మట్టి వాసన

మట్టి వాసన

రాత్రి డిన్నర్ టేబల్ దగ్గర కూచొని ఉన్నారు, జ్యోతిర్మయీ, భర్త రామశంకరం, కొడుకు ప్రకాష్, కోడలు సింధూర.

కవల పిల్లలు అక్షర, ఆశ్రిత్ లు తినేసి  బెడ్ రూమ్‌లో నిద్రపోతున్నారు.

పక్కపక్క ఎపార్టమెంట్ లే తండ్రీ కొడుకులవి.  కొడుకు కోడలు ఉద్యోగాలకి వెళిపోతారని డిన్నర్ తనే చేస్తుంది జ్యోతిర్మయి. పిల్లలు ఆ ఇంట్లోనో, ఈ ఇంట్లోనో వాళ్ళకి నచ్చినట్టు పడుకుంటారు.

“జ్యోతీ, ఏదో అందరూ ఉన్నప్పుడు మాటాడాలన్నావ్” రామశంకరం చపాతీ తుంపుతూ అడిగేడు.

ప్రకాష్ తలెత్తి “ఏమిటయిందమ్మా?”

అన్నాడు. “ఏమీ కాదు నాన్నా, మన అక్షర, ఆశ్రిత్ ల టీచర్ ఎందుకో రమ్మంటే వెళ్ళేను. వీళ్ళిద్దరూ జనరల్ నాలెడ్జ్ క్లాస్ లో ప్రశ్నలకి

“బియ్యం పప్పులు, పళ్ళు అన్నీ ఎలా వస్తాయి?”

అంటే ‘బిగ్ బాస్కెట్ లో దొరుకుతాయి’ అని చెప్పేరుట. ‘మీ ఇంటికి కాదు అసలు ఎలా పండుతాయి?’ అంటే ఇద్దరూ పకపకానవ్వి, పండడం ఏమిటి మాల్ నించి తెచ్చుకోవాలి” అంటున్నారు.

“అంత బుద్ధిలేకుండా ఎలా వాగుతున్నారు?” ప్రకాష్ అన్నాడు.

రామశంకరం కలగజేసుకొని

“ఇందులో నా తప్పు కూడా ఉంది. తల్లిలాటి పల్లెని వదిలి వస్తే వచ్చేను. మిమ్మలని ఎక్కువగా తీసికెళ్ళలేదు. ముఖ్యంగా పిల్లలు. వాళ్ళని తప్పనిసరిగా తీసుకెళ్ళాలి”

“నేను ఇంట్లో వీడియోలు పెట్టి చూపించి వివరంగా చెప్తాను నాన్నా” ప్రకాష్ అంటే సింధూర అవునన్నట్టు తల ఊపింది.

రామశంకరం నవ్వుతూ “ప్రకాష్ నువ్వు, కోడలూ నయాగారా వీడియోల్లోచూడలేకనే అమెరికా వెళ్ళేరా?” ఈ యూట్యూబ్ లూ, వీడియోలు  మరిగే, ఎవరికీ మట్టివాసన అంటే తెలీటం లేదు.  మనవి పల్లెని మరచిన బతుకులు. అది బద్దలు కొడదాం.  రేపే మన ప్రయాణం. జ్యోతీ, సద్దడాలు మొదలెడదాం”

“మా నాన్న ఇప్పుడు లేకపోయినా ఆఇంట్లో మా నాన్నలాగే వ్యవసాయం చేస్తూ మా తమ్ముడు వేణుగోపాలం ఉన్నాడు. మనల్ని ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు”

సింధూర రాత్రి భర్తతో “ఇదేమిటండీ, మావయ్య గారు ఇలా మాటాడుతున్నారు” అంది.

“లేదు సింధూ, నాన్న చెప్పినది నిజం. పిల్లలకి పల్లె గాలి తెలీదు, మట్టివాసన తెలీదు. భూమాత విలువ

కూడా తెలీటం లేదు. అక్కడ ఓ పది రొజులు వాళ్ళని ఉంచితే, మా బాబాయ్, పిన్ని తో గడిపితే వాళ్ళకి పల్లె రంగూ రుచీ తెలుస్తుంది” అన్నాడు.

