మల్లూరు విశిష్టత

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

మల్లూరు విశిష్టత
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వడలి లక్ష్మీనాథ్

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. ఈ గడ్డమీద ఎన్నో విచిత్రమైన మరియు ఎన్నో అంతుచిక్కని ప్రదేశాలు ఉన్నాయి. అవి చాలా మటుకు ప్రజాదరణకు నోచుకోక ప్రాచుర్యములో లేనివి. అటువంటిదే వరంగల్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో, భద్రాచలం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.
ఆలయములో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలసిన స్వామి. ఆ ఆలయం వరంగల్ నుంచి వెళ్ళినప్పుడు ఏటూరునాగారం అడవులు దాటి ఆ తర్వాత కమలాపురం దాటిన తర్వాత ఉంటుంది. ఆ ఆలయం విశిష్టత తెలుసుకున్న వెంటనే నాకు ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించింది. అది కొంచెం ప్రయాసతో కూడిన పని. వరంగల్ నుండి కారులో బయలుదేరాము.
అది కొండల మధ్యలో ఉన్న పురాతన దేవాలయం. ఆయన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అడవులలో కొండ మీద వెలసిన స్వామి ఒకపక్క, మరో పక్కగా ప్రకృతిలోని అందాన్ని ఒక్కచోట పెట్టినట్టుగా పెద్దపెద్ద వృక్షాలు. ఆలయం చుట్టుముట్టిన ఆ వృక్ష సంపద ఎన్నో ఔషధ గుణాలు నిండినటువంటి ప్రాకృతిక సంపద. ఆలయం చెట్ల ప్రాకారములో కొండ మీద ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఒక పక్కగా ప్రకృతి సోయగారమైన జలపాతం ఆ ఆలయానికి అలంకారముగా ఉంది. ఆ జలపాతాల పేరు చింతామణి జలపాతం. ఆ జలపాతంలోని నీరు అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్తారు. నేను చూస్తుండగానే డబ్బాలతో చాలామంది నీరు నింపుకొని పట్టుకొని వెళ్తున్నారు. అది అనారోగ్యాలు చేసినప్పుడు ఔషధంగా వాడుకుంటారు. మేము వెళ్ళే సరికి నీరు అంత ధారగా లేదు. అక్కడున్న వారు చెప్పింది ఏంటంటే అది మనుషులను బట్టి నీరు ధారగా వస్తూ ఉంటుందని. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ జలపాతం కొండలగుండా వస్తుంది. అక్కడ ఎంత మంది మనుషులు వస్తే అంత జలపాతం నీటిధార పెరుగుతుందని చెప్పారు. ముందు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మేము పక్కన నిలబడి చూస్తున్నాం జనాలు వచ్చారు. నిజంగానే మేము జలపాతం క్రింద ఉన్నప్పుడు మాకు సరిపడా నీటిధార వచ్చింది. ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ఆ జలపాతం చాలా ఎక్కువగా వచ్చింది. అది కొంత వింతగా అనిపించింది. అక్కడ సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, అప్పుడు వచ్చే జనాలు మొత్తం ఆ జలపాతంలోనే స్నానాలు చేస్తారు అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను.
ఈ ఆలయం సముద్ర మట్టం నుండి 1500 కిలోమీటర్ల ఎత్తుకు ఉంది. ఈ స్వామి విశిష్టత ఏమిటంటే, ఆలయం కొండలలో కలిసి ఉన్నప్పటికీ ఆ స్వామి శరీరం మానవ శరీరంలా నిర్మితమై, ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. స్వామి వారి శరీరం పొట్ట భాగము మానవుల పొట్టలాగ మెత్తగా, నొక్కితే లోపలకు వెళ్ళి, కొంత సమయానికి మామూలుగా వచ్చేస్తుంది. అతని ఉదర భాగం మీద మానవులకు ఉన్నట్టుగా వెంట్రుకలు కూడా సహజ సిద్ధంగా ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు. స్వామి వారి నాభి నుండి ద్రవము లాంటి పదార్దము ఊరుతూ వుంటుంది.
చాలామంది పిల్లలు లేని దంపతులు అక్కడకి వచ్చి ఆ స్వామివారి నుండి వచ్చే ద్రవము ప్రసాదంగా స్వీకరిస్తారు. దాని వల్ల వారికి సంసార సాఫల్యం కలుగుతుందని, దీర్ఘకాలిక, మరియు చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని ప్రతీతి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!