మారిన భర్త

మారిన భర్త
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వడలి లక్ష్మీనాథ్

గుర్తుంది కదా అల్లుడు! అమ్మాయి స్నిగ్ధ ముందే చాలా కోపంగా ఉంది, నచ్చచెప్పి పంపిస్తున్నాము.
అమ్మాయి కొంచెం గారాబంగా పెరిగింది. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కించాను, ఒక గంటలో దిగుతుంది. టైం కల్లా ఎయిర్పోర్ట్ దగ్గర ఉండు” ఫోనుచేసి చెప్పాడు మావగారు. నేను మీరందరూ చెప్పినట్టు అన్నింటికి ఒప్పుకొన్నాను కదా మావయ్య! తనకు నచ్చలేదని ఇల్లు కూడా మార్చాను. ఇంట్లోకి సరికొత్త ఫర్నీచర్ తీసుకొన్నాను. ఈ మధ్యనే కారు కూడా తీసుకున్నాను. మీ అమ్మాయికి చెప్పారు కదా, ఎర్ర కారని. ఎందుకైనా మంచిది, కొత్త ఇంటి అడ్రస్ కూడా ఇవ్వలేకపోయారా? నాతో ఫోనులో కూడా సరిగా పలకడం లేదు” అన్నాడు యశ్వంత్. అమ్మాయికి అడ్రసుతో సహా అన్నీ వివరంగా ఇచ్చాను. ఎర్ర రంగు కుర్తీ వేసుకొంది. పుట్టింట్లో ఉంది కదా! కొంచెం ఒళ్ళు చేసింది. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అల్లుడు!  అమ్మాయి కారు ఎక్కగానే నువ్వు ఫోను స్విచ్ఛాఫ్ చేసుకో. అసలే నీకు స్నేహితులు ఎక్కువ. డ్రైవింగులో ఫోను  మాట్లాడితే అమ్మాయికి అస్సలు నచ్చదు” చెప్పాడు మావగారు. అలాగే స్నిగ్ధ కారు ఎక్కగానే ఫోను స్విచ్ఛాఫ్ చేస్తాను. టైమ్ అయిపోతోంది, నేను ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతున్నాను” చెప్పాడు యశ్వంత్. ఫోను పెట్టేసాక కారు స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాడు యశ్వంత్. యశ్వంత్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి, పెద్ద జీతము. యశ్వంత్ కి ఒక ఆరు నెలల క్రితం పెళ్లయింది. అసలే అమ్మాయిల కొరతగా ఉన్న రోజుల్లో ఆరేళ్లు వెతికితే, అదృష్టం బాగుండి స్నిగ్ధ పెళ్ళికి ఒప్పుకొంది. పిల్లవాడు బుద్ధిమంతుడు, పొదుపరి అని మురిసిపోయాడు మామగారు.
సాఫ్ట్ వేర్ అనేసరికి రంగుల కలలు కనే స్నిగ్ధకు, ముందు జీవితం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో డ్యూయట్ లా కనిపించింది. పెళ్ళి తరువాత  స్నిగ్ధను యశ్వంత్ తన ఉండే అదే చిన్న రూములో కాపురం పెట్టేసరికి, తట్టుకోలేక పోయింది. చెప్పి చూసింది, యశ్వంత్ వినలేదు. దాంతో స్నిగ్ధ “ఇది పొదుపు కాదు, పిసినారితనం. ఇలాంటి వాడితో నేను ఉండలేను” అని పెద్దల ముందు తెగేసి చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. యశ్వంత్ తల్లి గౌరీ, ” నీకు మళ్ళీ సంబంధం చూసి పెళ్ళి చేసే ఓపిక నాకు లేదు. ఎప్పటికైనా నువ్వు ఆ అమ్మాయితోనే సంతోషంగా ఉండాలి. నీ పిసినారితనం మేమే భరించలేకపోతున్నాము. ఏ అమ్మాయి తట్టుకోలేదు. అమ్మాయి అడిగింది మంచి ఇల్లు, కారే కదా! ఇల్లు మారు, ఒక కారుకొని పిలిపించుకో. అంతేగాని మళ్లీ సంబంధం చూడమంటే నావల్ల కాదు” చేతులెత్తేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో యశ్వంత్ స్నిగ్ధ  కోరుకొన్నట్టుగా ఇల్లు తీసుకుని, కారు కొని కబురు చేశాడు.”ఫోన్లో కూడా ముభావంగా, పొడిపొడిగా మాట్లాడుతోంది. ఇంటికి వచ్చాక ఎంత బతిమిలాడు కోవాలో. మొత్తానికి తను అనుకున్నది సాధించింది కదా!  