మనసున్న మనుషులు

మనసున్న మనుషులు

    వనజ ఆందోళనగా  తన స్నేహితులు అందరికీ ఫోన్  చేస్తోంది అర్థరాత్రి సమయం కావడంతో ఎవరు స్పందించడం లేదు. పోనీ ఇరుగు పొరుగు వారిని సహయం అడుగుదామ అంటే, వారుండేది  ఉరుకులు పరుగుల జీవితంతో క్షణం తీరిక లేకుండా గడిపే ఉద్యోగస్తుల కాలని కావడంతో అందరూ ఉదయాన్నే బయటకి వెళితే ఏ చీకటి పడ్డాకో ఇంటికి తిరిగొచ్చి, ఎవరి ఇళ్ళలో వారు తలుపులు వేసుకుని కూర్చుంటారు.దానితో వాళ్ళు ఎవరితో వనజ కి కనీసం మఖపరిచయం కూడా లేదు.

ఒక ప్రక్క చూస్తే వనజ భర్త రమేష్  గుండె నొప్పితో విలవిలలాడి పోతుండటంతో అంబులెన్స్ కి ఫోన్ చేసింది. కొద్ది నిమిషాలలోనే వారు దగ్గరలో ఉన్న పెద్దాసుపత్రి కి చేరుకున్నారు. అక్కడ డాక్టర్ లు రమేష్ కి వైద్యం మొదలు పెట్టారు.

ఆరూమ్ బయట భర్తకి ఎలా ఉంటుందో  అన్న ఆందోళనతో,నిస్సహాయంగా,ఏడుస్తూ కూర్చున్న వనజ మదిలో పాత జ్ఞాపకాలు అన్ని మెదులుతున్నాయి…..

వనజ,రమేష్ లు ఇద్దరిదీ “రామాపురం ” అనే అందమైన పల్లెటూరు. సుమారు మూడు వందల గడప ఉండే ఆ ఊరి పెద్ద సుందరయ్య గారి ఒక్కగానొక్క కొడుకు రమేష్.  మమకారానికి,ఆప్యాయతలకి నిలయం ఆ ఊరు. ఎవరికి ఏ అవసరం వచ్చినా,శుభ,అశుభ కార్యక్రమాలు ఏమి జరిగినా ఊరు అంతా ఒకచోట చేరేవారు. ఎవరికి ఎవరు ఏమికాకున్న సరే వారంతా    అత్త,పిన్ని,మామయ్య, వదిన,అక్క,తాత ….అంటూ వరసలు పెట్టి ఆప్యాయంగా పిలుచుకునే వారు

తాను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే తల్లి మరిణించింది.ఊరు అంతా కలిసి వనజ తండ్రికి ధైర్యం చెప్పి ఓదార్చడమే కాక వనజను కూడా వారంతా ఎంతో ప్రేమగా తల్లిలేని లోటు తెలియకుండా పెంచారు ఆ మనసున్న మనుషులు.

ఆ ఊరి పెద్దయిన సుందరయ్య గారి భార్య  కొడుకి సంబంధం కోసం వెతుకుతూ  వనజ అందాన్ని, ఆమె తండ్రి మంచితనాన్ని చూసి, కోరి మరీ  వనజను తన ఇంటి కోడలిని చేసుకుంది.అమ్మ లా ఆదరించి పురుడుపుణ్యాలన్నీ అత్తగారే చూసింది.

ఇంజనీరింగ్ చదివిన రమేష్ కి  పట్టణంలో ఉద్యోగం చేయాలని, అక్కడే స్థిరపడాలనీ కోరిక. అక్కడ అయితే పిల్లలని కూడా  పెద్ద కాన్వెంట్ లో ఇంగ్లీషు మీడియంలో వేసి బాగా చదివించు కోవచ్చు అంటూ వనజ కూడా రమేష్ కి వంత పాడటంతో, సుందరయ్య గారికి  ఇష్టం లేకపోయినా వారు వెళ్ళడానికి  ఒప్పకోక తప్పలేదు.అలా వనజ,రమేష్ లు   చిన్న వాళైన ఇద్దరు పిల్లలని తీసుకుని పట్టణానికి చేరారు.

రమేష్ ఉద్యోగం లో అంచెలంచెలుగా మంచి స్థాయికి చేరాడు. అలా చూస్తుండగానే ఇరవైఏళ్ళు గడిచిపోయాయి. ఎప్పుడైనా పండగలకి ఊరు రమ్మని పెద్దవాళ్ళు పిలిచినా ఆ పల్లెటూరి వాతావరణం ఇష్టం లేని  వనజ,రమేష్ లు ఏదోక వంక పెట్టుకుని తప్పించుకునే వారు.కాలంతో పాటు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.అమ్మాయికి మంచి అమెరికా సంబంధం చూసి పెళ్ళి చేశారు. అబ్బాయి విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళాడు.  భార్య,భర్తలు    ఇద్దరే ఒంటరిగా పట్నంలో  ఉంటున్నారు.

నాలుగు రోజుల క్రితమే  రమేష్ తల్లి ఫోన్ చేసి మీకు పిల్లల  బాధ్యతలు తీరాయి  కదా ఇంక మన ఊరికి  వచ్చేయండిరా,  రేపో మాపో అన్నట్టు ఉన్నాయి మా ప్రాణాలు. ఈ వయసులో మీ పంచన పడుండాలనుంది అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ పల్లెటూరులో  ఏముంది వెళ్ళడానికి అని విసుకుంటున్న వనజను చూసి రమేష్ కూడా మౌనంగా ఉండిపోయాడు.

కానీ ఈరోజు ఆమెకి ఆ ఆప్యాయతల విలువ,మనుషుల అవసరం తెలిసొచ్చింది. దేవుడి దయవల్ల, సమయానికి హస్పటల్ కి తీసుకెళ్ళడంతో రమేష్ కోలుకున్నాడు.

ఇంటికి తిరిగి వచ్చిన వనజ అత్తగారు చెప్పినట్టు మనం మన ఊరికి వెళిపోదాం. అసలే మీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా అందరి మధ్యన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంటూ భర్తను ఒప్పించి సొంత ఊరుకి ప్రయాణమయ్యింది.

రామాపురం చేరుకున్నాకా  రమేష్ ఆరోగ్యం గురించి తెలిసి ఊరి వారంతా వచ్చి చూసి,ఎవరికి తోచినట్టు వాళ్ళు ఓదార్చి వెళుతున్నారు.

“అక్కడ పట్టణం లో ఓదార్చే దిక్కు లేక ఎంత క్షోభ అనుభవించిందో వనజ, ఇక్కడ ఎంత మంది ఆత్మీయులో ” అందుకే అంటారు కాబోలు “ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అని”. పల్లెని మరచిపోయి ఆధునికత మోజులో పట్నం చేరి ఇన్నాళ్ళుగా దూరం చేసుకున్న చిన్ననాటి మధుర జ్ఞాపకాలను మళ్ళీ ఆ జంట సొంతగూటికి చేరి ఆస్వాదిస్తున్నారు.

రచయిత:: నాగ మయూరి

 

You May Also Like

2 thoughts on “మనసున్న మనుషులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!