మొక్కయి వంగనిదే!మానై వంగునా

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

మొక్కయి వంగనిదే!మానై వంగునా

రచన:తిరుపతి కృష్ణవేణి

కరోనా లాక్డౌన్ ల కారణంగా చాలా రోజుల తరువాత మనుమడు, మనుమరాలు పింకీ, టీంకులను చూడటానికి వచ్చిన అమ్మమ్మ పార్వతమ్మని చూసిన పిల్లలు ఎంతో ప్రేమా, ఆప్యాయతలతో వాటేసుకున్నారు.ఇంతలో వంట పని ఇంటి పని ముగించుకొని అందరిని భోజనానికి లేవండి అని పిలిచింది అమ్మ వాణి. పిల్లలకు ఇష్ట మైన పప్పు రసం పిండి వడియాలు అమ్మ కి ఇష్టమని గుత్తి వంకాయ కూర భర్తకు ఇష్టమైన గోంగూర పచ్చడి అప్పడాలు గుమ్మడి వడియాలు తోటకూర ఇలా అమ్మ చాలా రోజులకీ వచ్చిన సందర్భంగా నాలుగు రకాల వంటకాలు తయారు చేసింది. అందరు కలిసి భోజనానికి సిద్ధం అయ్యారు. అమ్మమ్మే తినిపించలంటూ మారాం చేసారు పిల్లలు. అమ్మమ్మ ప్రయాణం చేసి అలసిపోయింది మీరు తినండి అమ్మమ్మని విసిగించకండి అన్నది వాణి. హాఁ!మాకు అమ్మమ్మే పెట్టాలి అంటూ గారాలు పోతూ అడిగారు పింకీ, టింకూలు.
పోనిలేవే! వాళ్ళకి పెట్టిన తరువాతే నేను తింటాలే! ముందు వాళ్ళకి పెడతాను ఇలా ఇవ్వు అన్నది, పార్వతమ్మ. అమ్మమ్మ చేతి గోరు ముద్దలు ఎంతో ప్రేమతో పెడుతుంటే తృప్తిగా తిన్నారు పిల్లలు. భోజనాలు పూర్తి అయిన తరువాత ఆరు బయట పిండారాబోసినట్లుఉన్న వెన్నెల్లో మంచాలు వేసుకొని అమ్మమ్మను మంచి కథ చెప్పమని మారాం చేశారు.
అలగే చెపుతానర్రా! అన్నది అమ్మమ్మ. పిల్లలు ఇద్దరు అమ్మమ్మకి చెరో ప్రక్క పడుకున్నారు.
అమ్మమ్మ కథ చెప్పటం ప్రారంభించింది.
ఒక ఊర్లో రాధా రాము అనే దంపతులు వుండే వారు. వారికి చాలా కాలం తరువాత ఒక్కగా నొక్క కొడుకు పుట్టాడు. వాడి పేరు సంతోష్ వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచ సాగారు . వాడు అడిగిందల్లా ఇస్తూ ఏ లోటు తెలియకుండా పెంచారు.చదువు తెలివి తేటలు అన్ని బాగానే వున్నాయి. కానీ అతి గారాబం వలన వాడు అనుకున్నది జరగాల్సిందే! అలా కాక పోతే అది నెరవేరవరకు ఏమి తినకుండా నానా గొడవ చేసే వాడు.
వయసు పెరిగే కొద్ది తనలో అల్లరి కూడా పెరుగుతూ వచ్చింది.
సంతోష్ ఏ తప్పు చేసినా తప్పుని తప్పు! అని చెప్పే వారు కాదు. వాడే తెలుసుకుంటాడులే! అని అనుకునే వారు. బంధువులు గాని ఫ్రెండ్స్ వచ్చిన సందర్భంలో కూడా వాడికి భయపడటం, గౌరవంగా మాట్లాడటం మర్యాదగా ఉండటం తెలిసేది కాదు.
పెద్దవాళ్ళు, ఇతరులు వచ్చినప్పుడు వారితో ఎలా వ్యవహారించాలి? అనే విషయము కూడా తెలిసేది కాదు.ఎవరూ చెప్పేవారు కాదు?
తల్లి దండ్రులు ఎంత సేపు వాడే తెలుసు కుంటాడులే!అని వాడిని వదిలేసేవారు?
అన్నీ విషయాలు తనకి
తానుగా ను తెలుసుకోవాలి అన్నదే, వాళ్ళ ఆలోచన! తల్లి అమ్మ రాధ మాత్రం అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే వుండేది . కొడుకంటే ప్రాణమైన నాన్న రాము మాత్రం, గద్దించి చెప్పటానికి ఏ మాత్రం ఇష్టపడే వాడుకాదు. అలా అలవాటు పడిన సంతోష్ అమ్మ ఎప్పుడయినా కోప్పడి తే అస్సలు సహించలేకపోయె వాడు. తనకి ఏదో పెద్ద అవమానం జరిగినంతగా ఫీల్ అయ్యే వాడు. ఇకపోతే ఇంట్లో తన వారు ఎవరు? ఇతరులు ఎవరు ఇలా రక్త సంబంధాలు విలువల గురించి కూడా చెప్పేవారు కాదు? ఇంట్లో ఉన్న నానమ్మను కూడా శత్రువు గా భావించి తరచూ వెళ్ళిపో అని తిడుతుండేవాడు. నానమ్మకు మనమడు అంటే పంచ ప్రాణాలు. ఒకప్రక్క ఆమె గారాబం కూడా ఎక్కువే! నా మనమడు అలా! నా మనమడు ఇలా! అంటూమురిచిపోతూచెబుతుంటుంది.తన ఒంట్లో వున్న శక్తి నంతా ఉపయోగించి నీకు అది కావాలా! నీకు ఇది కావాలా అంటూ అన్ని పిండివంటలు చేసి ముందు వుంచేది అందులో ఒకటి, రెండు ఎంచుకునే వాడు . ఎంతో కష్ట పడి వాటిని తయారు చేసేది. ఆ తరువాత అది బాగాలేదు ఇది బాగాలేదు అనేవాడు. ఆమె పరాయి మనిషి, మా ఇంట్లో పడి తింటూ ఉంటూంది. అనే వ్యతిరేకభావన సంతోష్ మనస్సులో పూర్తిగా నాటుకు పొయింది. వయస్సుతో పాటు అది కూడా పెరుగుతూ వచ్చింది.