*****

పచ్చటి చేలు, ఇంట్లో మహాలక్ష్మి సమూహం లాటి గోశాల, పల్లెటూరే అయినా, సకల సదుపాయలతో బాత్ రూమ్‌ లతో ఇల్లు.

తలకి తువ్వాలు కట్టుకొని తిరిగే  రైతులు, ఇంటి వెనక గడ్డివాములు పెద్దలూ పిల్లలూ అందరూ పరవశించిపోయేరు.  వేణు గోపాల్ భార్య మహాలక్ష్మి పేరుకి తగ్గట్టే ఉంది. చాలా ఆదరంగా చూస్తోంది.  రామశంకరం అన్నదమ్ములు నలుగురు. చెల్లెళ్ళు ముగ్గురు. అందరూ దగ్గర దగ్గర ఊళ్ళలోనే ఉంటారు. వేణుగోపాలం మాత్రం పల్లెని వదల్లేడు.

పిల్లలకి బోధపరిచిందికే తెచ్చేడేమో రామశంకరం పిల్లలకి పొలాల గట్లు, నాట్లు వేసేసరికి పురుగుల కోసం వచ్చే కొంగలు, వాటిని పొద్దున్నే తోలడం చూపించేడు. ఇంటిమనిషిలా ఉండే పనివాడు రాజయ్య పాలు పితకడం చూపించేరు. మహాలక్ష్మి పొద్దుటే గుంజకి తాడు కట్టి పెరుగు వెన్న తీస్తూ నెయ్యి స్వచ్ఛమైనది ఎలా వస్తుందో చెప్పేరు.  చిట్టి చిట్టి దూడలు చెంగనాలు వేస్తుంటే

అక్షర, ఆశ్రిత్ అచ్చు దానిలా గెంతులు వేయడం మొదలెట్టేరు.

రాజయ్య “అయ్యా, గమ్మునరా, మన భీముడు కొమ్ము విసురుతోంది” కేకేసాడు.  వేణుగోపాలం గబగబా వచ్చి శాల దగ్గర ఉద్రేకంగా ఉన్న ఎద్దుకి ఎదురువెళ్ళి కొమ్ముని పట్టి లొంగదీయడం చూస్తూ పిల్లలు కాదు, సింధూర,ప్రకాష్ ల తో సహా అందరూ నివ్వెర పోయేరు.

రాత్రి పూరీ కూరా చేసి పిల్లలకి వెన్నతో పెట్టింది మహాలక్ష్మి.  జ్యోతిర్మయి నవ్వుతూ “మనత్తగారు

ఉండేటప్పుడు దిబ్బరొట్టెకి కూడా వెన్న వేసేవారు. నీకూ అదే అలవాటు లక్ష్మీ” అంటే

“మరెప్పుడయినా అలవాట్లయినా, సంప్రదాయం అయినా ఆడవాళ్ళకి అత్తింటిదే అబ్బాలి కదక్కా” అంది

మహాలక్ష్మి. నాలుగు రోజులకే పిల్లలకి స్కూల్లో వాళ్ళ తెలివి తక్కువ వాగుడు తెలిసి వచ్చింది.

వారం రోజులకి ఇంటినీ, పశు సంపదనీ వదల్లేం అనిపించింది.

ఆ రోజు అనుకోకుండా వడగళ్ళ వాన పడేసరికి ఇద్దరూ వడగళ్ళు ఏరుకుంటూ తడిసి డేన్స్ మొదలెట్టేరు.  “అమ్మా, తాతయ్యా కమ్ కమ్ ఈ వాసన ఎంత బాగుందో చూడు” అక్షర కేక వేసింది

“అదీ మట్టివాసనే పాపలూ, ఆ వాసన పీల్చాలి. ముక్కుకు పట్టాలి, అప్పుడే ఆనందం జ్యోతిర్మయి హుషారుగా అంది.  పిల్లలని తృప్తిగా చూసేరు పెద్దలందరూ.

రచయిత::మంగు కృష్ణ కుమారి

 

 

You May Also Like

One thought on “మట్టి వాసన

  1. చాలా బాగుందాండి. లవ్లీ😍🤗🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!