అలీబాగ్ బీచ్

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

అలీబాగ్ బీచ్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు 

మహారాష్ట్రలోని పుణె నుండి 170 కి.మీ., బాంబే నుండి సుమారు 95 కి.మీ. దూరంలో ఆలీబాగ్ అనే ప్రాంతం ఉన్నది. అక్కడ చాల బీచ్ లు ఉన్నాయి. ఇక్కడి కెళ్ళడానికి ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుండి బోట్ లో వెళ్ళొచ్చు, షిప్ లో వెళ్ళొచ్చు. కార్లు, బస్ లో కూడ వెళ్ళొచ్చు.
అక్కడ మేము చూసిన ఒక వింత గురించి చెప్తాను. అక్కడ ఒక బీచ్ లో ఉదయం ఇసుకలో నిలుచుండి చూస్తే చాల దూరంలో సముద్రం కనిపిస్తుంది. అక్కడ మనము ఉదయం బీచ్ లో పది నిమిషాలు నడుస్తూ వెళితే ఆవలి వైపున శిథిలావస్తలో ఉన్న కొలాబా కోట గోడలు, భవానీ ఆలయం,  హనుమాన్ ఆలయం, ఇంక చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి.
సూర్యోదయ కాలంలో చూడడానికి వెళ్లేటప్పుడు ఇసుకలో మామూలుగా పది పదిహేను నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా గుర్ర బండ్లపై  వెళ్లొచ్చు. ఒక్కొక్కరికి సుమారుగ వంద రూపాయలకు తీసుకెళ్ళి తీసుకొస్తారు. అర కిలోమీటర్ దూరం ఉంటుంది. మేము సరదాగా గుర్రపు బండిలో వెళ్ళాము. మేము వెళ్లినప్పుడు గుర్రం బండి అతను “మీరు చూసి తొందరగా రండి. ఆలస్యమయితే నీళ్ళొస్తాయి.  సముద్రాన్ని దాటడం కష్టం అవుతుంది” అంటే మాకు అర్థం కాలేదు. అక్కడ నీళ్ళు లేవు హాయిగా ఇసుకలో నడుస్తూ  వెళ్ళొచ్చు. మరి సముద్రాన్ని దాటడం కష్టం అవుతుందని అంటుంటే మాకర్ధం కాలేదు. అతను మేము తొందరగా రావాలని అలాగ చెబుతున్నాడు అనుకున్నాము.
మేము వెళ్లి అక్కడ చూడడానికి ఎక్కువేమి లేకపోవుటచే, ఎందుకైన మంచిదని తొందర తొందరగా ఒక గంటలో అన్నీ చూసి వచ్చేశాము. గుర్రపు బండిలో తిరిగి వస్తుంటే, మేము వెళ్ళేటప్పుడు మామూలుగా ఇసుకతో ఉన్న బీచ్ ప్రాంతంలో మూడు  నాలుగు అడుగుల ఎత్తు నీరు వచ్చేసింది. వెళ్లేటప్పుడు అసలు నీళ్లు లేవు. వచ్చేటప్పుడు ఆ నీళ్ళ వేగానికి  బండికున్న గుర్రం నడవలేక పోతుంది. అప్పుడు అనుకున్నాము ఆ గుర్రపు బండి అతను చెప్పింది నిజమేనని. ఒక వేళ మేము అతను చెప్పినట్టు రాకపోయుంటే ఆ రాత్రికి ఆ నిర్జనమైన పాత కోట గోడలలో ఉండి కష్టపడాల్సి వచ్చేది.
అలా టైం గడుస్తున్నకొద్దీ నీటిమట్టం పెరుగుతూ, మధ్యాహ్నం అయ్యేసరికి కెరటాలతో సముద్రమట్టం పెరిగిపోయి అసలు ఉదయం నడిచింది ఇక్కడేనా అనిపిస్తుంది.
సూర్యస్తమయం అయ్యేసరికి ఉదృతమైన కెరటాలతో అంతులేని జలరాశి గల సముద్రం దర్శనమిస్తుంది.
మళ్లీ ఉదయం చూసే సరికి అసలు నీళ్ళు కనిపించవు దూరంగా ఎక్కడో సముద్రం కనిపిస్తుంది. ఆవలివైపున ఉన్న కోటకు ఇసుకలో మామూలుగా నడుస్తూ వెళ్ళి రాగలుగుతాము. అది చాలా వింతైన సముద్రతీరంగా తోచింది మాకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!