మా ఆరోక్లాసు అల్లరి

మా ఆరోక్లాసు అల్లరి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొల్లూరు నాగమణి

           ఎప్పటిలాగే ఆరోజున కూడా ప్రతీ క్లాసునీ చూసుకుంటూ వరండా వెంబడి నడుస్తున్న హెడ్మాష్టారు రామ్మూర్తి పంతులుగారు మా ఆరోక్లాస్ రూమ్ లోకి చూసి, “ఏమైంది మాష్టారూ? ఏమి తప్పు చేశారు వీళ్ళు? దాదాపుగా పిల్లలందరూ క్లాస్ బయట నిలుచున్నారు?” అని అడిగారు సంస్కృతం శాస్తుర్లు గార్ని(ఆయన పేరు శాస్త్రులుగారు). రామ్మూర్తిగార్ని చూసిన వెంటనే తన తిట్లదండకానికి కాస్త తాత్కాలిక విరామాన్నిచ్చి, లేచి నించొని గౌరవ నమస్కారం చేసి, ” ఏం చెప్పమంటారు లెండి, వారం రోజులుగా వల్లె వేయిస్తున్నాను రామ శబ్దాన్ని. కానీ ఏమి ఫలితం శూన్యం. ఒక్కళ్ళకీ వచ్చి చావట్లేదు. రామో రామః రామాభ్యాం…అని ముందుది వెనక, వెనకది ముందు ఏదో నోటికొచ్చినట్లు వాగేస్తున్నారు వెధవాయిలు” అని తనదైన ధోరణిలో బదులిచ్చేరు మా శాస్తుర్లుగారు. “సరేనండి! వాళ్ళందరినీ అలా బయట నిలబెట్టే బదులు లోనికి పంపించి, మీరే బయటికి వచ్చేస్తే సరి (నేర్పగలిగే నేర్పరితనం చేతగానందుకు అన్న అంతరార్థంలో)” అని అనేసి వెళ్ళిపోయారు. వెంటనే మేమంతా గొల్లున నవ్వడంతో మరోసారి ఎడతెరిపి లేకుండా తనదైన శైలిలో తిట్లదండకం కానిచ్చేశారు మా శాస్తుర్లుగారు. అది మొదలు అతను మమ్ములను బయట నిలబెట్టడం మానేశారు. కొట్టి, తిట్టి కొంచెం కొంచెంగా నేర్పించేవారు. సరిగ్గా నోరుతిరగక, చదువు గొప్పతనం తెలియక, చేసేదేమీ లేక ఆయన్ని లోలోపల తిట్టుకుంటూ ఉండేవాళ్ళమి. ఆయన పద్ధతి మాత్రం ‘నేను తగ్గేదే లేదు’ అన్నట్లుండేది. మాకు లోలోపల ఉండే అక్కసుని రకరకాలుగా తీర్చుకొనేవాళ్ళమి. బెంచీల్లో కూర్చుంటే అల్లరి చేస్తామని, అందర్నీ తన టేబుల్ దగ్గరే నిలుచోమనేవారు. అంతా చుట్టూ గుమి కూడేవాళ్ళమి. ఒకసారి మా క్లాసమ్మాయి ఒకతె అతని వెనక నిలుచొని, అతని పిలకలో గొబ్బిపువ్వు పెట్టింది. అప్పుడు అతని కదలికలకు పిలకలోని పువ్వు ఊగడం చూసి, నవ్వు ఆపుకోలేక అందరం పకాలున నవ్వేశాం. అతనికి కోపం నశాళానికెక్కిపోయింది, తడుముకొని చూసుకొని, పువ్వుని బయటకు తీసి, ఎవరీపని చేశారంటే అందరం సైలెంట్ అయిపోయాం. అందర్నీ బయటకు పంపడానికి వెనుకాడి (గతం గుర్తుకొచ్చిందేమో), అందర్నీ బెంచీలు ఎక్కించి, ఒకొక్కరినీ దగ్గరకు పిలిపించి, ఒక్కర్ని కూడా వదలకుండా బెత్తం విరిగేలా కొట్టేరు. నాలుగైదు