ఇలానే చెప్తుంది కానీ పిన్ని ని మాత్రం పిలవడం లేదు.” అని విసుక్కుంది వసూ.

“ఇదిగో వసూ ఈ నిమ్మరసం తాగు.” అని గ్లాస్ వసూ చేతికి ఇచ్చి , “అమ్మా కీర్తి ఇంకా అలంకరణ పూర్తి కాలేదా?. అవతల ముహూర్తం సమయం కూడా దగ్గర పడుతుంది. కాస్త ఆలస్యం చేస్తే వాళ్లు మనల్ని కోపగించుకుంటారు.కొంచెం తొందరగా రెడీ చెయ్యు అమ్మాయిని.” అంటూ వెళ్లబోయింది దేవి.

“ఆంటీ నేనెప్పుడో రెడీ చేసేశాను. కానీ…?!.” అంటూ ఆగింది కీర్తి.

“కానీ ఏంటమ్మా…?.” అని ఓసారి వసూ ని పరికించి చూసి “రెడీ చేశాను అంటున్నావు. మరి దాని నుదుట కళ్యాణ తిలకం పెట్టలేదేంటమ్మా. పెళ్లి కూతురి నుదుట బొట్టు పెట్టకుండా రెడీ చేశాను అని అంటావెంటీ?.” కొంత అసహనం గానే అంది దేవి.

“అది కాదాంటీ వసూ కళ్యాణ తిలకం పెట్టొద్దని అంటోంది. అందుకే తిలకం పెట్టలేదు.” అంది కీర్తి.

“కళ్యాణ తిలకం పెట్టొద్దని అనడం ఏంటి వసూ?. అవతల ముహూర్త సమయం దగ్గర పడుతుంటేనూ. కీర్తీ ఆ తిలకం పెట్టమ్మా.” అంది దేవి.

“వద్దమ్మా. కళ్యాణ తిలకం కీర్తి పెట్టడానికి వీలు లేదు.” అంది వసూ.

“పోనీ నేను పెడతాను. ఆ కళ్యాణ తిలకం ఇటివ్వు కీర్తీ, నేనే పెడతాను.” అంటూ వసూ నుదుట పెట్టడానికి చేయి పెట్టింది దేవి. ఆమె చేయి పట్టుకుని ఆపి అమ్మా నాకు కళ్యాణ తిలకం పెట్టాల్సింది నువ్వు కాదు… రాజీ పిన్ని. తననే పిలూ. తన చేతుల్తోనే కళ్యాణ తిలకం పెట్టించుకుంటాను.” అంది వసూ స్థిరంగా.

“రాజీ నా. ఎందుకు లేమ్మా. నేను పెడతాలే.” అని పెట్టడానికి ఉద్యుక్తురాలైన దేవి వైపు కోపంగా చూస్తూ,

“అమ్మా!ఎన్ని సార్లు చెప్పాలి నీకూ. నాకు కళ్యాణ తిలకం పెట్టాల్సింది రాజీ పిన్ని మాత్రమే. తను వచ్చి పెడితేనే కానీ నేను పెట్టించుకోనమ్మా.” అంటూ చైర్ మీద కూర్చుంది.

“దేవీ! అమ్మాయి రెడీ అయ్యిందా?. అవతల ముహూర్తానికి సమయం దగ్గర పడింది.” అంటూ వచ్చాడు వసూ తండ్రి జగన్నాధం.

“ఆ … అయిపో వచ్చింది.” అంటూ మరోసారి పెట్టబోతే అమ్మా ఇంకోసారి చెప్పే ఓపిక నాకు లేదు. చెప్పినా వినకుండా పెట్టడానికి రెడీ అయ్యావే అనుకో నేను పీటల మీద కూర్చోను. గుర్తుంచుకో.” అంది తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకుంటూ. కానీ అప్పటికే ఆమె కళ్ల లోని కన్నీటి పొర జగన్నాధం గారి కళ్లను దాటిపోలేదు.

“ఏమైంది వసూ శుభమా అని పెళ్లి చేసుకోబోతూ ఆ కన్నీరేంటి?.” అన్నారాయన కంగారుగా.

“చూడండి నాన్నా నాకు కళ్యాణ తిలకం రాజీ పిన్ని పెట్టాలంటే కాదు నేనే పెడతాను అంటుంది అమ్మ. పొద్దున్నుంచి పిన్ని నా దగ్గరకి రాలేదు. అడిగితే ఏదో పనుల్లో ఉంది అని చెప్తూనే ఉంది. ఎన్ని పనులున్నా పిన్నికి నాకంటే ఏదీ ఎక్కువ కాదని నాకు తెలుసు. అలాంటిది నా పెళ్లి అవుతుంటే తను ఎక్కడో చుట్టాలను పలకరిస్తూ వారి బాగోగులు చూస్తూ ఉండిపోవడం ఏంటీ. ముందు తనని పిలవండి. తన చేతుల్తో కళ్యాణ తిలకం పెడితే నా వైవాహిక జీవితం సంతోషం గా సాగుతుంది. అంతే కదా నాన్నా.” అంది తండ్రి చేయి పట్టుకుని.

ఆయనకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక నీళ్ళు నములుతూ నిలబడ్డాడు జగన్నాధం.

“వసూ చెప్పింది విను. పిన్ని పెట్టదు. నేనే పెడతాను.” అంది దేవి.

“ఏం ఎందుకు పెట్టదు. ఓ సారి తనని పిలువు అమ్మా. నేను అడిగితే పిన్ని కాదనదు.?!.” భాదగా వసూ.

“వసూ మొండిగా ప్రవర్తిస్తావు ఎందుకు?.చెప్పిన మాట విను. అవతల ముహూర్తం దగ్గర పడుతుంది.” అంటూ బ్రతిమలాడబోయింది దేవి.

“మీరే నా మాట వినండి. రాజీ పిన్ని వస్తేనే నేను కళ్యాణ తిలకం పెట్టించుకునేది, లేదంటే…?.” అంది కోపంగా.

“హా లేదంటే ఏంటీ?!.” అంటూ మాటలు వినపడే సరికి గుమ్మం వైపు చూశారు నలుగురూ.

కోపంగా వసూ నే చూస్తూ అంది శారద… వసూకి కాబోయే అత్తగారు.

ఆమెని అక్కడ చూడగానే కంగారు మొదలైంది దేవీ, జగన్నాధం గారిలో.

“వదినగారూ అమ్మాయి రెడీ అయిపోయింది. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు తీసుకుని వస్తాము కళ్యాణ మండపానికి.” అంది దేవి.

“మీరు ఆగండి వదినగారూ… నేను వసూ తో మాట్లాడాలి. మీ రాజీ పిన్ని ఇటుగా రాదు వసూ. తనకోసం ఎదురు చూడకుండా కళ్యాణ తిలకం పెట్టించుకుని సిద్ధంగా ఉండు.” అని వెనుతిరగ బోయింది శారద.

“మా పిన్ని ఎందుకు రాదు?!.” నెమ్మదిగానే అడిగినా సూటిగా ప్రశ్నించింది వసూ.

“ఎందుకంటే తన లాంటి ఆడది పచ్చని పెళ్లి పందిట్లో తిరగడం అశుభం. అందుకే తనని పక్క గదిలో ఉండమని చెప్పాను. అర్థం అయ్యింది కదా. ఇంక నువ్వు తిలకం పెట్టించుకుని రా.”

“లేదత్తయ్యా! మా పిన్ని వచ్చి పెడితేనే వస్తాను.”

“వసూ…?!.” గట్టిగా అరిచింది శారద.

ఆమె అలా అరవగానే బయట ఉన్న వాళ్లు కూడా వచ్చి నిలబడ్డారు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. జగన్నాధం గారికైతే గుండె దడగా ఉంది. దేవి దేవుళ్లందర్నీ వేడుకుంటుంది పెళ్లి నిర్విఘ్నంగా జరిగేలా చూడమని.

“ఎందుకత్తయ్యా అరుస్తున్నారు. అయినా ఏమన్నారు మీరూ… అలాంటి ఆడవాళ్లా.. ఎలాంటి ఆడవాళ్లూ… ఏం మా పిన్ని మీ అందరిలానే ముత్తైదువేగా మరి తానెందుకు పెళ్లిలో తిరగ కూడదు. ఓ… తన భర్త తనని విడిచిపెట్టి వెళ్లిపోయారనా… అతను వదిలిపెట్టి వెళ్లి పోతే మా పిన్నేం తప్పు చేసింది. తననెందుకు తిరగొద్దని చెప్పారు.

చంటిబిడ్డలా ఉన్నప్పటి నుంచీ నన్నెత్తుకుని సాకింది మా పిన్ని. కన్నది మా అమ్మే అయినా నా ఆలనా పాలనా చూసింది మాత్రం మా రాజీ పిన్నే. ప్రతీరోజూ నన్ను చక్కగా ముస్తాబు చేసి బొట్టు పెట్టి మొటికలు విరుస్తూ ఎంత ముద్దుగా ఉందో మా వసూ బంగారం. అనేది చెమర్చే కళ్లతో. నాకేదైనా అయితే తనెంత బెంగ పెట్టుకునేదో.

