మర్చిపోలేని క్యాంప్

మర్చిపోలేని క్యాంప్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎన్.లహరి

            సరళ.. ఒక మధ్య తరగతి అమ్మాయి. ఇంటి దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒక రోజు  NSS క్యాంప్ లో భాగంగా పక్కనే ఉన్న పల్లెటూరుకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆ ఊరివారి ఆత్మీయ పలకరింపు, వారు చూపిన ఆదరణ చూసిన సరళకి వారికేదైనా చేస్తే బావుణ్ణు అనిపించింది. వారి జీవనశైలి గమనిస్తే ఎక్కువ మంది నిరక్షరాస్యులు.  పరిసరాలు మరియు వాటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా తెలియనివారు. వారికి చదువు, శుచి, ఆరోగ్యం గురించి చెప్పినా సీరియస్ గా తీసుకోరని అర్ధమైంది సరళకి. ఒక రోజు క్యాంప్ వర్క్ లో భాగంగా, ఇంటింటికీ తిరుగుతూ ఉండగా… ఒక పూరి గుడిసె దగ్గర తన కాళ్ళు ఆగిపోయాయి. అక్కడ ఒక ముసలావిడ ఒంటరిగా కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది. “ఒక్కదానివే ఉన్నావు. ఎవరమ్మా నువ్వు?” అని అడిగింది సరళ “నా పేరు సావిత్రమ్మ. నా కొడుకులు నా భూమిని బలవంతంగా లాక్కుని, నన్ను వదిలేశారు ” అంటూ  సరళకు చెప్పుకుని  ఏడ్చింది. “అయ్యో!! అలాగా..” అని బాధపడింది సరళ క్యాంప్ పూర్తీ అయి తిరిగి ఇంటికి వచ్చేదాకా సరళ ఆమెను ప్రతీ రోజూ కలుస్తూనే ఉంది. తను దాచుకున్న డబ్బు తీసుకుని,  స్నేహితురాలితో కలిసి సావిత్రమ్మ ని కలిసింది. “ఈ రోజు నుండి నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి. ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు” అని ఫోన్, కొంత డబ్బు ఇచ్చింది. చిన్న చిన్న కవితలు, కథలు రాసి వివిధ పత్రికలకు పంపి వచ్చిన డబ్బులతో పాటు, ‘హెల్పింగ్ ఫర్ పూర్’ వంటి స్వచ్చంద సంస్థల సాయంతో సావిత్రమ్మ ఇల్లు రిపేర్ చేయించింది. తండ్రి సాయంతో ఆమెని ఆ ఊరిలోని ‘పి హెచ్ సి’ లో ఆయా గా  చేర్పించింది. చూస్తూండగానే కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసి పోయాయి. సరళ చేతికి లా పట్టా వచ్చింది.
అటు  సావిత్రమ్మ కాస్త నిలదొక్కుకునే సరికి ఆమె కొడుకులు మళ్ళీ తిరిగి వచ్చి ఆమెని డబ్బు కోసం, ఇప్పుడు ఉంటున్న ఇల్లు కోసం వేధించసాగారు. జరుగుతున్న అన్యాయానికి సావిత్రమ్మ  సరళ దృష్టికి తీసుకు వచ్చింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు సరళ. తను అప్రెంటిస్ గా పని చేసే సీనియర్ లాయర్ సలహా మేరకు సావిత్రమ్మ  కొడుకులపై కేసు పెట్టింది. కొంతకాలం కేస్ సాగి వాదోపవాదాలు అన్ని పూర్తి అయ్యాక జడ్జిగారు   సావిత్రమ్మకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
“ఆమె బ్రతికినంత కాలం ఎవ్వరూ కూడా భూములను  పంచుకోవద్దని, భూమి మీద,  సంపాదించుకున్న డబ్బులు మొత్తం ఆమెకే చెందుతాయని” సావిత్రమ్మ కన్నీళ్లతో సరళ పాదాలు కడిగింది..వారించింది సరళ. ఆమెకి ఎలా బ్రతకాలో కూడా నేర్పింది సరళ. అభాగ్యులైన మహిళల్ని చేరదీసింది సావిత్రమ్మ. సరళ అందించిన ఆత్మ విశ్వాసం, ప్రొద్భలంతో ఆమె మరో నలుగురికి ఆసరా అయ్యింది. చేతి వృత్తుల పనులు మొదలుబెట్టి చిన్న కుటీర పరిశ్రమ స్థాపించేదాక వెళ్ళింది సావిత్రమ్మ. ‘ఒక చిరు దీపం గది నిండా కాంతి నింపుతుంది. ఒక మంచి ఆలోచనా… కోటి మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది’. ఆమెని చూసి తృప్తిగా గుండెల నిండుగా సంతోషంగా చూస్తూ.. ఈ ఆలోచనలతో మరో సావిత్రమ్మ కోసం…

You May Also Like

One thought on “మర్చిపోలేని క్యాంప్

Leave a Reply to Raghavender Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!