నా చెలి

 నా చెలి

రచయిత:సావిత్రి కోవూరు

శీతల జల పాతము చెంత జలకాలాడి ఆడి
అలసిన నా చెలి సైకతముపై వడలిన విరిమాలగ శయనించగా,

పద్మము చెంత మధువుకై చేరిన మధుపము బోలి, నా చెలి పాల భాగమున, నీలి కురులే కదలాడగ,

మధుర స్వప్నం కని అల్లల్లాడే కనురెప్పలు,
నిర్మలజలమున కదలాడు మీనములుగ తోచగ,

తడి మోమున నిలిచిన నీటి బిందువులపై
రవి కిరణములు ప్రసరించి,   కాంతిరేఖలై నిలువగా

మబ్బులు కమ్మిన శశి వలె కురులు, అరమోమును కప్పగా,

అరవిరిసిన దానిమ్మ మొగ్గ వలె అరుణ వర్ణపు ఆధరములే మెరియగా,

కురులను దాగి నీటి బిందువులు నున్నని కపోలము దాటి పైఎద పై ఇముకగా,

కర కంకణములు మృదుమధుర మంజుల నాదం సప్త స్వరముల పలికించగా,

లేత తమలపాకుల బోలు చరణ ద్వయ మంజీర నాదాలు చిరు సవ్వడి వీనుల విందై వినిపించగా,

చందన వర్ణ శోభిత లేత పారాణి పాదాలు లయబద్ధంగా కదలగా,

కటి భాగమున వాలిన తామర తూడును బ్రోలు కరములు కాంచిన నా మది గతి తప్పెను.

***

You May Also Like

4 thoughts on “నా చెలి

  1. భావ కవితా చెలి 👌👌💐💐💐
    సావిత్రి గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!