పశ్చాత్తాపం

పశ్చాత్తాపం

రచన: నరసింహా రెడ్డి

“ఆత్ర..! ఏమైంది, అర్జెంటుగా రమ్మన్నావు..!?”  ఆదుర్దాగా అడిగింది శ్రావ్య.

ఆ ప్రశ్నకు సమాధానంగా ఆత్ర నుండి గట్టు తెగిన గోదావరిలా కన్నీళ్ళే  దర్శనమిచ్చాయి.   బుగ్గ మీద ఎండిన కన్నీటి చారికలు, ఉబ్బిన కళ్ళు  ఆమె ఎప్పటినుండో ఏడుస్తూ ఉంది అనడానికి సాక్ష్యంగా నిలిచాయి.
ఆత్రను లాలనగా దగ్గరకు తీసుకుని వెన్ను నిమురుతూ ఓదార్చింది శ్రావ్య.  ఒక్కోసారి మాటలకంటే  ఆత్మీయ స్పర్శ చాలా ధైర్యాన్ని స్తుంది.

కొద్దిసేపటికి తనను తాను నిభాయించుకుని  కళ్ళు తుడుచుకుంది ఆత్ర.

“ఏమైంది అసలు? ఎందుకిలా ఉన్నావు?” అడిగింది శ్రావ్య.

“అంతా అయిపోయింది శ్రావ్య. నేను నమ్మిన నమ్మకం నన్ను మోసం చేసింది. కంటితో చూసి నమ్మినవన్నీ  కల్లలై పోయాయి..” అంది గద్గద స్వరంతో.

“కొంచెం క్లారిటీగా చెప్పవే..?” ఆందోళనగా అంది శ్రావ్య.

 “ధమన్ నన్ను మోసం చేశాడే..” అంటూ మళ్ళీ కన్నీళ్ళపర్యంతం అయ్యింది  ఆత్ర.

“కొంతమంది మగవాళ్ళు ఎందుకే ఇలా చేస్తారు? మోసం చేయడానికే పుట్టినట్లు!!” బాధపడుతూ అంది శ్రావ్య.

“వదిలే తత్త్వం మగాడిది,,మోసే తత్త్వం ఆడదానిది అని తెలిసి కూడా మోసపోవడం మన తప్పే”  నిర్వేదంగా అంది ఆత్ర.

“ఇన్ని తెలిసిన నువ్వు,,అలా ఎలా మోసపోయావే?” కోపం, ఆవేదన నిండిన స్వరంతో ప్రశ్నించింది శ్రావ్య.

“దీపపు వెలుతురు చూసి ఆకర్షించబడ్డ పురుగులు ఆ దీపపు మంటకే ఆహుతయినట్లు,,,,ప్రేమ అనే అందమైన ఆకర్షణకు లొంగిపోయాను.  ఇప్పుడు ఇలా బాధపడుతున్న” అంది ఆత్ర.

“అన్ని విషయాలలో తెలివిగా వ్యవహరించే నువ్వు ఇలా ఒక మగవాడి చేతిలో మోసపోవడం నమ్మలేకపోతున్నాను..” అంది శ్రావ్య.

“ఆశ మనసుని కప్పేసినప్పుడు ఆలోచన అదుపు తప్పుతుంది.. మధ్యతరగతి వాళ్ళం కదా.. నాలాంటి వారికి ఆశ, అత్యాశగా మారడానికి పెద్దగా సమయం పట్టదు” అంది  ఆత్ర.

“అసలెక్కడ మొదలయ్యింది ఇది?” అడిగింది శ్రావ్య.

“నా ఆశ, అసంతృప్తి గా మారిన క్షణం నుండి..” శూన్యంలోకి చూస్తూ అంది ఆత్ర.

“ఏంటి,,నువ్వనేది?” ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య.

“చెప్తానే.. నీకు చెప్తే కానీ, నా గుండె బరువు తగ్గదు..

ఆరోజు నాన్న షాపింగ్ కి వెళదామన్నారు.

‘ఏమే! ఎంతసేపు ఇంటికి తాళం వేయడం? ఆలస్యం అవుతుంది. తొందరగా రా! నా బిడ్డకు ఈరోజు మంచి మంచి బట్టలు కొనాలి!!’  అన్నారు నాన్న సంతోషంగా.

‘వస్తున్నానండీ! హా, లోకంలో మీకే ఉంది బిడ్డ మరి’   అంటూ వచ్చింది అమ్మ.

“నా బిడ్డ నా తల్లి. నా ప్రాణం.  లోకంలో ఎవరైనా సరే, నా బిడ్డను నేను చూసుకున్నంత ప్రేమగా ఎవరూ చూసుకోలేరు” నాన్న గొంతు నుండి గర్వంతో కూడిన ఆనందంతో వచ్చాయి మాటలు.