ఓసారి జ్వరం వచ్చి మూడు రోజులు మూసిన కన్ను తెరవకుండా ఉన్నానని మా ఊరి గుడిలో పొర్లు దండాలు చేసిందట. నేను లేచి మామూలుగా తిరిగే వరకూ తాను సరిగ్గా తినను కూడా లేదట.అంత ప్రేమ నేనంటే మా పిన్నికి. అటువంటి మా పిన్ని నాకు బొట్టు పెట్టడం ఎందుకు మంచిది కాదు.” తన మనసులో ఉన్నదంతా బయటపెట్టింది వసూ.

“ఏంటమ్మాయి పెళ్లి కాకుండానే మీ అత్తయ్య ని ఎదిరించి మాట్లాడుతున్నావు?. అయినా నీకు తెలీదా పిల్లి ఎదురైనా , విధవరాలు ఎదురైనా, బల్లి మీద పడినా, బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మినా అపశకునం అనీ. అలాంటిదే ఇది కూడా. మొగుడొదిలేసిన ఆడది బొట్టు పెడితే రేపు నీ వివాహ జీవితం ఏమవ్వాలి. దానికన్నా పెద్ద అపశకునం ఏదన్నా ఉందా. అయినా జగన్నాధం ఆడపిల్లని ఇలాగేనా పెంచేదీ. పెద్దవాళ్ల మాటలకు ఎదురు చెప్తోంది. బుద్దిగా బొట్టు పెట్టించుకుని రమ్మని చెప్పు దానికి.” అంది జగన్నాథానికీ, శారద వాళ్ల కీ పెళ్లి మధ్యవర్తిగా వ్యవహరించిన పెద్దావిడ.

“బామ్మగారూ…” అని కోపంగా అని… “మీ వయసు వారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవీ. అపశకునం, అశుభం అనేవీ ఎవరో ఎదురైతే జరగవండీ… ఆ రోజుకి మన కర్మ ఎలా జరగాలని రాసిపెడితే అలా జరుగుతుంది. మీరన్నట్టే అయితే నేను కాలేజీకి వెళ్లేటప్పుడు మా పక్కింటి ఆంటీ రోజూ ఎదురయ్యేది. నాకేమీ కాలేదే. నా ఎం.సెట్ ఎంట్రాన్స్ ఎగ్జామ్ కి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైంది కాసేపు ఆగి వెళ్లమని అమ్మ చెప్పినా వినకుండా టైం అయిపోయింది అని వెళ్లిపోయాను. ఆ ఎగ్జామ్ లో నాకు మంచి ర్యాంకు వచ్చి ఎం.బీ.బీ.యస్ లో సీట్ వచ్చి ఈ రోజు డాక్టర్ అయ్యాను.

అపశకునాలు అంటూ ఏమీ ఉండవు మామ్మగారూ‌. మంచి మనసుతో ఎవరు ఎదురొచ్చినా , ఏం చేసినా మంచే జరుగుతుంది. రోజూ బొట్టు పెట్టి అందంగా తయారు చేసే మా పిన్ని చేత్తో తిలకం పెట్టించుకుంటే నా ఐదోతనం పచ్చగా ఉంటుందని నా నమ్మకం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి.” అని,

“అత్తయ్యా! మీరు పెద్దవారు, అన్నీ తెలిసిన వాళ్లు. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడానని కోపం తెచ్చుకోకుండా నా ఆవేదనని అర్థం చేసుకోండి.

పాపం మా పిన్ని ఆ పక్క గదిలో కూర్చుని ఎంతగా బాధపడుతుందో నా మనసుకి తెలుస్తుంది. ఎవరో చేసిన తప్పుకి ఆమెని అనడం ఎంతవరకూ కరెక్ట్. మా పిన్నిది చాలా మంచి మనసు. నా ఐదోతనం ఆరు కాలాల పాటూ కళకళలాడుతుంది. తనతో కళ్యాణ తిలకం దిద్దించరూ…ప్లీజ్…” అంటూ కన్నీళ్లతో శారద కి చేతులు జోడించి వేడుకుంది వసూ.

శారద మౌనంగా ఉంది. అందరిలోనూ ఉత్కంఠ. ఈ పెళ్లి ఆగిపోతుందని కొందరూ, ఆడపిల్లకి అంత పొగరేంటనీ ఇంకొందరూ , అయినా మొగుడొదిలేసిన ఆడది ఇలా పెళ్లిల్లకీ , పేరంటాలకీ రావడం ఏంటీ అని ఇంకొకరూ అంటుంటే జగన్నాథం దంపతులు భయం భయంగా వియ్యపురాలి వైపే చూస్తూ ఉన్నారు.

