ఇంగితం

అంశం: హాస్య ప్రధాన కథలు

ఇంగితం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: అరుణ

       ప్రియా..ప్రియా” అని కోపంగా అరుస్తున్న మాధవ్ కేకలు విని వంటింట్లో బజ్జిల పిండి కలుపుతున్న ప్రియ  పరుగు పరుగున ముందు గది లోకి వచ్చింది..చేతిలో ఉన్న ఫైల్స్ సోఫాలో పడేసి…ప్రియని కోపంగా చూస్తూ,” నా ఫోన్ ఎందుకు టచ్ చేశావ్?” అన్నాడు మాధవ్.
“అదీ..మీరు ఫోన్ ఇంట్లో మర్చిపోయారు..కంటిన్యూగా ఫోన్లు, మెసేజెస్ వస్తుంటేనూ” అంటూ నసిగింది ప్రియ. మాధవ్ మరింత గొంతు పెధ్ధది చేస్తూ,” కాదు..శివంగి అని ఉండే సరికి…నా మాజీ ప్రేయసి అనో…లేక నా క్లాస్ మెట్ అనో అనుకున్నావ్. ఫోన్ లిఫ్ట్ చేసి ఆడ గొంతు అయ్యేసరికి కట్ చేశావ్. ఏమి మెసేజ్ లు పెట్టిందా అని చెక్ చేశావ్?” అన్నాడు..
“అయ్యో అదేం కాదు. తనే కట్ చేశారు” అని కళ్ళలో నీళ్ళు తిరుగుతూండగా అంది ప్రియ
” ఎందుకా ఏడుపు? చేసింది చాలక…శివంగి మా బాబాయ్ కూతురు…దాని అసలు పేరు శిల్ప..మేమంతా దాన్ని శివంగి అని పిలిచి ఏడిపించేవాళ్లం..మన పెళ్లికి పిల్లలకి పరీక్షలు అయినందు వలన రాలేదు..పిల్లలకి సెలవులు ఇచ్చారు..అందరం  ఆదివారం వస్తాము అని చెప్పడానికి ఫోన్ చేసింది. మెసేజెస్ చేసింది.
ఏదో దాని కష్టం సుఖం చెప్పుకోడానికి ఫోన్ చేసింది. నువ్ లిఫ్ట్ చేసేసరికి..నువు కొత్త పెళ్ళానివి , గయ్యాళి గంగమ్మవేమో అని కట్ చేసింది.
ఎక్కడ కలవాలి అని మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇవ్వకపోయేసరికి ఆఫీస్ కి కాల్ చేసింది. ఎంటన్నయ్యా నీ  ఫోన్ మీ ఆవిడ లాక్కుందా? నీ మీద సిఐడి ఎంక్వయిరి చేస్తుందా? అని ఆడిగేసరికి నాకు తల కొట్టేసినట్లైంది.
చి చి..ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లేదా?
ఇంకొకరి ఫోన్ తాకకూడదు వారి మెసేజెస్ చూడకూడదు అని బుద్ధి ఉండక్కర్లేదా?
మీ పుట్టింట్లో ఇవ్వన్నీ నేర్పించలేదా? ఎంబిఏ చేశావ్ ఎందుకు? అఘోరించడానికి?” అని మాధవ్ ఆపకుండా అరిచిన అరుపులకి మనసు కష్టం వేసిన ప్రియ.. కళ్ళ నీళ్లతో గిరుక్కున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. మాధవ్ సోఫా లో జారిగిలపడి తన చెల్లెలికి ఫోన్ చేసి ప్రియ కి పద్దతులు తెలియవు అని, ఏమి అనుకోవధ్ధు అని హాయిగా వచ్చి ఎన్ని రోజులైనా ఇంట్లో ఉండొచ్చు ప్రియ వంటలు బాగా చేస్తుంది అని అంటున్న మాటలు వినపడ్డాయి ప్రియకి. హైద్రాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి అయిన మాధవ్ కి ప్రియ కి  నెల క్రితమే పెళ్లి అయింది. కొత్తగా ఫ్లాట్ అద్దెకి తీసుకుని కాపురం పెట్టారు.పెళ్ళైన కొత్త లోనే భర్త చేతిలో అకారణంగా చీవాట్లు తినాల్సి రావడంతో ఎంతో నొచ్చుకుంది ప్రియ. ఆ రోజు ఆదివారం. మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు. ప్రియ తన పిన్ని గారు ఢిల్లీ నుండి వచ్చిందని చూడటానికి వెళ్ళింది.