ఇంట్లో నాకు తిరుగే లేదు? అన్నంతగా తయారయ్యాడు. ఎవరైనా తన మాట పెడచెవిన పెడితే ఆ రోజు నానా రభస చేసేవాడు.ఎంతో సేపు బ్రతిమి లాడి సరి సరిచేసేవారు.
నాన్నమ్మ మాటని ఏ మాత్రం వినేవాడు కాదు. అవసరమైతే నువ్వు ఇంట్లో నుండి ఎటైన వెళ్ళిపో!మేము హాయిగా వుంటాము! అని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాడు అది విన్న రాము గాని నానమ్మ సరస్వతమ్మ గానీ నవ్వి ఊరుకోవడం తప్ప ఏమి అనేవారు కాదు. మొక్కయి వంగనిది మానై వంగునా? అన్నట్లుగా తయారయింది సంతోష్ పరిస్ఠితి.రోజు రోజుకు శృతి మించి పోతూంది.ఈ మాటలు ఎవరైనా బయటివారు విన్నప్పుడు కించెత్ బాధ పడే వారు.
చిన్నప్పుడు వారికీ ఆ మాటలు ఎంతో ముద్దుగా వుండేవి. అందుకే అందరూ నవ్వి ఊరుకోవడం తప్ప ఏమి అనేవారు కాదు.
సంతోష్ ఎదిగే కొద్దీ ఒదగాలి అన్నట్లు కాకుండా! పెరిగే కొద్దీ పెంకి తనం ఎక్కువ అయింది. నాన్న మాట తప్ప ఎవరి మాట వినేవాడు కాదు. అప్పుడు కానీ నాయనమ్మ సరస్వతికి అర్దం కాలేదు. తండ్రి అనే వాడు ఒక్క మాటైనా చెప్పడాయే? తప్పుని తప్పు, అని చెప్పితే పిల్లాడికి ఆ రోజే అర్థం అయ్యేది కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏమి లాభం? అని ఎంతో ముద్దుగా చూచుకొనే మనుమడిలో,తన పట్ల పెరుగు తున్న వ్యతిరేక వైఖరి మూలంగా ఎంతో మదన పడసాగింది సరస్వతమ్మ.
సంతోష్,అన్ని విషయాలలో చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. చదువులో కూడా ఫస్ట్ వుంటాడు. పిల్లలు పెద్దల పట్ల అణుకువ గౌరవభావం కలిగి వుండాలి. అది వాళ్ళు స్వతహాగా నేర్చుకుంటారు, అనేది మన పొరపాటే? అవుతుంది. మనం చిన్నప్పటి నుండి వాళ్ళకి నేర్పించు కుంటు రావాలి లేదంటే, సంతోష్ లా తయారవుతారు. అది పిల్లల తప్పు ఏ మాత్రం కాదు వాళ్ళ మనస్తత్వానికి మనం ఎలా మలుచుకుంటే అలా మలుగుతారు. మొదటి నుండి సంతోష్ తను స్వతహాగా తెలుసు కుంటాడులే అనే ది పెద్దవాళ్ళు చేసిన తప్పు. మానవ సంబంధాలు, మర్యాద, క్రమశిక్షణ పిల్లలకు చిన్నతనం నుండే నేర్పించాలి. అది తల్లి దండ్రులవిధి.
ఎప్పుడు నేర్పించాలసింది అప్పుడే నేర్పించాలి. ఎలా మలుచుకుంటే అలా తయారవుతారు.లేకుంటే సంతోష్ లా తయారవుతారు! అది సంతోష్ తప్పు కాదు?తల్లిదండ్రులు చేసిన తప్పు. అది పెద్దవారు తెలుసుకోవాలి.పిల్లలు అటు బంధువులను. మన ఇంటికి వచ్చే పెద్దవారితో ఎంతో మర్యాదగా, చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి. పిల్లలు అంటే దేవుని స్వరూపాలు. కల్లా కపటం తెలియని వారు. చిన్ననాటి నుండే వారి మేధస్సుకు మెరుగులు దిద్దాలి.
కొంతకాలం తర్వాత కూడా సంతోష్ లో పెద్దగా మార్పు రాకపోవటంతో తల్లిదండ్రులు మంచిగా మార్చటానికి చాలా కష్టపడాల్చి వచ్చింది.

చూచారా పిల్లలు సంతోష్ పరిస్థితి! మీరు అలా కాకూడదు. తల్లి దండ్రుల మాటలు చక్కగా వింటూ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, బాబాయి, పిన్ని, తమ్ముళ్లు, చెల్లెల్లు, ఇతర బంధువులపట్ల ప్రేమాను రాగాలు కలిగి ఉండాలి.
కల్లాకపటం లేకుండా మంచి మనసుతో మెలగాలి. తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలి.తెలిసిందిగా….
పిల్లలు చప్పట్లు కొడుతూ చాలా మంచి కథ చెప్పావు అమ్మమ్మా అని ఎంతో మెచ్చుకున్నారు.
నిద్రవస్తూంది అంటూ ఇంట్లోకి వెళ్లారు పిల్లలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!