బెత్తాలుండేయిలెండి అతనిదగ్గర ఎప్పుడూను. ఒకసారి ఆయన మా చేత  కాంపోజిషన్ వ్రాయించేరు. మాకు ఎవ్వరికీ సరిగ్గా వ్రాయడం రాలేదు. తత్ఫలితంగా అందరికీ ఇంపోజిషన్ పడింది. కాంపోజిషన్ పుస్తకంలో ఒక పక్క కాంపోజిషన్ వ్రాస్తే, ఇంకోపక్కన ఇంపోజిషన్ వ్రాసేవాళ్ళమి. అయినా సరే చూడకుండా చెప్పలేక తన్నులు తింటుంటే ఒకసారి ఉపాయం వచ్చింది మాకు. ఆ ఉపాయంతో అందరం బాగా అప్పజెప్పేశాం ఆతని టేబిల్ వద్దకు వెళ్ళిమరీ. ఆయనకి ఆశ్చర్యం అనిపించి, ఆరా తీసేరు మమ్మల్ని నిదానంగా. ఏముంది, అతను పుస్తకం మడిచి పట్టుకుంటే, చక్కగా వెనకపక్కన వ్రాసినది చదివి చెప్పేశాం. మేము చేసిన తప్పును చెప్పేసినా మాకు చీవాట్లు, తన్నులు తప్పలేధు. ఇలా కొంతకాలం సాగిపోయింది. ఒకసారి, మాలో మేము ఆలోచించుకొని, ఒక కంత్రీ పని చేశాము. ఎప్పటిలాగే మా శాస్తుర్లుగారిది ఫస్ట్ పీరియడ్. అలవాటు ప్రకారం ప్రార్థన అయిన వెంటనే వచ్చేసి, సైలెన్స్ సైలెన్స్ అని బిగ్గరగా అరుస్తూ, తన కుర్చీలో కూర్చున్న వెంటనే ఠపీమని ఒక్క ఉదుటున లేచి నిలుచొని, కిందామీద భయంభయంగా చూడసాగేరు కుర్చీ నాలుగు కాళ్ళ క్రిందా అమర్చిపెట్టిన నాలుగేసి డాట్ కేప్స్ అనబడే చీమటపాకాయలు ఒక్కసారిగా పేలడంతో వచ్చిన ఢాం ఢామ్మన్న పెద్ద పెద్ద ఊహించని శబ్దాల కారణంగా. ఇక మేమంతా బలవంతంగా మా నవ్వుల్ని ఆపుకొన్నాం. పక్క క్లాసుల్లోంచి పిల్లలూ, మేష్టర్లూ అంతా దడదడా వచ్చేశారు మా క్లాస్ దగ్గరకు ఏమైందోనని. ఇక చెప్పాలా తలోరకంగా పలకరింపులూ పరామర్శలూను. “పడ్డారా? దెబ్బలు తగిలేయా? పంచె కాలిందా? కుర్చీ విరిగిందా?” అని మాష్టార్లందరూ అడుగుతుండడం అంతా గోలగోలగా గందరగోళంగా అయిపోయింది ఒక్క నిముషంలోనే. ఏమీ చెప్పడానికి మాటరాని స్థితిలో షాక్ లో ఉండిపోయారు మా శాస్తుర్లుగారు. ఇంతలో మా సన్యాసి తాత (ప్యూన్) లాంగ్ బెల్లు కొట్టేశాడు ఏదో అయిపోయిందని. ఇంకేముంది చెప్పాలా?  ఊహకందనంత తొందర తొందరగా అన్ని క్లాసులూ ఖాళీ అయిపోయాయి పిల్లలంతా ఇళ్ళకు వడివడిగా పరుగులు తీయడంతో. ఇలాంటివే ఎన్నో ముచ్చట్లున్నాయండి తెలిసీ తెలియని వయసులో చేసినవి. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ముచ్చటించుకుందాం! మా మేష్టారు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను క్షమించరాని అల్లరి చేసినందుకు ఇందుమూలముగా మరోసారి!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!