మురిపెంగా నన్ను చూస్తూ బైక్ ఎక్కింది అమ్మ.

వాళ్ళంత ప్రేమను పంచుతున్నా, నాకు ఆనాడు అర్థం కాలేదు ఆ ప్రేమ విలువ. ఎంతసేపు నా ఆలోచనలు ‘అమ్మ కూడా బైక్ ఎక్కితే నాకు ఇరుకయిపోతుంది’ అనే ధ్యాసే. నా కంఫర్ట్ గురించి తప్ప ఏమీ ఆలోచించేదాన్ని కాదు.

షాపింగ్ అయిపోయింది.  నాకోసం చాలా కొన్నారు నాన్న.  కానీ, ఆ సంతోషం లేదు నాలో.  వచ్చేటప్పుడే ఇరుకుగా ఉంది. ఇప్పుడు ఇన్ని పట్టుకుని ఆ బైక్ మీద ఎలా వెళ్ళాలి? అనే ఆలోచనలు చుట్టుముట్టాయి నన్ను.

అసంతృప్తిగా బైక్ ఎక్కుతూ పక్కకు చూశాను.  అక్కడ ఓ వ్యక్తి, ఐదారు సంవత్సరాలు ఉన్న తన కూతురిని ఎత్తుకుని ముందు సీటులో కూర్చోపెట్టి, తను డ్రైవింగ్ సీటులో కూర్చుని, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

అమ్మా వాళ్ళు షాపింగ్ చేసినవన్నీ బైక్ మీద పడకుండా అడ్జెస్ట్ చేస్తున్నారు.

ఇంకో పక్కకు చూశాను. నా వయసే ఉంటుదనుకుంట ఒకమ్మాయి, స్కూటీ మీద ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. స్కూటీ వెనుక “డాడ్స్ గిఫ్ట్” అని రాసి ఉంది.  వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ అనుకుంట.
అమ్మ బైక్ ఎక్కింది.  ఇంటికి చేరుకున్నాం. నా మీద నాకు న్యూనతాభావం.  అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నాననే ఆలోచనలు ఎక్కువ అయ్యాయి.  అక్కడి నుండే నా పయనం మొదలయ్యింది.” అంటూ కళ్ళు తుడుచుకుంది ఆత్ర.

ఓదార్పు గా భుజం తట్టింది శ్రావ్య.

“అమ్మాయి జీవితంలో రెండు అధ్యాయాలుంటాయి శ్రావ్య. మొదటిది పుట్టినప్పటి నుండి పెళ్ళి అయ్యేవరకు. రెండవది పెళ్ళి నుండి మరణం వరకు.

మొదటిది నా తల్లిదండ్రుల చేతుల్లో అడ్జెస్ట్ అవుతూ బ్రతికాను.  రెండవది అలా ఉండకూడదనుకున్నాను.  నా జీవితం నా చేతుల్లో ఉండాలనుకున్నాను.  ఇకనుండైనా నాకిష్టం అయినట్లు బ్రతకాలనుకున్నాను.  పెళ్ళి విషయంలో అసలు రాజీపడకూడదనుకున్నా.

వాళ్ళు కుదిర్చిన సంబంధం అయితే వాళ్ళ స్థాయిలోనే ఉంటుందని, జీవితం మొత్తం రాజీపడి బ్రతకాలి వస్తుంది అని అలా వద్దనుకున్న.

నేను కోరుకున్న స్థాయికి తగ్గ అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్న.

అనుభవంతో కూడిన ఆలోచన మంచి ఫలితాన్నిస్తుందని, ఆవేశంతో కూడిన ఆలోచన పతనానికి దారితీస్తుందని తెలుసుకోలేకపోయా.

అవసరాన్ని ఆసరాగా తీసుకునే మగాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో ఒకడే ధమన్.

జీవితం కూడా బాగుపడతాయి కి తీసుకున్నంత సమయం, చెడిపోవడానికి తీసుకోదు. నాలో ఏం చూశాడో తెలియదు.  నేలపైన ఉండి ఆకాశం చూసే నాకు, ఆకాశంలో ఎగురుతూ నేలను చూపించాడు.

ఏదీ అడిగే అవసరం లేకుండా అన్నీ నా కాళ్ళముందు ఉంచాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు.నేను కన్న కల కనులముందు కనిపించేది.

కానీ, అదంతా చేపకోసం జాలరి వేసిన గేలం అని తెలుసుకోలేక పోయాను.  ఆ ఎరకు ఆశపడి నా జీవితాన్ని పోగుట్టుకున్నాను.”  బాధగా అంది ఆత్ర.