నేను కూడా కొంచెం బెట్టుగానే ఉండాలి” అని మనసులోనే అనుకున్నాడు యశ్వంత్. ఆలోచనల్లోనే కారు ఎయిర్పోర్టు చేరింది. దూరంనుంచి కనిపిస్తోంది ఎర్ర రంగు కుర్తీలో. అప్పటికే బయటకు వచ్చి నిలబడి దిక్కులు చూస్తోన్న స్నిగ్ధ. ముఖానికి మ్యాచింగ్ మాస్క్ ఒకటి. దీని సోకులకి నేను సరిపోను” అని మనసులోనే అనుకున్నాడు. కారు దగ్గరకు వస్తూనే చెయ్యి ఊపి, కారు ఆపి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసాడు. స్నిగ్ధ ఈ లోపలే వెనక డోర్ ఓపెన్ చేసుకుని ఎక్కింది. యశ్వంత్ కారు దిగి, సామానులు వెనక డిక్కీలో పెట్టి, వెనక ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో, మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసి బయలుదేరాడు యశ్వంత్. కారు ఎక్కిన వెంటనే మామగారికి మెసేజ్ పెట్టి ఫోను స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఇన్ని ఏర్పాట్లు చేసి రమ్మని పిలిచినా, అంత  మొండితనంగా ఉంటే, నేను హలో అని పలకరించాలా. ఇంటికెళ్లాక చూద్దాము లే అనుకున్నాడు. స్నిగ్ధ మాస్క్ లో ఉండి  ఫోనులో మాట్లాడుతోంది.”నేను కారు ఎక్కాను. తర్వాత మాట్లాడుతాను” అని. వెనకనుండి మాట అస్పష్టంగా వినిపిస్తోంది యశ్వంత్ కి. అరగంటలో ఇల్లు చేరుకున్నాడు. ఈ అరగంటలో ఆమె ఏమీ మాట్లాడలేదు. యశ్వంత్ కూడా, ఇంటి దాకా వచ్చింది కదా! ఇల్లు, తను తీసుకున్న  ఫర్నిచర్ ఇవన్నీ చూసాక, ఇంత మంచి పని చేసావు. అంటూ మెచ్చుకొంటుంది అనుకున్నాడు. కారు దిగి “అపార్ట్మెంట్ నెంబర్ ఎంత? ఎన్నో అంతస్తు” అంది.
అపార్ట్మెంట్ తాళం తీసి చేతిలో పెడుతూ, “రెండవ అంతస్తు, ఇంటి నెంబర్ 203″ అన్నాడు. తాళము తీసుకొని లిఫ్ట్ ఎక్కి  వెళ్ళిపోయింది స్నిగ్ధ.
వెళ్ళిన వైపుకు చూస్తూనే, సామానులు తీసుకొని వెళ్ళాడు యశ్వంత్. లోపలికి వెళ్ళిన యశ్వంత్ కు,  స్నిగ్ధ కనిపించలేదు. బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది. చేసేదేమీలేక లోపల వంటగదిలో కెళ్ళి వండిన వంట టేబుల్ మీద పెడుతూ, కాఫీ తయారు చేసి ట్రే లో పెట్టాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూసిన యశ్వంత్ కొయ్యబారి పోయాడు. ఎదురుగా స్నిగ్ధ. నువ్వు ఇంక ఈ జన్మలో మారవు. మా నాన్న చెప్తే వచ్చాను. నీకు ఎయిర్పోర్ట్ కి కూడా రావాలని అనిపించ లేదా?” అంటూ లోపలికి వచ్చింది. యశ్వంత్ తల తిప్పి బెడ్ రూం వైపు చూస్తూన్నాడు. అప్పుడే బెడ్రూమ్ తలుపు తీసుకుని బయటకు వచ్చింది లోపలున్న మహిళ. ఎవరు ఆవిడ?” అడిగింది స్నిగ్ధ.
ఎవరు మీరు?” అడిగాడు యశ్వంత్ ఆమె వైపు చూస్తూ. మీరంతా ఎవరు?” అడిగిందా యువతి.
యశ్వంత్ వైపు ఆ యువతి వైపు ఎగాదిగా చూస్తూ, “మా అన్నయ్య పంపించిన కారు డ్రైవరు మీరు  కాదా?”అడిగింది. కాదు అన్నాడు భయం భయంగా.
మరి మీరు నా దగ్గరకు వచ్చి, కారు ఆపారు? ప్రశ్నించింది. నా భార్య ఎర్ర రంగు కుర్తీ వేసుకొని వస్తోందని మా మామగారు చెప్పారు. మీ డ్రస్ చూసి, మీ దగ్గర కారు ఆపాను. మాస్క్ వేసుకోవడం వల్ల మిమ్మల్ని స్పష్టంగా చూడలేదు ” అన్నాడు నీళ్ళు నములుతూ. అప్పుడే ఆ యువతి చేతిలోని ఫోను రింగయింది. ఫోను లో అవతలి వ్యక్తి, నీ కోసం పంపిన కారు ట్రాఫిక్ వల్ల ఆలస్యంగా ఇప్పుడే వచ్చింది. డ్రైవరు అక్కడ ఎయిర్పోర్టులో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు?” అని. జరిగిన పొరపాటు వివరించి, యశ్వంత్ వైపు తిరిగి, సారీ అండీ! మీతో మాట్లాడి కారు ఎక్కవలసింది. సారీ మేడమ్ సారీ” అంటూ సామానులు తీసుకొని వెళ్ళిపోయింది. జరిగిన పొరపాటు అర్దం చేసుకొన్న యశ్వంత్, స్నిగ్ధ ను దగ్గరగా  తీసుకొని, చేతిలోని కాఫీ స్నిగ్ధ చేతికి అందించాడు. చూడ చక్కనైన ఇల్లు, ఫర్నీచర్ చూసిన స్నిగ్ధ చేతిలో ఉన్న కాఫీ వాసనతో తన్మయత్వంగా “నా కోసం ఇంతలా మారి పోయావు” అంటూ యశ్వంత్ ను అల్లుకు పోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!