నా ప్రియ నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                నా ప్రియ నేస్తం

రచన :: సత్య కామఋషి ‘ రుద్ర ‘

అలసినా అలిగినా, నేను
మిద్దె నెక్కి మిన్నకుంటాను..
నాతో నేనే మిగిలిన ఆ వేళ.,

అల్లదిగో ఆకాశం చూడు..
మిలమిల మెరిసే తారలు చూడు..
మెల్లగ కదిలే మబ్బులు చూడు..
అదిగో చూడు వెన్నెల ఱేడు..

అంటూ నాతో కబురులాడుతుంది
మైమరపుల ఊరడింపుగా..!

తరుల చల్లని గాలి తెరలను తెచ్చి
విరుల పరిమళాల అత్తరులద్ది..
కీచురాళ్ళ సన్నని సడుల కచేరి పెట్టి
కనులకు మసక చీకటి మైకము దిద్ది.,

కటిక రాతి నేలను, పుడమి తల్లి
వెచ్చని ఒడిగా మలచి..మెల్లగ
నను నిదురలోకి జారనిచ్చింది..!

కలల కడలి అలలపై నను తేల్చి..
సొగసైన నా చెలియ చక్కని రూపాన్ని,
కొంటె కవ్వింపుల అల్లరి ఙ్ఞాపకాలను,
మది గిలిగింతలుగా నా తలంపుకు తెచ్చి.,

చెరిగిన చిరనవ్వులను నా పెదవులకు
తిరిగిచ్చి., మైమరపించీ మురిపించింది.!

ఓదార్పుగ, సేద దీర్చి..అలక దీర్చి
నను ఓలలాడించు నా అల్లరి నేస్తం..!
గాయబడి చెప్పుకోలేక, తట్టుకోలేక,
నా చిన్ని గుండె బరువెక్కిన ప్రతీసారీ..

తోడులేదని తల్లడిల్లకంటూ..ఎక్కడైనా
ఏనాడైనా, తానున్నానని తెలుపక తెలిపే
ఆ ప్రకృతికాంత, వీడిపోని నా ప్రియ నేస్తం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!