“వాడు ఏమన్నాడు అసలు, మోసపోయావని ఎలా తెలుసుకున్నాం?” సందేహంగా అడిగింది శ్రావ్య.

నేను తనకు లొంగిపోయిన వారం తర్వాత నుండి నన్ను పట్టించుకోవడం మానేశాడు.  తను నాకు దూరం అవుతుంటే, రియాల్టీ  దగ్గరకు వచ్చింది.
ఏంటిది అని నిలదీశాను..

‘ఏముంది, అవసరానికి ఉపయోగపడ్డావు,,టిష్యూ పేపర్ లాగా!  వాడి పడేశాను.  టిష్యూ కొంచెం ఖరీదు ఎక్కువ అయినా తుడుచుకుని పడేయాల్సిందే కదా.  డబ్బిచ్చి కొన్నారని జేబులో దాచుకోము కదా!!’  అన్నాడు నిర్లక్ష్యంగా.”అంది ఆత్ర.

“నీతిలేని కుక్క వాడు. వాడన్ని అంటూ ఉంటే ఏమీ అనలేదా నువ్వు” కోపంతో ఊగిపోతూ అంది శ్రావ్య.

జీవం లేని నవ్వు నవ్వింది ఆత్ర.

నా కుటుంబమే కాదు,  నా బాధ కూడా మధ్యతరగతే.  వాడి మాటలు విన్నాక,,వాడి కాలర్ పట్టుకుని కోపంగా అరవలేదు, భోరున ఏడవనూలేదు. లోకం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది అనిపించింది.

నన్ను తిడుతున్న నా గుండెశబ్దం మాత్రమే వినిపించింది. బయటకు కక్కలేక,లోపాలు దాచలేక గొంతులోనే దిగమింగాను బాధని.  కానీ, కడలిలా ఉప్పొంగుతున్న ఈ కన్నీళ్ళను ఆపలేక పోతున్నాను” అంది ఏడుస్తూ ఆత్ర.

“ఊరుకోవే, నువ్వేమైనా ఊహించావా ఇలా జరుగుతుందని..!” సానుభూతిగా అంది శ్రావ్య.

అది కాదే,  ఆనాడు నాకు కారులో ఉన్న అమ్మాయి, స్కూటీ మీద వెళుతున్న అమ్మాయి కనిపించారు కానీ,, ఎప్పుడూ నా పక్కన నడుచుకుంటూ వచ్చే నిన్ను  చూడలేకపోయాను.

మనిషి పోలికెప్పుడూ ఉన్నతస్థాయి లో ఉన్న వాటిమీదే ఉంటుంది కానీ, తన స్థాయి వారితో పోల్చుకోదు.  ఆరోజు ఆ క్షణం నువ్వు నాకు గుర్తొచ్చి ఉంటే, ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. నా జీవితంలో అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వే.  నీకు తెలియకుండా దాచిన ఈ విషయాలు కూడా నీకు చెప్పాలని పిలిచాను” అంది ఆత్ర.

“ఊరుకోవే, దేవుడు ఆడించే జీవిత చదరంగంలో ప్రాణం లేని పావులం మనం.  ఆడేది, ఆడించేది ఆయనే.   జరిగిందేదో జరిగింది.  నువ్వు కావాలని చేయలేదుగా. జరిగిందంతా నీ మంచికే అనుకో.  పొరపాటున జరిగిందనుకుని ఒక పీడకలలా దీనిని  మర్చిపో. ”  ధైర్యం చెప్తూ అంది శ్రావ్య.

“చేసేదేమీ లేదు కానీ, చెప్పేది మాత్రం ఉంది”  స్థిరంగా అంది ఆత్ర.

“ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి?” అడిగింది శ్రావ్య.

“అమ్మానాన్నలకు క్షమాపణ చెప్పాలి. మామూలు క్షమాపణ కాదు, చాలా పెద్ద క్షమాపణ చెప్పాలి .నాకు తెలుసు మా నాన్న గురించి బాధపడతారేమో కానీ, తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటారు.”

అన్న మాటలు శ్రావ్య నోటినుండి వింటూ తన వడిలొ కన్నీటితొ తడుస్తున్నటువంటి ఆత్ర చిత్రపటాన్ని తుడుస్తూ మనోరోదన పడుతున్నడు ఆ తండ్రి….

ఒక నిమిషపు అనాలోచన ఖరీదు జీవితం.
తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకం…
మనల్ని ఇష్టపడేవారి దుఃఖం.
ఏ తప్పైనా జరిగిన తర్వాత కన్నా,
జరగకముందే ఆలోచిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

సమాప్తం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!