టీవీ లో న్యూస్ చానెల్స్ తిప్పుతున్న మాధవ్ కి ఫోన్ రింగ్ అవడంతో లేచి  బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.  ఛార్జ్ పెట్టి ఉంది ఫోన్. “అరే ప్రియ ఫోన్ మర్చిపోయినట్లుందే” అనుకుంటూ…యధాలాపంగా ఫోన్ కేసి చూసాడు. అఖిల్  2 మిస్డ్ కాల్స్ అని ఉంది. 3 మెసేజెస్ అని ఉంది. మెసేజ్ ఓపెన్ చేయగానే. ఫోన్ లిఫ్ట్ చేయి. అర్జెంట్ అని ఉంది.
“ఎవరీ అఖిల్?”  నాకు తెలిసి ప్రియ బంధువుల్లో అఖిల్ అనే వారు ఎవ్వరూ లేరు. కొంపదీసి కాలేజి లో బాయ్ ఫ్రండ్ నా? లేక ఫేస్ బుక్ ఫ్రండ్ నా?
అమ్మో నేను ఇంట్లో ఉన్నా కాబట్టి ప్రియ ఫోన్ మర్చిపోయింది కాబట్టి సరిపోయింది..ఎప్పటి నుండి మాట్లాడుకుంటున్నారో ఇలా ఫోన్లు చేసుకుని అని మాధవ్  అనుకుంటూ ఉండగా ఇంకో మెసేజ్ వచ్చింది. ఒకచిన్ని పువ్వు స్టిక్కర్. పిన్ని గారింటి నుండి ఎప్పుడు వస్తావ్? అఖిల్ అని ఉంది. ఇక ఆగలేక ఫోన్ చేసాడు. అవతల ఫోన్ కట్ చేస్తున్నారు. మాధవ్ కి పిచ్చి ఎక్కినట్లు ఆనిపించింది. వెంటనే మెసేజ్ చేసాడు.
” ఎవరు బాస్ నువ్వు? ప్రియకి ఎందుకు మిస్డ్ కాల్స్ ఇస్తున్నావ్?  మెసేజెస్ పంపిస్తున్నావ్?”
ఒక రెండు క్షణాలకి ఆ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి “హలొ బ్రో” అన్నాడు. “హాయ్ శ్రీవారూ. నేను అఖిల ప్రియ ని. అదేంటి నా ఫోన్ మీరు లిఫ్ట్ చేశారు? ఓ..అఖిల్ అని ఉండేసరికి లిఫ్ట్ చేశారా? మెసేజెస్ కూడా చూసారా? అన్ని నేను పంపినవే. నా దగ్గర ఉన్న మరో ఫోన్ నుండి నేనే కాల్స్, మెసేజెస్ చేసాను నా ఫోన్ కి. మీరు నాలా ఇంకొకరి ఫోన్ లిఫ్ట్ చేయడాలు, మెసేజెస్ చూడటాలు చేసే వారు కాదు.  ఇంగితం కల వారు అనుకున్నానే”
ఇక ఆ తరువాత ప్రియ ఏమి మాట్లాడుతుందో వినపడలేదు మాధవ్ కి. “మా ఫ్రండ్స్ అందరూ కలిసి మన రిసెప్షన్ లో  ఈ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు. సిం కూడా వాళ్లే వేసిచ్చారు. మీకు ఆ సిం నుండి ఎప్పుడైనా ఫోన్ చేస్తే ట్రూ కాలర్ లో  అఖిల్ అని డిస్ ప్లే అవుతుంది. ఎవరో అనుకుంటారేమో. నేనే” అని రిసెప్షన్ అయిన రాత్రి ప్రియ చెప్పిన మాటలు చెవిలో గింగిరాలు తిరుగుతుండగా అలాగే కూలబడ్డాడు మాధవ్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!