“నీ బాధ నాకు అర్థం అయ్యింది వసూ. నీ వాదనలోనూ నిజముంది. ఎవరో చేసిన తప్పుకి మీ పిన్నిని అనడం తప్పే. నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంది.

మా నాన్న గారు పోయాక అమ్మ బయట తిరిగి పొరపాటున ఎవరికైనా ఎదురైతే వాళ్లు నానా మాటలూ అనేవారు.నాకు కోపం వచ్చి వాళ్లని బాగా తిట్టేదాన్ని. రోజూ ఇదే తంతు. అందరూ అలా అంటుంటే నువ్వు బొట్టు పెట్టుకోవడం లేదు కాబట్టే అందరూ అలా అంటున్నారు. నువ్వు పెట్టుకోమ్మా అనీ ఓ రోజు స్టిక్కర్ తెచ్చి అమ్మ నుదుట పెట్టేశా. దాంతో అమ్మ నన్ను కొట్టి ‘భర్త పోయిన ఆడది బొట్టు పెట్టుకోడదు. ఎవరో ఏదొ అన్నారని అలా చేస్తే నేను బరితెగించి ఇంకెవరితోనో సంబంధం పెట్టుకున్నానని నిందలు మోపుతుంది ఈ ‌సమాజం.’ అంది.

కానీ నాకు మాత్రం మా అమ్మ పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపించేది. ఎన్ని నిందలు భరించిందో పాపం. కానీ ఏ రోజు కూడా మా అమ్మ ఎదురైన వాళ్లకి కానీ, తనని పొద్దున్నే చూసిన వాళ్లకి కానీ చెడు జరిగినా దాఖలాలు లేవు. మరెందుకలా అనేవారో అని కోపం వచ్చేది. కానీ ఏం చేస్తాం చిన్నపిల్లని కదా.

మా అమ్మ రాను రాను ఇంటికే పరిమితం అయిపోయింది. బయటకు వచ్చి ఎవరికి ఎదురైతే ఏం మాట పడాల్సి వస్తుందో అని. నా పెళ్లి అయ్యేంత వరకూ తను ఇంటి నుంచి బయటకు వచ్చింది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇంట్లో బట్టలు కుట్టి ఆ వచ్చిన డబ్బుతో నన్ను పెంచి పెద్దదాన్ని చేసి నా పెళ్లి జరిపించింది.

అదేం విచిత్రమో మా అమ్మ ఎదురైతే అపశకునం అనుకునే వారు మా అమ్మకి చీరలు ఇవ్వడానికి వచ్చి కీసు కీసు బేరాలు చేసి డబ్బులు ఇచ్చేవారు. అప్పుడు అపశకునం కాదా. ఆ బట్టలు వేసుకుంటే వాళ్లకేం అవ్వదా అనిపించేది.’ అని కాసేపు ఆగి,

నువ్విప్పుడు ఎదురుతిరిగి నన్ను ప్రశ్నించినట్టు నేనూ ప్రశ్నించి ఉంటే మా అమ్మ కూడా నలుగురిలో నవ్వుతూ తిరిగేది కదా అనిపించింది ఓ నిముషం. నీది చాలా మంచి మనసు వసూ. నిన్నిలా పెంచిన మీ అమ్మా నాన్నా…కాదు కాదు మీ పిన్నిదే ఈ క్రెడిట్ అంతా‌. ఈ బంగారానికి కళ్యాణ తిలకం వాళ్ల పిన్ని చేతుల మీదుగానే దిద్దించి తీసుకుని రండి.” అని చెప్పి… గొప్ప మనసు వసూ నీది.” అని వసూ నుదుట ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది శారద.

అప్పటిగానీ గుండె మీద భారం తగ్గలేదు భార్యాభర్తలిద్దరికీ. పరుగున పక్కగదికి వెళ్లి రాజీ ని పిలిచింది కీర్తీ.

రాజీ వచ్చి వసూ నుదుట కళ్యాణ తిలకం దిద్ది మొటికలు విరిచి బంగారు బొమ్మలా ఉన్నావురా బంగారం. నా దిష్టే తగిలేలా ఉంది నీకు.” అని తన కాటుక తీసి వసూ కి దిష్టి చుక్క పెట్టింది.

పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మని పిలవడంతో వసూ ని మంటపానికి తీసుకెళ్లారు‌. చాలా బాగా జరిగింది వసూ,నీరజ్ ల పెళ్లి. అంతే సంతోషంగా ఉన్నారు భార్యా భర్తలు ఇద్దరూ పెళ్లి అయ్యాక కూడా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!